Previous Page Next Page 
పధ విహీన పేజి 10


    "జగ్గూ! అతడిని నాతొ సామానుడని గాని అధికుడని గాని అరాధించ లేదు. నేను. ప్రతి ఆడదీ మగవాడయిన వాడినీ ఏవిధంగా భావిస్తుందో ఆ విధంగానూ భావించలేదు నేను. అతణ్ణి నా బిడ్డగా భావించాను. అయినా ఈ పాడు ప్రపంచంలో ఒకరి నొకరు సమానంగా ఏనాడూ ప్రేమించరను కుంటాను. అవునా?"
    ఆమె మాటలు వింటుంటే జగన్నాధానికి భయం వేసింది. ఈ ఉద్రేకంలో ఏ పక్ష వాతమయిన రాదు గదా అనిపించిందతనికి. ఆమె నేదో వేధిస్తున్నది. ఏదో పొరపాటు యొక్క సమగ్ర చిత్రణ ఇవ్వాలని వాక్యాల కోసం తంటాలు పడుతున్నది. కాని అవి అతకటం లేదు. 'అతను నా ప్రాణం. మొదట అతన్ని చూసినప్పుడే అతను నా కొక్కదానికే ఉండిపోవాలని వాంచించాను. కాని నా అసూయకు అవతలి వైపున అతను సుఖ పడాలనే కోరిక కూడా ఉండేది జగ్గూ. మురళీ చాలా అందగాడు కదూ? అతను నవ్వితే ఎంతో బాగుంటుంది."
    "చిట్టీ నా తల్లివి కదూ. కాస్త తమాయించుకో."
    "అతనికి స్వయంగా ఆలోచించే తెలివి బొత్తిగా లేదు. అందుకే అతనికి నేను రక్షగా ఉండాలను కున్నాను. నా చిన్నారి పాపాయిని గోముగా లాలించాలనుకున్నాను. ఆ ఆలోచించే తెలివి లేకపోవటాన్నే నేను అమితంగా ప్రేమించాను. అతనికి తెలివి తేటలు, ఆలోచన శక్తీ, ఉంటె ఇంతగా ఆరాధించే దాన్ని కాదేమో. అతనోకసారి నాతొ పోట్లాడి ఎవరి దగ్గరికో వెళ్ళాడు. అప్పుడెంతో గర్వపడ్డాను. అతని తప్పులను క్షమించటం లో కూడా నాకు ఆనందం ఉంది."
    కాసేపు కళ్ళు మూసుకుని గతాన్ని ఆలోచించు కున్నది చిట్టి.
    "జగ్గూ, అనేక తడవలు నన్ను ఒంటరిగా వదిలి అతను వెళ్ళిపోతూ ఉండేవాడు. అతని కోసం నిరీక్షించటం లో కూడా నాకు సుఖం, ఆనందం ఉండేవి. అతను నా కాళ్ళ మీద వాలిపోయి నిద్రపొతే అతని తల నిమురుతూ పాట పాడాలనిపిస్తుంది నాకు. వాసంతి మంచిది."
    చిట్టి తన వేదనను పుండు కేలికినట్లు కెలుక్కుంటూన్నది. కావాలని నిర్వేదాన్ని పెంచు కుంటున్నది. అతన్ని గురించి దుఃఖించటం లో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నది. అధికంగా ఆరాధించే వ్యక్తిని పోగొట్టుకొన్న కొత్తలో ప్రతి స్త్రీ తరుచు ఇలాగే దుఃఖిస్తుంది.
    "వాసంతి అతనికి సరి యిన ఇల్లాలు అవుతుంది. తెలివి గల పిల్ల....వాళ్ళిద్దరూ సుఖంగా ఉండటం కన్న నాకేం కావాలి చెప్పు?"
    చిట్టి ఇక ఆగలేకపోయింది. వెక్కి వెక్కి ఏడిచింది. సాయంత్రం నుంచీ తన బాధనంతా దాచుకుని ఇతరుల కోసం ఎంత అభినయించింది? జగన్నాధం ఆమెకు దగ్గరగా వెళ్లి తల మీద చెయ్యి వేశాడు.
    "నువ్వు ఒక్కడివే నాకు మిగిలావు కదూ. వద్దులే, నువ్వూ వెళ్ళిపో. చచ్చినా అమ్మ దగ్గరికీ, నాన్న దగ్గరికీ వెళ్ళను. అంట్లు తోముకుని బ్రతుకుతాను. వెళ్ళు ముందు" అని బలవంతంగా అతని చెయ్యి తీసి పారేసింది. మళ్ళీ అయిదారు నిమిషాలయినా గడవక ముందే --
    "నీకు నామీద ఎంత ప్రేమ లేకపోతె ఈ విధంగా నన్ను సహిస్తావు? " అని అతని ఒడిలో వాలిపోయి ఏడవటం ప్రారంభించింది.
    ఆమెను అనునయించి, ఆత్మహత్య చేసుకోకుండా పక్కింటి పకోడీల ముసలమ్మ ను కాపలా పెట్టి వెంకట్రామయ్య గారి ఇంటికి బయలుదేరాడు జగన్నాధం. చిట్టి చేసిన తప్పును అయన క్షమిస్తాడనే ఆశ ఏ కోశానా లేదు. అయినా ప్రయత్నించటం తన ధర్మం అనిపించిందతనికి.
    దీపం ముందు కూర్చుని బాదం ఆకుల విస్తరి కుడుతున్నది సుందరమ్మ గారు. వెంకట్రామయ్య గారు పందుల్ని తిడుతున్నారు. ఈ వృద్ద దంపతుల దాంపత్య జీవితంలో మధుర స్మృతు లేమీ లేవు. చిట్టి వెళ్ళిపోయినాక వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరయినారు. ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న ఏక పుత్రిక తమను వదిలి వేల్లిపోవటంతో వాళ్లకు ఈ లోకం విసుగు కలిగిస్తున్నది. చిట్టి విషయం అసలు ఎత్తనే ఎత్తరు.
    ఈ మధ్య చాలా రోజులు జగన్నాధం అటువైపు వెళ్ళక పోవటం వలన సుందరమ్మ గారు అంతర్గతంగా పరితపించి పోతున్నది. రహస్యంగా చిట్టి క్షేమం చెప్పేవాడు అతనొక్కడే. అందుకే అతను కనిపించగానే కుడుతున్న విస్తరి అక్కడ పారేసి ఎదురొచ్చింది ఆవిడ. వెంకట్రామయ్య గారు కూడా తన తిట్ల దండకం ఆపి అతన్ని ఆహ్వానించారు. కూర్చున్నాడన్న మాటే గాని ఎలా ప్రారంభించాలో అతనికి అర్ధం కావటం లేదు.
    "ఏమిటి నాయనా కబుర్లు?' సుందరమ్మ గారు ఆత్రుతగా అడిగింది.
    "ఏమీ లేదు. చిట్టిని తిరిగి తీసుకొద్దామని ఉంది.' ధైర్యం చేసి అనేశాడు జగన్నాధం.
    వెంకట్రామయ్య గారు ఆ మాటకు కొన్ని క్షణాలు సమాధానం చెప్పలేదు. తరవాత చేతి కర్ర అరుగు కేసి కొడుతూ ----
    "ముందు గుమ్మం దిగు" అన్నారు. సుందరమ్మ గారు గావురుమంటూ "నాయనా అసలేం జరిగిందో చెప్పు" అన్నది.
    "ఇంతమటుకూ ఏమీ జరగలేదు. ఇప్పుడు చిట్టిని మీరే కాదంటే దాన్ని రక్షించటం భగవంతుడి తరం కూడా కాదు........" అన్నాడు జగన్నాధం.
    "మీ కందరికీ సిగ్గు లేడూ? ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలూ ఆహితాగ్ని కుటుంబంలో పుట్టి ఇలాటి అప్రాచ్యపు పనిచేసిన దరిద్రురాల్ని తిరిగీ తీసుకు రావాలా?' ఎందులో నయినా పడి చావమను. ఇన్ని నీళ్ళు కూడా వదలను" అన్నారు వెంకట్రామయ్య గారు. జగన్నాధం ఆశగా సుందరమ్మ గారి వంక చూశాడు. ఆవిడ ఏడుస్తూ తలవంచుకుంది.
    "సరే . నేను వెడుతున్నాను. ఈ పనికి శిక్ష ఉంటె ఏదో ఒక లోకంలో తప్పకుండా అనుభవిస్తారు మీరు. వెధవ దేశం" అని కక్షగా అని చరచరా బయటికి వచ్చాడతను.
    అతను రాగానే ఆ వృద్దులిద్దరూ ఒకరి నొకరు కౌగలించుకుని ఎంతసేపు ఎదిచారో తెలిస్తే ఉంటె ఆ శిక్ష ఏదో ఈ లోకంలోనే వాళ్ళు అనుభవిస్తున్నార నే సంగతి అతనికి అర్ధమయి ఉండేది.
    ఆ కోపంలో ఎటు పోతున్నాడో అతనికే అర్ధం కాలేదు. నేరం చెయ్యటం మానవుడిలో సహజ మయిన బలహీనత. అది తప్పే కావచ్చును. కాని లోకం నుంచి ఆ నేరానికి దొరికే శిక్ష వలన ఆ నేర స్వరూపం మహా పర్వతం లా మరింత పెరిగి పోతున్నది. అలా కాకుండా సానుభూతి, క్షమ గనుక లభిస్తే ఇన్ని నేరాలు జరిగి ఉండేవి కావు అనిపించింది అతనికి.
    ఆ ఆలోచనలతోనే తన ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో విజయ కూర్చున్నది. ఆమె మొగాన కళాకాంతులు లేవు.
    తనను పలకరించకుండానే లోపలికి పోతున్న జగన్నాధాన్ని చూసి ఆశ్చర్య పోయింది ఆమె. జయప్రదరావు ఖాయిలా పడి లేచినప్పటి నుంచీ అదో విధంగా తయారయినాడు. జిహ్వ చాపల్యం ఎక్కువయింది. అస్తమానం ఏదో ఒకటి చేసి పెట్టమని వేధిస్తున్నాడు. తిండి గడవటమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితిలో పిండి వంటలు రావటం ఎలాగా అన్న విషయాన్ని గురించి బొత్తిగా ఆలోచించటం లేదు అతను.
    పరిపూర్ణమైన యవ్వనం ఇప్పుడిప్పుడే జారిపోతున్నది. తన కలలూ సౌందర్య పిపాసా పవిత్రతా గర్వం కింద ఇన్నాళ్ళూ అణిచి వేసుకున్నది. తను ఊహించుకునే రాజకుమారుడు జయప్రదరావు లోంచి అదృశ్య మయినాడు. ఆమె ఊహ నందనవనం ఎడారిగా మారిపోయింది. తన ఒంటరి తనం తిరిగి తనను ఆవహించింది. అది పోతుందనే ఆశ ఏ కోశానా ఇప్పుడు లేదు. విశాలమూ, సౌందర్య పూరితమూ అయిన ఈ జగతీ రాగరంజిత ప్రాంగణం లో ఆమె ఒంటరి బాటసారి. ఆమెకు ఎవరూ తనవాళ్ళని పించటం లేదు.
    కొన్ని రోజుల కిందట ధనం, గౌరవం , ఇల్లాలితనం అన్నీ ఉండేవి. ఏదో పైశాచిక హస్తం అవన్నీ తుడిచి పెట్టేసింది. అయినా భర్తను చూసుకుని గర్వించింది విజయ. ఇప్పుడు అతను కూడా తనవాడనిపించటం లేదు. ఇప్పుడు మిగిలింది ఒకటే . అది సౌశీల్యం.
    సాయంత్రం చేగోడీల కోసం పోట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపొయినాడు జయప్రదరావు. ఇంతవరకూ రాలేదు. ఇదంతా చూస్తుంటే సంస్కార సహ్రుదయాలు, ప్రేమాను బంధాలు అన్నీ కూడా ఉత్త అసహ్యాలుగా తోస్తున్నాయి. అనురాగం తాలూకు ఆత్మీయతా కిరణాలు వికసించకుండానే రాలి పడిపోతున్నాయి. ఆమె ఆత్మ ఆ అనుతాపం లో పడి భయ విచలితమవుతున్నది.
    ఇంతవరకూ తను గర్విస్తున్నా సౌశీల్యం అవాంఛనీయమని ఇన్నాళ్ళ కు తెలుస్తున్నది. అయినా త్యజించ లేదు విజయ. దానితోనే ఇంకా అంధకారం లోకి పురోగమించ వచ్చును తను. ఏమయినా సరే తను స్త్రీ. ధర్మం నుంచి తనను తాను వంచించ దల్చు కోలేదు.
    బ్రతుకు తాలుకూ మహావరం ఆమె జీవన పధంలో కొంతకాలమే లభ్యమయి జారిపోయింది. దాని కోసమే దుఃఖిస్తూ కూర్చున్న విజయ కు జగన్నాధం తనను పలకరించకుండా వెళ్ళటం చూసి ఆశ్చర్యం కలిగింది.
    "తమ్ముడూ?"
    "ఆ పిలుపు విన్న జగన్నాధం తను చేసిన పొరపాటు గ్రహించి వెనక్కు తిరిగాడు.
    "చీకట్లో కూర్చున్నావేం అక్కగారూ?"
    "ఏమీ లేదు, ఎక్కడి నించి? అంత పరధ్యానంగా ఉన్నావు?"
    విజయ ప్రశ్నకు ఏమని సమాధానం ఇవ్వాలో అతనికి తెలియలేదు. చిట్టికి ఆశ్రయం ఇస్తుందా విజయ? అసంభవమని తెలిసీ కూడా అంతరంతారాల్లో అశాంకురం పోటమరించింది జగన్నాధానికి. అడిగి చూద్దామని పించింది.
    'అక్కగారూ........"
    "ఏమిటి?"
    "మీకో కధ చెపుతాను. వింటారా?"
    "కాశీ మజిలీ కధ అయితే వింటాను .' నవ్వింది విజయ. ఏ పరిస్థితిలోనూ చిరునవ్వు నవ్వగల ఆమె స్తైర్యానికి అతను మనసులోనే అభినందించాడు.
    "చెప్పు, తమ్ముడూ, ఏం కధ?"
    "ఇది జీవితం తాలూకు కధ, అక్కగారూ. ఇందులో అసత్యం గాని, అతిశయోక్తి గాని లేదు. సరే. ఉపోద్ఘాతం లేకుండా చెపుతా వినండి. ఒకమ్మాయి ప్రాణ ప్రదంగా ప్రేమించిన అతనితో మోసపోయింది. తల్లితండ్రులు ఆమెకు ఆశ్రయం ఇవ్వమన్నారు. అప్పుడా అమ్మాయి గతేం కావాలి? ఈ సమస్యకు సమాధానం కావాలి నాకు."
    "పెళ్లి కాలేదు, అవునా?"
    "అవును."    
    "అయినా అతను ఆమె భర్తే."
    "కావచ్చును. అతనామే ను వదిలేశాడు."
    "అప్పుడు ఆత్మహత్య చేసుకుంటే సరి."
    "భర్త పరిత్యక్త అయిన స్త్రీ కి ఈ దేశంలో మార్గాంతరం లేదంటారా మీరు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS