"మీ మనస్తత్వం చాలా చిత్రంగా ఉంది" అన్నాడు డాక్టరు అంతకన్నా ఏమనాలో అర్ధం కాక."
"ఒకటి రెండు సంవత్సరాల్లో నాకు విసుగెత్తింది. ఏది ఏమైనా ఆవిడకు జీవితం అంటే ఏమిటో బాగా తెలుసు. పేరు ప్రతిష్ట లతో పాటు సుఖ శాంతులు కూడా పొంద గలిగింది."
"కాని డబుల్ గేమ్ ఆడింది."
"ఏ డబుల్ గేమ్?"
"ఆవిడ, ఆవిడతో పాటు మీరూ ఆడిన డబుల్ గేమ్...."
"దాన్ని డబుల్ గేమ్ అంటారా మీరు? మరి ఏం చేయడం? అర్ధరహితంగా ఉంది మీరనే మాట."
"మరి? అర్ధవంత మైనది ఏమిటది?"
"నేను, నా అవసరం, నా వ్యక్తిత్వం-- ఈ లోకం నా కోసం కల్పించబడింది. ఈ భూమి మీద ఆనందం నాకోసం సృష్టించబడింది. ఆ రెండూ తెలుసుకుని అనుభవించ టమే నా జీవిత ధ్యేయం. ఆ ధ్యేయం లేని మానవుడు బ్రతుక లేడు మిగిలింది స్వవిఘాతం. డాక్టర్, ఏమీ అనుకోకుండా ఉంటె ఒక విషయం చెపుతాను. ఈ కట్టుదిట్టాలు పాతివ్రత్య పతివ్రతాలూ బొత్తిగా అర్ధ విహీనమైనవి.అందుకే వాటి నుంచి నన్ను నేను విముక్తుడిని చేసుకున్నాను. అవి మన సుఖానికి అడ్డు రానంత వరకూ స్వప్రయోజనాన్ని నెరవేర్చు కోవచ్చును. బ్రతుకు చిల్లర వ్యాపారం లాటిది డాక్టర్."
"బాగుంది."
"ఫలాపేక్ష లేని పని ఉండదు. నాకు సుఖం కావాలి, స్త్రీ కావాలి. నిషా కావాలి -- వాటితో పాటు అధికారం కావాలి. ఔన్నత్యం కావాలి. వీటిని సమన్వయ పరచటం కొంచెం కష్టమే అయినా ఫర్వాలేదు. ఫలితం బాగానే ఉంటుంది. మనం బ్రతుకుతున్న నేటి ఈ సమాజంనిస్తేజమూ నిర్జీవమూ అయింది. వ్యక్తీ, సంఘం తోనూ, సంఘం వ్యక్తితోనూ మీరు చెప్పినట్లు డబుల్ గేమ్ ఆడుతున్నారు."
"ఇంతకూ మీ వదిన గారి లాటి స్త్రీ కనిపించిందా?"
"లేదు.స్త్రీ పవిత్రత మీద నాకు నమ్మకం కలిగితే నేను చేసినదంతా పాపం అవుతుంది. ఆ పాప భారాన్ని మోస్తూ బ్రతకలేను. డాక్టర్, అందుకే ఆలోచిస్తున్నాను. మా వదిన పతివ్రతా .....సరే పోనీండి" అని సోడా గ్లాసులో వంచాడు నాగేశ్వర్రావు.
డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. ఇలాటి నాగేశ్వరరావు లు వందమంది అయినా విజయను ఏమీ చెయ్యలేరని ఆయనకు తెలుసు.
"ఎందుకు నవ్వుతారు?"
"ఏమీ లేదు....మీ వదిన గారి సంగతే."
"ఏమిటది?"
"మీ మేలు కోరి చెపుతున్నాను. ఆవిడ జోలికి వెళ్ళకండి."
"నేను కీచకుడి నీ, రావణాసురుడిని అనుకున్నారా ఏమిటి? ఆవిడ ఇష్టం లేకుండా ఏదీ చెయ్యను. ఆవిడ ఇష్టాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తాను."
"స్త్రీ కి ఇంకా విలువ మిగిలి ఉంది. అందుకే స్త్రీ అంటే నాకు గౌరవం" అన్నాడు డాక్టర్ విజయలక్ష్మీ ని తలుచుకుని మనసులోనే గర్వపడుతూ.
డాక్టర్ హృదయవిహీనుడూ అకర్మన్యుడూ కాదు. ఆదర్శాలను గౌరవించటమె కాదు, పవిత్రతావాది కూడా. అందుకే నాగేశ్వరరావు అభిప్రాయాలకు ప్రాతికూల్యం చూపించక పోయినా ఏకీభవించ లేదు.
మానవ జీవితంలో అంచెలంచెలుగా వచ్చిన పరిణామాలను పట్టి చూస్తుంటే జాత్య సంబంధమైన పవిత్రతకు విలువేమీ లేకపోవచ్చును. కాని అనూహ్యమూ అద్భుతమూ అయిన ఒక తేటనీటి నైర్మల్యం జీవితానికి చాలా అవసరం. ఆ నైర్మల్యం మీదనే శాంతి దేవాలయపు పునాదులు ఉన్నాయి. వాటిని కదిలించడం అంత మంచిది కాదన్న అభిప్రాయం ఆయనలో పాతుకు పోయింది. అందుకని ఏ వ్యక్తీ అభిప్రాయాలను అయన కాదనడు.
....సృష్టి లో మానవుడి తాలూకూ ఉనికి నిన్నటిదీ మొన్నటిదీ కాదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచీ అతను ఊపిరి పీల్చి బ్రతుకుతూ వస్తున్నాడు. అది నుంచీ ఈనాటి వరకూ అతను ఒక్కలాగా ఉన్నాడని గాని, ఒక రీతి గానే జీవిస్తున్నాడని గాని, ఒకమాదిరి గానే ఆలోచిస్తున్నాడని గాని అనుకోటం శుద్ధ పొరపాటు. తను మార్పు చెందాడు. తన జీవన విధానం మార్పు చెందింది. తన విజ్ఞానం తన ఆలోచన మార్పుచెందినాయ్. ఇంకా మారతాయి.
ఆనాటి మనిషిని ఎందుకు తిన్నావు అని అడిగితె ఆకలి అని స్పష్టంగా చెప్పేవాడు. నేడు అలా అనడు. అలవాటంటాడు. ఆనాటి మనిషికి కారణాలూ కల్పనలూ లేవు. ఆ రోజుల్లో పవిత్రతకు అర్ధం లేదు. నాగేశ్వరరావు పగబట్టిన స్త్రీ పవిత్రత కు ఆనాడు విలువేమీ లేదు. ఈనాడూ కొన్ని దేశాల్లో లేదు. ఆస్ట్రేలియా లో ఒక తెగలో పెళ్లి కూతురు ప్రతి వ్యక్తీ తోనూ గడిపితే తప్ప పనికి రాదు. ఆఫ్రికా లో పెళ్లి కొడుకుతో పాటు అతని స్నేహితులు కూడా ఆమెను పొందుతారు. అక్కడ అనుభవ యోగ్యం కాని స్త్రీని ఈగ వాలని రొట్టెతో పోల్చి అవమానిస్తారు. ఎంతమందిని ఆకర్షిస్తే అంత విలువ ఆ స్త్రీకి. అలాంటి చోట్ల ఉంటె నాగేశ్వరరావు బహుశా పవిత్రంగా ఉండేవాడెమో..."
నవ్వుకున్నాడు డాక్టర్.
"ఎందుకు నవ్వుతున్నారు?" నాగేశ్వరరావు నిషాగా ప్రశ్నించాడు. అసలే అందంగా ఉన్న అతని కళ్ళు మరింత కాంతితో ప్రకాశిస్తున్నాయి.
"మీరు చాలా అందంగా ఉంటారు. అందుకే ఇంతమంది ఆడవాళ్ళను ఆకర్షించగలుగుతున్నారు." "మధువు తరవాత మానిని కావాలి. కానీ డబ్బు పెట్టి కొనలేని డాక్టర్, ఎలాగ? అని నవ్వుతూ చిలిపి ప్రశ్న వేశాడు నాగేశ్వరరావు. డాక్టరు కూడా సమాధానంగా నవ్వి "స్టీరింగ్ కంట్రోల్ జీవితానికి చాలా అవసరం" అన్నాడు.
బిల్లు చెల్లించి ఇద్దరూ బయట పడ్డారు.
"ఈ ఊరి రోడ్ల మీద కారు నడపడం కన్న సర్కస్ ఫీట్లు చెయ్యటం తేలిక" అంటూ కారు స్టార్ట్ చేహాడు. అతను! డాక్టర్ నవ్వి పైపు వెలిగించి నిశ్చితంగా వెనక్కు వాలాడు.
కారు జారిపోతున్నది. కఠినమూ, నిర్మానుష్యమూ అయిన విజయవాడ రోడ్ల మీద గమ్యవిహీనమైన ఏ మానవుడూ క్షణం ప్రయాణించ లేడు. గమ్యం చేరతామన్న ఆశ లేకపోతె ఆ రోడ్లు మనలను భయపెడతాయి. యక్ష ప్రశ్నల్లాగా తెగసాగి విసుగు పుట్టిస్తాయి.
గవర్నరు పేట సెంటరు దాటి ఏలూరు రోడ్డు మీద నించి నక్కల రోడ్డు దాటి, సుదీర్ఘ మయిన కోర్టు రోడ్డు మీద ప్రయానిస్తున్నది కారు. డానికి గమ్యం లేదు. తిరగటమే పని. పైగా నిషా నయనాలతో నాగేశ్వరరావు నడుపుతున్న కారు అది. ఆ రాత్రప్పుడు విజయవాడను పరిశీలించడం చాలా సరదాగా ఉందతనికి. షాహెన్ షా మహల్ ప్రాంతాల్లో రోడ్ల మీద నిద్రపోతున్న శ్రమ జీవులు , లైట్ల కాంతి మొగాల మీద పడి ఎవరన్నా గుర్తు పడతారేమో అనే భయంతో ముఖం చాటు చేసుకొంటున్న ప్రేమికులు శరీరం ఖరీదు ఆరణాలన్నార కన్నా ఎక్కువ గాని అప్సరాంగనలు, లారీలలో దొంగ సరుకు జేరేస్తున్న దర్జా పురుషులు, నిద్రపోతున్న కిళ్ళీ కొట్టు వారు, బుర్ర గోక్కుంటున్న పెసరట్ల ముసిలిది, నగ్నంగా తిరిగే పిచ్చి వాడూ, మేడలూ, కారులూ, అందాల భామాలూ, అదృష్ట వంతులూ.
ఎందరో , ఎందరెందరో అతనికి ఆశ్చర్యాన్ని కలిగించారు. వెనక సీట్లో పడుకుని నిశ్చింతగా నిద్రపోతున్న డాక్టర్ ను చూసి తనలో తనే నవ్వుకుని వేగం తగ్గించి సిగరెట్ ముట్టించాడు నాగేశ్వరరావు.
కారు మలుపు తిరిగింది. బందరు రోడ్డు పెట్రోలు బంకు అందమైన మేడ ముందు ఎవరి కోసమో నిరీక్షిస్తున్న రాజకుమారుడి లాటి అందగాడు. ఎవరి కోసమో అతని నిరీక్షణ? నాగేశ్వరరావు నవ్వుకున్నాడు. పది గజాలు వెళ్లేసరికి నల్లటి డ్రైవరు నడుపుతున్న నలుపు కారులో తెల్లటి అమ్మాయి. రోజా పసందుల అందాల రాణి. బహుశా ఆ అమ్మాయి కోసమే నెమో అతని నిరీక్షణ అయి వుంటుంది.
పెద్ద మైదానం, ఏవో భవనాలు, ఆకాశ వాని నిలయం, వెన్నెలలో మెరుస్తున్న కొండలు, ఆ కొండల నీడలో ఏవో కదలికలు -- విజయవాడ: ఆంధ్రుడి ఆధిక్యత ను అల్పత్వానికి కూడా సమగ్ర చిహ్నమైన విజయవాడ.
దుర్గాదేవి నిలయ ప్రాంగణం లో దివ్యమై కూడా తన చాపల్యాన్ని వదలని విజయవాడ.
నాగేశ్వరరావు భావకుడు. అతని భావాలు బరువైనవి కావు. సీతాకోక చిలకలా తేలికైనవి. తూనీగలా మ్రుడువైనవి. మల్లె మొగ్గలలా మోహన మైనవి.
అందుకే చాలామందికి నచ్చని విజయవాడ నగరం అతన్ని ఆకర్షిస్తున్నది. కారు వెనుదిరిగింది. కొత్తగా పడిన వంతెన. విచిత్రమైన మురికి బజారు. అలంకార్, ఆంధ్రప్రభ, హాస్పిటల్ రోడ్డు, దారిలో నిలబడి పరికిస్తున్న నాగేశ్వర్రావు పంతులు, ప్రకాశం పంతులు, సుభాస్ బాబుల విగ్రహాలు , రంగు రంగుల పౌంటైన్ లు, పోష్టరులో ఒళ్ళు విరుచు కుంటున్న అవా గార్దేనర్, వెక్కి వెక్కి ఏడుస్తున్న వైజయంతి మాల, కాలేశ్వరర్రావు మార్కెట్టు,దుర్గగుడి, క్రిష్ణా బారేజీ.
కారుకు గమ్యం లేదు. తనకూ పధం లేదు.పద్దతి అసలే లేదు. విజయ ........విజయవాడ.
మెర్కురీ దీపాల వెలుగులో చిరునవ్వు నవ్వుతున్న చిన్నారి నగరం. ఆ నగరంలో తను పదవిహీనుడు.
ఈ నగరానికి ఉన్న పవిత్రత కు దుర్గ కాపలా కాస్తున్నది. తనబోటి పధవిహీనులు అర్ధరహితంగా పరిభ్రమించటం తప్ప గమ్యం చేరుకోలేరు.
విజయ......విజయవాడ.......పవిత్రత.........పట్టుదల........పధవిహీనత.......తను?
"ఎక్కడికి పోతున్నాం? మెలకువ వచ్చి డాక్టరు ప్రశ్న.
"డాక్టర్! రామచంద్రా రెడ్డిని ఎరుగుదురా మీరు?"
"నా క్లాసు మేటె అతను.
"చెప్పాడు. అతను నా ప్రియమిత్రుడు. అతని అనుభవాలు చిత్రం అయినవి. సరే పోనీండి."
"ఇలా కారు నడపటం కన్నా ఒక చోట ఆగి కబుర్లు చెప్పుకొటం మంచిది. "డాక్టరు అన్న ,మాటలకు నవ్వి కారును రోడ్డు పక్క ఆపాడు నాగేశ్వర్రావు.
"ఎక్కడున్నాడు రామచంద్రారెడ్డి?' పైపులో పొగాకు దట్టించి ప్రశ్నించాడు డాక్టర్.
"ఒక ఫ్రెంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకు లిచ్చాడు. ఇప్పుడు చాలా బుద్ది మంతుడయ్యాడు లెండి."
"అవును. ఆ అమ్మాయి పేరు నైనాయో, నానాయో అనుకుంటాను."
"ఆ తరవాత సంగతి చాలా ఉంది."
"చెప్పండి. కారు నడిపి ప్రమాదం తెచ్చి కన్నా కధలు చెప్పటం మంచిది" అని నవ్వాడు డాక్టర్.
"కధ ఊరికే చెప్పను. ఆ కధకూ, అతనికీ నాకూ కలిపి ఒక పెద్ద కారణం ఉంది. ఆ నానా ఇప్పుడు విజయవాడ లో ఉంది. చూద్దామంటే వెడతాం" అని కారు దిగి సిగరెట్ అంటించాడు నాగేశ్వర్రావు.
"రామచంద్రారెడ్డి కి విడాకులు ఇచ్చిన తరువాత, చాలాకాలం పాటు మద్రాసు లో ఒక హోటల్లో ఉండేది. తెలుసుగా నానా చాలా డబ్బు కలదని? అంత డబ్బుండి ఇండియా ను పట్టుకుని పాకులాడటం మరో చిత్రం. సరే, ఆ సంగతి అలా ఉంచండి. ఆ హోటల్లో నే ఒక పెద్ద ఫిలిం డిస్ట్రిబ్యూటరు ప్రేమలో పడింది. అతను కూడా నాకు చాలా స్నేహితుడు. ఒక రోజు మేమిద్దరం కాఫీ త్రాగుతున్నాం. మీకు విసుగ్గా లేదు కద?"
"ఛ ,,ఛ. ఇంత అందమైన ప్రేమ కధ చెపుతుంటే విసుగేమిటి? చెప్పండి, చెప్పండి.'
"నానా కారు దిగి వెళ్ళటం చూసి నా మిత్రుడికి మతిపోయింది. అంత చక్కని స్త్రీ ని పొందని వాడి జన్మ వృధా అనిపించింది అతనికి. నాకూ అనిపించింది కాని అతను ముందుగా బయట పెట్టటం వలన నా కోరిక ఉపసంహరించు కున్నాను. ఆ తరువాత అతను సాహసించి ఆమె భోజనం చేస్తున్న బల్ల దగ్గరికి వెళ్లి పరిచయం కలిగించు కున్నాడు. అరగంట సంభాషణానంతరం "మీకు పెళ్లయిందా" అని ఆత్రుతగా అడిగిందట. అయిందంటే తనను దూరం చేస్తుందేమో అని భయం చేత కాలేదని అబద్దం ఆడాడు అతను. ఆ తరవాత అతన్ని ఆమె ఎంత వెర్రిగా అరాధించిందో చెప్పలేను. పెళ్లి కాలేదని ఆమె దగ్గర అతను అబద్దం ఆడినందుకు ఎంత విచారించాడో పాపం! అయిందని చెపితే గుండె ఆగి చచ్చి పోతుందేమో అని భయం. ఈ పరిస్థితిల్లో అరునెలలు గడిచాయి. ఆమె తెలుగు వంటలు నేర్చుకుంది. చేనేత చీరలు కట్టేది. కారం తినటం కూడా అలవాటు చేసుకుని తిలకం కూడా దిద్దుకుంది చివరికి.
"నా మిత్రుని అబద్దం సంగతి తెలియని మరో వ్యక్తీ ఇతనికి పెళ్లి అయిందనే విషయం ఆమెకు చెప్పేశాడు. షాక్ అయి ఫ్రాన్సు వెళ్ళిపోయింది. కాని అక్కడా చాలా రోజులు ఉండలేక పోయింది. తిరిగి ఇండియా వచ్చి విజయవాడ లోనే మకాం పెట్టింది. నా మిత్రుడు ఆఫీసుకు వెడుతున్నప్పుడో, వస్తున్నప్పుడో అతన్ని చూస్తుంది. అంతే, అంతకన్న మరేం లేదు. క్షమించమని ఎంతో ప్రాధేయ పడ్డాడు ఇతను. తిరిగి ఇతన్ని క్షమించనూ లేదు. అతని నుంచి దూరంగా పోయి దాక్కోనూ లేదు. కాని మనం ఎవరమయినా వెడితే ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తుంది. రెడ్డికీ నాకూ ఉన్న స్నేహం కూడా ఆమెకు తెలుసు. ఒకసారి ఆమెతో నా వాంఛ ను బయటపెట్టాను. ఆమె తిరస్కరించింది. నా జీవితంలో అదోక్కసారే తిరస్కరింపబడ్డాను. ఆమెను అందుకే గౌరవిస్తున్నా ననుకుంటాను. నన్ను తిరస్కరించిన స్త్రీ మీద నాకు చాలా ప్రేమ. అందుకే మా వదిన అన్నా నాకుప్రేమ. వారినే పొందాలని ఉంటుంది."
"పురుషుడితోడు అక్కర్లేదా ఆమెకు?"
"ఉహు....మగ జాతి మీద ఉండే నమ్మకం ఆమెకు తీరిపోయింది. ఇతనికి పెళ్లి కావటం చాలా పెద్ద షాక్..."
"తరవాత రెడ్డి ఏం చేశాడు?"
"ఎవరో మొగుడోదిలిన దాన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు."
కొంచెం సేపు ఇద్దరూ మాట్లాడలేదు. రోడ్డు పక్క చేలూ వెన్నెలా చేరి ముచ్చట లాడుకుంటున్నాయి. నాగేశ్వరరావు కారు స్టార్టు చేశాడు.
