Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 9


                                         5

    అతన్ని చూడగానే, ఇంతకు మునుపు పాట    పాడిన యువతి గభాలున లేచి రేణుక చాటుగా నిలబడింది. తల వంచుకుని కాలి గోటిని నేలకురాస్తో.
    "రావోయ్ అల్లుడా......అందరం నీ గురించే ఎదురు చూస్తున్నాం" అన్నారు కామాక్షమ్మ సోఫాలో కూర్చునుండి.
    నిరంజనం ఆవిడ కెదురుగానున్న సోఫాలో కూర్చున్నాడు. అతన్ని రెండు క్షణాలు నఖ పర్యంతం పరీక్షించి అన్నారు.
    "బాగా చిక్కిపోయావు నాయనా! పెల్లినాటికి ఇంకాస్త మనిషివి. అవునులే-బాధ్యతలు పెరుగుతే మనిషి చిక్కిపోదూ మరి"    
    "కాఫీ తెస్తాను పిన్నీ" అన్నది రేణుక.
    "ఇప్పుడు కాఫీ ఏమిటమ్మా! భోజనాల వేళ, కాఫీ తాగి ఆకలి చంపుకుంటే అవతల ఆరోగ్యం ఏమైపోనూ? ఇప్పుడేం వద్డుగానీ నువ్వూ అలా కూర్చో.......శారదని ఇంతకుమునుపు నువ్వు చూడలేదను కుంటాను కదు బాబూ! ఇదిగో ఈ పిల్లే శారద. ఒక్కగా నొక్క కూతురు రేణు-తల్లీ! రా! ఇతను నిరంజనం బావ" అని ఇద్దరినీ పరిచయం చేశారావిడ.
    శారద నిరంజనానికి నమస్కారం చేసింది.
    "పియూసీ వరకూ చదువు చెప్పించాం. సంగీతమూ చెప్పించాము. నువ్వింటావో వినవోగాని అప్పుడప్పుడు రేడియోలో కూడా పాడుతుంది.....
    నిరంజనం వేళ్ళు లెక్కపెట్టుకుంటూన్నాడు. రేణుక గోడవైపు చూస్తోంది. శారద వల్లక్కయ్యపక్కన అలాగే సిగ్గుతో నిలబడి ఉంది.
    ఎవరూ ఏమీ మాటాడక పోవడంతో మల్లా కామాక్షమ్మగారే ప్రారంభించారు.
    "ఈ ఏడాదే శారద పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం నీ ఎరికలో మంచి సంబంధాలుంటే చూచి చేపుదూ. నీకు పుణ్యముంటుంది."
    "ఇంతలోనే పుణ్య మేమిటండోయ్" అన్నాడు నిరంజనం. ఏమీ అనకపోతే బావుండదన్న ఉద్దేశ్యంతో. ఆ ఒక్క ముక్కనీ ఆసరాగా తీసుకుని ఆవిడ ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించీ, వాటికోసం కన్న తల్లి తండ్రులు అనుభవించే యాతనల గురించీ, ఓ పావుగంటసేపు మాటాడారు. గుక్క తిప్పుకోకుండానే, చెప్పినదంతా ఓమాటు సమీక్షిస్తున్నట్టు రెండు ముక్కల్లో ఈ కాలంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యడం మహా యజ్ఞమనీ, పెళ్ళికాని ఆడపిల్లాలు ఇంటికి పెద్ద భారమనీ అన్నారు. చివర్ని ముగింపు మాటగా-
    "మా రేణుతల్లి అదృష్టవంతురాలు గనుక నీలాటి గుణవంతుడు దొరికాడు. అందుకు చాలా ఆనందిస్తున్నాం నాయనా! చూస్తూన్నాంగా ఈ రోజుల్లో అల్లుళ్ళ ఆగడాలు ఇందాక నీ గురించి అమ్మాయిని అడుగుతే-ఆఫీసులో పనుండి ఉండిపోయావని చెప్పింది. అదుగో అల్లా ఉండాలి లక్షణమంటే. మావయ్యగారి వ్యాపారమైనా నీ స్వంత వ్యాపారంలా చూచుకుంటూ, మరింత అభివృద్దికి తీసుకు రావాలని పాటు పడుతున్నావ్. అందరూ అలా ఉంటారా చెప్పు?"
    నిరంజనానికి చిరాకు కలిగించింది. ఇప్పుడు మావయ్య ప్రసక్తి రావడం అతని కిష్టం లేదు. అందుచేతనే అతను ముఖం చిట్లించుకు కూర్చున్నాడు. ఇది గమనించిన రేణుక-
    "భోజనాల వేళయింది. లేవండి మరి" అన్నది.
    "నా కప్పుడే భోంచేయాలనిలేదు. ముందు అత్తయ్య వాళ్ళకి వడ్డించు" అన్నాడతను తన గదిలోకి ఎదుతూ.
    ఆ రాత్రి రేణుక తన మనసులోని మాట నిరంజనానికి చెప్పేసింది.
    "శారదని మీ తమ్ముడి కివ్వాలని పిన్నీ వాళ్ళ ఉద్దేశ్యం. మీతో ఆవిడ ఉద్దేశ్యాన్ని చెప్పమన్నది.
    నిరంజనం, అత్తయి మాటల్లో దాక్కున్న ఈ అంతరార్ధాన్ని మొదట్లోనే గ్రహించాడు. కానీ, తనకై తాను బయటపడ దలుచుకోలేదు. పైగా ఈ శ్రీమంతుల సంబంధం తన తమ్ముడికి చేసుకోవడం ఇష్టంలేదు. శ్రీమంతుల బిడ్డని చేసుకుని తను అనుభవిస్తోన్న 'సుఖం' సాక్ష్యానికి సిద్ధంగా ఉండనే ఉంది. తన తమ్ముడు గూడా ఈ పంజరంలో చిక్కుకోడం తనకి సుతరామూ ఇష్టంలేదు. అలా అని చెప్పి తన అభిప్రాయాన్ని రేణు కకి చెప్పాలనీ అనిపించలేదు. మవునంగా ఉండిపోయేడు.
    "శారదని చూశారుగా. అన్ని విధాలా మీ తమ్ముడికి తగిన పిల్ల. ఇద్దరూ కళారాధకులే. అతను కథలు రాస్తాడు. శారద చక్కగా పాడుతుంది. పోతే-మీ ఉద్దేశ్యమూ........"
    "మధ్య నా ప్రమేయమేముంది రేణూ. అన్నింటికీ నాన్న ఉండనే ఉన్నారాయే. అదీ గాక పెళ్ళి చేసుకునేది వాడు కాబట్టి, మరి వాడి అభిప్రాయమూ తెలుసుకోవడం మంచిదికదూ?"
    "నన్నడుగుతే ఇది నిక్షేపంలాటి సంబంధమంటాను. బాబాయి వాళ్ళు త్వరలోనే బెజవాడలో బట్టల దుకాణం పెద్ద పెట్టుబడితో పెట్టబోతున్నారుట. అక్కడే చక్కటి ఇల్లొకటి కట్టించుకోవడమో, కొనుక్కోవడమో చేస్తారు. ఇవి గాక, ఎలా లేదన్నా లక్ష రూపాయల రొక్కం రెడీగా ఉంది."
    "వాళ్ళ ఆస్థి వివరాలు చెప్పమని నిన్నడగలేదు రేణూ! మావాళ్ళకి శారద నచ్చుతే, నువ్వు చెపిన ఈ వివరాలన్నీ అనవసరం. పోతే.......మరొక అభ్యంతర మేమిటంటే, మా చెల్లి పెళ్ళి కానిదే వీడి పెళ్ళి చెయ్య దలుచుకోలేదు. కాబట్టి ముందు చెల్లి పెళ్ళి జరగాలి."
    "భలే.....పెళ్ళి అన్న తర్వాత అనుకున్న మరుక్షణంలోనే జరుగుతుందటండీ ఎక్కడైనా? కాపోతే వాళ్ళు అడగమన్నారు గనకా, అతని పెళ్ళి విషయంలో మనగ్గూడా బాధ్యతంటూ ఉన్నది గనక అడిగాను కాని, అనుకున్న వెంటనే శారదని శంకరాని కిచ్చి పెళ్ళి చేద్దామని చెప్పలేదుగా" అన్నది రేణుక.
    ఆ తర్వాత ఇద్దర్లో ఎవ్వరూ మాటాడలేదు.
    
                                      *    *    *

    ఆ మర్నాడు నిరంజనం ఇంటికొచ్చేసరికి ఇంట్లో నాన్నా, చెల్లెలూ, తమ్ముడూ కనిపించేరు. అందరూ హల్లో కూర్చుని ఉన్నారు. నాన్నా వాళ్ళతో కామాక్షమ్మగారు మాటాడుతున్నారు. తనని చూచి ఆవిడే అడిగేరు.
    "నాన్నగారు వస్తున్నట్టు ఉత్తరం రాశారు టగా నాయనా? మరి మాతో చెప్పనేలేదే?"
    అతనేం మాటాడకుండా వచ్చి అందరి మధ్యా కూర్చున్నాడు.
    "మూడు గంటలకి వచ్చాం" అన్నారు జానకి రామయ్య.
    "ఇప్పుడు మీ వంట్లో ఎలాగుంది" అడిగాడు నిరంజనం.
    "ఏం చెప్పను. ఎప్పుడో చెప్పా పెట్టకుండా గుండెల్లో పోటు వస్తుంది. ఆ ఒక్కరోజూ మనిషిని కృంగ దీసేస్తుంది. ఉత్త రోజుల్లో నేమో ఆయాసం, కొద్దిగా నీరసం"
    "ఈ వయస్సులో అందరికీ అలాగే ఉంటుంది అన్నయ్యగారూ!"
    "నువ్వు కాకినాడనుంచి ఎప్పుడొచ్చావురా?" తమ్ముడ్ని అడిగాడు నిరంజనం.

 

                       
    తమ్ముడు జవాబు చెప్పలేదు. ఉద్యోగ విషయం అడుగుదామనుకున్నాడు గానీ, నాన్న రాసిన ఉత్తరం లోని విషయాలు గుర్తుకొచ్చి మానుకున్నాడు నిరంజనం.
    "సుశీలా.......ఒకసారి ఇలా వస్తావూ" వంట గదిలోంచి రేణుక పిలిచింది.
    "ఇప్పుడే వస్తారా అన్నాయ్" అని సుశీల వెళ్ళిపోయింది.
    కామాక్షమ్మగారు జానకిరామయ్యగారికి, తాము పెట్టబోయే బట్టల దుకాణం గురించీ, బెజవాడ లో తను ఇల్లు గురించీ చెప్పడం మొదలు పెట్టారు.
    ఇది వినే ఓపిక లేక నిరంజనం తన గదిలోకి వెళ్ళిపోయేడు. నిరంజనాన్ని శంకరం అనుసరించాడు.
    గదిలో బట్టలు మార్చుకుంటోన్న అన్నయ్య నుద్దేశించి-
    "నాన్నకి ఈమధ్య వంట్లో బొత్తిగా బావుండటం లేదు. ఇంట్లో కాలు బయట పెట్టనేలేదు. నువ్వు రాశావుటగా ఇక్కడికి రమ్మని" అన్నాడు శంకరం.
    "అవును ఈ ఊళ్ళో నాకు తెలిసిన డాక్టర్లున్నాయి, మంచి వైద్య సౌకర్యాలూ ఉన్నాయి."
    "ముందు చెల్లీ, ఆయనా ప్రయాణమయ్యారు, నన్నూ రమ్మని బలవంతం చేస్తే-"
    ఈ మాట వినగానే నిరంజనానికి కాస్త కోపం వచ్చింది.
    "అవున్రా వాళ్ళు రమ్మని బలవంతం చేస్తేనే తప్ప రావన్న మాట."
    "అనికాదు"
    "మరి?"
    "ఎందుచేతనో ఎక్కడికీ వెళ్ళాలనిపించడం లేదు."
    "అవున్లే పెద్దవాడి వవుతున్నావు గదూ మరి. ఏవిటీ, వ్యవసాయం చేస్తానని చెప్తూన్నా వుట."
    "ఉద్యోగం దొరక్కపోతే ఏం చెయ్యను?"
    "ప్రయత్నాలు చెయ్యాలి."
    "ఇంక చెయ్యదలుచుకోలేదు."
    "అలాగైతే ఉద్యోగ మెలా వస్తుంది?"
    "చెప్పానుగా. రాకపోయినా ఇబ్బంది లేదని."
    "సరే.....నీతో వాదించి నేగెలవలేను. నీ కేది మంచిదని తోస్తే అది చెయ్యి."
    తలుపు దగ్గర శబ్ధమైంది. రేణుక ట్రేలో కాఫీ తీసుకొచ్చింది.
    "అన్నదమ్ములిద్దరూ ఏదో తీవ్రంగా చర్చి స్తున్నట్టున్నారు."
    "చర్చించడాలే తక్కువ" అన్నాడు నిరంజనం.
    "సర్లేండి. ముందు కాఫీ పుచ్చుకోండి. నా కవతల చాలా పనులున్నాయి."
    కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది రేణుక.
    అన్నదమ్ములిద్దరూ కాఫీ తాగుతూండగా హాల్లోంచి నవ్వులు వినిపించాయి. ఒక నవ్వు కామాక్షమ్మగారిదీ, మరొక నవ్వు జానకిరామయ్యగారి దీని. నిరంజనం గది తలుపు దగ్గర నిలబడి హాల్లోకి తొంగిచూశాడు.
    వాళ్ళింకా నవ్వుతూనే ఉన్నారు. కామాక్షమ్మ గారి పక్కన తలొంచుకుని శారదా, నాన్న దగ్గర వాళ్ళ నవ్వుతో జత కలుపుతూ సుశీలా నిలబడి ఉన్నారు. వంట గదిలోకి వెళ్ళవలసిన రేణుక దారి మార్చి మళ్ళీ వచ్చి వాళ్ళ దగ్గరే నిలబడి ఉంది.
    నిరంజనం గుమ్మం నుంచి కదిలి తమ్ముడి దగ్గరకు వచ్చాడు.
    "నిన్ననే కామాక్షమ్మగారూ, ఆవిడ కూతురు శారదా వచ్చారు. ఈ కామాక్షమ్మగారు రేణుకకి పినతల్లి. మాటలు చెప్పడంలో ఆవిడ్ని మించినవారుండరు" అన్నాడు నిరంజనం.
    "నాకూ అలాగే అనిపించింది."
    "ఈ పెద్ద వాళ్ళ ఛాదస్తం గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళేదో విత్తు వేస్తున్నామనుకుని ఒక విత్తువేసి వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటారుగాని, ఈ హాస్య ప్రసంగంతో సంబంధమున్న పిల్లల అవస్థ గమనించరు. ఇప్పుడు హాల్లో జరుగుతూన్న తతంగం అదేను."
    అన్నయ్య మాటకి శంకరం నవ్వుకున్నాడు.
    "నీతో చాలా విషయాలు మాటాడాలి" హఠాత్తుగా అన్నాడు నిరంజనం.
    "ఏమిటని?"
    "నువ్వు కుర్రాడివి. నీకు లోకం తెలీదు. ఆవేశంలో కొన్ని పిచ్చి పనులుచేసి ఆ వేశం తగ్గిన తర్వాత వస్తాయించడం కూడదురా శంకరం. దేనికైనా యోచన అవసరం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS