Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 10


    "ఇవాళ ఏదైనా సినిమాకి వెళ్ళాలని ఉంది. నువ్వు త్వరగా తెముల్తే సంతోషిస్తాను" అన్నాడు శంకరం, అన్నయ్య చెప్పబోయే విషయానికి అడ్డు తగిలి.
    తమ్ముడి ఉద్దేశాన్ని పసిగట్టలేనంత తెలివి తక్కువవాడు కాదు నిరంజనం. నింపాదిగా నచ్చచెప్పవచ్చనే నిశ్చయించి అతఃనూ ఊరుకున్నాడు.
    హాల్లో శారద పాట పాడుతోంది కమ్మటి గొంతుతో.
    "రాగ సుధారసా-"
    అన్నదమ్ములిద్దరూ పాటని పూర్తిగా విన్న్నారు. హాయిగా, తీయగా పాడింది శారద.
    "శారద చక్కగా పాడుతుంది. రేడియోలో ప్రోగ్రామ్సనీ ఇస్తుందిట."
    "..................."
    "పాపం. ఆ పిల్ల వచ్చిన దగ్గర్నుంచీ పాటలు పాడటమే పనిగా పెట్టుకుంది. ఏం చేస్తుంది మరి శ్రోతలు పాడమని కోరితే పాడక తప్పదు గదా."
    "అవతల సినిమాకి వేళవుతుంది మరి" అన్నాడు శంకరం.
    ఇద్దరూ సినిమాకి వెళ్ళిపోయారు.
    నాలుగు రోజులపాటు ఆ ఇంట్లో ఏ విధమైన గంధర గోళమూ లేకుండా హాయిగా గడిచింది. అందరూ సరదాగా నవ్వుకుంటూ గడిపారు. జానకి రామయ్యగార్కి నెత్తురు పోతున్నదని చెప్పేరు వైద్యులు. దాని క్కావలసిన మందులూ రాసి ఇచ్చారు. జానకిరామయ్యగారికి గుంటూర్లో కొడుకు దగ్గర హాయిగా ఉంది. శంకరం ఉద్యోగం గురించీ, తన ఆరోగ్యం గురించీ పూర్తిగా మరిచిపోయే రాయన. రోజంతా కామాక్షమ్మగారితో లోకాభిరామాయణం, పిల్లలకి లోకం పోకడ గురించీ చెప్పడంతో గడిచిపోతుంది.
    శంకరం, సుశీలా, రేణుకా, శారదా-రోజస్తమానం కేరమ్సూ పేకాటల్తో గడిపేస్తున్నారు.
    ఇంత హాయిగా వున్నా ఆ ఇంట్లో ఆ సాయంత్రం రగడ ప్రారంభమైంది.
    శారద, శంకరం ఒక పార్టీగా, సుశీలా రేణుకా మరో జట్టుగా కూర్చుని కేరమ్సు ఆడుకుంటున్నారు. వాళ్ళ క్కాస్త అవతలగా జానకిరామయ్య గారూ కామక్షమ్మగారూ 'నేటి పెళ్ళిళ్ళూ వాటి ముచ్చట్లూ' గురించి మాటాడుకుంటున్నారు.
    అప్పుడే వచ్చాడు నిరంజనం. వచ్చీ రావడంతోనే రేణుకని పిలిచాడు. ఆమె, ఆట మధ్యలో లేవడం ఇష్టం లేక వెంటనే వెళ్ళలేడు. దాంతో మరింత కోపంగా పిలిచాడు నిరంజనం.
    ఈ రకమైన పిలుపుతో హాల్లో ఉన్న జనాభా అంతా ఒకరి మొహం ఒకళ్ళు చూచుకుంటూ మవునం వహించారు. రేణుక లేచి అతని గదిలోకి వెళ్ళింది.
    "నేను మీ బానిస ననుకున్నాడా మీ నాన్న?" అన్నాడు నిరంజనం.
    ఉలిక్కి పడ్డారు హాల్లోని వ్యక్తులు.
    "అర్ధంలేని వ్రాతలు రాయడం ఆయనొక్కడికే తెలుసనుకుంటున్నాడు కాబోలు. ఈ ఉత్తరం చదువు ఎంత దారుణంగా రాశాడో నిన్ను పెళ్ళి చేసుకున్నది బ్రతక లేక కాదు. ఈ బొడి హోదా కోసం అభిమానం చంపుకున్న వెధవనీ కాదు.
    రెండు క్షణాలు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత మళ్ళా అతని కేకలతో గది దగ్గరిల్లిపోయింది.
    "చెప్పినట్టుల్లా చేయడానికి మీరు పెంచుతూన్న కుక్కని కాదు, నాకూ చీమూ, నెత్తురూ ఉన్నాయి. కంపెనీ ఆయనధైతే కావచ్చు. ఆ కంపెనీకి నేను బాధ్యతకల అధికారి వన్న మాట మరిచిపోదాం దారుణం. నా యిష్టానికి వ్యతిరేకంగా నేనే పనీ చెయ్యను. చెయ్యలేను. రేపు మీ నాన్నకి ఉత్తరం రాయి-తగిన గౌరవ మిచ్చి నన్ను కంపెనీ వ్యవహారాలు చూడమంటాడో-లేక ఈ ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చేయమంటారో" అని చెప్పేసి ఇంటినుంచి బయట కెళ్ళిపోయాడు.
    రేణుకని పిలిచి కామాక్షమ్మగారు అడిగారు.
    "అసలేం జరిగిందమ్మా!"
    "నా ఖర్మ" అన్నది రేణుక. ఆ ఉత్తరాన్ని కామాక్షమ్మగారికిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది రేణుక. ఆవిడ ఉత్తరాన్ని ఎగాదిగా చూచి శంకరాణి కిచ్చింది. అతను చదివాడు.
    ".......శివానంద్ గారితో అన్నావుట మన కంపెనీలో ఏ ఉద్యోగమూ ఖాలే లేదని. నాకు చాలా బాధని పించింది. ఆయన ఆఫీసరు. అందునా ముందు ముందు ఆయన్తో మనకు చాలా పనులుంటాయి పాపం, నువ్వన్న మాటకి ఆయన ఎంతో విచారిస్తూ నాకు ఉత్తరం రాశారు. కాబట్టి ఈ జాబు అందిన వెంటనే వాళ్ళ కుర్రాడికి ఉద్యోగం ఇవ్వు. అది అన్ని విధాలా మంచి పని. కావలసినవాళ్ళని దూరం చేసుకోడం తెలివి తక్కువ. వెంటనే వాళ్ళ కుర్రాడికి ఉద్యోగం వేసి నాకు జాబు వ్రాయగలవు.........."
    ఉత్తరం విని ఎవరూ ఏమీ మాటాడలేదు. శంకరం గబగబా బయటకు నడిచేడు అన్నయ్యను కలుసుకునేందుకు. అప్పటికే అతను కారులో చాలా దూరం వెళ్ళిపోయేడు.
    ఆ రాత్రి అందరి భోజనాలూ ముగిసిన తర్వాత, ఎప్పుడో పది గంటలకి నిరంజనం వొచ్చాడు. అతనొచ్చిన పదినిమిషాలకి మళ్ళాగొడవ ప్రారంభమైంది. ఈ మాటు రేణుక తన వాదనని ప్రారంభించింది.
    "ఆయన రాసిన దాంట్లో గూడా పెద్ద నేరమేమీ కనిపించడం లేదు మరి" అన్నది రేణుక.
    "ఎందుక్కనిపించాలి? కనిపించదు. నువ్వూ ఆ గూటి పక్షివేగా మరి. మీరు నన్ను కొడుక్కున్న మాట వాస్తవమే గదూ. అందుచేత మీ అదుగులకి మడుగు లొత్తడం నా విధి. తప్పుతుందా? ఛీ........వెధవ జీవితం"
    "లేనిపోనివన్నీ మీకు మీరే ఆపాదించుకుని బాధపడటం బాగోలేదు."
    "రాణీగారికి కవిత్వ మళ్ళడం గూడా దాతనోచ్చును. ఎవడో ఆఫీసరుట, ఆపద్భాందవుడట, సహాయం చెయ్యాలిటా, వాళ్ళ ఆఫీసులో ఆ కుర్రాడికీ ఉద్యోగం వేయించడం ఆయనకి నామర్దాట గానీ, ఆ పనేదో నేను చెయ్యాలిట. తనకి యోగ్యుడనిపించని వాడికి-యోగ్యుడిగా భావించి నేనో దారి చూపించాలిట. నాన్ సెన్స్-ఎవరకీ బుద్దుల్లేవు."
    "అయిపోయిందేదో అయిపోయింది.......నాన్న గారితో చెప్పి"-
    "ఓహో! తమరు నచ్చచెప్పడం, ఆయన తలాడించడమూను. పరిపరి. బాగానే ఉంది. తమ ఔదార్యానికీ కృతజ్ఞుడిని" అన్నాడు కసిగా నిరంజనం.
    మొత్తానికి ఆ పూట దంపతులిద్దరూ భోజనం మానుకున్నారు. ఇది చూచి జానకిరామయ్య గారు నొచ్చుకున్నారు. కామాక్షమ్మగారు "ఇలాటి రగడలు రావడం సహజం అన్నయ్యగారూ! అయితే సరిపెట్టుకోవడంలో ఉంటుంది తెలివి" అని అన్నారు.    
    ఆ మరుసటి ఉదయం కామాక్షమ్మగారు ప్రయాణ మైయ్యారు. వెడుతూ, జానకిరామయ్య గారితో అన్నారు.
    "వీలుంటే ఎప్పుడైనా ఒకమాటు బెజవాడ వస్తారుగా అన్నయ్యగారూ"
    ఆయన తలూపారు. వాళ్ళు వెళ్ళిపోయారు.
    వాళ్ళు వెళ్ళిన మరుక్షణం నుండి జానకిరామయ్య గారికి తోచడంలేదు. అంతా వెలితిగా ఉంది. దానికి తోడు ఈ ఇంట్లో రగడ ఒకటి. ఆయన మనసు చికాకుగా ఉంది. శంకరాన్ని కదిపి చూశారు. అతనూ వెళ్ళిపోదామనే చెప్పాడు.
    ఆ సాయింత్రం నిరంజనం రాగానే జానకి రామయ్య అన్నారు.
    "రేపు మేమూ వెళ్ళాలనుకుంటున్నాంరా!"
    నిరంజనం ఆయన మొహంలోకి చూస్తో,    
    "ఎందుకనిట?" అని అడిగేడు.
    "ఏమీలేదు" ఆయన నవ్వుతూ అన్నారు.
    "సరే.....మీ కిక్కడ ఉండటం కష్టమైతే అలాగే వెళ్ళండి. నేను చెప్పేదే ముంటుందింక"
    "మరోవిధంగా అర్ధం చేసుకోవద్దు."
    "అసలు ఒక అర్ధమంటూ నాకు తెలిసేడుస్తే బాగుండిపోదును. సరే.....వెళ్ళండి. ఇక్కడ మీరు నలుగు రోజులు గడిపినట్టు తెలుస్తే మావయ్య ఎంత దిగులు పడిపోతారో గదా"
    "అవేం మాటలురా నిరంజనం? తప్పు కదూ?"
    "ఏ......ఉన్నమాటే అన్నాను"
    "చాల్లే ఊరుకో మాటకు ముందు నువ్వలా దెప్పి పొడుస్తే పాపం, ఆ పిల్లెంత బాధ పడుతుందో గ్రహించావా?"
    నా బాధ మాత్రం ఎవరికీ అవసరంలేదు"
    "చూడు నాయనా! చెప్పవలసిన వాడిని కాబట్టి చెప్తూన్నాను. సంసారమన్న తర్వాత అనేకమైనవి జరుగుతూంటాయి. కొన్ని మన కిష్టమైనవీ, మరికొన్ని సుతరామూ ఇష్టం కానివీను. మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఓర్పు. ఓర్చుకున్నవాడికే సౌఖ్యం. నిన్నింతతి వాడిగా చేసిన ఆయనకి నీ బాగూ, నీ క్షేమమె కదా కావలసింది. కాబట్టి ఆయనచేసే ప్రతి పనీ నీ మంచి కోసమేగదా" అన్నారు జానకిరామయ్య.
    "నేనెవరి హితోపదేశమూ వినదలుచుకోలేదు. ఆలోచించేపాటి జ్ఞానం నాకూ ఉంది" అన్నాడు నిరంజనం నిష్ఠూరంగా.    
    ఈ రకమైన జవాబుతో జానకిరామయ్యగారు కొద్దిగా బాధ పడిన మాట వాస్తవం. ఆ బాధని కప్పిపెట్టుకుని-
    "సరే నీ ఇష్టం.......రేపు మా ప్రయాణానికి మాత్రం ఏర్పాట్లు చెయ్యి" అని చెప్పి వచ్చేశారు.

                                  *    *    *

    జానకిరామయ్యగారు ఇల్లు చేరగానే తెలిసిన ఘోరమైన విషయం-దీనబంధు అకస్మాత్తుగా పోయారని. ఈ వార్త వినగానే జానకిరామయ్య గారు నిలువునా కూలిపోయారు. కుళ్ళి కుళ్ళి ఏడ్చారు.
    మొప్పటివరకూ గుండ్రాయిలా తిరిగిన దీనబంధుని మృత్యువు కడుపున పెట్టుకుంది. నీ రోగమూ, రొష్ఠూ లేకుండానే కన్నుమూశారు. మొన్నవున్న దీనబంధు ఇవాళ లేడు! ఇది నమ్మలేనంత నిజం. నిజం, దీనబంధు మాస్టారు పోయారు.
    ఆయన హంసలా బ్రతికారు. పదిమందిలోనూ అవుననిపించుకున్నారు. తను నవ్వుతూ, తన పక్కన ఉన్నవాళ్ళని నవ్వించేవారు. అంత సహృదయతా అంత నిర్మలత్త్వమూ ఆయన కొక్కరికే చెల్లుబడి!        
    ఇక దీక్షితులు లేరు.
    దీనబంధు అందర్నీ వదిలి వెళ్ళిపోయారు.
    గొడుగు దూరమయ్యింది!    
    ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగడం లేదు దుఃఖం.
    ఆ ఇంటికి వెళ్ళి చూస్తే తన కడుపు తరుక్కు పోయింది. ఎప్పుడు వెళ్ళినా, గంపెడు నవ్వుతో ఆహ్వానించే హితుడూ, స్నేహితుడూ లేడక్కడ. కళాకాంతులు వెదజల్లే ఇల్లు బోసిపోయి ఉంది. ఇంటిల్లిపాదీ గుండెలవిసేలా ఏడుస్తూన్నారు. మరీ ఆ పెద్ద కొడుకు ఆడపిల్లకంటే ఎక్కువగా పరిసరాలు మరిచిపోయి ఏడుస్తున్నాడు. దీనబంధు కూతురు, ఆయన వ్యక్తిత్వ
ాన్నీ, ఆయన్నీ పైకి తలుచుకుంటూ ఏడుస్తోంది. దీనబంధు భార్యకి స్పృహలేదసలు. తతిమ్మా పిల్లలందరూ గోడ వారగా వాలిపోయారు. ఇక ఏడ్చేందుకు వాళ్ళకి ఓపికలేదు.
    తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. ఏడ్చేవాళ్ళని ఓదార్చడం మరచి ఆ సహృదయుని స్నేహశీల తనీ, అతని అభిమానాన్నీ విశాల హృదయాన్నీ పొగుడుతూ కళ్ళనిండా నీళ్ళు నింపుకుంటున్నారు.
    మనిషి పోయేడు 'అతని మంచితనం మిగిలింది.'
    దీనబంధు దూరమైనా ఆయన రాయలు దూరంకక, అమృత సమానమైన ఆయన నవ్వూ, తేజస్సూ దూరంకావు.
    ఇంతమందిలోనూ 'మంచి' అని పించుకుని, ఇంతమంది గౌరవాన్నీ, ఆదరణనీ పంచుకున్న దీక్షితులు ధన్యుడు.
    ఆ హృదయ విదారకమైన సన్నివేశాన్ని చూచేందుకు మనసొప్పక వెంటనే ఇంటి కొచ్చేశారు జానకిరామయ్య. ఇంటికొచ్చి తన డైరీలో రాసుకున్నారు. "మా దీక్షితులు స్వర్గస్థు డయ్యాడు భౌతికంగా వాడు మా ముందులేని మాట నిజమే-కానీ 'స్నేహం' ఈ లోకంలో బ్రతికినంతకాలమూ వాడూ ఉంటాడు."
    ఆ రోజు లగాయితూ జానకిరామయ్యగారిలో మార్పు వచ్చింది. ఆయన మునుపటిలా ప్రతి విషయాన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతోనే గడిపేస్తున్నారు. ఆయన మనసులో చాలా విషయాలు తన సంబంధం లేకుండానే తిరుగుతున్నాయి.
    పోతే-శంకరం గురించి: తను గుంటూర్లో ఉండగానే కాకినాడనుంచి రంగారావ్ ఉత్తరం రాసేడు. నలుగు వ్యాక్యాల్తో ఉత్తరం ముగించాడు.
    "వచ్చావ్. వెళ్ళావ్. వచ్చింది ఉద్యోగం కోసమైనా, వెళ్ళింది ఎందుకో తెలీదు. కారణం రాయాలని ఉంటే రాయి. లేకపోతే అదీ వద్దు, నీ మనసు నొప్పించాలని నా కెప్పుడూ లేదు. ఇది మాత్రం నిజం-
                        రంగారావ్".
    ఉత్తరానికి జాబు రాయాలనిపించలేదు.
    మధ్యలో ఆగిపోయిన నవలని తిరిగి ప్రారంభించాడు. ఈ వ్యాపకంతో అతను చాలా విషయాలు మరిచిపోయేడు. నాన్న ఆరోగ్యమూ, అన్నయ్యసంసారం, తన ఉద్యోగం-సమస్తం మరిచి మనసంతా నవల పూర్తి చేయడంలో లగ్నం చేశాడు దానికి తగ్గట్టు నవల గూడా వేగంగా, పట్టుగా నడుస్తోంది.
    పదిహేను రోజుల్లో అతని నవల ముగిసింది. ఒక మంచి రచన చేశాననే తృప్తితో గాలి పీల్చుకున్నాడు.
    కోరుకున్నది నిజమై, తన ముందుంటే మనిషి తత్తరపాటు చెందడం సహజం. నవల పూర్తయిందన్న సంతోషానికి, ఉద్యోగం దొరిందన్న ఆనందం తోడై శంకరాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.
    రెండు నెలల క్రితం బెజవాడలో ఒకానొక ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ కి వెళ్ళి తిరిగొచ్చేడు. ఫలితంకోసం చాలా రోజులు ఎదురు చూచి, తెలీక పోవడంతో ఆశని చంపుకున్నాడు గూడాను. అలాటిది కాస్తా, రాదనుకున్న ఉద్యోగం రావడంతో అతను తల దిమ్మెత్తేలా ఆశ్చర్యపోయాడు.
    జానకిరామయ్యగారు కొడుకు ఆనందాన్ని చూచి సంతోషించేరు. ఆయనే అన్నారు-    
    "చదువుకున్నవాడికి, వాడి చదువు ఎప్పటి కైనా పని కొస్తుంది. వెళ్లిరా! చక్కగా ఉద్యోగ చేసి అభివృద్దిలోకి రా నాయనా"
    శంకరం కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది!
    "చివరికి నీ మాటే నిలబెట్టుకున్నావురా! నీ యోగ్యతా, అర్హతా గమనించి ఇచ్చిన ఉద్యోగానికే వెడుతున్నావ్. నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారాయన.
    ఇన్నాళ్ళూ చిన్నన్నయ్య అవస్థని అర్ధం చేసుకున్న సుశీల ఆ రోజు ఒక పర్వ దినంగా భావించింది. చిన్నన్నయ్య గూడా ఒక ఉద్యోగస్థుడయ్యాడని గర్వించింది.
    బెజవాడ వెళ్ళిన తర్వాత భోజనం వసతి, మొదలైన విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకోవాలో తనకు తెలిసినదంతా చెప్పింది సుశీల.
    ఆ రోజే శంకరం బెజవాడ వెళ్ళిపోయాడు. కొత్త చోటులోకి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు.

                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS