ఇంట్లో అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాడు. శంకరం వాళ్ళ చెల్లాయితో ఏదో చెప్తున్నాడు. గుమ్మం దగ్గర నాన్నగార్ని చూడగానే మాటలాపి ఒకసారి ఆయనవైపు చూచి తలవంచుకున్నాడు.
జానకిరామయ్య గారు తన అస్వస్థని దాచుకుంటు "ఎప్పుడొచ్చావ్? ఉద్యోగం ఏమైంది?" అని అడిగేరు.
శంకరం తండ్రి ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పలేదు.
* * *
ఫోన్ మోగింది!
నిరంజనం మొదట్లో వినిపించుకోలేదు. మళ్ళా హడావిడి చేసింది ఫోన్. విసుక్కుంటూ రిసీవరు అందుకున్నాడు నిరంజనం.
"హల్లో.......నిరంజనాన్ని"
"నేను.........రేణూని మాటాడుతున్నా. అనుకోకుండా సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. సుందరివాళ్ళు బలవంతం చేశారు. ఇట్నుంచి ఐతే సినిమాకి వెడుతున్నాం. వచ్చేటప్పటికి వేళవ్వచ్చు. సుబ్బయ్యతో కేరియర్ తెప్పించుకుని భోంచేసేయండి" అవతల నుంచి ఈ నాలుగు ముక్కలూ వినిపించాయి. విన్న తర్వాత ఫోన్ పెట్టేశాడు నిరంజనం.
అతని కీవేళ మనసు బొత్తిగా బాగులేదు. ఇంటి దగ్గర్నుండి వచ్చిన ఉత్తరం తన మనసుని పాడు చేసింది. అన్నీ ఒకేసారి వచ్చినట్టు, ఇంటి మీదా, నాన్న మనసుమీదా దాడి చేశాయి పరిస్థితులు. నిరంజనం ఆ ఉత్తరాన్ని మళ్ళీ చదివేడు.
"రెండు రోజుల క్రితం శంకరం కాకినాడ మంచి వచ్చేశాడు. ఉద్యోగం కోసం వెళ్ళినవాడు ఉత్తచేతుల్తో రావడం నాకు ఆశ్చర్యం అనిపించింది. కారణం అడుగుతే ఒక్కటీ సరిగ్గా తేల్చి చెప్పడం లేదు. వాడి పద్ధతి విడ్డూరంగా ఉంది. ఎక్కడో చాలీ, చాలని జీతంతో ఉద్యోగం చేసే దానికంటే నాగలి పట్టుకుని సేద్యం చెయ్యడం మంచిదంటున్నాడు. అసలు వాడి ఉద్దేశ్య మేమిటో స్పష్టంగా బోధపడటంలేదు. నాకేం తోచకుండా ఉంది.
శంకరం ఉద్యోగం గురించి అలా ఉంది.
నువ్వూ, నేనూ మన మందరం మరిచిపోయేందుకు ప్రయత్నిస్తూన్న రాజారావు ఈ మధ్య మా దీనబంధుకి బరంపురంలో కనుపించాడుట. అతి దారుణమైన స్థితిలో ఆ మచ్చ మనకి దూరమైందనుకున్నాం. మళ్ళా దిక్కుమాలిన మొహాన్ని అవాంఛనీయమైన పరిస్థితుల్లో చూడాల్సివస్తుందేమోనని అనుమానం. వాడే గనుక ఈ ఇంటి గడప తొక్కితే? - ఈమధ్య నిష్కారంగా కోపం వచ్చేస్తుంది నాకు.
నా ఆరోగ్యం బొత్తిగా బాగో లేదు. ఈ రెండు రోజులూ కాలు బయట పెట్టనేలేదు. డాక్టరు చెప్తున్న దేమిటంటే-బ్లడ్ ప్రషర్ కీ సంబంధించిన రోగము, శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమని. నా గురించి నా కెప్పుడూ భయంలేదు. ఈ ప్రాణం ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పదని తెలుసు. కాని ఒక్కటే చింత నన్నే నమ్ముకున్న నా కుటుంబం ఒక స్థితికంటూ ఇంకా రాలేదు. మనల్ని ఆవరించిన చిన్న చిన్న సమస్యలూ ఇంకా తీరనే లేదు. ఇలాంటి స్థితిలో.......
మొన్నీమధ్య ఉత్తరం రాశావు. గుంటూర్లో వైద్య సౌకర్యాలు చాలా బావుంటాయనీ, వీలైతే ఓమాటు రావలసిందనీను. రెండు మూడు రోజులో రాదల్చుకున్నాను. ఇక్కడ ఒక చిన్నమాట-శంకరానికి తెలీకుండా నువ్వే ఎక్కడయినా ప్రయత్నించి వాడికో ఉద్యోగం వేయించు. నాకు తెలుసు-వాడికి నాగలి పట్టుకోడమే చాతగాదు. సేద్యానికేం పనికొస్తాడు.
సుశీలకు మొన్నీమధ్యనే ఒక సంబంధం వచ్చింది. కానీ అది నాకు నచ్చలేదు. వివరాలు స్వయంగా చెప్తాను.
ఇంకేం వ్రాయను ఇప్పటి కిది చాలా పెద్ద ఉత్తరం అయ్యింది. పూర్తిగా రాసిన తర్వాత చదివాను. ఇన్ని విషయాలు చెప్పి నీ మనసు పాడు చేయడం న్యాయం కాదు; గ్రహించగలవు.
రేణుకకి, నీకూ నా ఆశీస్సులు.
-జానకిరామయ్య.
నిరంజనానికీ, తమ్ముడి ఉద్దేశ్యం అర్ధంకాలేదు. ఉద్యోగం దొరకడమే ఒక గొప్ప యజ్ఞంగా తయారైన ఈ రోజుల్లో ఎవరో మిత్రుడు ఉద్యోగం వేయిస్తానని రాస్తే వెళ్ళాడు. మళ్ళీ ఇలా అకారణంగా ఉత్త చేతుల్తో తిరిగి రావడంలో అంతరార్ధ మేమిటో? అసలక్కడ ఏం జరిగిందో ఊహించటానికి వీలుపడటంలేదు.
నిరంజనం లేచాడు. సిగరెట్టు ముట్టించి వరండాలోకి వచ్చాడు. కాసేపు అక్కడే నిలబడి సిగరెట్టు కాల్చేసాడు.
నాన్న తన నింకా అర్ధం చేసుకోలేదు.
తనిక్కడ అంతస్థూ, హోదాల్లో బ్రతుకు తున్నమాట వాస్తవమే. కాని......
విసుగ్గా, సిగరెట్టు పీకని కాలి కిందవేసి నలిపేశాడు. సుబ్బన్నని పిలిచి రాత్రికి కేరియర్ తీసుకురమ్మని చెప్పేడు. బట్టలు మార్చుకుని రింగు రోడ్డు వైపు నడక ప్రారంభించేడు.
అధికారమూ, అంతస్థూ రెండూ ఉన్నాయి. స్థానికంగా పరువూ, ప్రతిష్ఠలూ ఉన్నాయి. తన చేతికింద చాలామంది బ్రతుకుతున్న మాటా నిజమే.
ఇలా అని చాలామంది చెపుకుంటారు. అప్పు డప్పుడూ తనూ 'ఆత్మవంచన' చేసుకోడం కద్దు. కాని, యదార్ధం ఆలోచిస్తే తన బ్రతుకు వడ్డించిన విస్తరి కాదు. తనపైన పర్యవేక్షణ, అధికారమూ లాటి శక్తులు మావయ్య చేతుల్లో ఉన్నాయి. ముఖ్యమైన వ్యాపార విషయాలు ఆయన్తో సంప్రదించాలి. తన అభిప్రాయాలు ఆయన కనుగుణంగా మార్చుకోక తప్పదు. అనగా అర్ధం తను మరొకళ్ళ చేతిలో ఆట బొమ్మ!
సమర్ధ నీయుడైన వ్యక్తి వ్యాపార సంస్థని వెయ్యి కళ్ళతో వేట కుక్కలా కనిపెట్టాలి గనుకా, ఇంత బాధ్యతా మరొకళ్ళ చేతికి వప్పగించడం ఇష్టం లేదు గనుకా, తన నుపయోగించుకుంటున్నారు మావయ్య.
ఆయన లౌక్యుడు. అంతా తన చేతిలో పెట్టి నట్టు నటించి, తననొక ఆయుధంలా ఉపయోగిస్తూన్నా రాయన. ఇలాంటి సమయంలో తమ్ముడికి ఉద్యోగం అందునా అతి సామాన్యమైనది కావాలని ఆయన్నదుగుతే మరింత చులకనాయిపోవడం మినహా మరొకటి జరగదు.
తనలాటివారు శ్రీమంతులింట్లో కాలు పెట్టడమే విడ్డూరమనిపించింది చూచేవారందరికీ. ఈ నగ్న సత్యాన్ని తన పరిచయస్థుల్తో చెప్పుకుని తన విశాల హృదయాన్నీ దృక్పధాన్నీ దాటి చెప్పుకోవాలనే తపన రోజు రోజుకీ ఉధృతమవుతుంది మావయ్యకి.
మనిషికి తనమీద తనకి నమ్మకం, విశ్వాసం, ధీమా గౌరవం ఉండాలి. రేణుకతో తన పెళ్ళయిన నాటి నుండీ అవన్నీ ఒక్క టొక్కటిగా దూరమవుతూ వస్తున్నాయి. ఒక్కో మెట్టూ దిగి పోవడం జరగుతోంది.
ఈ పంజరంలోంచి తప్పుకోవడం తనకి చేత కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముడ్ని కూడా ఈ వలలోయలలో ఇరికించి, వాడి ఆత్మాభిమానంపైన దెబ్బ తీయడం తనకి సుతరామూ ఇష్టంలేదు. వాడికి ఉద్యోగం వచ్చిన మరుక్షణం నుండే ప్రారంభమవుతుంది గారడి.
"ఫలానాతను మా అల్లుడికి స్వయంగా తమ్ముడు. పాపం, చదువున్నా తగిన ఉద్యోగం లేక నానా ఇబ్బందీ పడుతూంటే అయిన వాళ్ళమై చూస్తూండటం ధర్మమంటారా? అందుచేతనే అతని గ్గూడా ఒక దారి చూపించాలనే ఉద్దేశ్యంతో ఇదిగో ఇలా చెయ్యగలిగాను" అని తను కలుసుకున్న పెద్ద మనుషుల్తో తోచినప్పుడు బాతాఖానీలో చేర్చి చెప్పకుండా ఉండలేడు మావయ్య. తమ్ముడి సంగతి తనకి బాగా తెలుసు. వాడు ఈ మాటలు వింటూ సహించి వూరుకుంటాడన్న మాట అబద్ధం. తను కాబట్టి-'సర్దుకుపోయే మనస్తత్త్వం' ఇంకా చావలేదు కాబట్టి నవ్వుతూ తిరగ కలుగుతున్నాడు. వాడికి ఉద్యోగం వేయించడమంటే లేనిపోని 'క్షోభ' నెత్తిమీద రుద్దుకోడమన్న మాటే.
తనముందు సడన్ గా కారు ఆగింది. కార్లోంచే 'హల్లో' అన్నాడు శివానంద్. నిరంజనమూ విష్ చేశాడు నవ్వుతూ.
"ఏమిటి విశేషం మాదారి వస్తున్నావ్?"
"ఏం లేదు. తోచక."
"నో తోచకా బిజినెస్. కమాన్ అలా క్లబ్బు కెళ్ళొద్దాం."
"ఇవ్వాళ రాలేను."
"బలే.........ఇంకా నయం ఇవ్వాళ కొత్త చేతులొస్తూన్నాయి. ముఖర్జీ అని చెప్పి ఒక బ్రహ్మాండమైన చెయ్యి దిగిందట. అతని ముందు సుజప్రజ్ఞని పరిచయం చేసుకోవాలని అభిలాష. నువ్వు చెయ్యి కలపకపోతే మా బాగు ప్రేక్షకుడిగానిఅనా రాద్దూ. ఆనందిద్ధువుగానీ" అన్నాడు శివానంద్.
నిరంజనం అయిష్టంగానే కారెక్కాడు. కారు కదిలింది.
శివానంద్ ఆఫీసరు. 'దాహం'గల పెద్ద మనిషని చాలామంది అనుకుంటారు. లంచం తీసుకునే చాలా మందికి ఉద్యోగాలు వేయించాడనీ అనుకుంటారు. ఈ పాపిష్టి డబ్బుని పేకాటకి అంకితం చేయడం అతని కలవాటు. అతని బహి! ప్రాణం పేకాట. దానికోసం ఎంత త్యాగమైనా చేయగల ధీరోదాత్తుడు.
నిరంజనానికి అతన్తో పరిచయం క్లబ్బులో జరిగింది. అది బయట క్కూడా ప్రాకి స్నేహితులయ్యారు.
ఈ క్లబ్బు వాతావరణం రుచించలేదు నిరంజననికి. అలా అని బయటకు చెప్పుకుంటే 'అనాగరికుడు' అని గేలి చేయగలరు కాబట్టి తప్పని సరిగా ఆ ద్వేష భావాన్ని గుండెల్లో దాచుకోవలసి వచ్చింది. ఇలా క్లబ్బుల కెళ్ళడం కొన్ని పిచ్చి పనులు చేయడం లాటి నవ నాగరికతా లక్షణాలకి మావయ్యే మార్గదర్శకుడు.
కారు రింగ్ రోడ్ దాటి టవున్ లోకి వస్తూండగా శివానంద్ అన్నాడు.
"ఎన్నాళ్ళనుంచో నీతో ఒక ముఖ్యమైన విషయం మాటాడాలని ఉంది."
"ఏమిటో అది?"
"మా కజిన్ ఒకడున్నాడు. మెట్రిక్యులేషన్ ఎలాగైతే పాసయ్యాననిపించుకున్నాడు. పది హేనురోజులుంచీ మా ఇంట్లోనే మకాం వేశాడు. 'నాకు ఉద్యోగం కావలసి వచ్చింది కాబట్టి వేయిస్తావా ఛస్తావా' అని కూర్చున్నాడు. చెప్పద్దూ-ఉద్యోగాలు దొరకక, గ్రాడ్యుయేట్సు నుంచి వందలకొద్దీ అప్లికేషన్లు మా డిపార్టు మెంటుకి వచ్చాయి. పైగా రాబోయే ఇంటర్వ్యూ లో నా చెయ్యి అంతంత మాత్రంగానే ఉంటుంది. మాజోనల్ మానేజర్ అప్పాయింట్ మెంట్స్ చూస్తాట్ట. ఇలాటి పరిస్థితుల్లో మావాడు ఇంటర్వ్యూ కొచ్చి నిలబడతాడనే నమ్మకం నాకులేదు.మాజోనల్ మానేజర్ ముందు, యోగ్యతగల అనేకమంది కేండిడేట్స్ ని అవతలకు నెట్టి మావాడి పేరు సజెస్టు చెయ్యడం గూడా ఏమంత భావ్యమూకాదు. అందువల్ల మా వాడికి మా దిపాటు మెంటులో ఉద్యోగం దొరకడం కల్ల వృధా శ్రమ తప్ప."
"అవుతే?"
"ఏముందీ. నా పరిస్థితి నంతా చెప్పుకున్నాను గదా. మరి అవతల వాడికేమో ఉద్యోగం కావాలాయె. అందుచేత నువ్వే మీ కంపెనీలో వాడికి చోటివ్వాలోయ్" అన్నాడు ఆఫీసర్.
"ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీలున్నట్టు లేదు."
శివానంద్ గట్టిగా నవ్వేడు. నిరంజనానికి అతని వాలకం చిరాకు కలిగించింది.
"నువ్వు తలుచుకుంటే వేకెన్సీ దానంతటదే పుట్టుకొస్తుంది" అన్నాడు నిరంజనం భుజంతట్టి.
"కానీ ఎప్పాయింట్ మెంట్ విషయాల్లో, నీ డిపార్ట్ మెంట్ లో నీ చెయ్యి ఎంతవరకు ఉందో మా కంపెనీలో నా చెయ్యీ అంతే ఉంది మరి" అన్నాడు నిష్కర్షగా.
శివానంద్ కీ కోపమొచ్చింది, క్లబ్బు దగ్గర కారాపి దిగుతూ 'దట్సాల్ రైట్' అన్నాడు నిష్ఠూరంగా.
నిరంజనాన్ని అక్కడే వదిలి శివానంద్ గబగబా క్లబ్బులోకి నడిచేడు. నిరంజనానికి బాధ అనిపించింది.
వెంట బెట్టుకొచ్చి, తన మాట కాదన్నాడనే నెపంతో పసిపిల్లాడిలా ప్రవర్తించిన శివానంద్ వాలకం అసహ్యం కలిగించింది. గూడాను. కొందరి మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉంటాయి. వాళ్ళ వయస్సు పెరిగినంతగా మేధస్సూ సంస్కారం పెరగవు ఈ స్వభావం చూస్తూన్న వాళ్ళకి జుగుప్స కలిగించడంలో ఆశ్చర్యంలేదు మరి.
తన దగ్గర ఉద్యోగమైతే యోగ్యతా యోగ్యతలు కావలసొచ్చాయిగాని ఎదటివాడి దగ్గరైతే ఆ పట్టింపులు లేనట్టు మాటాడాడు శివానంద్.
క్లబ్బు ఆవరణలో మరో నిమిషం గూడా నిలువకుండా ఇంటికి తిరిగొచ్చేశాడు నిరంజనం.
ఆ రాత్రి భోంచేసి మరో తడవ నాన్న రాసిన ఉత్తరం చదివాడు. ఎన్ని సార్లు చదివినా-అదే ఉత్తరం, అవే విషయాలు, అదే బాధ. భారంగా నిట్టూర్హి నడుం వాల్కాహాడు.
దాదాపు పది గంటలకి రేణుక వచ్చింది. తాను కారు దిగి, కారులో వున్న నేస్తురాళ్ళని ఎవరింటి దగ్గర వేళ్ళని దిగబెట్టిరమ్మని డ్రైవర్తో చెప్పి ఇంట్లోకి వచ్చింది.
నిరంజనం మంచం పక్కన వున్న ఫేము కుర్చీలో కూర్చుంటూ-
"భోంచేశారా?" అనడిగింది.
"వూ......."
"వాళ్ళతోపాటు సినిమాకి వెళ్లేంతవరకూ నా ప్రాణం తీశారు. వెళ్ళాక తప్పింది కాదు."
"ఉహూ......."
"..................."
"..................."
"మీరీ వేళ అదోలా ఉన్నారే?"
"....................."
"వంట్లో బాగో లేదా?"
"బాగానే ఉంది"
"మరి?"
"ఏమీలేదనడంలే!"
"కాదు.......ఏదో ఉంది విశేషం"
"అలాగా. నాకు తెలీదులే" అన్నాడు విసుగ్గా.
"...................."
"...................."
"మా పిన్నీవాళ్ళు వస్తున్నారట. శారద ఉత్తరం రాసింది"
"అయితే?"
"శారదంటే మా పిన్ని కూతురు. పీ.యూ.సి వరకూ చదువుకుంది. సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. చాలా చక్కగా పాడగలరు. పిన్నీ శారదా రేపు సాయింత్రం వస్తున్నారు. మీరు పెందరాళే వస్తే వాళ్ళని రిసీవు చేసుకోవచ్చు."
"చూద్దాం. వీలైతే అలాగే చేద్దాం."
"అదేం కుదరదు."
"అంటే?"
"అబ్బ! మీ కన్ని విషయాలూ విడమరిచి చెప్పాలండీ మరీను. వాళ్ళు మనింటికి రావడం ఇదే మొదటిసారాయె. మర్యాద చెయ్యడం మన వంతు గదా."
"అలాగే......ఏ లోపమూ రాకుండా మర్యాద చేద్దాం. సరేనా?"
రేణుక ఏమీ మాటాడలేదు. అతని మాటలకి కోపం వచ్చింది కాబోలు రుస రుస చూచింది.
"చాలా వేళయింది. నాకు నిద్రొస్తుంది" అన్నాడు నిరంజనం.
"మీ నిద్ర పాడు చేయడానికి నేను రాలేదు. హాయిగా నిద్ర పోండి" అంటూ విస విసా వెళ్ళి పోయింది రేణుక. లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు నిరంజనం.
ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్ర పట్టనేలేదు.
* * *
ఆ సాయింత్రం అతనికి నాలుగ్గంటలకి ఆఫీసుకి ఫోన్ చేసింది రేణుక.
"పిన్నీవాళ్ళు వచ్చే వేళయింది."
"అవుతే"
"ఇదేమిటండీ! బొత్తిగా పసిపిల్లలై పోతూన్నారు. మనం వాళ్ళని రిసీవు చేసుకోవాలి గదా. త్వరగా వచ్చేయండి మరి."
"సారీ.......రేణు. నేను రాలేను, ఆఫీసు పనింకా తెమల్లేదు. కాబట్టి..............."
"ఆఫీసుపని తెమలకపోతే అవతల కొంపలేం మునిగిపోవులేండి. ఆ పని అలా పెట్టేసి రండి. రేపు చూచుకోవచ్చు" నిరంజనం మాటకి అడ్డుపడి అన్నది రేణుక.
"వో........రాలేను. నా తరఫున గూడా నువ్వే రిసీవు చేసుకో"
"అంతేనా?"
"....................."
"అవుతే కారు పంపండి. అర్జెంట్" అనేసి ఫోన్ పెట్టేసింది రేణుక.
కారుని ఇంటికి పంపి, తన పనిలో నిమగ్నుడయ్యాడు. పనంతా ముగిసేసరికి రాత్రి ఏడుగంటలయ్యింది. బయట కొచ్చి నిలబడ్డాడు. ఇంటి కెళ్ళిన కారు ఇంకా తిరిగి రాలేదని తెలిసింది. అలాగే నడుచుకుంటూ ఇంటి కొచ్చేడు.
"గోపాల కృష్ణుడు నల్లనా
గోకులమున పాలు తెల్లనా!"
చక్కటి గొంతునుంచి శ్రావ్యంగా వినిపిస్తోంది పాట. నిరంజనం మంత్ర ముగ్ధుడిలా గుమ్మం దగ్గరే నిలబడి పోయాడు. పాట పోర్తయిన తర్వాత తెప్పరిల్లి లోపలికి వచ్చేడు.
* * *
