Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 9


    "ఆ అబ్బాయిని మనింట్లో కొన్నాళ్ళు ఉంచుకుంటే?" పార్వతమ్మే అంది. దానికిన్నీ ఇదే ఉద్దేశ్యం లోపల కొట్లాడుతూందన్న విషయం చకితుణ్ణి చేసినా, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లుంది సంయమం.
    "శాస్త్రిని అడుగుతాను" అన్నాడు. అంతకన్న తను మాట్లాడలేడు. ఓవేళ ఆ కోర్కె క్రింద, ఇంట్లో ఎదురుగా తిరుగుతూ ఉంటే శాంత మనస్సు మారవచ్చు. లేక మగ సంతతికోసం ఉడిగిన వయస్సులోని తీరని కోర్కె మరోవిధంగా రూపొందనైనా రూపొందవచ్చు - అనే తట్టింది. ఏదైనా తను విరక్తుడు గాలేడు. ముడతలు పడ్డ శరీరం, దంతపటిమ వదిలిన స్థితి. తనలోనూ కోర్కె లను రేపుతూంది. పైగా ఆస్తి, ఉన్న నిల్వలు, తన తర్వాత..... ఈ ప్రశ్నకు సమాధానం మిటకరించినట్లు ఉంది.
    భోజనాలై, భుక్తాయాసం తీర్చుకుంటున్నప్పుడే అవధానికి దగ్గరగా వచ్చేం; మంగళగిరి వెళ్ళాలన్న దృష్టి పోయింది. ఇంత వరకూ యాత్రలు చెయ్యాలన్న క్షణికం తలంపేకాని కార్యరూపం పొందలేదు. దిగమ్రింగిన కఫంలాగే అది ఉంది. ఓ పూర్ణ యాత్ర చెయ్యగలిగిన స్తోమతు ఉన్నా ఆజ్ఞ లేని అధికారం అయ్యింది.
    గుళ్ళో చెంబులో పానకం తీసుకువెళ్ళినా సగమే స్వీకరించి గుటక వేస్తాడుట. ఈ అర్ధస్వీకారంలో అర్ధం ఏమిటో? కొండమీద కొన్ని బారువుల బెల్లం ఉన్నా చీమైనా కన్పించదట! త్రాగినదంతా ఎక్కడికి వెళ్ళుతూంది? విచిత్రంగానే భావనలు ప్రశ్నల్లో రేకెత్తేయి. కుతూహలం రేకెత్తింది. ఈ దేవుళ్ళంతా కొండలమీదికెక్కి కూర్చున్నారు, ఎందుకూ?
    నవ్వుకున్నాడు. అదే మానవశోధనా? వాళ్ళ పరీక్షా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తాహతులో ఉన్నారు. అది స్థలమహత్యం, పీఠశక్తి అన్నా సర్వం శివోహం అన్నదాంట్లో ఇముడింపు. తన విద్య, వైభోగం కూడా తెలుసు, తెలియదు అన్న దృక్పథంలో దేవదారువులై కూర్చుంటున్నాయి.
    నువ్వు అజ్ఞాపిస్తేనేకదా జరిగేది, అమ్మా? అనుకునే భావనకు ఆనకట్ట వేసేడు.
    సాయంత్రం అయ్యేసరికి అంచీలమీద బయలుదేరి రావలసిందని దశరథంగారి వద్ద నుండి మనిషే వచ్చేడు. ఆశ్చర్యం వచ్చింది, ఏమంత పుట్టి ములిగిపోయిందన్నట్లే.
    "అంతా క్షేమమా?" అడిగేడు.
    "కులాసాయే బాబు."
    "మరి ఈ పిలుపు?"
    "నాకు తెలియదండి. మీరు ఇక్కడ వుంటారని, వెంటబెట్టుకు రమ్మన్నారు అంతే."
    ఇరుకున పడ్డాడు అవధాని. కూడా భార్య ఉంది. ఏ జరూరు కార్యక్రమాలకో తను బయల్దేరి వెళ్ళినా, అది కూడా రావడంలో ఔచిత్యం లేదు. శాస్త్రికి అప్పజెప్పి ఇంటికి ఎవరినైనా తోడు ఇచ్చి పంపమంటే, అదీ సమంజసంగా కనపడటంలేదు. దాన్నే అడిగితే అనుకునే పిలిచి కబురు విషయం చెప్పేడు.
    "నేనూ వస్తా." అతి ముక్తసరిగా.
    "నేనేదో వ్యవహారం....."
    "నే సుభద్రమ్మని చూడాలని వుంది. ఎప్పుడో పదేళ్ళయ్యిందనుకుంటా చూచి."    
    మొదట్లో గుర్తుకు రాకపోయినా, నెమ్మదిగా అర్ధం అయ్యింది. 'వద్దు' అని చెప్పలేని తనయ్యేడు. కదలక కదలక ఇల్లు కదిలింది. మళ్ళీ ఆ గడపలో కాలెట్టి సంసార తాపత్రయంలో పడితే కదలడం ఓ పట్టాన వీలుకాదు.
    వెంకటశాస్త్రిస్టేషనువరకూ వచ్చి సాగనంపేడు.
    "ఎపుడైనా మా యింటికి ఓసారి రా!" అంది  పార్వతమ్మ.
    "ఇంటిదగ్గర శాంత ఒకర్తే ఏం తిప్పలు పడుతుందో!" అవధాని.
    "వెంకటమ్మ కళ్ళల్లో పెట్టుకుచూస్తుంది. దానికి ఇల్లు వప్పచెపితే ఖజానాలో డబ్బు దాచుకున్నట్లే" అంది. నవ్వేడు దాని కారణానికి.
    "అల్లా అని......."
    పోదురూ! రేపురాత్రికి మళ్ళీ ఇల్లు చేరమా, ఏమిటి?"
    "సుభద్రమ్మ నిన్ను వదిలిపెట్టదేమో!"    
    "ఎన్నాళ్ళనుండో చూడాలని వుంది. నాకన్న చిన్నదే. వాగుడు వాక్కాయి. మనిషిని నమ్మితే శరీరం కోసి ఇచ్చేస్తుంది."
    దశరథంగారిని తను ఎరుగును. అతిముక్త సరిగా మాట్లాడినా సరసుడు. ప్లీడరీతనం మాటల్లో పొందుపరుచుకునే ఉంది. కాస్తా కూస్తా వెనుకనిల్వలు, ప్లీడరుగిరీలో వెనక్కు వేసినా నిస్సంతువుగానే ఉండిపోయింది కుటుంబం. పూజలు, వ్రతాలు, యాత్రలు వెళ్ళివచ్చేరు. తను కుండలి ఓ ఏభై సార్లయినా పరిశీలించేడు. తన ఫలితాల్లో 'లేదు' అన్న సమాధానం రాలేదు. కాని అది అతి ఆలస్యంగా, అనుకోని వయస్సులో కలగవచ్చన్న దృఢతర నమ్మకం.
    ప్రస్తుతపు పిలుపు అటువంటి సంభాళింపుకు ప్రాతిపదిక ఏమైనా పడిందా అన్న నమ్మకం కలిగిస్తూంది. పైగా తనకు, తన పిన తండ్రి బిడ్డలకు పడ్డ లావాదేవీలు ఎప్పుడో అంతమై ఆఖరయ్యేయి. అవి మళ్ళీ త్రవ్వుకుని, తన్ను అంచీలమీద రప్పించడం జరుగుతూంది అనుకోవడం భ్రమే.
    "ఆయనో!" అన్నాడు చిలిపిగా.
    "బహుశః సుభద్రమ్మ చీరచెంగుకు ముడి వేసుకుంటుంది."
    "నీకంటే గడుసేమరి!"
    "ఆఁ చెప్పవచ్చేరు! మీరు గా వం చాకొంగుకు ముడివేసుకున్నారు."
    "కొండిక బ్రాహ్మన్ని పట్టుకుని...."
    "నోట్లో వ్రేలుపెడితే కరవలేరు కదూ! అల్లాగే వుండి రెండు జిల్లాల్లో పేరు, లక్ష రూపాయల ఆస్తి, పెద్ద భవంతి, వడ్డీ వ్యాపారం......."
    "బాబు బాబు ఊరుకుందూ! నీగడ్డం పట్టుకుంటాను" అనేసేడు. ముసిగా కందిచేలు పువ్వుల్లో తన బంగారు ఛాయ దాచుకుంది.
    హృదయంలో పార్వతమ్మ స్థానం అది. దానికి చలనం లేదు. దినదినానికి అది అభివృద్ది పొందుతూనే ఉంది. తనలో నిండిపోయి, అదే తనయిన దృష్టి. ఆ మనిషిలో ప్రవృత్తే అర్ధంకాక తికమకలు పడేవాడు. నగలు, నాణ్యేలు అంటే మమకారం లేదు. ఎంత పోరినా వేసుకుంటే ఉస్తికాయల గొలుసు ఒక్కటే వేసుకునేది. దానిమీద అంత మక్కువేం అంటే అత్తగారు నన్ను చూడ్డానికి వచ్చినపుడు మెళ్ళో వేసింది; ఆవిడమీద నాకున్న గౌరవం అనేసేది. ఇన్నాళ్ళల్లోనూ తన్ను ఒక్కటి అడగదు. అర్ధరాత్రి, అపరాత్రి వచ్చే అతిధులకు, హుందా తగ్గట్లుగా అన్నపూర్ణ అవడంలో ఉన్నంత ఆనందం ఇంకొకటి లేదు దానికి.
    ఆనాడు శాంత విషయంలో అంత జరిగినా, పల్లెత్తంతమాట అనలేదు. అది వ్యక్తీకరించదు. తనలో తాను కుమిలిపోయి మ్రింగుకొనే ఆశయం. ఈ వ్యక్తిత్వం చూచినప్పుడే తనకు భయం వేసింది. ఓనాడు అదే బద్దలైతే తనుకాదు, లోకమే నిల్వలేదన్న తన పిరికితనం.
    "మనం దత్తత చేసుకుంటేనో?" తటాలున ప్రశ్నించేడు.
    డిల్లపోయింది. జవాబు లేదు.
    "రామశాస్త్రి కొడుకుని చూచేవు. ఆ విషయంలో ఆలోచించు" అనే ఊరుకున్నాడు.
    గుమ్మంలో బండి ఆగడం తడవుగానే దశరధం మెట్లు దిగేడు. సుభద్రమ్మ, ఆయనతో పాటు పార్వతమ్మ కూడా దిగడంతో, ఒక్క ఉరుకులోనే వెళ్ళి-
    "ఎన్నాళ్ళకు వచ్చేవు! ఎన్నాళ్ళకు వచ్చేవు, అక్కయ్యా" అంటూనే కౌగలించేసుకుంది. వీళ్ళిద్దరి మధ్యా ఉన్న ఉన్మత్త స్నేహానికి అవధాని అటు, ఇటు దశరధంకూడా దడదడలాడేరు.
    "మీకు శ్రమ ఇవ్వక తప్పలేదు. పెండ్లిలో విందులు కుదవనియ్యకుండానే రప్పించేను. పని అల్లాంటిది. దానికి క్షంతవ్యున్ని." దశరథం.
    "మావృత్తే అల్లాంటిది. అందులో తమరు కబురు పంపడం అన్నదే మాకు గౌరవం. పాటించ డంలో మాకు గర్వం" అన్నాడు అవధాని.
    మర్యాదలన్నీ అయిన తర్వాతనే "చెప్పేరు కాదు. శుభవార్త" అన్నాడు అవధాని ఓపాటి సూటిగా దశరధంను చూస్తూనూ, గుమ్మం ఆవలగా కూర్చున్న సుభద్రమ్మను ముదల కిస్తూనూ.
    సిగ్గు ఇద్దరూ బాగా ప్రదర్శించేరు.
    "మా ఆవిడ ఇప్పుడప్పుడే కాదంటోందండీ!" అన్నాడు దశరథం.
    "పోండి" అంటూనే పార్వతమ్మ ప్రక్కగా సిగ్గుదాచుకుంది సుభద్రమ్మ.
    "దగ్గరికి వచ్చింది లెండి" అన్నాడు అవధాని నవ్వుతూనూ.
    రామశాస్త్రి ఉరుకులుకక్కుకుంటూనే వచ్చి సావిట్లో ఈ ఆనందం అర్ధం తెలియక "నమస్కారాలు, వచ్చేరా? మీరు వచ్చేరో లేదో అని లక్ష్మిగారు తరిమేసింది నన్ను" అన్నాడు చెమటతుడుచుకుంటూను.
    ఆశ్చర్యం ప్రకటిస్తే "అదేలెండి బాబు గారు. మా తమ్ముడి బావమరిది భార్య" అంది సుభద్రమ్మ.
    "అయితే?"
    "మా వదిన పోవడం మీకు తెలుసుననుకుంటా. ఇంట్లో మేనకోడలును తెచ్చి పెంచింది ఆవిడ. వాళ్ళ అబ్బాయి రాజుకిచ్చి మేనరికం కలుపుకోవాలని తరిఫీదు ఇచ్చింది. కాని వాడికి ఆ పిల్లంటేనే ఇష్టంలేనట్లు, ఆ ఇంటి వాతావరణమే నచ్చనట్లు దేశాలమీద పడ్డాడు. ఇప్పుడు విపరీతకాలం అన్నట్లు, ఏభై ఏళ్ళు నిండినా, మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న పట్టుబడుతున్నాడు." ఆగింది. అందులో తన అయిష్టమంతా ప్రస్పుటం చేసింది.
    "ఆ మేనకోడల్నే తను చేసుకుంటాడుట." ముక్తసరిగా తేల్చేడు దశరధం.
    "శుభం" అన్నాడు అవధానులు.
    "ఏమిటో, బాబుగారు! ఇదంతా ముజ్జిడ్డుగా వుంది. అసలు తమ్ముడికి మొదట్లో ఇష్టం లేదు. ఆ సీతారామయ్యా, లక్ష్మీ ఇంట్లో కాలెట్టేరు; ఆక్షణం నుండి మార్పు వచ్చింది.
    ఏమందు పెట్టేవో, ఏ ఎర చూపించేరో కాని వాళ్ళు కులదైవాలయ్యేరు ఇప్పుడు తమ్ముడికి. తమ్ముడిమీద ఒలకబోసే ఆ పేక్ష లేదు. వాళ్ళ దృష్టంతా వాడి మూలుగుతున్న డబ్బు, లక్షల  ఆస్తి, బస్సుల మీద వుంది."
    "మరి అమ్మాయికి?" పార్వతమ్మ.
    "ఇన్నాళ్ళూ అదీ నమ్మింది, అత్తయ్య తర్వాత ఆ ఇంట్లో రాజు భార్యలా ప్రవేశం కలుగుతుందని. ఆ నమ్మకంతోటే వుంది. వాడు పరారీ అవడంతో కుళ్ళి కృంగింది. ఇప్పుడు దాన్ని వదిన స్థలంలో వదినలా చెయ్యడానికి తల్లితండ్రులిద్దరూ పూనుకున్నారు."
    "ఈ క్షణంలో మూడు ముళ్ళూ వేయించి చేతులు కడుక్కోవాలని ఉన్నారు వాళ్ళిద్దరూ." రామశాస్త్రి.
    "చేతులు కడుక్కోవడం కాదయ్యా. నడుములు బిగించి తాళాలు గుంజుకోవడానికే."
    "దీన్నిగురించే మిమ్మల్ని కవురుపెట్టే వయస్సు, రెండోపెళ్ళి- ఎవరి వ్యక్తిగత అభిప్రాయాల్ని బట్టి వుంటుంది? రామ చంద్రయ్య బావ అంటే నాకు గౌరవం. అతనికి ఇన్నాళ్ళూ కోడలు కోడలనుకున్న రుక్మిణిని భార్యగా స్వీకరించగలను అన్న భావన, ధైర్యం కలగడానికి నేనేమీ అనలేను.
    "రాజు విషయమే వ్యధ. ఎక్కడున్నాడో, ఏం ఇబ్బంది పడుతున్నాడో? ఈ వివాహం అన్నది వాడిని ఎంతగా హింసిస్తుందో కూడా చెప్పలేను. పైగా ఆ కరటకదమనకులు ఎంత వరకూ వాడిని ఆదరిస్తారు అన్నదే చీకట్లో వుంది. దాని విషయంలో బావతో ప్రస్తావించినా, 'చూద్దాం' అన్నంత వ్యామోహంలో పడ్డాడు.
    "ఏ విషయాలు ఎల్లావున్నా ప్రస్తుతంలో, ఎంత త్వరగా ముహూర్తం పెడితే అంత మంచిది. ఇక గత్యంతరం లేదు."
    అర్ధం అయ్యింది. సంసార విషయాలు, లౌకికాలు, ఔచిత్య అనౌచిత్యాలు తనకు అనవసరం. తనవృత్తి ధర్మాన్ని పాటించడమే.
    "వెళ్తామా" అంటూనే లేచి ఉత్తరీయం పైన వేసుకున్నాడు రామశాస్త్రి.
    అందరూ లేచేరు.
    రెండురోజులు అవతలగానే ముహూర్తం కుదరడానికి అందరికీ ఆశ్చర్యం కలిగినా, లేడి పిల్లలా లక్ష్మి ఎగిరిపోతూనే, సీతారామయ్యతో వరహా తాంబూలంలో పెట్టించి అవధానికి ఇప్పించింది.
    బాగుండదన్నట్లుగానే "మరి సెలవా, అత్తయ్యా?" అంది సుభద్రమ్మ.
    "నన్ను నన్నులాగే వుండనియ్యమ్మా" అంటూనే పమిట ఝమాయించింది లక్ష్మి.
    ఇంట్లో దేవుడిపీఠం దగ్గర కూర్చుని అలో లక్ష్మణా అంటూ రుక్మిణి ఏడుస్తూనే ఉంది.
    హృదయం పిండించే కుమిలింపులో 'రాజూ!', 'బావా!' అని ఎలుగెత్తినా వినపడనన్నట్లే శూన్యం నిలిచిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS