"మీ కబుర్లకు అడ్డం వచ్చేనేమో!" అంటూనే నోట్లో పెట్టుకున్నాడు. అది స్వాధీనం అయ్యేటట్లు లేదు. ఎల్లా తింటారు అన్న నిస్సహాయత కళ్ళల్లోకి వచ్చింది. అభిజాత్యం క్రమ్ముకుంటే, "అయ్యగారు అల్లా తినలేరు. నేను కోసి ఇస్తానుండండి" అంటూనే లక్ష్మయ్య అడ్డుపడి చాకు తెరుస్తూనే, చెకచెకా ముక్కలు చేసేడు. ముందే పెట్టేడు.
"ఏమీలేదు. మొన్న ఊళ్ళో ఎవరో దారి తప్పి పడిపోతే..... అది చెపుతున్నాడు."
"మీరు చూచేరా?" రావు ప్రశ్న.
తలూపేడు లక్ష్మయ్య.
"ఎల్లా వుంటాడు?"
"ఏమిటిరా ఈ పత్తేదారుతనం?" మధు.
"చెప్పగలరా?"
లక్ష్మయ్య తూచా తప్పకుండానే వర్ణించేడు. తను రంగుల దాసు తీసుకొని, వర్ణం కలిపి, చిత్ర కారుడైనట్లే ఉంది. ఎత్తు, పొడుగు, వెడల్పు, ఆకారం, తీరు ఒకటి తర్వాత ఒకటి చిత్రించుకుని, ప్రాణం పోసుకుంటున్నాయి. మధు తెల్లబోయేడు. క్షణికం ఆలోచనలో పడ్డా, ఆ విన్న రూపురేఖలు తను చూచినట్లే ఉన్నట్లు ఉన్నాయి. ఎవరో చాలా పరిచితులు.
"జేబులో డబ్బు ఏమైనా వుందా?"
"ఒకటి రెండు పచ్చ కాగితాలు, నోట్ల దొంతర ఉన్నట్లున్నాయి."
"ఒరే మధూ, రాజేమోరా!" అన్నాడు బరువుగా.
"ఆయన మీకు తెలుసా?" లక్ష్మయ్య ప్రశ్న.
అప్పటికి తెప్పరిల్లేడు. రాజు! రావినూతల పాడు వెళ్ళడంలో అర్ధం? తనకు గుర్తు ఉన్నంతవరకూ అక్కడ ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు లేరు. తన కుండలే చూపించు కుందామని అవధానులు చిన్నాయన ఇంటికి వెళ్ళడం హాస్యాస్పదం. ఆ శాస్త్రంలో నమ్మకం లేదు. పైగా లక్ష్మయ్య చెప్పిన సారాంశంలో శాంత ఏడ్పు, వెంకటమ్మ ఊరడింపు కూడా అతకటం లేదు.
తను నిజం ఒప్పుకోవాలంటే శాంతను చూచిపుష్కరం దాటింది. ఇంటిబయట కొంజా దాటి ఎప్పుడూ రానేరాదు. ఆ ఇంట్లో శాంత ఉందని చాలామందికి తెలియదు. అల్లాంటి పసుపూ కుంకుమా కోల్పోయిన విధవ, ఓ అపరిచిత వ్యక్తికోసం దుఃఖిస్తూ ఉంది అన్నది తను నమ్మలేడు. అది పచ్చి అబద్ధం. ఇన్నాళ్ళల్లోనూ శాంత శీలంగూర్చి వినికిడిలో ఏవిధమైన పొల్లూ వినలేదు. పైగా ఇప్పుడు సంశయించడం అన్న తలంపు ఎంత క్రూరంగా ఉందో అన్న కుమిలింపు కలిగింది. ఈ అన్వయం కానిదే తన్ను ఇరుకున పెడుతూంది.
'వాడెవడో' అన్న సమాధానం వచ్చింది.
"నుదుటమీద కుడివైపు మచ్చ ఉందా?" అన్నాడు రావు.
తల ఊపేడు లక్ష్మయ్య.
ఠావుల్ తప్పేయి మధుకు.
నెమ్మదిగా జరిగినదంతా రావు చెప్పేడు. ఆఖరుకు తనెందుకు వచ్చిందీ స్పష్టీకరణ చేసేడు. మధుమాత్రం శ్రోత అయ్యేడు. ఇప్పటికి పరిస్థితులు తన పాత్రేమిటో నిర్ణయించి నట్లయ్యింది.
"సత్య విషయాలు దాచేరకం కాదే?"
"నోరు విప్పలేదురా ఇదంతా చూస్తే ఏదో తీవ్రంగానే వాళ్ళ మద్య జరిగింది. అది ప్రణయమా అన్నదే నాకు తెలియటం లేదు. సత్యమాత్రం ఇదివరకటి సత్యాలా లేదు. అది మాత్రం రూఢి. వల్ల మేనమామ అనుకున్నట్లు దేశాల మీదపడ్డాడా అంటే, కాఫీ కూడా జ్ఞాపకం చెయ్యాలి వాడికి. అట్లాంటివాడు రైలు టిక్కెట్టు కొని ప్రణయం స్వయంగా చేస్తాడు అన్న నమ్మకం నాకు లేదు."
లక్ష్మయ్యకు మాత్రం ఆ రాత్రి వ్యక్తి వీళ్ళిద్దరూ తెలుసు, ఇంటినుండి పారిపోయేడు అన్న విషయం గ్రాహ్యమైంది. తను సాయంకాలానికి ఇల్లు చేరాలి అన్న ఆయత్తతలోనే లేచేడు. మధు ఇచ్చిన రెండు రూపాయలు వద్దంటూనే పుచ్చుకుని బయట పడ్డాడు.
వీధులోకి వచ్చేసరికి, సరిగ్గా గదిముందే రిక్షా ఆగడం, పదహారేళ్ళ అమ్మాయి ఠీవిగా నడుస్తూ మధుగారి గదిలోకి వెళ్ళడం ఊదర కొట్టినట్లయ్యింది. 'ఎవరు' అన్న ప్రశ్న వచ్చినా 'మనకెందుకు పెద్దవాళ్ళ గొడవ' అనుకునే నడిచేడు. అయితే మధుగారు పట్నంలో చదువుకుంటున్న చదువు ఇదే కాబోలు అనుకుని ముసిముసిగా నవ్వు కున్నాడు. ఒక్కసారి నారాయణమ్మ కుదిపింది లోపల.
మౌనంలో పడ్డ రావు, మధులు యిద్దరూ, ఒక్కసారి ఎగిరి గంతేసేరు, ఎదురుగా గుమ్మంలో సత్యను చూచి. ఆశ్చర్యం మ్రింగుకోక, శిలాప్రతిమలే అయ్యేరు క్షణికం. ఎప్పుడూ సత్య ఇల్లా వస్తుందన్న ఊహ రాలేదు. పైగా ఇటువంటి సందర్భంలో ఊహకు అతీతమైన పనే జరిగింది.
నవ్వుతూనే "నేను రావచ్చా?" అంది.
ప్రకృతిలోనే పడి, మర్యాదా చేసేరు. రావు ఇక్కడ ఉంటాడు అన్న ఊహతోనే వచ్చింది. దానితో తన వెనుక జరిగిన సమీక్ష తెలుసుకోవాలన్న ఇచ్చ కలిగింది. అయినా తన చెయ్యి ముందు చూపించలేదు. ఇందులో మథునిండుకుండ. తొణకడు. రావు బోళావాడు.
ప్లేటులో ఉన్న చెరుకుముక్కలు ముందరికి తోస్తూనే రావు "విన్నావా, సత్యా? రాజులాంటివాడే ఆ ఊళ్ళో స్పృహతప్పి పడి ఉంటే..." అని మొదలుపెట్టి విన్నదంతా చెప్పేడు.
గుండెలు పిడచకట్టినట్లే అయ్యేయి. పైకి తన బాధ, మథనకూడా చెప్పలేదు. అది మ్రింగవలసిందే. ఆనాటి రాత్రి జరిగిన ప్రతి సంఘటనా తన్ను మూడు ఊతలు ఊయించినా, ఓ మధుర దగ్ధ ప్రణయ చిహ్నం అది. అందులో రాజు నాయకుడు. తనో.... మథు కనుకొలకుల్లోంచి తన్ను కనిపెడుతున్నాడనే తెప్పరిల్లి-
"ఎవరా శాంత?" అంది.
రావు, మథు ముఖం చూచి ఊరకున్నాడు.
"పన్నెండు ఏళ్లకు పూర్వం ఓసారి చూచే. మా చిన్నాయన కోడలు. విధవ."
"వయస్సు?"
"ఇప్పటికి యవ్వనం నిగారించి ఉంటుంది."
నిట్టూర్పు నిగిడ్చింది. ఏదో ధైర్యం. తను నిరుత్సాహపడలేదు.
"మధూ, ఒక్కసారి ఆవిడిని నేను చూడాలని ఉంది. ఇవ్వాళే వెడదాం" అంది.
గుటక మ్రింగేడు.
టెంకాయ పిచ్చికొండ అయ్యేడు రావు.
* * *
7
పెండ్లి పందిరిలో పెద్ద ముత్తయిదువే అయ్యి పార్వతమ్మ కలిసింది. పేరయ్యశాస్త్రి పెద్ద అక్కగారి అనురాగం పన్నీరు చేసుకున్నాడు. మాటతప్పకుండా వాళ్ళిద్దరూ రావడం అన్నదే సంతోషం ఇస్తే ఈ అనుకోని కలివిడికి, వెంకట సుబ్బమ్మ మురిసింది. అయినా ఆ తాళికట్టేవేళకే ఆవిడ కన్పించలేదు. తను వెతుక్కుంది చుట్టూరా. అటు మగవాళ్ళల్లోనూ ఆయనా చూపుకు ఆనలేదు.
కళ్ళతోనే ఆయనకు అందిచ్చినా కదలలేని స్థితి: పరిస్థితి.
తలంబ్రాలు పోసుకునేవరకూ వాళ్ళు రాలేదు. నెమ్మదిగా లేచి విడిదిలోకి వెళ్ళేడు. కట్నంగా చదివించిన వెయ్యిన్నూటపదహార్లు, బరంపురం పట్టుపంచలు, వెండి చెంబు, పళ్ళెం, పెట్టెలు పట్టించుకువస్తూంటే దొడ్లో తులసికోటవద్దనే ఇద్దరూ దిగాలుగా కూర్చున్నారు.
"ఏమిటిది, బావా?"
పార్వతమ్మ చీరకొంగులో ముఖం దాచుకుంది. అర్ధం అయ్యింది. పైగా, తనమీద గౌరవంతోనే వాళ్ళు వచ్చేరు. ఆనాటి సంఘటన ఇంత పచ్చిగా వాళ్ళల్లో వత్సరాలు గడిచినా ఉందని తనకు తెలియదు. అది మాతృ హృదయంలో హరించదు. నిత్యసత్యంలాగే రవులుకుంటూనే ఉంటుందన్న నిర్దారణే.

"ఏవో జ్ఞాపకంవస్తే..." ఇక మాట్లాడలేదు. అది ప్రసంగించాలన్న ధ్యాసలేనట్లు "పిల్ల సలక్షణంగా ఉంది. ఈడూ జోడూ కలిసింది" అంది.
చిన్నగా పేరయ్యశాస్త్రి నవ్వుతూనే "మొదట మధుకోసం ప్రయత్నించేరు. కాని విధి బలవత్తరంగా మా ఇంటి కోడలు అవ్వాలని రానీ ఉంటే అది ఎల్లా కొనసాగుతుంది?" అన్నాడు.
"సంప్రదాయమైన కుటుంబం."
పార్వతమ్మ గ్రహించింది అర్ధంఅన్నట్లే "ఎంతో మర్యాదస్తులు. ఇచ్చి పుచ్చుకోవడాలు..." అని ఆగింది.
పేరయ్యశాస్త్రి విపులంగానే చెపుతూనే, ఇచ్చినవన్నీ చూపించేడు. కంచం బరువు చూస్తూనే, మరచెంబు చేత పరిశీలించే "ఎంతో బావున్నాయి" అని మెచ్చుకుంది.
కంగారుగా వస్తూనే "బాబుగారూ! పెండ్లికొడుకునీ, కూతుర్నీ తీసుకువస్తున్నారు" అన్నాడు, ఓ ఇరవై ఏండ్లలోపు.
ముఖం తేటగా ఉంది. వినయం కన్పించింది. చదువుకుంటున్న విద్యార్ధి లక్షణం ప్రస్ఫుటం ఎగా దిగా చూచేడు అవధాని. గ్రహించినట్లే శాస్త్రి అందుకుంటూనే-
"రామశాస్త్రి కొడుకు. నావద్దనే వైదిక విద్య నేర్చుకుంటున్నాడు" అనేసి "అవధానులు గారు" అన్నాడు అటు తిరుగుతూ.
వినయంగా నమస్కారం పెట్టే, వెంకట శాస్త్రి "నాన్నారు మిమ్మల్నిగూర్చి ఎన్నో సార్లు చెప్పేరు. జ్యోతిష్యం మీవద్ద నేర్చుకోవడానికి పంపుతానన్నారు" అన్నాడు.
భుజకీర్తులు పెట్టుకున్నట్లే అయ్యింది అవధానికి. పార్వతమ్మ రెప్ప అర్చనేలేదు. పేదరికంలో విద్యాభ్యాసానికి ఉన్న సొంపు, సరళి హృద్యంగా ఉంటే "నాకు తెలిసిన రెండు ముక్కలూ చెప్పడానికి సంతోషం" అన్నాడు.
పేరయ్య శాస్త్రి సంతోషంలోనే "నీ అదృష్టంరా ఆయన నోటమ్మటే ఆ వాక్కు రావడం!" అని శిష్యుణ్ణి ముదలకించేడు.
"అంతా ఆ అంబ కృప" అని గొణుక్కున్నాడు.
అవధానికి మెరుపు కొట్టినట్లయింది. "అంబ కృప." దాన్ని ఊతంగా ఉంచుకునే ఇన్నాళ్ళూ ఈ ఎగుడు దిగుడుల్ని భరించేడు. దిగమ్రింగుకోవడానికి ఆవిడే ధైర్యం, స్థైర్యం ఇచ్చి తన్ను నిలబెట్టింది. క్షణికం, రెండు రోజుల క్రితం జరిగిన మాట స్మరణలోకి వచ్చింది. చౌదరయ్య సూచించడంలో పొరపాటు లేదు.
కాని రూపొందింది వేరొకటి. ఊహ కూడా మొగ్గలో త్రుంచివేయబడింది. అది ఒక కోణంలోంచి చూస్తే తన దౌర్భాగ్యం. 'అపుత్రస్య గతిర్నాస్తి' అన్న తన నుదుట, బలీయంగా వ్రాయబడ్డ గీత, వెంకటశాస్త్రి తనలో మమకారాన్ని చూరగొనేందుకు ప్రాతిపదిక అయ్యింది. వినయం, విధేయత, జ్ఞాన పిపాస కూడా ముగ్ధుణ్ణి చేశాయి. అయినా ఇప్పుడు నిస్సహాయత ఆక్రమించింది.
"పెద్దలు. వారిద్ధరికీ నమస్కారం చెయ్యి." శాస్త్రి.
పసుపు పారాణుల మధ్య ఆ చిన్న దంపతులు కాళ్ళకే మొక్కేరు. ఇద్దరూ దీవించేరు. హడావిడిలోనే తక్కినవాళ్ళు పడిపోతే, ఇద్దరే మిగిలేరు. దాపున తులసికోట.
