రామడోళ్ళమధ్య ఆదరాబాదరా అయినా, అవధాని పార్వతమ్మలకు ఆ సుభద్రమ్మ ఇంట్లో అష్టదిగ్భంధం అయ్యింది; పెండ్లి అయ్యేవరకు.
8
అవధానులు గారింట్లో తనెప్పుడూ ఊహించనంత సన్నివేశమే తటస్థపడడం, దాని పరిణామం చాలా విచిత్రంగా తయారవడం, ఒక్క తనలో విజ్రుంభించి, శివతాండవమాడుతున్న శక్తికి సంతోషం కలిగినా, ఆనందం వెల్లువ అయినా, నియమాలు, నిష్టలు, వ్యక్తిత్వం కూడ అవి ఎంత అసందర్భంగానో ఉన్నాయని తోచింది. తన మనస్సే తనకు కట్టలు తప్పుతూంది. ఆ ఇల్లు, పరిసరం, అందులో అలవాట్లు తనకు జ్ఞాపకం ఉన్నట్లే సంభూతి. అవి మైమరపు లోంచి మబ్బుల్లా విచ్చుకున్నట్లే ఉంటాయి.
ఈ పరిణామంలో అర్ధంకూడా తెలియదు. దాన్ని తర్కించి, ఆలోచించి, చర్చించి ఓ అర్ధం తీసుకుందామన్నా తను చెప్పలేడు. చెప్పలేని ఓ అవ్యక్తం. అద్వితీయ వ్యక్తి తనలో లేచి నించుని 'ఇది నీ ఇల్లే....అప్పుడు' అన్నవతులో 'శాంత నీ భార్య' అనేస్తున్నది. దాన్ని ఒప్పు కోవడం కన్న, ఎదుర్కొనే ధైర్యం లేదు. మైకం విడిపోయినట్లున్న ఆ సత్యం తన్ను దాసోహం అనిపిస్తూంది.
వంగి నమస్కారం పెట్టిన శాంతను, తన చేతుల్లో లేవనెత్తి, హృదయానికి హత్తుకోవాలన్న ఆయత్తత కలగక లేకపోలేదు. తనకు తెలియని సంభాలింపు కొరడా పుచ్చుకుని తన్ను రక్షించింది. శాంతను ఆ క్షణంలో పర్యవేక్షణ చెయ్యకపోలేదు. బాహ్యేంద్రియాలన్నీ మగత క్రప్పిన కనుమరుగులో క్రీగంట కనువిప్పుగా ఉండనే ఉన్నాయి.
అవే చెప్పించేయి - 'నాకన్న పెద్దవా'రని.
'భార్య భర్తకు నమస్కరించడంలో తప్పు లేదు.' ఆ మాటలే ఇప్పుడు, ఓ భాగంలో ఆనందం, గగుర్పాటు; రెండోపెడహృదయం పిడచకట్టే భయం కలగచేస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ తను ఉద్వాహం ఆడేడు? అన్నది ఈ లోకపు ప్రశ్నకాదు. దానికి జవాబు కూడా రాదు. అడిగినా గేలిచేసి తన్ను పిచ్చివాళ్ళలో జమవేస్తారు. అది తప్పదు.
ఇక ఈ శరీరాన్ని జయించే శక్తి, తనలో నించుని ఎక్కడో మరిచిపోయిన స్మృతులను రేకొట్టి, అశాంతపరిచి, అది సృష్టి సత్యం, శివేచ్చ అన్నా, నమ్మేది, ఆ ఆధ్యాత్మిక అంతః శక్తి. దానికి సాక్ష్యం లేదు. ఒక్క అచంచల బలవత్తర ప్రోద్భలం తప్ప. దాన్ని జవదాటలేని బాహిక నిర్వీర్యత.
ఆనాడు రాత్రి సత్య తన్ను పతనంలోనే చూసింది. కాని తనలోంచి సత్యలో రూపం నిర్దేశింపబడని ఆకారాన్ని చూచేడు. అది అప్పుడు తెలియలేదు. కాని శాంతను చూచిన తర్వాత ఆ రూపం జీవం పొంది, 'దా' అన్నట్లే తనకు తట్టింది. తను వెతుక్కుంటున్నది శాంతకోసమా? పరితపించినది ఆమె కోసమా? తన ఐక్యానుభూతికి అర్ధాంగి ఆవిడా? లోకం ఎల్లా ఒప్పుకుంటుంది?
తన స్థలమే ఆ ఇంట్లో లేదు; కాని ఉంది. తన సర్వ జీవశక్తులూ అక్కడ ఉండాలని దిక్కులు పిక్కటిల్లే ఆక్రోదనే చేస్తున్నాయి. అయినా తను, తనుగా, రాజుగా అక్కడ ఉండలేడు. అదంతా ఓ సృష్టి లయాల మధ్య ఉన్న పరమార్ధంలా ఉంది.
సృష్టి స్థితి లయాలనుగూర్చి తను ఆలోచించకపోలేదు. సృష్టి లయం అయితేనేకాని స్థితి రాదు అన్న నమ్మకం ఏర్పడ్డా, దాన్ని సహేతుకంగా నిర్వచించలేడు. దాన్నే విపులీక రించినా, ప్రస్తుతం గతంలో భావికోసం బీజం వేసుకుంటుంది. దాని ఫలితం ఈ భౌతికం ఉన్నా లేకపోయినా కలుగుతుంది. ఆ అనుభవ క్రమబద్ధమే జన్మల రహస్యం అంటే, పాశ్చాత్య వ్యామోహం అనేటట్లు ఉన్నా, తను శివోహం అనెయ్యవలసినంత నమ్మకం. అది తనలో ఉండిపోయింది-నిగూఢంగా, నివురు గప్పినట్లుగా, అనిమిషంగా.
ఈ సందిగ్ధ సమరాన్ని తను అన్వయం చేసుకునే శక్తి తనలో లేదు. ఆ బలహీనతే ప్రోత్సహించినట్లు బయటపడ్డాడు. ఎవరూ చూడకూడదనుకునే. అడ్డదారి త్రొక్కి పుంతలోంచి రోడ్డు ఎక్కేసరికి, శాంత జ్ఞాపకంతో కన్నీళ్లు తిరిగేయి. తను ఏదో సంపాదించుకున్నాడు. అన్వేషణ ఫలించింది. అవి తన చేతులారా తిలోదకాలిచ్చుకుంటున్నట్లు దుఃఖం.
ఎదురుగా శ్మశానం కనిపించింది. ఎందుకో పచ్చగా పెరిగి, తలలువేసిన తులసికోట ఆకర్షించింది. నీరసం కొలువెత్తిన శరీరం నడిచేవెళ్ళి చతికిలబడింది. ఏదో శాంతి. కళ్ళు బరువే ఎక్కి, మూతలు పడ్డాయి. నడినెత్తి మీద సూరీడు వచ్చేసరికే మెలకువ వచ్చింది. ఒళ్లంతా ముచ్చెమటలు పోసి ఉన్నాయి.
కళ్ళు తెరిచి, "ఒక్కగా నొక్కడు. రామం. చిరస్మరణీయంగా ... ధూళిపాళ అవధానులు. మరణం 1934 - జనవరి 16."చదివేడు. కంగారు పుట్టింది. ఏమిటిది? ఆ రామం అవధానులుగారి పోయిన కొడుకా? మరి శాంత? ఇక తలుచుకోలేక పరుగెత్తేడు.
గుండెలవిసినట్లే పరుగెత్తేడు. ఏదో ఎక్కడో కలయికలోని భయం. పెనుమిత్తి; సత్యం; తన్ను తరుముకునేవచ్చి జబ్బ తడుతూంది. శరీరం పిడచకట్టినట్లే.
వచ్చే బస్సును ఆపి, ఎక్కి కూర్చునే, ఎదురుగా ఉన్న మరచెంబు నీళ్ళు తీసుకుని త్రాగి తెప్పరిల్లేడు. అందరి కళ్ళూ ఓసారి అతనిమీద పడ్డాయి.
"ఎక్కడికి?"
"ఎక్కడికి వెళ్తుంది?"
"ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ఎల్లా ఎక్కేవ్? బెజవాడ."
"టిక్కెట్టు ఎంత?"
చెపితే నోట్ల దొంతర తీసి ఐదు రూపాయల కాగితం తీసి ఇచ్చేడు. ఫ్రంటు సీటులో కూర్చున్న హెడ్ కాన్ స్టేబిల్ మెడ పైకెత్తి చూచేడు. కళ్ళు మెరసేయి.
'అంత గుడ్లెట్టుకు చూస్తావేం' అన్న ఉరుముతోనే వానివైపు చూచి, కళ్ళు మూసుకున్నాడు.
కృష్ణమ్మ తల్లి రువ్వుకుంటున్న చల్లగాలి తగిలేటప్పటికి మెలకువ వచ్చింది. కొండఫై కాపలా ఉన్న కనకదుర్గమ్మ, పొంచి పొంచి నవ్వుతూంది. పాయల్లో ప్రకృతి తిన్నెలన్న ద్వీపాల మీద అలసట తీర్చుకుంటున్న పొట్ట కూటి భక్షకులు; పొంచి ఉన్నాము మేము అన్న యమపాశాల్లా వలలు.
తను కాలేజీ వదిలినపుడు ఎప్పుడైనా తోస్తే వచ్చి దూరంగా కూర్చుని తిన్నెమీద భావకవిత్వం వ్రాయాలనుకునేవాడు. ఆ ఊహ అందినప్పుడే శిఖండి జ్ఞప్తికి వచ్చేది. మహాభారత కథయున్నూ, అంత రహస్యాన్ని తనలో ఇముడ్చుకుందన్నట్లే ఇప్పుడు తట్టింది.
తను ఎక్కడికి వెళ్ళాలి? ఇదే ప్రశ్న బస్సు దిగిన తరువాత వచ్చింది. తన గది ఉంది. మధు, రావు, సత్య ఉన్నారు. ఇంకో కొంత మంది ఉన్నారు. కాని, మనస్సు వెళ్ళడానికి మొరాయిస్తూంది. వాళ్ళందరూ కూడా ఏదో తను బ్రతికి ఉన్న కాలంలో ఆప్తులు అన్నా, మరపురాని స్నేహితం. ఇప్పుడు ఈ స్థితిలో తనకు ఇష్టంలేదు.
హోటలుకు వెళ్ళి గది తీసుకున్నాడు. తను ఒంటరిగా ఉండాలన్న కోర్కెతో స్నానం చేసి, వాళ్ళిచ్చిన ఫలహారం తీసుకుని ప్రక్క మీదనే వ్రాలేదు. అప్రయత్నంగా నవ్వు వచ్చింది. తన్నుచూసి తనలో వారు నవ్వేరు.
టేబిల్ మీద పేపరుమడత విప్పేడు. యధాలోకపు పరవేక్షణ. రెండో పుట మూలగానే మావయ్య, నాన్న కలిసివేసిన ప్రకటన కనపడింది. అది సాధారణంగానే, తప్ప దన్నట్లు వేసినట్లు తట్టింది. తనకోసం మంచం ఎక్కిన తండ్రి, అల్లాడిపోయే అత్తయ్య, బెంగపెట్టుకున్న రుక్మిణి, మావయ్య-ఎంతమంది ఉన్నారో? కైపు వతులో శరీరం ఉప్పొంగినా, తను స్థాణువే అయ్యేడు. వాళ్ళెవరూ? తనెవ్వరూ?
శాఖాభేదాలు కలిగిన ఈ నూత్న అధ్యాయాల్లోని భౌతికాతీత బంధుత్వం తను చెప్పివ్యక్తీకరించలేడు. అది అసహజం. అయినా తన ఆశ్రితులు, పరివారం, బంధువులు, ఆఖరుకు స్వగృహం, దానితోసమాధి కూడా రావి నూతలపాడుతో ఉన్నాయి. తన స్థలం అక్కడ. ఇక వీళ్ళా, ఇంట్లో జాగా ఇచ్చి పిడకల ఇల్లు కట్టుకో, దానికి లోకాతిక్రమణ తప్పకుండా అద్దె, వడ్డీ చెల్లించుకో అన్న నిబంధన. అంతకన్న వేరేలేదు, తన శరీరపు చరిత్ర.
సత్య ఇంటికి వెళ్ళవచ్చు. ఆ రోజు ఆహ్వానం తన్ను కడుపులో చెయ్యిపెట్టికెలికినట్లవుతూంది. చలింపచేసే బలవత్తర ఆకర్షణ. తన శరీరం రెచ్చిపోయే మమకారం; అదైనా తెరచాటుగా ఉన్నప్పుడే విజ్రుంభిస్తుంది. ఆ ఊహల్లోనే శరీరం స్వేద తీర్చుకుంది.
ఉలిక్కిపడి లేచేడు. తలుపు ఎవరో కొడుతున్నారు! 'తన్ను ఎవరూ లేపవద్దు.' కుర్రాడికి చెప్పేడు. అయినా ఎవరు తన్ను పిలిచేవారు?
బద్ధకంగా లేచివెళ్ళేడు. తలుపు తెరిచేసరికే, చవకబారు పౌడరు వాసన వేసింది. ఎదురుగా నల్లగా, లావుగా, నైలాన్ చీర పగిలి అసహ్యకరంగా ధూళిపారాణిగా ఉన్నకాళ్ళు. నేరేడు పండంత బొట్టు. కాటిక కాకి ముక్కులా బ్రొటనవేలు వ్రాస్తూనే నవ్వింది.
"ఎవరు కావాలి?" బిత్తరపోయే అన్నాడు.
"ఈ వూరు మీకు క్రొత్తలా వుందే!"
అర్ధరాత్రి దాటిన ఘంటల్లో తన ప్రవర అడిగించడం హోటల్ యజమానులకు పరిపాటా?
"కాదు."
"మీకు....." నసిగింది.
"నాకు........" లోపల కుతూహలంలో రెట్టించేడు.
"అవసరం వుందేమో!"
నవ్వేడు. తనరొట్టె నేతిలో పడింది అన్న శ్రమ ఫలితం ముఖం మీద ద్యోతకమయ్యింది.
"లోపలికి వస్తావా?"
"మీ ఇష్టం."
కూర్చోలేదు. కుర్చీ వీపు పట్టుకునే నిలబడింది.
"నీపేరు?"
"కాంచనమాల." త్రుళ్ళిపడ్డాడు. జీవితా లకు అంత విలువ. శరీరం అమ్మకంతో కడుపు నిండుతుంది. ప్రపంచాన్నంతా భరించుకునే శక్తి. ఈ స్త్రీ కొన్ని వత్సరాలనుండి ఇందుల మాడిపోయి ఉండవచ్చు. అది ఓ భౌతిక విలువ లేని వ్యాపారం అయినా, పొట్టకూటికోసం నిత్యనైవేద్యం; వృత్తి. తన సంపాదనతో రేపు వెళ్ళుతుందా లేదా అన్న దృక్పధమే. అది తప్పు అని దానివల్ల పాపం వస్తుందని, దేవుడు శిక్షిస్తాడన్న తలంపేలేదు. అది పొరపాటునైనా తలంపుల పొలిమేరల్లోకి రాదు. అంటీ ముట్టని అలవాటు.
ఇది తనకు రాలేదు. వ్యతిరిక్తంగా తను దూరం అవుతున్నాడు. జార్చిన పమిటె సద్దుకున్నట్లు నటనలో, నవ్వుతూంది. తీసిన తలుపు అల్లాగే ఉండిపోయిందన్న బెరుకు.
కొద్ది ఖరీదుకు ఆవిడ శరీరం తనదవుతుంది. దానితో రాత్రల్లా వేగి, మంది నుసి కావచ్చు. కోర్కెలకు, శరీరానికి ఎంత ప్రేమో అన్న ఏవగింపు కలిగితేనే-
"రోజుకు ఎంత సంపాదిస్తావ్?" అన్నాడు.
"నేను అల్లాంటిదానను కాను."
"మరి ఎందుకు వచ్చేవు?"
తికమకపడింది. ఆ ప్రశ్న ఎవ్వరూ వేయలేదు ఇంతవరకూ. ఇంత ఉపోద్ఘాతమూ కాలేదు ఎప్పుడూ. కళ్ళల్లో కైపు ఎక్కిన మత్తులో తన చుట్టూరా క్రప్పుకుంది మగాళ్ళను. వాళ్ళివ్వబోయే తృణంకన్న ఫణమే ఎక్కువ పుచ్చుకుని వెళ్ళేది.
