Previous Page Next Page 
ఆరాధన పేజి 9

 

    పెరట్లో చాప పరచుకుని కూర్చున్నా రిద్దరూ. హరికృష్ణ కి తాను వ్రాసిన జవాబు గురించి చెప్పాలను కుంది అనూరాధ. కానీ ఎలా అరంభించాలో తోచకుండా పోయింది. సినిమా నుంచి రాగానే రాజు నిద్రబోయాడు. హరికృష్ణ భోజనం చేసి సిగరెట్ వెలిగించాడు. శారద అంతకు ముందే నిదుర బోయింది.
    అన్నపూర్ణమ్మ గారికి పగలంతా పనిచేయడం మూలాన మెలకువే రాలేదు అనురాదే లేచి వెళ్లి వడ్డించింది. అతని కెంతో సంతోషంగా వుంది.
    మంచినీళ్ళు కూడా అతని గదిలో వుంచి రాబోతుండగా అన్నాడు హరికృష్ణ --
    'జవాబు వ్రాయగూడదనుకున్నావా? అనూరాధా! నీరజ నిన్ను తప్పకుండా తీసుకుని రమ్మంది...శారద పెళ్లికి వెళ్లి రాగానే వెళ్దాం !'
    క్షణ మాత్రం మౌనం వహించిందామె .
    'వేసవి లో అమ్మ ఆరోగ్యం సరిగా వుండదు. ఎక్కడికీ రావడానికి వీలుపడదేమో!' ఆ కంఠనా ధ్వనించిన అయిష్టతను గమనించాడతడు.
    'ఉహూ! నేను నమ్మను అనూ! అమ్మగారిని ఎప్పుడో అడిగానుగా! వెళ్ళమన్నారు!'
    ఆశ్చర్య పడిందామె. తల్లి నుంచి కూడా అప్పటికే అనుజ్ఞ తీసికోన్నందుకు. స్నేహితురాలి వివాహం పూర్తీ కాగానే శారద ప్రయాణం కట్టింది. అన్నపూర్ణమ్మ గారు శారద నుదుట కుంకుమ వుంచి వో జాకెట్ ఆమెకి అందించింది.
    'ఇంతకన్నా ఎక్కువగా సత్కరించలేదమ్మా యీ ఎముకల గూడు!' అన్నది.
    'చల్లని నీ అనురాగం చాలమ్మా నాకు! కానుకలు కావాలనీ ఏనాడూ కోరలేను. చెల్లాయి కీ నాకు భేదం మాత్రం సృష్టించవద్దని కోరుతున్నాను. అదొక్కటేనమ్మా నా ప్రగాడ వాంఛ' అన్నది శారద.
    'స్నేహాన్ని మించిన మధురానుబంధం మరొకటి లేదమ్మా! ఆ బంధం మీ అక్కా చెల్లెళ్ళ మధ్య కలకాలం కాపురం వుండాలనే దీవించు తున్నాను తల్లీ!'
    రాజు కూడా ప్రయాణ మయ్యేసరికి విస్తుపోయింది అనూరాధ! 'శారదక్కయ్య హరికృష్ణ పంపించమని పట్టుబట్టారు అనూ! వాడికీ సరదాగా వుంది! రానివ్వు!" అన్నారు అన్నపూర్ణమ్మ గారు.
    'మరి నువ్వు ఒక్కదానివే వుండగలవా? అమ్మా!' అన్నది అనూరాధ.
    'ప్రక్క యింట్లో మనుషులున్నారుగా! పిచ్చి తల్లీ! నీకా బెంగ వద్దిక. ఈ సెలవుల్లో నన్నా కాస్త సరదాగా తిరిగి రామ్మా! నాన్నగారుంటే ....ఆ..ఏం లేదులే-- పద....బండికి టైమయినట్లుంది.' అంటూ దుఃఖాన్ని దిగమ్రింగి మాట మార్చి వేసిందా అనురాగమయి.
    తల్లినా మండుటండల్లో ఏపనీ చేయవద్దనీ కోరింది అనూరాధ. విస్తళ్ళు కుట్టడం మానమని అడిగింది. వెళ్ళగానే జాబు వ్రాస్తానని చెప్పింది. పరీక్షలు తెలియగానే తెలియబరచ మన్నదామే.
    వెళ్ళే ముందు హరికృష్ణ నమస్కరించాడామేకు. అతని  విషయాని కామె ముగ్ధురాలయ్యింది. అతనిలోని స్నేహశీలత నెంతో మెచ్చుకుంది. శారద వెళ్లి వస్తానమ్మా! అనూరాధ రావడం ఆలస్య మౌతుందేమో! గాభరా పడవద్దు! అని చెప్పింది.
    
                             *    *    *    *
    మద్రాసు వెళ్ళగానే రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. హరికృష్ణ వరుసగా నాలుగు రోజులు స్వయంగా కారు నడుపుతూ అతనికి మద్రాసు లోని వింత లన్నింటినీ చూపించాడు. ఇంటికి వచ్చేసరికి అనూరాధ వంట ముగించి యిద్దరి కోసం ఎదురు చూస్తుండేది.
    భోజనం పూర్తీ కాగానే రాజు ఏ పార్కు కో, సినిమా కో బయలుదేరేవాడు. అనూరాధ పర్సు లోంచి ఒక్క పైసా కూడా తీయనీయ లేదు హరికృష్ణ.
    'అతిధుల్ని మర్యాదగా చూడడం యీ డాక్టర్ కి తెలుసు అనూ!' అంటూ మృదువుగా మందలించేవాడు.
    అనూరాధ పెదవి కదల్చలేక పోయేదా పైన. ఆరోజున రాజు సినీమాకు వెళ్ళాడు. అంత క్రితమే శారదా సతీశ్ లు వచ్చి వెళ్లారు. వాళ్లకు తనే స్వయంగా మైసూర్ పాక్ చేసి వడ్డించింది అనూరాధ. హరికృష్ణ ఎంతో కమ్మగా వుందని ప్రశంసించాడు. శారద కూడా అంగీకరించింది.
    నీరజను చూడ్డానికి మరునాడు వెళ్దామన్నది అనూరాధ. రాజు కూడా బయలుదేరాడు. శారద ఆ రోజున హాస్పిటల్లో వో ఆపరేషను కేసు వుండడం మూలాన రాలేనంది. డ్రైవరు రాలేదా రోజున . హరికృష్ణే కారు నడుపుతున్నాడు.
    వెళ్ళవలసినది యింకా నాలుగు మైళ్ళు ఉంది. వో లారీ ఎదురుగా వేగంగా వస్తోంది. హారన్ విన్పించే స్థితిలో లేడా లారీ డ్రైవర్. మంచి నిషా లో వున్నాడు. ఆకాశంలో తేలిపోతున్నట్లు నడుపుతున్నాడు. హరికృష్ణ వో ప్రక్కకు తప్పించాడు కారును.
    ఎదురుగా వస్తున్నది కారని కూడా తెలియనంత నిషాలో వున్న ఆ లారీ డ్రైవర్ చక్రాన్ని యిష్టం వచ్చినట్లు త్రిప్పుతున్నాడు.
    క్షణం లో లారీ, కారును పల్టీ కొట్టించి రయ్ మని దూసుకు పోయింది . స్టీరింగు ముందున్న హరికృష్ణ కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ప్రమాదాన్ని ముందుగా వూహించని స్థితిలో వున్న అనూరాధ , రాజులు స్పృహ లేకుండా పడిపోయారు.
    అంతలో ఎదురుగా వస్తున్న మరో కారు ఆ ప్రమాదాన్ని చూసి ఆగింది. హరికృష్ణ తల నుంచి విపరీతంగా రక్తం  స్రవించుతోంది. అనూరాధ కు కూడా కాళ్ళకు  బాగా దెబ్బలు తగిలాయి. రాజుకి అంతగా తగలలేదు. హరికృష్ణ తల వెళ్లి స్టీరింగ్ కు తగలడం మూలాన రక్తం ధారగా కారిపోతోంది. ఆ వచ్చిన కారులోని వాళ్ళు వెంటనే తీసుకొని వెళ్లి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే పని చేస్తున్నారు శారదా సతీశ్ లు. వో నౌకరు వెళ్లి హరికృష్ణ కి జరిగిన ప్రమాదాన్ని గురించి చెప్పాడు. ఆతురతతో పరుగున వచ్చారా దంపతులు.
    హరిని చూడగానే శారద నిర్ఘాంత పోయింది. కట్టే లా బిగుసుకు పోయింది. అనూరాధ ని, రాజునీ సతీశ్ ని చూడమని చెప్పింది. మరో డాక్టర్ సాయంతో హరికృష్ణ ని లోనికి తీసుకొని వెళ్లింది. గాయాన్ని కడిగి మందులు వేసి కట్టు కట్టారు. అనూరాధ కు రెండు గంటల తరువాత స్పృహ వచ్చింది. మరో వైపుకు వత్తిగిలి కళ్ళు తెరిచింది. నీరసంగా వుంది. 'రాజూ!' అన్నది సన్నగా.
    'రాజు బయట వున్నాడు. ఫరవాలేదు అనూ! అతని కేమీ దెబ్బలు తగల్లేదు' అన్నది శారద కాఫీ అందించుతూ.
    'మరి.... హరికృష్ణ గారో...' ఎలాగో వోపిక చేసికొని ప్రశ్నించింది.
    'ఫరవాలేదమ్మా! కోలుకుంటాడు ' యదార్ధాన్ని ఆ పరిస్థితుల్లో చెప్పడం మంచిది కాదని దాచిందామె. అంతవరకూ హరికృష్ణ కి స్పృహే రాలేదు.
    ఇంజక్షన్లు చేస్తున్నారు. గ్లూకోజు ఎక్కించు తున్నారు. ఆ సాయంత్రానికి కొంచెం గా కదిలాడు. శారద కనులలో అశారేఖ తళుక్కు మన్నది.
    కళ్ళు తెరిచి చూశాడు నలు వైపులా , ఎదుట నిలబడి వున్న శారద ఎదో అనబోయి ఆగిపోయింది. అతడామెను పలుకరించనే లేదు. తలపై వున్న కట్టును తడిమి చూసుకున్నాడు. బాధగా మూలిగాడు సన్నగా.
    'నొప్పిగా వుందా?' అన్నది శారద వంగి.
    'లేదండి! బాగానే ఉంది. పాపం! మీరెందు కిక్కడ వున్నారు? కారులో వెళ్లి  పోవచ్చు గా! మీకు కారు లేదేమో! పోనీ....'
    'బావా!....' ఆమె నోట మాటే రాకుండా పోయింది.
    'డాక్టర్! వోసరిలా రండి! హరిని చూడాలి!' అంటూ మరో డాక్టర్ని పిలిచింది.
    'ఎలాగో మాట్లాడుతున్నాడు! మెదడు దెబ్బ తిన్నదేమో!'; భయం పడగ విప్పింది.
    డాక్టరు పిలిచాడు పేరు పెట్టి. కానీ హరికృష్ణ కనులు కూడా తెరవలేదు.
    'మిస్టర్'!' అన్నాడు. అతని వంక చూసి పెద్దగా నవ్వసాగాడు హరికృష్ణ.
    శారద తెల్లబోయింది. తానొక డాక్టర్ నన్నమాటే మరిచిపోయింది.
    'యస్! డాక్టర్! ఇతనికి మతి తప్పింది. మెదడు కి బలమైన గాయం తగిలింది. అందుకే వెనుకటి సంగతులేవీ గుర్తుకు రావడం లేదు' అన్నాడా డాక్టర్.
    శారద భారంగా నిట్టూర్చింది. జీవితాన ఏ సుఖాన్ని అనుభవించక ముందే అతడు దుర్భరమైన బాధలకి లోనవుతున్నాడని విచారించిందెంత గానో. సతీశునికి కబురంపించింది. అతడు కూడా ఎంతో బాధపడ్డాడు సంగతి విని.
    అతడిని యింటి దగ్గరే వుంచి చికిత్స ప్రారంభించాలని నిశ్చయించు కున్నారా దంపతులు. మరునాడే అనూరాధ ను పిలిచి అన్నది శారద--
    'బావ యిపుడు నిన్ను గుర్తు పట్టడెమో!'
    ఆశ్చర్యపోయింది అనూరాధ. శారద అన్న మాటలు విన్న వెంటనే.
    'అదేమిటక్కా? ఏమయ్యింది?' ఆతురత పరుగులు పెట్టిందా కంఠనా.
    'మరో జన్మ ఎత్తినట్లు మాట్లాడుతున్నాడు...'
    'అంటే....ఆయన పిచ్చి వారయ్యారా? అక్కా?" భయంతో వూగిస లాడిపోతోందామె.
    'ఆ! అంతే అనుకోవాలి అనూ! వెనుకటి సంగతులేవీ గుర్తుకు రావడం లేదేంతగా గుర్తు చేసినా. తన పేరే తనకు తెలియదంటున్నాడు.' బాధతో వణికింది శారద స్వరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS