రోజూ సాయంత్రం మా కుర్రకారంతా చెరువు గట్టు మీదికి చేరేవాళ్ళం. గట్టు మీద నాలుగు బ్రహ్మాండమైన మర్రి చెట్లున్నాయి. అక్కడ అలిసి పోయేదాకా కోతి కొమ్మచ్చు లాడి , లాగులు, చొక్కాలు అన్నీ విడిచి చెట్టు కింద దాచి, చెర్లో పడేవాళ్ళం. మర్రి చెట్టెక్కి చేర్లోకి దూకటం సరదాగా ఉండేది. మా అందరి కంటే సారధి , చిటారు కొమ్మనెక్కి, ఈల వేసుకుంటూ, పల్టీలు కొట్టుకుంటూ చెర్లో కి దూకేవాడు. అయిదు రూపాయలు మనో మోహిని కిచ్చిన నాటి నుంచి మాతో ఆటలకు రావడం మానేశాడు సారధి. బడి వదలగానే సంచీ కిటికీ లోంచి ఇంట్లోకి గిరవాటు పెట్టి, చిలకల సరస్సు కు వెళ్లి పోయేవాడు.
"ఎందు కెళ్తున్నావురా రోజూ?' అని అడిగాను.
"పాము మాత్రం నేర్చుకుంటున్నాను. అప్పుడే ఎవరికీ చెప్పబోకు. పాముల నాగయ్య కు నాగ వశీకరణం తెలుసు. ఎంత పెద్ద త్రాచు నైనా సరే ఆ మంత్రం చదివి "అగు" అంటే ఆగుతుంది. ఆ మంత్రం చదువుతూ పాము నోట్లో చెయ్యి పెట్టినా కరవదు. మంత్రం నేర్చుకున్నాక నీకే చూపెడతాగా నా మహిమ ముందుగా" అన్నాడు.
ఒకనాడు సారధి బలవంతం చేసి నన్ను కూడా తనతో పాటు తీసుకు వెళ్ళాడు. మేం గుడిసెల దగ్గిరికి వెళ్లేసరికి చీకటి పడుతుంది. నులకమంచం మీద కూర్చొని పాముల నాగయ్య గంజాయి దమ్ము పీలుస్తున్నాడు. ఆ పక్కనే స్వామీజీ గోచీ పెట్టుకొని కింద కూర్చొని , ఆకాశం కేసి దూరదూరాలకు చూస్తున్నాడు.
నా కళ్ళు మనో మోహిని ని వెతుకుతున్నాయి. పొయ్యి ముందు కూర్చొని ఊడుతుంది. పుడకలు తడివి గామల్సు, మండక పొగలు చిమ్ముతున్నాయి. ఊది ఊది మంట చేసింది మోహిని. ఆ మంట వెలుగులో మోహిని మొఖాన్ని పరీక్షగా చూశాను. చాలా మారిపోయింది.
పంతులమ్మ గా ఉండగా రోజూ నాలుగైదు సార్లు ముఖం కడుక్కుని పౌడరు రాసుకొని, తిలకం దిద్దుకోనేది. ఇప్పుడా గుడిసె లో స్నో, పౌడరు , తిలకం సబ్బు వగైరా సరంజామా లేదు. ఎప్పుడూ తెల్లటి గ్లాస్కో చీరలు కట్టేది పంతులమ్మ. తెల్లగా మల్లె పువ్వుల్లా మడత నలగకుండా , నునుపు రేగకుండా ఉండేది. అలాటి పంతులమ్మ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కోరా రంగుకి దిగిన చీర -- రవిక లేదు. సగం శరీరం కనిపిస్తుంది. ముఖంలో, శరీరంలో ఇదివరకటి లాలిత్యం లేదు. ఏదో లోతు, గంబీర ముద్ర , అజ్ఞాత శక్తి, ఆ మూర్తి లో కనిపిస్తున్నాయి.
సారధిని చూసింది మోహిని. పెదిమలు దాటి, వెన్నేలు ఒలికింది. నవ్వుతూ లాలనగా సారధిని దగ్గిరికి తీసుకుంది. కౌగలించుకుంది. ముద్దు పెట్టుకుంది. చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంది.
ఆ స్త్రీ మూర్తి ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతుంది.
సౌందర్యాన్ని స్వచ్చందంగా విసర్జించింది.
యౌవనాన్ని జయించిన యోగిని!
పాముల నాగయ్య గంజాయి గొట్టాన్ని సారధి కందించి , "బిడ్డా! రా" అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. గంజాయి తాగి నిభాయించు కొనే శక్తి సారధికి ఎన్నడబ్బిందో నాకు తెలియదు.
"స్వామి వారికి కూడా పాము మాత్రం నేర్పానురా, బిడ్డా!" అన్నాడు పాముల నాగయ్య.
స్వామి వారి బోసి నోటి పై వికృతమైన మందహాసం నల్లగా మెదిలింది. ఆరోజే నల్ల తాచుని పట్టుకు వచ్చాడు నాగయ్య. అంత జోరులో ఉన్న నాగును ఎప్పుడూ చూడలేదట తను. గుడ్డలో మూట కట్టి చూరుకు వెళ్లాడ కట్టాడు మూట కదులుతుంది.
"స్వాములారూ , చూపండి కోడె ని బిడ్డకి" అన్నాడు నాగయ్య.
స్వాముల వారు లేచి మూట విప్పారు. సెగలు చిమ్ముతూ , బుసలు కొడుతూ కాల సర్పం లా లేచించి కోడె తాచు.
మంత్రం చదువుతూ తాచుని కవ్విస్తూ , చేత్తో పొడుస్తున్నాడు స్వామి. మోహిని మళ్ళీ పొయ్యి దగ్గిరికి పోయింది మంట అరిందని. పాముల నాగయ్య స్వామి వారంతటి మనిషి తన శిష్యుడై నందుకు సగర్వంగా గంజాయి పొగ వదులుతూ "నీచేతా ఇలాగే అడిస్తారా నాగుల్ని" అన్నాడు.
"అమ్మో" అంటూ చీరిన కేక దిక్కులు పగిలేలా వినిపించింది. తాచు స్కామిని కరిచి , జరజరమని పాకి గుడిసె కు ఎదట గల పుట్టలోకి దూరింది.
స్వామి శరీరం క్షణం లో నల్లబడింది. నోట్లోంచి నురగలు వస్తున్నాయి. మెలికలు తిరిగి పోతున్నాడు. కళ్ళు తెరిపిడి పడటం లేదు. మోహిని ఏడుస్తూ వచ్చి స్వామి మీద పడింది. పాముల నాగయ్య మంత్రాలు చదివాడు. తాయెత్తు కట్టాడు. పసరు పిండి వేశాడు. ప్రయోజనం లేకపోయింది.
స్వామి మరణించాడు. ఏ ప్రారబ్ధ కర్మకి తాను అతీతుడ్నీననుకున్నాడో ఆ ప్రారబ్దానికే తల వంచి, తనువూ చాలించాడు ఆ స్వామి. లోకాన్ని ఉద్దరించాలని అవతరించిన మహాత్ముడు లోకాన్ని విడిచి పోయాడు. ఎవరినీ ఉద్దరించ కుండానే, ఎవరికీ మోక్షం చూపెట్ట కుండానే కన్ను మూశాడా కారణ జన్ముడు.
మోహిని స్వామి శరీరాన్ని వదిలి, సరాసరి గుడిసె ఎదట గల మర్రి చెట్టు దగ్గిరికి వెళ్ళింది. ఆ చెట్టు కింద గల పుట్టలో దూరింది స్వామి ప్రాణాలు హరించిన సర్పం. తన చేయి కన్నంలో పెట్టింది. కెవ్వున కేక పెట్టింది. నేల కోరిగింది. నల్లబడి, నురాలు కక్కి కన్నుమూసి స్వామిని అనుసరించింది.
అంతా రెప్ప పాటులో జరిగినట్టు అనిపించింది. అందరిలాగా బ్రతకలేక, ప్రపంచానికి దూరంగా పోయి, దూరంగా జీవించిన రెండు ప్రాణులు రాలిపోయాయి. పాముల నాగయ్య రెండు మృత దేహాలను తక్షణం గొయ్యి తీసి పాతి పెట్టాడు. మమ్మల్ని ఇంటికి పొమ్మని సాగనంపాడు. రాత్రి పది గంటలకి ఇళ్ళకు చేరుకున్నాం ఇద్దరం. నాకు నిద్ర పట్టలేదు. వికృత దృశ్యా లేవో కళ్ళ ముందు భయంకరంగా నృత్యం చేస్తున్నాయి. సారధి ఏడవలేదు. కాని అతని బాధ ఎంత తీవ్రమైందో నాకొక్కడికే తెలుసు.
మరునాడు ఊరందరికీ ఈ వార్త ఎలాగో తెలిసింది. కాసేపు ఊరివారు ఆశ్చర్యపోయారు. నివ్వెర పోయారు. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేశారు. హెడ్ మాస్టారు సవ్యసాచి ఆనందంతో ఉక్కిరిబిక్కిరై , "పాపుల్ని భగవంతుడు శిక్షిస్తాడు" అని తీర్పు చెప్పాడు. పంతులమ్మ చేసిన పాపం హెడ్ మాస్టార్ని ప్రేమించాక పోవటమే.
నాలుగో రోజున పాముల నాగయ్య ఒక పాము చర్మం తెచ్చి, సారధి కిచ్చి వెళ్ళిపోయాడు. ఆ తరవాత నాగయ్య ను నేనింత వరకూ చూడలేదు. చిలకల సరస్సు ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాడు. పంతులమ్మను కరిచిన పాము చర్మం అది. చిత్రమైన ఆ సోదర బంధానికి స్మృతి గా సారధి దగ్గిర మిగిలింది ఆ పాము చర్మం!
సారధి జీవితంలో గాడంగా ప్రేమించిన మొదటి స్త్రీ పంతులమ్మ. ఆ బంధం లోకంలో ఏ రెండు ప్రాణుల్నీ ఏనాడైనా బంధించిన , ఏ బంధం కంటే గూడా బలీయమైనదే!
పంతులమ్మ , స్వామి -- వీరి అకాల మరణాలకు ఊళ్ళో విచారించిన మనిషి లేడు. సారధి కూడా ఆ విషయాన్ని మర్చి పోయినట్లే కనిపించేవాడు. కాని ఆ అనురాగ జ్యోతి అతని ఆత్మ జ్యోతిలో ఐక్యమై పోయిందని నాకు తెలుసు.
ఇన్నేళ్ళ తరవాత మా ఊరు వచ్చి, ఇద్దరం తిరిగి చిలకలసరస్సు దగ్గిరికి వెళ్లాం. ఆ గుడిసెలు ఇప్పుడు లేవు. కాని, ఆ ప్రాంతంలో ఒక ఊరు వెలిసింది. ఓ వంద కొంప లున్నాయి. మర్రి చెట్టు మాత్రం లోక సాక్షిలా నిశ్చలంగా అక్కడే ఈ సుఖదుఃఖాల కు తాను అతీతమైనట్లు నిలబడి ఉంది.
ఆ చెట్టు దగ్గిరే అరగంట సేపు కూర్చొని , మెల్లిగా , మౌనంగా స్మృతి పధంలో మెరుస్తున్న గతాన్ని పోల్చుకుంటూ ఇళ్ళకు చేరాము సారధి, నేనూ.
8
సారధి విషయం రఘుపతి తో మాట్లాడాను. రఘుపతి అంతా విన్నాక ఇలా అన్నాడు.
"సారధి జీవితం పాడవటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి : అతనికి జాతకాల మీద ఉన్న పిచ్చి. రెండు ; హెలెన్. ఈ రెంటి నుంచి అతనికి విముక్తి కలిగించాలి. ఏమైనా, సారధి ఒక నిర్ణయానికి వచ్చాక అతన్ని మార్చటం ఎవరి తరం? ఏ విషయాన్ని గురించైనా మనతో అతను చర్చిస్తే , విషయం వివరించి ఒప్పించ గలం. కాని అతను చర్చలోకి దిగడయ్యే. చెప్పినదంతా నిదానంగా వింటాడు గాని ఒక్క మాటకి ఎదురు చెప్పాడయ్యే. అంతా విన్నాక , మనం చెప్పిన డానికి పూర్తిగా విరుద్దంగా తనకు తోచినట్టి చేసి ఊరు కుంటాడయ్యె.'
నిజమే, సారధి తో వచ్చిన చిక్కే అది. సారధి మనసులో ఏముందో ఎప్పుడూ బైటికి చెప్పడు. చెయ్యదలుచు కున్నది చేసి ఊరుకుంటాడు.
నేను, రఘుపతి ఒకనాడు అనంతమ్మ గారితో సారధి విషయం చాలా వివరంగా మాట్లాడాం. మధ్యలో ముకుందరావు వచ్చాడు. మొత్తం మీద తక్షణం సారధి కి పెళ్లి చేయవలసిన అవసరం ముకుందరావు, అనంతమ్మ గుర్తించారు.
సారధి తో పెళ్లి విషయం ఇంతవరకు తల్లి తండ్రులు మాట్లాడలేదు. ఉద్యోగంలో చేరి ప్రయోజకుడై , తన కుటుంబాన్ని పోషించుకో గల శక్తి సామర్ధ్యాలున్నప్పుడు మాత్రమె మగవాడు పెళ్లి చేసుకోవాలని ఆ దంపతుల అభిప్రాయం. లోకంలో కనిపించే దాంపత్యాలలో అంత సామరస్యం గల జంట నేనెక్కడా చూడలేదు.
అనంతమ్మ పాడిన పాటకి ముకుందరావు వంత కలుపుతాడు.
ముకుందరావు పాడిన పాటకి అనంతమ్మ వంత కలుపుతుంది.
ఆ మరునాడు మీటింగు పెట్టారు. పెళ్లి చేసుకోవలసిన అవసరాన్ని అవధాని గారు వివరించి చెప్పారు సారధికి. ముకుందరావు కూడా తన అభిప్రాయం చెప్పాడు. సారధి మౌనంగా వింటున్నాడు కాని, పెదవి కదపటం లేదు.
"ఏమంటావు రా?" అన్నారు అవధాని గారు.
సారధి మాట్లాడలేదు.
అవధాని గారు చెబుతున్న మాటలు ఆయనవి కాదు. ముకుందరావు చెప్పదలుచుకున్న ముక్కలు అవధాని ముఖాన వెలువడుతున్నాయి.
"చూడు, నాయనా. "ముక్కు పొడుం ఓ తులం దట్టించి, సకిలించి నట్లు చిత్రమైన సవ్వడి చేసి, మళ్ళీ మొదలు పెట్టారు అవధాని గారు. "నీకు పెళ్లీడు వచ్చింది. తోటకూర కాడలా ఎదిగి కూచున్నావు. ఉప్పూ కారం తింటున్న ఘటాలం గనక, బ్రహ్మ చర్య వ్రతం చిలకాలం అవలంబించటం అసాధ్యమైన విషయం. అదీగాక బెండకాయ లాగా ముదిరిన బ్రహ్మచారి విలవ శూన్యం. ఏ ఈడులో జరగవలసిన ముద్దు ముచ్చట ఆ ఈడు లో జరక్కపోతే కురవాళ్ళు పాడై పోతారు. పెడదారులు తొక్కుతారు."
ఇదే ధోరణి లో అనర్గళం గా , సునాయాసంగా , రసాత్మకంగా ప్రసంగించి ముగించి, 'అర్ధమైందిరా , అబ్బీ?" అన్నారు అవధాని గారు.
సారధి సన్నగా నవ్వి లేచి వెళ్ళిపోయాడు. అవధాని గారి ఒళ్ళు మండిపోయింది. తనంతటి వాడు అంతసేపు వాగినదంతా గడ్డి పోచ కింద కొట్టి పారేశాడు సారధి!
"ఇతగాడు బాగుపడే మాట కల్ల!" అన్నాడు. "నాశనం కావటానికి ఎన్ని అవలక్షణా లుండాలో అన్నీ ఈ పొగరు బోతులో పుష్కలంగా ఉన్నాయి." అన్నాడు. ఇలాటి దౌర్భాగ్యులకు సలహా ఇవ్వాలని రావటం తనదే పొరపాటన్నాడు. మళ్ళీ ఓ అరతులం నశ్యం ఎక్కించి, "వాడి చావు వాణ్ణి చావనీవోయ్" అంతో ముకుందరావుకు సలహా చెప్పి వెళ్ళిపోయాడు అవధాని గారు.
ఆ తరవాత సారధి ని నేను నిగ్గదీసి అడిగాను . వెర్రి జాతకాల పిచ్చిలో పడి నిండైనా జీవితాన్ని నలిపి నాశనం చేసుకోవటం అర్ధరహితమని పరిపరి విధాల చెప్పాను. ప్రయోజనం లేకపోయింది.
ఇంకా రెండు రోజులుండి తిరిగి బెజవాడ చేరుకుందామని అనుకున్నాం. సారధిని చూస్తె నాకు చిత్రమైన అభిప్రాయాలు కలుగుతూండేవి. పైకి కనిపిస్తున్నదానికంటే ఉన్నతమైనది, అతీతమైనది అతని వ్యక్తిత్వం అనిపించేది.
