Previous Page Next Page 
మనిషి పేజి 8

 

                            
    రాత్రి అందరూ పడుకున్నాక పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో పార్ధసారధి చప్పుడు చేయకుండా లేచి, ఆ అర్ధరాత్రి ఒక్కడూ ఊరు దాటి, స్మశానాలు దాటి, చిట్టడవి దాటి సరస్సు దగ్గిరికి వెళ్లి, తాను ఆ రోజంతా కష్టపడి సంపాయించిన రూపాయి బిళ్ళని మోహిని చేతిలో పెట్టేవాడు.
    మనోమోహిని ఆర్ద్ర నేత్రాలతో, అత్రపడుతున్న హృదయంతో సారధిని గుండెలకు హత్తుకుని, "తమ్ముడూ! ఎన్ని జన్మలెత్తి నీ ఋణం తీర్చుకోనురా?' అంటూ ముద్దులతో ముఖాన్ని క్షాళనం చేసేది.
    పరికలు ఏరుకొనే అదను పది పదిహేను రోజులే ఉంటుంది. ఆ తరవాత డబ్బు సంపాయించటానికి మరో మార్గం తొక్కాడు సారధి.
    ఆ రోజుల్లో యుద్ధం జరుగుతుంది. ఇనుముకు కరువు వచ్చింది. దేశం లోని వంతెన లు కూడా పడగొట్టి ఇనుప దూలాలూ, చువ్వలూ పీక్కు పోయారు గవర్నమెంటు వాళ్ళు. అంతేకాదు , ఏ చిన్న ఇనపముక్క దొరికినా , దాన్ని అణాకో,అర్ధణా కో బరువును బట్టి కొనేవారు పోలీసులు. రోడ్ల మీద అరిగిపోయి, ఊడిపోయిన గుర్రపు నాడాలు, ఎడ్ల నాడాలు ఏరటానికి మా కారు కుర్రవాళ్ళు చాలామంది శనాదివారాల్లో రోడ్డు వెంట వెతుక్కుంటూ వెళ్ళేవారు. మూడు నాడాలకు అణా ఇచ్చేవారు.
    సారధి రోజూ మా ఊరు నుంచి నాడాలు వెతుక్కుంటూ గుడివాడ దాకా నడిచి వెళ్లి వస్తుండేవాడు. గుడివాడ మా ఊరికి పద్నాలుగు మైళ్ళు. రాను పోను ఇరవై ఎనిమిది మైళ్ళు నడిచి, ఏరిన నాడాలన్నీ ఇంటి వెనక గొడ్ల పాకలో దాచి, చెర్లో పడి ఒక అరగంట స్నానం చేసి, ఇంటికి చేరుకునేవాడు. రోజుకి రూపాయి పైనే సంపాయించే వాడు. మరునాడు కుదర వల్లి పోలీస్ స్టేషన్ కి ఆ నాడాలు తీసుకుపోయి, డబ్బులు తీసుకుని, ఆరు మైళ్ళూ వెనక్కి నడిచి, చిలకల సరస్సు చేరి, అక్కయ్య కా డబ్బు ఇచ్చి వచ్చేవాడు.
    కాని రోజూ అంతదూరం నడవటం ఏ మనిషికీ ఆ వయసులో సాధ్యం కాదు గదా? నడవలేని రోజు కూడా డబ్బు సంపాయించాలి.
    డానికీ మూడవ మార్గం మిగిలింది.
    అదేమిటి? మా ఊరికి ఉత్తరంగా గుడివాడ రోడ్డు మీద అంజనేయుల స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం పక్కనే బ్రహ్మాండమైన కోనేరుంది. ఆ ఆలయం సంవత్సరం పొడుగునా ఇంచుమించు నిర్మానుష్యంగా ఉంటుంది. ఒక్క నాగుల చవితి కి మాత్రం అక్కడ పెద్ద తీర్ధం జరుగుతుంది. ఆలయ ప్రాంగణం లో ఒక పెద్ద పాముల పుట్ట ఉంది. ఆ పుట్టలో చిరకాలం నుంచి ఒక దేవతా సర్పం ఉంటున్నదని , ఆ సర్పం రోజూ అర్ధరాత్రి స్వామి ఆలయంలో గర్బగుడి లో ప్రవేశించి, నృత్యం చేసి, స్వామిని పూజించి , తిలకం ధరించి తిరిగి పోతున్నదని అను శ్రుభ్రంగా వస్తున్న దొక కధ.
    ఆ దేవతా సర్పం ఎవరినీ కరవదని, అది విషానికి బదులు అమృతాన్ని శిరస్సు నందు దాచుకుందని అంటారు. నాగుల చవితి కి చుట్టూ పట్ల గ్రామాల నుండి పది వేల మంది జనం అక్కడికి వచ్చి, ఆ పుట్టలో పాలు పోసి, పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి పోతుండేవారు. ఆలయం లోని ఆ దేవతా సర్పాన్ని ఎవరూ చూడలేదు గాని, భూలోకానికి చెందినా మామూలు విష సర్పాలు అక్కడ తిరగటం చాలా మంది చూశారు. నా బుద్ది తెలిశాక ఆ కోనేటి గట్టు మీదనే పురుగు కరిచి ఇద్దరు ముగ్గురు మరణించటం నాకు తెలుసు. ఆ గట్టు మీద కాసర కాయల పాదులు పిచ్చిగా పెరిగి, పిచ్చిగా కాస్తుండేవి. అవి కోసుకొని ఊళ్ళో కూరల కొట్టు సాంబయ్య కిస్తే, వీశే అరణాలకి కొంటారు ముప్పావల కి అమ్ముతారు.   కొనే వీశే కు 180 తులాలైతే, అమ్మే వీశే కు 100 తులాలే.
    సారధి కొన్నాళ్ళు ఆ కోనేటి గట్టు మీద కాసరకాయలు కోసి, సాంబయ్య కిచ్చి, రోజు కో ముప్పావలా దాకా సంపాయించే వాడు అక్కయ్య కోసం.
    ఒకనాడు మోహిని "తమ్ముడూ, అయిదు రూపాయలు కావాలిరా" అందిట.
    సారధి నా దగ్గరికి వచ్చి "ఒరేయ్ , విఠలు , ఓ అయిదు రూపాయలు ఉన్నాయిరా నీ దగ్గిర?' అన్నాడు.
    నా దగ్గిర లేవు.
    "పోనీ , నాకో సాయం చేయరా?' అన్నాడు.
    ఒకరి సహాయం అర్ధించటం సారధి తత్త్వం కాదు.
    "ఏమిటిరా?"
    "నాతొ కాసర కాయలు కోయటానికి నువ్వూ రారా! ఇద్దరం ఇవాళ అర్ధ మణుగన్నా కోయాలి."
    "అక్కడ పాములు తిరుగురాయని నీకు తెలీదురా? నిష్కారణంగా చస్తాం" అన్నాను.
    "ఒరేయ్ ,చచ్చే గీతుంటే ఏం చేయక పోయినా చస్తాం . బ్రతికే గీతుంటే ఏం చేసినా చావం" అంటూ నన్ను లాక్కుపోయాడు.
    సారధి సాధారణంగా ఈతబెత్తం పుచ్చుకు బయలు దేరేవాడు.
    "ఎందుకురా ఈ బెత్తం ?" అని అడిగాను.
    "దెయ్యాల్ని కొట్టటానికి " అన్నాడు.
    "అక్కడ దెయ్యా లున్నాయా?'
    "నీకు తెలియదా?'
    "ఉన్నాయను కుంటారు, నిజమే . కాని, చూడలేదు. నువ్వు చూశావా?'
    "చూశాను."
    "ఎలా ఉంటాయి?"
    "అవి కొరివి దెయ్యాలు. నడుస్తున్న మంటల్లా ఉంటాయి. ఒకరోజు వాటి అంతు కనుక్కుందామని వెంటపడ్డాను. కాసర కాయలు కోస్తున్నాను. చీకటి పడింది. దూరంగా మంటలు కనిపించాయి. అవి మొత్తం ఆరు దయ్యాలు. రెండు పెద్దవి. నాలుగు చిన్నవి. బహుశా అదొక దెయ్యాల కుటుంబ మానుకుంటా . పెద్ద దయ్యాల్లో ఒకటి మగది. రెండోది ఆడది. చిన్న దెయ్యాలు ఆ పెద్ద దెయ్యాల పిల్లలు."
    "వెంటపడితే అవి అందాయా?"
    "నా సంగతి వినుంటాయి. ఈ దయ్యాల్లో ఓ గమ్మత్తుందిరా . అంత పిరికిసన్నాసు లేక్కడా ఉండరు. అవి భయపడే వాళ్ళని భయపెడతాయి. మీద ఎక్కి పీక నులిమి ప్రాణం తీస్తాయి. మనమే ఎదురు తిరిగి ఈత బెత్తం పెట్టి నాలుగు వడ్డించామనుకో, కాలికి బుద్ది చెప్పి పారిపోతాయి. ఆరోజు అంతే జరిగింది. నేను వెంట పడ్డాను. అవి నాకంటే చకచకా నడవటం మొదలెట్టాయి. పరుగెత్తాను వెంటపడి. అవి నాకంటే వేగంగా పరిగెత్తాయి. తెల్లవారే దాకా తిరిగాను. చాలాదూరం తిప్పాయి. ఓ ముప్పయి మైళ్ళు తిరిగా ననుకుంటా. కాళ్ళ నిండా తుమ్మ ముళ్ళు దిగాయి. ఓ చోట రేకుముక్క దిగింది కాల్లో. నెత్తురు వచ్చింది. బాధపెట్టింది. ఇంక వెళ్ళలేక ఓ రాయి మీద కూలబడి పోయాను. అప్పటికి తెలతెలవారుతుంది. ఆ దయ్యాలు దూరంగా పారిపోయి మాయమై పోయాయి" అంటూ కధ ఆపి, "ఒరేయ్ , ఆసలు మనుషులు దయ్యా లెందుకౌతారో నీకు తెలుసా?' అన్నాడు.
    ఈ మహా విషయం పద్నాలుగేళ్ళ పార్ధ సారధికి ఎలా తెలిసిందో మరి. చెప్పటం మొదలు పెట్టాడు.
    "ఒరే! నేను అనుకొనే దేమిటంటే నమ్మిన వాళ్ళని మోసం చేస్తారే వాళ్ళూ దయ్యాల య్యేది. మన మునసబు చచ్చాక దయ్యం అయ్యేది ఖాయం. ఎందుకంటె , రంగదాసు కి కూతుర్ని ఇస్తానని నమ్మించి, మళ్ళీ ఇవ్వనంటున్నాట్ట." అన్నాడు.
    ఇద్దరం అలా మాట్టాడు కుంటూ ఆంజనేయస్వామి కోవెల చేరుకున్నాం. అప్పటికి మధ్యాహ్నం పన్నెండయింది. కోనేరు గట్టు మీదికి వెళుతుంటే తెల్లటి పామొకటి అలికిడికి కదిలి నీళ్ళ లోకి జారింది. నా ప్రాణం గతుక్కుమంది. పార్ధ సారధి నిచూస్తే ధైర్యంగానే ఉంటుంది కాని, తలుచుకుంటే భయం వేసేది. ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం సన్నగా రుపరగా పడుతుంది. ఇద్దరం కాసర కాయలు కోస్తున్నాం.

                                        7
    కాసర కాయలు సాయంత్రం దాకా కోశాం. పొద్దు గుంకుతుంది.
    "ఇంక ఇంటికి పోదాం రా!"అని నేను ప్రతి పదినిమిషాలకి లేస్తున్నాను. సారధి ఆ ధోరణి లో లేడు. అయిదు రూపాయల కాసర కాయలు కోయందే లేవకూడదనే శపదంలో ఉన్నట్టున్నాడు. చీకటి పడింది. అయితే వెన్నెల కాస్తుంది  పిండి ఆరబోసినట్లు. ఇంక ఇంటికి వెళ్లి పోవాలని నేను నిశ్చయించు కున్నాను. నాకు ఇంటి దగ్గిర స్వాతంత్యం లేదు. మా అమ్మ దగ్గిర ఎంత చనువో , మా నాన్న దగ్గిర అంత బెరుకు. ఆయనకు నామీద ఉన్న వల్లమాలిన ప్రేమ కొద్ది నేను పాడై పోవటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వ కూడదనే ఆత్రత కొద్దీ నన్ను చాలా కట్టడి లో ఉంచేవారు.
    పిల్లల పెమ్పకాలను గురించి మా నాన్నగారికి నీర్ణీతములైన అభిప్రాయాలున్నాయి. పిల్లలంటే మైనం ముద్దలని, కాస్త వేడి చేసి, ఏ మూసలో పోస్తే ఆ రూపం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం. నా బాధలు సారధి కి కూడా తెలియటం వల్ల , అతనంతట అతనే, "ఇంక నువ్వు ఇంటికి పోరా" అన్నాడు.
    "నువ్వూ రారా" అని బ్రతి,మిలాడుతున్నట్లు అన్నాను.
    "ఆరు వీసెలన్నా కోయందే నేను రాను" అన్నాడు. ఆ మాటలో తిరుగు లేని నిశ్చయం ఉంది. ఆ నిశ్చయాన్ని బ్రహ్మ ఆపలేడు. రాజశాసనాని కున్న కఠీన్యం ఆ వాక్కులో ఉంది. నాకు చాలాసార్లు అనిపించేది, "ఈ పార్ధసారధి ఒక మహా సామ్రాజ్యాన్ని ఏకచ్చాత్రాధిపత్యంగా పరిపాలించవలసిన సామ్రాట్టు" అని.
    ఎబట్ వ్రాసిన 'నెపోలియన్ బోన పార్టీ' జీవిత చరిత్ర అనువాదాన్ని, ఆ తరవాత ఇంగ్లీషు లోనూ అనేక సార్లు చదివాను. ప్రపంచ చరిత్ర లో నెపోలియన్ కంటే నన్నెక్కువ ఆకర్షించిన వ్యక్తీ లేడు. అతని శక్తి, అతని ధైర్య సాహసాలు , మానవాళి ని శాసించడం లో అతని కున్న ధాటి నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ తరవాత ఏం.ఎ పాసయ్యక కూడా నెపోలియన్ ని గురించి ఎన్నో గ్రంధాలు చదివాను. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తీని గురించి అన్ని గ్రంధాలూ వెలువడలేదు. అన్ని భాషల్లో కి అనువదించబడలేదు. ఏ వ్యక్తీ అంత శ్రద్దా సక్తులు కలిగించలేడు. నెపోలియన్ మహాపురుషుడని వర్ణించినవారున్నారు. పరమ దుర్మార్గుడని విమర్శించినా వారున్నారు. ప్రశంసించినా, విమర్శించినా , అతడు మానవాళి ముందెన్నడూ కనీ వినీ ఎరగని శక్తి సంపన్నుడని అందరు అంగీకరించారు. పార్ధసారధి ని చూసినప్పుడల్లా నెపోలియన్ గుర్తుకి వస్తాడు. ఈ మాట నేనంటే నవ్వేవారున్నారు. ఈ మాటలో నించి లేని హాస్య రసాన్ని పిండటానికి ప్రయత్నించే వారున్నారు.
    కాని ఒక రత్నం భూగర్భం లోనే అజ్ఞాతంగా ఉండి పోతుంది. మరొక రత్నం వెలికి తీయబడి , చెక్కబడి మహా చక్రవర్తి సువర్ణ కిరీటాన్ని అలంకరిస్తుంది.
    ఒక పువ్వు ఎక్కడో మహారణ్యం లో వికసించి , హసించి రాలి నశించి పోతుంది.
    ఒక పువ్వు చిరునవ్వులు చిందుతూ దివ్య క్షేత్రానికి చేరి, స్వామిని అలంకరించి, దివ్య పరిమళాలు విరజిమ్మి పూజనీయమౌతుంది.
    ఒకొక్క అదృష్టం అలా ఉంటుంది.
    ఒకొక్క దురదృష్టం అలా ఉంటుంది.
    పార్ధసారధి ని ఆంజనేయస్వామి గుడి దగ్గిరే వదిలి నేను ఇంటికి వచ్చేశాను. అతను చెప్పమన్న విధంగానే, "మీ అబ్బాయి జంక్షన్ కు సినిమాకు వెళ్ళాడు" అని చెప్పాను అనంతమ్మ గారితో.
    జంక్షన్ మా ఊరికి మూడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడొక టూరింగ్ సినిమా హాలు పెట్టారు. మా ఊరి వారు తరచుగా అక్కడికి వెళ్ళటం కద్దు.
    మరునాడు తెలతెలవారుతుండగానే నేను అనంతమ్మ గారి దగ్గరికి వెళ్లి, "పెద్దమ్మా! సారధి వచ్చాడా?' అని అడిగాను.
    అనంతమ్మ వాకిలి ఊడ్చు కొంటుంది. "ఇంకా రాలేదు , నాయనా! జంక్షన్ లోనే ఏ స్నేహితుని దగ్గిరో పడుకొని ఉంటాడు. అయన గారికి స్నేహాల కేం కొదవ?" అంది.
    నేను చకచకా నడిచి ఆంజనేయస్వామి స్వామి ఆలయం దగ్గిరికి వచ్చాను. ఇంకా దుబ్బుల్లో కూర్చునే ఉన్నాడు సారధి.
    వంచిన తల ఎత్తకుండా కాసర కాయలు కోస్తున్నాడు. నన్ను చూసి విజయగర్వంతో నవ్వుతూ "అయిదు రూపాయల కాయలు కోశానురా" అన్నాడు.
    ఇద్దరం కలిసి ఆ కాయల్ని గొనె సంచి లోకి ఎత్తాం. తరువాత మా సమస్య ఆ కాయల్ని కూరల సాంబయ్య కొట్టుకి చేర్చటం.
    అంత బరువు మోసుకొని అంత దూరం నడవటం కష్టమని పించింది. సారధి కి ఆలోచనలకూ తక్కువ లేదు. దూరంగా తుమ్మ పొదల్లో అయిదారు గాడిదలు కనిపించాయి. సారధి పరుగున పోయి , ఒక అరగంట పాటుబడి ఓ గాడిదను రెండు చెవులూ పుచ్చుకొని లాక్కు వచ్చాడు. ఆ గొనె సంచి గాడిద మీద వేసి, దాన్ని తోలుకుంటూ బయలుదేరాం. ఊరి బయటనే ఉంది కూరల సాంబయ్య కొట్టు.
    మొత్తం మీద బేరాలు సాగించి అయిదు రూపాయలు సంపాయించాడు సారధి.
    "రాత్రి కొనేరు గట్టు మీద దయ్యాలేమన్నా కనిపించాయా?' అని అడిగాను.
    "అవి జడిసి పోయాయిరా" అన్నాడు.
    "ఎలా?"
    "ఆంజనేయ దండకం చదవటం మొదలు పెట్టానులే. ఆంజనేయస్వామికి, దయ్యాలకు పడదుగా -- మన మునసబు గారికీ, చౌదరయ్య కూ పడనట్టే. అందుకని దండకం చదవగానే ఆంజనేయస్వామి గద పుచ్చుకు వచ్చి, మన్ని కాపలా కాస్తాడు. దయ్యాలు వస్తే ఆ గద పెట్టి వాటి తల పగల గోడతాడు. అందుకని దయ్యాలు మన దగ్గిరికి రావు."
    "మరి ఆంజనేయస్వామి మనకు కనిపిస్తాడా?"
    "కనిపించడు మనకి."
    "ఎందుకని?"
    "అబద్దాలు చెప్పేవాళ్ల కి దేవుళ్ళు కనిపించరు. మనం ఆడేవన్నీ అబద్దాలేగా?"
    "నువ్వు అబద్ద మాడవుగా."
    "మొన్న అబద్దమాడి లింగరాజు ని తన్నించాగా!"
    ఆనాడే సారధి అయిదు రూపాయలు తీసుకు వెళ్లి మోహిని కిచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS