
ఆదివారం సెలవు కావటం వల్ల సోమవారం టపా కొంత ఆలస్యంగా వస్తుంది. ఆ సోమవారం అందరికీ శుభలేఖలు వచ్చాయి.
హెలెన్ లింగరాజు ని పెళ్లి చేసుకుంటున్నది. శుఖలేఖ లో ఇద్దరి ఫోటోలు వేశారు. నేను ఆశ్చర్య పడ్డాను. పది రోజుల క్రితం దాకా హెలెన్ తో సారధి తిరుగుతున్నాడు. చివరికి సారధి పెళ్లి చేసుకోవటం జరిగితే ఆ హెలెన్ నే చేసుకుంటాడని అనుకుంటున్నాను. అలాటిది బాంబు పడినట్లు అందిందీ వార్త. శుభలేఖ పుచ్చుకొని సారధి ఇంటికి వెళ్లాను.
అప్పటికి సారదికీ వచ్చింది శుభలేఖ.
సారధి మామూలుగానే ఉన్నాడు. అతని ముఖంలో విషాదచ్చాయలు నాకేమీ కనిపించలేదు.
"లింగరాజు అదృష్ట వంతుడురా" అన్నాడు సారధి ఆకాశంలోకి చూస్తూ.
సారధి పై జాలి వేసింది. అతను పోగొట్టుకున్నది అల్పమైంది. కాదని నాకు తెలుసు. తను అంగీకరిస్తే , హెలెన్ లింగరాజు ను చేసుకొనేది కాదు.
లింగరాజు కిది రెండో పెళ్లి. రామచంద్రా పురంలో లక్షలకు అధికారి అయిన ఒక పంతులు గారు లింగరాజు ను ఇల్లరికం తీసుకు వెళ్ళాడు. ఉన్న ఒక్క కుమార్తె ని, ఆస్తిని చేతిలో పెట్టి అరణ్యాలకు పోతానని , తిరిగి రానని అనేక సంవత్సరాలు ప్రచారం చేశాడు. చివరికు లింగరాజు దొరికాడు. కుర్రాడు బావుంటాడని, బుద్ది మంతుడని మరో సంవత్సరం ప్రచారం చేసి , ఊరు వాడా ఏకం చేసి, అనేక షరతులు పెట్టి, పెళ్లి చేసి, అల్లుణ్ణి ఇంటికి తెచ్చుకున్నాడు పంతులు గారు.
లింగరాజు 'కాపరానికి' వెళ్ళిన రెండు నెలల్లో మామగారికి, అల్లుడికి చెడిపోయింది. రోజో ఇంట్లో వాగ్యుద్దాలు జరుగుతుండేవి. పంతులు గారు అలిసిపోయెదాకా రంకెలు వేసి, అర మానెడు మజ్జిగ తాగి, ఊరి మీదికి పోయి, కనిపించిన ప్రతి వాడికి తనకు, అల్లుడి కి జరిగిన సంభాషణ అంతా ఏకరువు పెట్టి, "ఇల్లరికం తెచ్చుకోవట మంత బుద్ది తక్కువ పని లోకంలో లేదు" అంటూ తీర్పులు చెబుతూ , లెంపలు చెళ్ళున వాయించుకుంటూ , పొద్దు గుంకాక కొంపకు చేరేవాడు.
ఈ ఇల్లరికపు అల్లుడి పై పంతులు గారి చాలవ వల్ల ఊళ్ళో వాళ్లకి రవ్వంత గౌరవం లేకుండా పోయింది. ఇంటికి వచ్చిన పెద్ద లందరితో , "ఆయనగారు మా అమ్మాయికే కాదండోయ్ , నాకూ మొగుడే. నిజానికి నా మీద అతగాడు చేస్తున్న స్వారీ ఉందే ...ఎందుకు లెండీ? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇంతకీ ఎన్నడో ఋణముంది. అనుభవించరా , బిడ్డా అని నా బిడ్డని ఆస్తిని అతగాడికి అప్పజెప్పి కూర్చో వలసి వచ్చింది" అంటుండేవాడు. ఇంట్లోనే ఉన్న అల్లుడికి వినిపించాలనే ఆ మాటలు మరీ బిగ్గరగా అనేవాడు.
లింగరాజు ఎంత సహనం గలవాడైనా , మామగారి ఘోష భరించలేక పోయాడు. మామగారు ఎలా ఉన్నా, భార్య కల్యాణి మొదట్లో భర్తకు అనుకూలం గానే ఉండేది.
జీవితంలో అనేక విషాదాల్ని జయించి, అనేక లోట్ల ను భర్తీ చేసే శక్తి యౌవనాని కుంది. తోలి రోజుల్లో పంతులు గారి ఘోష ఆ క్రొంగొత్త జంటను అట్టే బాధించ లేదు. కాని రోజులు గడిచిన కొద్దీ జీవితపు వాడి తగ్గి, వేడి చల్లారిన కొద్ది ఆ దంపతుల మధ్య దూరం పెరగసాగింది. ఆ రెండు ప్రాణుల్ని తోలి రోజుల్లో ఏకం చేసింది అనురాగ బంధం కాదు. తండ్రి పక్కన చేరింది కల్యాణి. భర్తను పరాయి వాడుగా భావించి, కోర్కెల వేడికి ఓడిపోక తప్పని కొద్ది క్షణాలు తప్ప, మిగతా కాలంలో అతనికి దూరదూరంగా తొలగి పోతుండేది.
లింగరాజు తెలివి తక్కువ వాడని ఆమె అభిప్రాయం. తన అందానికి, ఐశ్వర్యానికి, తెలివి తేటలకు అతడు తగినవాడు కాదని ఆమె నమ్మకం. ఆ మాట ప్రత్యక్షంగా భర్తతోనే చాలాసార్లు వివిధ భంగిమల్లో వివరించేది.
"పెళ్లయింది గనక, ఆ మూడు ముళ్ళు పడ్డాయి గనక, ఎంత ఇదైనా భర్తగా చేలామణీ అవుతున్నావు కనక నీకు నేను లొంగుతున్నాను గాని, లేకపోతె కలలో నైనా నాలాంటి స్త్రీ నీకు దొరుకుతుందా?" అని ప్రశ్నించేదిట!
లింగరాజు కి కోపం తక్కువ. కావలసింది దొరుకుతున్నప్పుడు, లేనిపోని అభిమానాలకు పోయి గొడవలు తెచ్చుకోవటం అతని స్వభావం కాదు. అంతకు ముందు ఒక సంవత్సరం క్రితం లింగరాజు నాకు కనిపించాడు. అప్పటి కతన్ని చూసి నాలుగేళ్ల యింది.
ఈ నాలుగేళ్ల లో అతని రూపు రేఖల్లో, స్థితి గతుల్లో చాలా మార్పు వచ్చింది. పనామా పాంటు, తెల్లని సిల్కు బుష్ షర్టు తొడుక్కున్నాడు. మనిషి బాగా లావయ్యాడు. అయితే వికృతంగా లేడు. కొంచెం పొట్ట వచ్చింది. సన్నటి కోరమీసం పెట్టాడు. దాంతో మొహం కూడా బాగా మారింది. ఎంత మారినా అతని స్వభావం , మాటల ధోరణి మాత్రం మారలేదు. చాలా నిదానంగా తూచి తూచి మాట్లాడటం అతనికి మొదటి నించి అలవాటు.
వెల్ కం హోటల్లో కాఫీ తాగుతుంటే కనిపించాడు. ఇంటికి వెళ్లాం. చాలా కాలానికి కనిపించిన చిన్ననాటి స్నేహితుణ్ణి చూసినప్పుడు కలిగే ఆనందం అల్పమైంది కాదు. మా ఆవిణ్ణి పరిచయం చేశాను. చాలా చనువుగా వంటింట్లో కి వెళ్లి, పీట వేసుకుని కూర్చుని, "ఏం చెల్లమ్మా , వీణ్ణి చేసుకున్నా వెందుకూ?" అంటూ కబుర్లు మొదలు పెట్టాడు. పరాయి వాళ్ళతో మాట్లాడటానికి సిగ్గుపడే మనిషయినా, లింగరాజు చొరవను బట్టి, "ఆయన్నే అడగండి." అంది. భోజనం మా ఇంట్లోనే చేశాడు. భోజనం చేస్తున్నంత సేపు ఛలోక్తులు, విసురుతూ ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు.
భోజనాలయ్యాక డాబా మీద మడత మంచాలు వేసుకుని పడుకున్నాం.
"ఒరేయ్ ! దాంపత్యం అన్యోన్యంగా సాగటం కంటే జీవితంలో అదృష్టం ఏముందిరా? ఒకరి కొకరు సుఖ శాంతు లందించుకో గలిగితే , ఆ దంపతుల కంటే అదృష్ట వంతు లేవరుంటారురా?' అన్నాడు లింగరాజు.
అతని కంఠం లో జీర కనిపించింది. విషాద చ్చాయ లాతని ముఖం మీద నీలి నీడలు చిమ్మటం స్పష్టంగా చూశాను.
"నీకేరా ఇప్పుడు? అందమైన పిల్ల దొరికింది. కావలసినంత ఐశ్వర్యం లభించింది."
లింగరాజు పలచగా నవ్వాడు.
"నిజమేరా! డానికి అందంలో తక్కువ లేదు. ఐశ్వర్యం తక్కువేమీ కాదు. కాని, ఒక్కోసారి అన్నీ ఉండి కూడా నరకం అనుభవించేవా రుంటారు. ఏదో బాధ వాళ్ళని పాము పడగలా నిరంతరం వెలుగు ప్రసరించనీయకుండా పైన అడుతుంటుంది. నా జీవితం అలాగే ఉందిరా."
లింగరాజు చెప్పేది వినాలని లేదు. డానికి కారణం అతని మీద నాకు సానుభూతి లేకపోవటం కాదు. గాయాన్ని ములుకుతో కెలికి ప్రయోజనం లేదు కనకనే. అయినా వింటున్నాను. లింగరాజు బరువుగా, నెమ్మదిగా చెబుతున్నాడు . నేను వినక తప్పలేదు.
"ఇల్లరికపు అల్లుడికి లోకంలో ఎంత గౌరవం ఉంటుందో నీకు తెలుసు. పెళ్ళికాక పూర్వమే నేనూ ఈ పరిస్థితిని ఊహించు కున్నాను. ఈ సంబంధం ఒప్పుకుంటే నా వ్యక్తిత్వం నశించి పోతుందనీ నాకు తెలుసు. అయినా అంగీకరించాను. నిజంరా! పంతులు సంపాదించిన లక్షల కోసం కల్యాణి ని చేసుకోలేదు ఆమె నాకు నచ్చింది. ఆ అందం, శరీరసౌలభ్యం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. ఇల్లరికం లేకుండా పిల్లని ఇవ్వమని అడిగాము. పంతులు ఒప్పుకోలేదు. కన్నబిడ్డ తో సమంగా చూసుకుంటానని, తన బిడ్డను, సంపద ను పాలించుకో మని తియ్య తియ్యటి కబుర్లు చెప్పాడు. నేను ఒప్పుకున్నాను. పెళ్లి అయిన తరువాత రాజమండ్రి పేపరు మిల్లు లో ఉద్యోగం దొరికింది. కాని తన కూతుర్ని మరో ఊరు పంపటం తన బొంది లో ఊపిరి ఉండగా జరగదని కచ్చితంగా చెప్పాడు పంతులు. నేను ఒక్కడినీ రాజమండ్రి వెళ్లి, హోటల్లో తింటూ రెండు నెలలు ఉదోగం చేశాను. కల్యాణి ఈ రెండు నెలల్లో నూ పూర్తిగా మారిపోయింది.
చిన్ననాడు సుమతీ శతకం లో చదివిన పద్యం ఒకటి గుర్తు వచ్చింది. ఆ పద్య భావం ఏమంటే " వయసులో ఉన్న భార్యను ఎక్కువ కాలం దూరంగా విడిచి ఉండట మంటే , చేజేతులా వేశ్య వాడకు పంపటమే" అని.
"ఎందుకు మారింది నీ భార్య?' అని అడిగాను.
"నా దురదృష్టం . నేను వెళితే ఆమెకు రోగం వచ్చేది. తలనొప్పి అని పడుకోనేది. జ్వరం వచ్చిందని ముసుగు పెట్టేది. అది నిజం కాదని నాకు తెలుసు. నన్ను చూడగానే కావాలని మనిషి ముడుచుకు పోయేది. మాట ఉండదు. పలుకు ఉండదు. ఉసూరు మంటూ రాజమండ్రి తిరిగి పోయేవాణ్ణి . అది నన్ను ప్రేమించటం లేదు. నన్ను వదిలించు కోవాలని చూస్తుంది. కాని, విఠల్ , అది నన్ను ద్వేషించిన కొద్దీ , అదేం దురదృష్టమో దానిపై నాకున్న మమకారం పెరుగుతూనే ఉంది గాని తగ్గలేదు. దాన్ని వదిలి బ్రతకలే ననిపించేది. చివరకు ఉద్యోగం మాని తిరిగి మామగారింటికి చేరాను. కాళ్ళు కడుక్కుంటానికి నీరిచ్చిన వారు లేకపోయారు. కల్యాణి తన గదిలో ముసుగు తన్ని పడుకుంది. పంతులు అరుగు మీద కూర్చొని పంచాంగం చూసుకుంటున్నాడు. నన్ను చూశాడు. అయినా చూడనట్లు నటిస్తున్నాడు. నాకు వెర్రి బాధ కలిగింది. అభిమానం చంపుకొని, దాని మీద ఉన్న మమత కి బానిసనై లోపలకు వెళ్ళుతున్నాను.
"ఉద్యోగం చేసేవాడిని ఇలా రెండు రోజుల కొకసారి ఇక్కడికి ఊడి పడక పొతే ఏం కొంప మునిగింది?' అన్నాడు పంతులు.
ఉద్యోగం మానిన సంగతి చెప్పాను. మండి పడ్డాడు. తన ఇంటి మీద పడి తేరగా తింటూ బ్రతకటం సిగ్గు చేటన్నాడు. లజ్జా భిమానలు లేవు కనకనే, ఇంకా తన చూరు పట్టుకు వ్రేళ్ళడుతున్నానన్నాడు. నేను వినిపించుకోకుండా కల్యాణి గదిలోకి వెళ్లాను. గోడ వైపుకు తిరిగి పడుకొని ఉంది. పిలిచాను. పలకలేదు. ముసుగు తీసి, భుజం తట్టి, పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, పొర్లి కారుతున్న కన్నీటి ని తుడుచుకుంటూ , "కల్యాణి , మీ నాన్న అన్న మాటలు విన్నావా?' అన్నాను.
"విన్నాను. అయన బాధ మీ కెందుకు అర్ధం కాదు?' అంది.
"నేనేం చేశాను, కల్యాణి?"
"ఆయనేం చేశాడు మిమ్మల్ని? దోనే పోయే వాణ్ణి తెచ్చి అల్లుడుగా చేసుకున్నాడు. కాళ్ళు కడిగి నన్ను మీకు ధార పోశాడు. తన సంపదంతా మీకు ధారాదత్తం చేయాలను కున్నాడు. అదేగా అయన చేసిన నేరం? నిజమే. అయన చేసిన తప్పే అది."
"ఎందుకు? ఎందుకు, కల్యాణీ? మీరిద్దరూ నన్నెందు కిలా హింసిస్తూన్నారు ? నేను మీకు చేసిన ద్రోహం ఏమిటి?"
"మాకు చేతనైన విద్య అదొక్కటే నండీ మరి! మాలాటి రాక్షసులతో మీరు వేగలేరు. వెళ్ళండి, బాబూ, వెళ్ళండి" అంది.
రోజూ ఇలాగే గడుస్తుంది. ఆ ఇంటిని నరకం చేశారు. నన్ను చిత్రహింస పెడుతున్నారు" అంటూ తన కధ ముగించాడు లింగరాజు.
ఎవరేం చేయగలరు? ఆద్యంతరహితమైన ఈ సమస్యల్ని పరిష్కరించే శక్తి నాకెక్కడిది? లింగరాజు నన్నేమీ సలహా అడగలేదు. నేను చెప్పలేదు. అసలు సలహా కోసం అతను తన సమస్యల్ని నాకు చెప్పలేదు. ఒక బరువు దించుకుంటానికి, ఓ విధమైన మనశ్శాంతి కోసం చెప్పాడు.
మరునాడు ఉదయం మళ్ళీ రామచంద్ర పురం వెళ్ళిపోయాడు లింగరాజు. నరకం లో కూడా స్వర్గాన్ని అన్వేషిస్తాడు మానవుడు. ఆ సంసారం ఎలాగైనా ఎప్పటికైనా విచ్చిన్నమయే ప్రమాదం ఉందని నేను భయపడ్డాను, సంవత్సరం క్రితం జరిగిన ఈ కధంతా మానసిక ఫలకం పై కనుపించింది.
అలాగే జరిగింది. లింగరాజు భార్యను వదిలి పెట్టి , హెలెన్ ని చేసుకుంటానికి నిశ్చయించు కున్నాడు.
బరువు గుండెతో ఇల్లు చేరుకున్నాను.
పదిహేను రోజులు మా ఊళ్ళో కులసాగానే గడిచిపోయాయి. రఘుపతి రావటం, సారధి ఉండటం అందుకు కారణాలు. మేం బెజవాడ రాగానే, సారధి గుంటూరు వెళ్ళాడు, హెలెన్ తో మాట్లాడి రావటానికి.
