Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 9


                                     13
    అదృష్టవ శాత్తూ అరుణ సురక్షితంగానే ఉంది. ఆ ఉండడం లోనూ రావ్ బహద్దూర్ సేతుపతి గారి భవంతిలో ఉంది. సేతుపతి గారంటే తెలుగునాట తెలియని వారు అరుదు. పెద్ద పరిశ్రమల యజమాని. స్వయంగా ఎన్నో పరిశ్రమలను నడుపుతున్నారు. స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా మొదలయిన అయిదారు బాంకుల్లో డైరెక్టర్. సమాజంలో, దేశంలో పేరెన్నిక కన్నవారు.
    'అరుణకు మళ్ళీ అంతటి అదృష్టం పట్టిందా?' అని ఆశ్చర్య పడవచ్చు కొందరు. దాన్నే విధి విలసమన్నారు. దేవుడూ లేడు దైవమూ లేదు; అంతటికి మానవుడే! మానవుని శక్తి సామార్ధ్యాలే  కారణమంటూ చాతీలు విరుచుకొని తిరిగేవారు తమదొక ఆధునికమైన మతమని విర్రవీగు తుంటారు. కానీ, ఈ సృష్టి అన్న మహామాయ లో వారెవరో వారికి తెలుసా , పాపం?!!
    అరుణ ఆనాటి రాత్రి అలా బయలుదేరిందా? అంతా కటిక చీకటి. ఆ అమ్మాయి కళ్ళు ఏకధారగా కన్నీరు కారుస్తున్నాయి. తానేక్కడికి వెళ్ళాలి? ఆ చిన్నారి తల్లి ఏనాడూ ఇంతటి క్లిష్ట పరిస్థ్తితి ఎదుర్కోలేదు. ఇప్పుడు ఎదుర్కోవలసి వచ్చింది! ఇక తప్పదు!
    గమ్య స్థానం లేని నడక అయింది అరుణది. కాళ్ళు అడుగులు వేస్తున్నాయి. అంతే! ఏదో కీ ఇచ్చిన ఒక బొమ్మ లాగా వెళ్లి వెళ్లి ఆ అమ్మాయి ఆ ఊరి రైలు స్టేషన్ చేరుకుంది.
    తెలతెలవారుతుండగా ఏదో పొగ బండి వచ్చింది. అంతా ఆదుర్దాగా, అవసరవసరంగా అటూ ఇటూ పరిగెడుతున్నారు. అరుణ కూడా అందుబాటు లో ఉన్న ఒక పెట్టె లోకి వెళ్ళింది. అది ఎయిర్ కండిషన్డ్ కోచ్! అటెండర్ అమాంతంగా అరుణ మీద విరుచుకు పడ్డాడు.
    "ఏయ్! ఎవరు నువ్వు?"
    "అరుణను." దానితో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయను కుంది కాబోలు ఆ అమ్మాయి!
    'అరుణ అంటే? ఇదే క్లాసు పెట్టె తెలుసా? దిగు! ఊ!"
    బైట గార్డు ఈల వేసిన చప్పుడు వినవచ్చింది.
    "దిగమంటుంటే . "బలవంతంగా అరుణను అతడు తోసి పారావేసే వాడే! ఆ ఉద్దేశ్యం తోటే విసురుగా అరుణ చెయ్యి పుచ్చుకున్నాడు.
    "అగు!" అందొక గొంతుక.
    అటెండర్ తిరిగి చూచాడు. "గుడ్ మార్నింగ్, సార్!"
    "గుడ్ మార్నింగ్!" ఆయనే సేతుపతి. నిండైన విగ్రహం. 45,50 ఏళ్ళ వయస్సు. అన్ని కళలూ ఉట్టిపడే ముఖం . తేజస్వి. కేవలం కరుణ మాత్రమె ప్రతిబింబించే కళ్ళు. నైట్ గౌన్ తొడుక్కుని, చేత టూత్ బ్రష్ పుచ్చుకుని నిలుచున్నాడు.
    "ఎవరీ అమ్మాయి?"
    "ఎవరో, సార్! ఇదేదో తన సొంత సొత్త యినట్టు ఎక్కేసింది.
    ఈలోగా బండి కదలనే కదిలింది.
    అటెండరు తన ఆగ్రహాన్ని ఆపుకోలేక పోతున్నాడు. "ఉండు, వచ్చే స్టేషన్ లో చెబుతా నీ సంగతి! పోలీసులకు అప్పజెప్పితే గానీ నీలాటి వాళ్లకు బుద్ది రాదు!"
    "అగు. ఆ అమాయకురాలి మీదనా నీ ఆగ్రహం?...నీ పేరేమిటమ్మా?"
    "అరుణ."
    "అమ్మో. చాలా మంచి పేరే! ఎవరి పాపవమ్మా నీవు?"
    దానికి జవాబేమిస్తుంది అరుణ? కన్నీరు కార్చింది . ఏడ్చింది.
    "ఎందుకమ్మా? నీకేం భయం లేదులే! నేనున్నాను గా. ఏ ఊరు వెళ్ళాలి?"
    "నాకు తెలీయదండి."
    "మరి టికెట్ కొనలేదా?"
    "లేదండీ. నా వద్ద అసలు డబ్బుల్లేవు!"
    "శభాష్! చూశావా, జాన్?"
    జాన్ అటెండరు పేరు. సేతుపతి గారి జీవితమంతా ఈ పెద్ద తరగతి పెట్టెల్లో నూ, ఎయిర్ లైన్సు విమానాల్లో నూ గడుస్తూండడం వల్ల అటు పైలట్లు, ఎయిర్ హాస్టస్ దగ్గిర నించీ ఈ అటెండర్స్ వరకూ ఆయనకు అందరూ తెలుసు. అయన వల్ల టిప్స్ రూపంలో ఇటువంటి వారికి ఎంత ముట్టిందో పుచ్చుకున్న వారికే ఎరుక! ఇచ్చే మహారాజు సేతుపతి గారికి అసలు ఏమీ తెలిసేది కాదు! ఆయన్ను గురించి ఒక కధ ఉంది.
    అప్పుడప్పుడు అయన వ్యాపారం మీద బొంబాయి కలకత్తా మొదలయిన నగరాలకు వెళ్ళినట్టే జంట నగరాలకు కూడా వెళుతుండే వారు. తరచుగా రిట్జ్ హోటల్లో నే మకాం. మళ్ళీ అక్కణ్ణించి సేతుపతి గారు బయలుదేరి వెళ్ళిపోతున్నా రంటే ....ఆ హోటల్ లోని బెరర్లందరూ రెండు భారులుగా నిలుచునే వారు. హాండ్ బాగ్ తెరిచి , వాళ్ళందరూ వంగి వంగి చేసే నమస్కారాల్ని మందహాసంతో స్వీకరిస్తూ, సేతుపతి బాగ్ లో చెయ్యి ఉంచి, ఏదో ఒక కట్ట కావచ్చు, పది రూపాయలది కావచ్చు. బేరర్ల అదృష్టం మరి! దొరికిన కట్ట లో నుంచి ఒక్కొక్కడికి ఒక్కొక్క కాగితం చోప్పిన ఇస్తూ వెళ్లి, కారెక్కి ఏరో డ్రోం కి వెళ్ళేవారు అయన. ఒకనాడు వందరూపాయల కాగితాల కట్ట వచ్చింది చేతికి! బేరర్ల ముఖాలు స్టెయిన్ లెస్ స్టీలు పళ్ళాల్లా వెలిగిపోతున్నాయి! సేతుపతి చూచాడు. 'పాపం, ఈవేళ వీరి అదృష్టం ఇలా పండింది.' అనుకున్నాడు కాబోలు! అందరికీ అన్ని వందరూపాయల నోట్ల నూ ఇచ్చుకుంటూ వెళ్ళాడు! ఆ హోటల్లో బస చేసిన అమెరికన్ టూరిస్టులు కూడా ముక్కు మీద వేలేసు కున్నారట ఆరోజు!
    "డబ్బుల్లేవు! అందుకని అరుణ టికెట్ కొనలేదు! తప్పు డబ్బుదా, అమ్మాయిదా , జాన్?" అన్నారు సేతుపతీ నిక్కచ్చిగా జాన్ కు కన్ను గీటుతూ!
    "డబ్బుదే సార్!"
    "గుడ్! మరి, పాపం , ఆ అమ్మాయిని అలా కేకలేస్తావెం?"
    "సారీ సర్!"
    "తప్పు నిజంగా నాదేనండి. డబ్బు లేకపోతె మాత్రం...." అంటూ అరుణ ఏదో అనబోయింది.
    అంతలో "నీవురుకో అమ్మా! జాన్, టెక్ కేర్! ఇంకెప్పుడయినా ఇలాటి పొరపాటు జరిగిందంటే......" అంటూ సేతుపతి గారు హెచ్చరించారు.
    "జరగదు సర్!"
    "గుడ్!"
    సేతుపతి గారు జాన్ కు ఇచ్చిన లెక్చర్ ను విని, అయన ఏ గవర్నరో అయి ఉంటాడను కుంది అరుణ.
    "ఆ.....నీ పేరేమిటన్నావమ్మాయి?"
    "అరుణ అండీ, సార్!"
    "చాలా మంచి పేరు! మనదేశంలో అరుణా అసఫాలీ అని ఒక గొప్ప మహిళ ఉంది! ఆమె పేరేప్పుడయినా విన్నావా?"
    "విన్నాను, సర్! సోషలిస్టు." నాన్నగారి దగ్గిర కూర్చుని న్యూస్ పేపర్లు చదవడం అరుణకు ఇప్పుడు ఉపయోగపడింది!
    "ఆ భేష్, జనరల్ నాలెడ్జి లో పాసయ్యావు! నూటికి నూరు మార్కులు! కాబట్టి నీవేం భయపడద్దు. నేను పళ్ళు తోముకుని వస్తా గానీ, ఇక్కడే ఉండు, జాన్, అమ్మాయి జాగ్రత్త."
    "రైట్ , సర్!"
    "ఏమమ్మా.......ఈ అబ్బాయంటే నీకేం భయం లేదుగా ఇప్పుడు?"
    "లేదండీ , సర్!"
    "గుడ్!" సేతుపతి గారు వెళ్ళిపోయారు. అయన ఎంత గొప్పవాడో తెలుసుకోకుండా అరుణ ఉండలేక పోయింది. జాన్ ను అడిగింది.

 

                                


    "అయన గవర్నరా?"
    'అంతకంటే గొప్పవాడు. మల్టీ మిలియనేర్!"
    "అమ్మ బాబో!" అంది అరుణ కళ్ళింతవి చేసి . ఈలోగా సేతుపతి రానే వచ్చారు.
    "బేబీ! నీవు కూడా పళ్ళు తోముకో. తరవాత మనం మాట్లాడుకుందాం. జాన్!"
    "సర్?"
    "అరుణ కు టూత్ పేస్టూ, ఒక తువ్వాలూ తెచ్చి ఇవ్వు!"
    "ఎస్ , సర్!"
    "పళ్ళు తోముకుని సరాసరి నా దగ్గిరికి వచ్చేసేయ్యి అరుణా. జాన్ తీసుకొస్తాడు లే. నీకేం భయం లేదు. ఊ?"
    'అలాగే నండి, సర్!"
    ఆవిధంగా కలిగింది అరుణ కూ, సేతుపతి గారికీ పరిచయం! ముఖం కడుక్కుని అరుణ సేతుపతి గారి కంపార్టు మెంట్ లోకి వచ్చింది.
    "నీకు బిస్కట్లు కావాలా? బ్రెడ్ బటర్ జాం కావాలా?" అన్నారు సేతుపతి.
    "నేనేం తిననండీ."
    "ఆ! తినకపోతే మానవుడు బ్రతక గలడా?"
    "బ్రతక లేడండీ! కానీ........నేనింకా స్నానం చెయ్యలేదు. దేవుడికి దండం పెట్టుకోలేదు........"
    "ఓ , అదా? మరి మనం ప్రయాణం చేస్తున్నాం కదా? రైళ్ళ లో అటువంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలానమ్మా, పాపా? అవసరాన్ని బట్టి మన ఆచార వ్యవహరాల్నీ కుదించుకు పోతుండాలి!"
    "అలాగే నండి!"
    "గుడ్! జాన్, అరుణకు బిస్కట్లు ఇవ్వు."
    "ఎస్, సర్."
    అక్కడే ఒక అందమైన పెట్టె ఉంది. అందులో అన్నీ వున్నాయి. జాన్, సేతుపటికి ఇన్ స్టంట్ కాఫీ చేసి ఇచ్చాడు. అరుణ కు బిస్కట్లిచ్చి హార్లిక్స్ కలిపి ఇచ్చాడు.
    "తమరికి పైపు నింపి ఇవ్వమన్నారా , సర్?"
    "నో, నాట్ నౌ! నేను పిలుస్తాను లే , నువ్వువేళ్ళు."
    జాన్ వెళ్ళిపోయాడు. అరుణ అనుమానిస్తూ అనుమానిస్తూ బిస్కెట్టు ను చిలకలా కొరుకుతుంది.
    "ఏమమ్మా....బిస్కట్లు బాగాలేవా?"
    "చాలా బాగున్నాయండీ."
    "నువ్వు తింటూనే ఉండాలి. నాకు తోచింది నే నడుగుతాను. ఇష్టముంటే నే జవాబు చెప్పు. నేను వేసిన ప్రశ్నల వల్ల నీ మనస్సుకు నొప్పి కలిగితే జవాబివ్వద్దు. అంతే! కానీ......నీవు మాత్రం కన్నీరు కార్చరాదు! ఏం?"
    'అలాగేనండీ . అయినా నాకెవ్వరూ లేరు!"
    'అందుకే కదా, అమ్మా, నువ్విలా ఒంటరిగా వచ్చింది? ఆ మాత్రం అర్ధం చేసుకోలేనూ? అయినా.....మరి ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు?"
    అరుణ సమాధానం చెప్పలేదు.
    "మరి నీవిలా వచ్చేస్తే, వాళ్ళంతా దిగులు పడి, మనసు పాడుచేసుకొని , నీకోసం సతమత మవరూ?"
    "నాకోసం ఎవ్వరూ బాధపడరండి. ఒక్క నాన్నగా......" నాలుక కరుచుకుని , అరుణ అకస్మాత్తుగా ఆగిపోయింది.
    "చూశావా......చూశావా.. ఇంత మంచి అమ్మాయివే? ఎవ్వరూ లేరని అబద్దం చెప్పావెం మరి?"
    శంకరనారాయణ గారిని తలుచుకుని అరుణ కుమిలి కుమిలి ఏడ్వడం మొదలు పెట్టింది!'    
    "ఇదుగో , నేను చెప్పానా, అమ్మా, ఏడవ కూడదని? ఆడపిల్లలు ఏడిస్తే అశుభం!"
    "ఎవరు? ....ఏ ఊరు?....ఏ పేరు?..... అని మీరడగ కుండా ఉంటె, నేను నిజంగా నిజం చెబుతాను, సర్!" అంది అరుణ, తనను తాను సముదాయించు కోడానికి ప్రయత్నిస్తూ.
    'అంతకన్నానా, అమ్మా! నేను ఇక నిన్నేమీ అడగను!"
    'అయినా.....నిజమే చెబుతా నండీ!"
    "నాకు తెలుసునమ్మా , నీవు అబద్దాలాడలేవని! నిన్ను చూడగానే నాకా సంగతి అర్ధమై పోయిందిగా?"
    "థాంక్సండీ ! నాకు నిజంగా తలిదండ్రులు లేరు. అంటే, వారెవరో నాకు తెలియదు! ఎవరికీ తెలియదు! దేవుడి లాంటి అయన నన్ను రెండు నెలల పసిపాపను గా చేరదీశారు. ఇన్నాళ్ళూ పువ్వుల్లో పెట్టి పెంచారు. నేనెక్కడ ఉంటె అక్కడే కష్టాలు కాపరం చేస్తాయిట! అది నిజం కూడా! నన్ను చేరదీశారు ; వారు అన్ని విధాలా అన్యాయమై పోయారు! నేనొక తెలివి తక్కువ దద్దమ్మ ను! అందుకనే అది నాకు తెలిసి రాలేదు. నిన్న రాత్రే అర్ధమయింది! వారిని ఇంకా ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగించడం ఇష్టం లేక, ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను! అంతే, సార్! సరస్వతీ దేవి సాక్షిగా అదే ణా కధ!" అంటూ అమాయకంగా తన పుస్తకాలనీ నెత్తిన పెట్టుకుని ఒట్టేసుకుంది అరుణ.
    సేతుపతి కొంత తడవు ఏమీ మాట్లాడలేదు. తుదకు ఉస్సురన్నారు. పైప్ తీసుకుని, పొగాకు నింపుకుని వెలిగించారు. ఆలోచనా నిమగ్నులై అలాగే పొగలు వదులుతూ కూర్చున్నారు. అలా ఓ పది పదిహేను నిమిషాలు గడిచి పోయాయి.
    "మరి నీవిప్పుడెం చేస్తావమ్మా?"
    "ఎవరైనా పని ఇస్తే చేస్తాను , సార్! నా కన్ని పనులూ చేతనవును! వంట కూడా చెయ్యగలను."
    "మరి.....'చిన్న పిల్లవు. నీకేం చేతనవుతుంది?" అని ఎవ్వరూ నీకు పని ఇవ్వకపోతే?"
    "చచ్చిపోతాను, సార్!"
    "ఆ!.....అంతే నంటావా, అమ్మా , అరుణా?"
    "అంతే ,సార్! అసలు రైలు స్టేషన్ కు రాకుండా అలాగే అక్కడెక్కడో పడి చద్దామను కున్నను! చచ్చి ఉంటె బాగుండేది!"
    సేతుపతి కాస్సేపు పైపు తో కొన్ని సాధక బాధకాలాలోచించారు.
    "నన్నో మాట చెప్పమన్నావా, అరుణా?"
    "చెప్పండి, సార్!"
    "నీలాటి బుద్ది మంతురాలు చచ్చిపోవడం నా కిష్టం లేదమ్మా!"
    "అయితే మీ ఇంట్లోనే ఏదైనా పని ఇప్పించండి , సార్!"
    "నువ్వు నిజంగా వంట చేయగలవా?" అన్నారు సేతుపతి బాగా తీవ్రంగా.
    "నిజంగా చెయ్యగలను, సార్. సరస్వతి తోడు!" మళ్ళీ పుస్తకాల్ని నెత్తి మీద పెట్టుకుంది అరుణ.
    "నీవెంత వరకు చదువుకున్నా వమ్మా?"
    "ధర్డు ఫారం చదువుతున్నాను, సార్!"
    'అలాగా? సరిలే, ఏదో ఒకటి చేద్దాం. కానీ, నీవేమీ భయపడకు! పాపం...రాత్రంతా నిద్రపోయి ఉండవు. కాస్సేపు పడుకో. తరవాత ఏది జరగాలని ఉందొ అదే జరుగుతుంది. పడుకో అమ్మా" అంటూ తన పక్కనే చూపించారాయన.
    అరుణ మారు మాట్లాడలేదు. పడుకుంది. పడుకుందో లేదో , నిద్రాదేవి ఆ బంగారు బొమ్మను తన ఒడిలోకి లాక్కుంది. అమాయికంగా నిద్రపోతుంది అరుణ. ఆ అమ్మాయినే తదేక దీక్షతో చూస్తున్నారు సేతుపతి....'అయ్యో పాపం! అనుకున్నారు. తన శాలువా తో అరుణ దేహాన్ని కప్పారు.
    ఒక చేత్తో పైపు తో సాధన చేస్తూ. మరొక చేత్తో అరుణ ను జో కొట్టడం ఆరంభించాడు సేతుపతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS