14
చెన్న పట్టణం లో అడయార్ ఆ ప్రాంతాల్లో ఉంది సేతుపతి గారి బంగళా. దాదాపు మూడు నాలుగు ఎకరాల కాంపౌండు. చుట్టూ తీర్చిదిద్దిన తోట. చూడగానే అదేదో రాజభవనం అనుకోవలసిందే! అంత గొప్పగా ఉంచారు ఆ భవంతినీ పరిసరాల్నీ. కాపలా కోసం సాయుదులయిన సిబ్బంది. ప్రతి ఆరు గంటలకూ ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళు మారుతుంటారు. వరసన నాలుగు గారేజీలు! నాలుగు కార్లెందుకూ ఒక్కడికీ? అదే హోదా అంటే!
సరదాగా సేతుపతి గారు తిరగాదానికి ఒక టూరర్. వారి భార్యకు ప్రత్యేకంగా ఒక కారు. వారి ఏకైక పుత్రుడు డాన్ బాస్కో స్కూలుకు వెళ్ళడానికి ఒక కారు. సేతుపతి గారు ఆఫీసుకు, మీటింగు లకూ వెళ్ళడానికి ఒక కారు! అన్నీ సరికొత్త మోడల్స్! సంవత్సరం సంవత్సరం అవి మారుతుండవలసిందే!
సేతుపతి గారి భార్య పేరు చాముండేశ్వరి. సేతుపతి గారే ఆమెను 'చండీ' అని పిలుస్తారు. ఒక నౌకర్లు చాటున ఆమెను మహంకాళి అనడం కూడా కద్దు. వారి అబ్బాయి పేరు రఘుపతి. డాన్ బాస్కోలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.
అరుణను ఆ భవంతి లోకి తెచ్చారు సేతుపతి. చాముండేశ్వరి , రఘుపతీ, సెక్రటరీ లు, మేనేజర్లూ ఆయనకు చిరునవ్వులతో స్వాగతమిచ్చారు. అందరి కళ్ళూ అరుణ మీద పడ్డాయి. కట్టుకున్న గుడ్డలూ, ఆ అమ్మాయి తెచ్చుకున్న పుస్తకాలూ తప్ప, ఏ ఆభరణాలు లేవు అరుణకు.
"ఈ అమ్మాయి ఎవరు?' అ ప్రశ్న మరెవరడుగుతారు? చండే అడిగింది!
సేతుపతి గారు చిన్నగా నవ్వుతూ "మా అక్కయ్య కూతురే!" అన్నారు.
"అబ్బబ్బ! ఈ వేళాకోళలతోటి నేను సతమత మై పోతున్నా ననుకోండి! అసలు మీకు అక్కయ్య గారే లేనిది, ఆవిడ గారి బిడ్డ ఎక్కడ్నించి ఊడి పడింది?"
"నువ్వు చండివే! అందుకని, నీకంట పడకుండా మా అక్కయ్య అజ్ఞాత వాసం చేస్తుంది! ఆమెను కాకపోయినా, ఆమె కూతుర్ని అయినా ఆదరిస్తావేమో నని అమ్మాయిని తీసుకు వచ్చాను. పేరు అరుణ.
"నమస్కారమండీ" అంది అరుణ చాముండేశ్వరీ కి చేతులు జోడించి.
"ఎంతటి చక్కదనాల కుప్పో....అంతటి గుణ వంతురాలు. నీ గుణాలు ఎలాగూ మా బంగారు అరుణ కు అబ్బవనుకో! ఆ అమ్మాయి గుణాల్లో ఒకటిన్నర శాతం అయినా అలవరుచు కోడానికి నీవు ప్రయత్నిస్తే , ఇహం లోనూ, పరం లోనూ కూడా నీవు సుఖపడతావు!"
"ఒరబ్బో....మహా చూశాం లెండి!" అని రుసరుస లాడుతూ వెళ్ళిపోయింది చాముండేశ్వరి.
"మిస్టర్ సంబంధం!" సేతుపతి పిలిచిన ఆ వ్యక్తీ ఆ ఇంటి వ్యవహారాలకు సంబంధించి నంతవరకూ మానేజరు.
"సర్?"
"మన బాబు గది పక్కనే అరుణ కో గది ఏర్పాటు చెయ్యండి!"
"సరే సర్!"
'మీరు ముఖ్యంగా చేయవలసిన పనులు రెండు ఉన్నాయి."
"ఎస్, సర్."
"సాయంత్రం ఆ అమ్మాయిని అటు బజారు వైపు తీసుకెళ్ళి ఓ పదిహేను ఇరవై జతల బట్టలు కొనిపెట్టండి. తరవాత రేపెప్పుడయినా ట్రిప్లికేన్ వెళ్లి, నేషనల్ గర్ ల్స్ హైస్కూల్లో ఎనిమిదవ తరగతి సీటు కోసం ప్రయత్నించండి. టీసీ లు అవీ అడిగితె టెస్టు చేసుకొమ్మనండి. మా అమ్మాయని చెప్పండి!"
"రైట్ ,సర్!"
"రఘూ, ఈ అమ్మాయి పేరు అరుణ."
"ప్లీన్ద్ టు మీట్ యూ!"
అరుణ నమస్కరించింది.
"వీడు మా అబ్బాయి రఘు, అరుణా. వెళ్ళండి ఇద్దరూ వెళ్ళండి. మిస్టర్ సంబంధం! వీళ్ళనిక తీసుకు వెళ్ళచ్చు. అమ్మాయీ, అరుణా, సాయంత్రం ఏడు న్నర కు నీ గదికి వస్తా. అప్పుడు మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెళ్ళండి. వెళ్ళండి. నాకిప్పుడొక వెయ్యి నూట పదహారు గొడవలు ఉన్నాయి! మిస్టర్ అయ్యం గార్, సుబ్బారావు గారూ ఆ రాయలసీమ సిమెంట్స్ తాలూకు కాగితాలన్నీ తీసుకుని నా స్టడీ కి రండి. నాయర్!"
"అయ్యా?' వంటమనిషి అతడు.
"అందరికీ కాస్త డ్రింకు ఏర్పాటు చెయ్. లంచి ఒంటి గంట కు నా స్టడీ లోనే తీసుకుంటా. ఎవ్వరూ, ఏ పరిస్థితుల్లో నూ నన్ను డిస్టర్బ్ చెయ్యరాదు."
"సరి, సర్!"
సేతుపతి గారు తమ పనుల మీద తాము వెళ్ళారు. తక్కిన వారూ వారి వారి పనుల మీద పరుగులు తీశారు.
పరుగులు తీయడమంటే నిజంగా పరుగులు తియ్యడమే! సేతుపతి ఎంతటి సహ్రుదయుడో , ఎంతటి దయామయుడో అంతటి నిక్కచ్చి అయిన మనిషి కూడా! పనివాడు, వాడు జనరల్ మానేజరు కానీ మామూలు కూలీ కానీ, ఎవడీ పని వాడు సక్రమమైన పద్దతుల్లో నడిచే యంత్రం లాగా సాఫీగా , అలజడి లేకుండా చేసుకు పోవలసిందే!
ఇక సేతుపతి గారి సమయం నిజంగా ఆయనది కాదు. నెలలో ఇరవై రోజులు బొంబాయి, కలకత్తా, డిల్లీ మొదలయిన నగరాల్లో నే గడిచి పోతాయి! మద్రాసు లో ఉన్న ఆ వారం పది రోజులు కూడా అయన ఊపిరి సలుపుకోలేనంత పనిలో ఉంటారు. సమాజంలో విపరీతమైన పలుకుబడి కలవాడు కాబట్టి ఎప్పుడూ ఏవో కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. అయన గారి ఈ కార్యక్రమానికి చాముండేశ్వరి బాగా అలవాటు పడిపోయింది. రఘుపతి కూడా అంతే!
అరుణ ను తెచ్చుకున్న ఆరోజు సంగతి '-- ఏడున్నర కల్లా అరుణ ను అరుణ గదిలో కలుసుకుంటా నని మాట ఇచ్చారుగా సేతుపతి? ఆనాడే, ఆ సమయానికే అమెరికన్ కాన్సల్ జనరల్ ఇస్తూన్న ఏదో పార్టీ కి వెళ్ళవలసి వచ్చింది ఆయనకు. డ్రెస్ చేసుకుంటూ అరుణ నే తన గదికి పిలిపించు కున్నారు.
"ఆ......హాల్లో బంగారమ్మా! ఏమిటి సంగతులు? మా ఇల్లు నచ్చిందా?"
"నచ్చిందండీ."
"గుడ్! మధ్యాహ్నం కడుపు నిండుకూ బువ్వ తిన్నావా?"
"తిన్నానండీ!"
"వెరీ గుడ్! మా రఘుపతి మంచివాడేనా?"
"మీ ఇంట్లో అందరూ మంచి వారే, సర్!"
"అక్కడే పొరపాటు పడుతున్నావ్! అయితే మా చండి, ఇంకా నీ విషయంలో వేగం అందుకోలేదన్న మాట! అల్ రైట్, అల్ రైట్ ! నువ్వు నీ గదికి వెళ్ళు. తరవాత కలుసుకుందాం.
నమస్తే చెప్పి, అరుణ వెళ్ళిపోయింది.
"మిస్టర్ సంబంధం!"
"సర్!"
"స్కూల్లో, సీటు సంగతి మరిచిపోకండి!"
"ఈవేళే వెళ్లి వచ్చాను, సర్. హెడ్ మిస్ట్రెస్ అసలు లాభం లేదన్నారు. సార్. అక్టోబర్ లో కొత్తగా చేర్చుకోడానికి వీలు లేదన్నారు , సర్!"
"ఐ. సి!"
సంబంధం ఏదో చెప్పబోయేలోగానే ఫోన్ మోగింది. సేతుపతి గారే తీసుకున్నారు రిసీవర్.
"హల్లో ....సేతుపతి హియర్....ఆ? నమస్కార మండీ. ఔనౌను..... అయినా అదేమీటమ్మా అంత నిక్కచ్చిగా కాదనేశారు? మా అరుణ ను మీరు చూడలేదు; చూసి ఉంటె ....పరవాలేదు లెండి. నే నర్దం చేసుకోగలను! అబ్బే.....నేనేం బాధపడ్డం లేదమ్మా. సెలవు . నమస్కారం....." అంటూ రిసీవర్ పెట్టేశారు.
"సర్, అమ్మాయి గారిని ఆంధ్ర మహిళా సభలో చేర్పిస్తే , రెండేళ్ళ లో మెట్రిక్ పాసవగలదు..."
"బ్రిలియంట్ ఐడియా! అలాగే చెయ్. టైమయిపోయింది. రేపు డిల్లీ వెళ్ళాలి. నేను వచ్చే లోగా అరుణ చదువు ను గురించి ఏదో ఒక పోజిటివ్ స్టెప్ తీసుకోండి."
"రైట్, సర్!"
"ఇక మీరు వెళ్ళచ్చు."
"నమస్కారమండీ!"
"నమస్కారం, మిస్టర్ అయ్యం గార్!"
"సర్!" ఎక్కణ్ణించి ఊడి పడ్డాడో అన్నంత త్వరగా ప్రత్యక్ష మయ్యాడు ఆ సెక్రటరీ!
"టికెట్ సంగతేమిటి?"
"రిజర్వు చేశానండీ."
"గుడ్. డిల్లీ లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ ని ఫోన్ లో కాంటాక్ట్ చెయ్యండి. ఈవేళే ఏం వారం?....బుధ. శుక్రవారం ఉదయం పదకొండు పన్నెండు గంటల మధ్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చెయ్యండి!"
"ఎస్, సర్!"
"రైట్. గుడ్ నైట్!"
"గుడ్ నైట్, సర్!"
