Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 8

                               
                                    12
    ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా గాలించినా అరుణ జాడ మాత్రం ఎవ్వరూ కానలేక పోయారు. కారు వేసుకుని రంగయ్య చౌదరి ఊరు ఊరూ , వాడావాడా వెదికాడు. ఆ చుట్టుపక్కల ఉన్న పోలీసు స్టేషన్ల లో రిపోర్టు లు ఇచ్చాడు. అరుణ ను గుర్తు పట్టగల ఎందరినో అన్ని మూలలకూ పంపించాడు. ఏం లాభం ? అమూల్యమయిన ఒక మాణిక్యం భూమి మీద ఎక్కడో పడిపోయింది. అరుణ అన్న మాణిక్యం ఏ మూల నక్కిందో!
    పది, పదిహేను రోజులు పడరాని పాట్లు పడ్డ తరవాత, రంగయ్య చౌదరి శంకరనారాయణ గారి దర్శనం చేసుకున్నాడు.
    "ఎక్కడా, లేదు కదూ, బాబూ?"    
    రంగయ్య ఏమనగలడు?"
    "నాకు తెలుసు, రంగయ్యా . అరుణ మనకిక అగుపడదు. అయినా....ఆ పిల్ల మళ్ళీ ఇక్కడికి రావడం కూడా అంత మంచిది కాదులే! ఎక్కడో ఉన్నట్టు ఆచూకీ తీశామనుకో, వెళతాం. బ్రతిమాలతాం. నా మాట తోసివేయ్యలేక అరుణ మళ్ళీ ఈ నరకం లోకి వస్తుంది! అంటే దాని అర్ధం ఏమిటి? ఆ అమ్మాయి తన ఆత్మను చంపుకుంటుంది. నా అరుణ అలా చెయ్యడానికి వీలులేదు. ఏం ఫరవాలేదు లే. పదకొండు పన్నెండేళ్ళ పిల్లను, పట్టెడు మెతుకులు పెట్టి పోషించే వారే ఉండరంటావా , అందులోనూ అన్నపూర్ణ కు నిలయమైన మనదేశంలో? చాలా శ్రమ పడ్డావు , బాబూ! ఇన్నాళ్ళూ నీవేదో నాకు ఋణపడి ఉన్నావని బాధపడేవాడివి ! ఇప్పుడు నేను నీకు ఋణపడి ఉన్నాను. ఈ ఋణాన్ని నేను తీర్చుకోలేను. క్షమించు.' శంకరనారాయణ గారు అనడాని కేమో అన్ని మాటలు అన్నారు! కాని, అయన ముఖం లో ఏ కవలికా లేదు. ఏదో.....ఒక రాతి బొమ్మ పలకగాలిగి పలికినట్టు పలికారాయన!
    "సార్! నన్నెందుకు సార్ ఇంతగా శిక్షిస్తారు? ఈ పది పదిహేను రోజుల ప్రయత్నం లోనే నేనీ అన్వేషణ ను మానివేస్తాననా? ఏమైనా సరే, అరుణ ఎక్కడున్నా సరే తీసుకు వస్తాను, సార్! ఆ నమ్మకం మాత్రం నామీద ఉంచండి."
    "వద్దు , నాన్నా, రంగయ్యా! ఇక నీవే ప్రయత్నమూ చెయ్యవద్దు. నేనేం ....బాధపడి ....మనసు పాడు చేసుకునీ అనడం లేదు ఈ మాట. అరుణ మళ్లీ ఈ ఇంటికి రావడం నాకు నిజంగా ఇష్టం లేదు. ఇక పొతే.....నీవు చెయ్యగల సహాయం ఒకటుంది . బాబూ."
    "ఏమిటి, సార్?"
    "ణా అవసాన దశలో నీకు కబురు చేస్తాను."
    "రామ రామ! అదేం మాట , సార్?"
    "పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పోవాలిగా? కబురు అందగానే , అన్ని న్యూస్ పేపర్ల లోనూ వేయించు, నేను అవసాన దశలో ఉన్నట్టు, అరుణను కడసారిగా చూచి కన్ను మూయదలుచుకున్నట్టు . అప్పటికి నా ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో? ఆ పని నేను చెయ్యలేక పోవచ్చు. అందుకని నిన్ను అడుగుతున్నా........."
    "మీ ఆర్ధిక పరిస్థితి కేమిటి, సార్? మేమంతా లేమూ?"
    "ఇక ఎవ్వరూ ఎర్రటి ఏగానీ తెచ్చి ఇవ్వడానికి వీలులేదు, రంగయ్యా!"
    "సార్?!"
    "ఇది నా అజ్ఞ! మంచికో, చెడుకో నీవూ నీలాటి సహృదయులూ నన్నొక గురువుగా ఎంచుకున్నారు. మీరు ఇక కడసారిగా నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ అదే!"
    రంగయ్య చౌదరి కంట తడి పెట్టుకున్నాడు. ఇది అన్యాయమన్నాడు. కానీ, శంకరనారాయణ అంతటి వారు చేసుకున్న నిస్చయమది! ఇక దానికి తిరుగు లేక పోయింది! అటు వైపు వంట ఇంటి నుంచి కూడా ఏడ్పులు వినబడుతున్నాయి!    
    "ఇక నీవు సెలవు తీసుకోవచ్చు , రంగయ్యా! నా సంసారాన్ని......అంటే నా భార్యనూ, నా బిడ్డల్నీ ఇక నేను చక్కదిద్దు కోవాలి! అరుణ అంటే పరాయిది! అదేక్కడ పుట్టిందో.......ఎవరికి పుట్టిందో ........ఎందుకు మా జీవితాల్లో అంతటి వెలుగు వెలిగించి, అకస్మాత్తుగా ఈ చీకట్ల ను ఇలా క్రమ్మ జేసిందో ఆ భగవంతుడి కే ఎరుక! నువ్వు వెళ్ళు, బాబూ! పాడయి పోయిన మా మనస్సు లతో పాటు, నీవెందుకూ నీ మనస్సు ను మధన పెట్టుకోవడం? ఆ....కడసారిగా చెబుతున్నాను రంగయ్యా, నన్ను అవమాన పరచదలుచు కుంటేనే నీవు ఆర్ధికంగా కానీ, మరో విధంగా కానీ నాకు సహాయం చెయ్యి!"
    "నేనేం పాపం చేశానని సార్, ణా కింతటి కఠిన శిక్ష?" అన్నాడు రంగయ్య బావురుమని ఏడుస్తూ.
    "తప్పు రంగయ్యా , తప్పు! ఇక నీవు వెళ్ళు, బాబూ! నన్ను చూచి బాధపడే ఓపికా నీకున్నా, నీ మంచి తనాన్ని భరించే శక్తి నాకు లేదు. వెళ్ళు. నేనాలోచించు కోవాలి! గుడ్ బై!"
    రంగయ్య ఆయన పాదాల్ని తన కన్నీటి తో కడిగి లేచాడు. గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. పోబోతున్న రంగయ్య కు కనకదుర్గా పిలిచింది. రంగయ్యా ఏడుస్తున్నాడు! కనకదుర్గ ఏడుస్తుంది! ఆ ఇద్దరు పిల్లలూ కూడా ఏడుస్తూనే ఉన్నారు.
    "నాయనా రంగయ్యా, తల్లిని కాకపోయినా, తల్లిలా  ఆ పిల్లను పెంచాను. ఏదో ఈ బాధల్లో నా మనసు పాడై , నేనేదో అన్నాననుకో! అంతమాత్రాన నాకింతటి మాయని మచ్చ ఆపాదించి, అరుణ నన్నిలా అన్యాయం చెయ్యడం ఏమైనా బాగుందా? లోకం ఏమనుకుంటుంది?"
    "నన్నేం చెయ్యమన్నారమ్మా? వారు నా కాళ్ళూ, చేతులూ కట్టివేసి , నన్నో మూల కూర్చో బెట్టారు! అయన ఏమవుతారోననే నా భయం! చెయ్యాలనుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా ఇక! భగవంతుడే మీకు దిక్కు" అని చరచర వెళ్ళిపోయాడు రంగయ్య.
    శంకర నారాయణ గారు మాత్రం నిర్విరామంగా ఆలోచిస్తున్నాడు. కొందరు ఆయనకు పిచ్చి పట్టిందను కున్నారు. కానీ, పట్టలేదు. ఇక పొతే, అయన మాత్రం కొన్ని కఠిన మైన, కఠోరమైన నిశ్చయాన్ని కొని తెచ్చుకున్నారు!"తనను తాను శిక్షించు కోవాలనా? తన సంసారాన్ని శిక్షించాలనా? ఏమో మరి!
    ఆ రాత్రి పిల్లలిద్దరూ నిద్రపోయిన తరవాత, శంకరనారాయణ కనకడుర్గను కేకేశారు. ఆమె వచ్చి అయన పాదాల మీద పడి కన్నీరు మున్నీరు గా ఏడ్చింది.
    "ఎందుకే దుర్గా? జరిగిందేదో జరిగిపోయింది. అన్నిటినీ తలుచుకుని , ఇక ఎంత ఏడ్చినా ఏం లాభం? గుండె రాయి చేసుకుని, మన భావి జీవితాల్ని గురించి ఆలోచించుకుందాం.... అమ్మాయిల చదువులు.... పెళ్ళిళ్ళూ ..కర్మవ శాత్తూ నేనేమైనా ........"
    "మీకు పుణ్య ముంటుంది! అటువంటి ఆశుభాల్ని మీ నోటంట రానివ్వకండి!"
    'అలాగే నీ మనస్సు నొప్పించడం ఏనాడూ నా ఉద్దేశం కాదే, దుర్గా! స్వయం క్రుతాపరాధం వల్ల మనం ఈ దుస్థితికి రాలేదు, ఊరుకో!"
    కొన్ని నిమిషాల పాటు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. దుర్గ తన దుఃఖాన్ని దిగామింగడం లోనూ, శంకర నారాయణ గారు తాను చెప్పదలచు కున్నదాన్ని ఎంత నిష్కర్షగా చెప్పి వెయ్యాలా అన్న చింతన లోనూ నిమగ్నులై ఉండిపోయారు.
    "దుర్గా!"
    "ఏమండీ?"
    "ఇప్పుడు నీ వద్ద ఏమాత్రం డబ్బుంది?"
    "ఆరు వందల దాకా ఉందండీ!"
    "అంతా ఆప్తులు చేసిన దాన దర్మాలేగా?"     
    దుర్గ మారు పలకలేదు.
    "పోనీలే! ఏదో....తీరా ఊరు విడిచి వెళ్ళేనాడు కూడా చార్జీ లకనీ....వాటికనీ....వీటి కని ...బిచ్చమెత్తు కునే రాత తప్పింది. అప్పులే మాత్రం ముంటాయి?"
    "ఇంటద్దె పాతిక, పచారీ కొట్టులో ఓ యాభై రూపాయలు, పాలవాడికి పద్దెనిమిది , చాకలికి ఓ ఆరూ......"
    "సరి, రేపీ పాటికి ఈ అప్పులన్నీ తీర్చేసేయ్యి. రేపు రాత్రే ప్రయాణం. ఇక ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు."
    "అలాగే!"
    "అదేమిటి దుర్గా.... ఎక్కడికి వెళదామని గాని, ఈ ఊరెందుకు వదలాలని గాని ఏమీ అడగవా?"
    "అన్నీ ఆలోచించే మీరి నిశ్చయానికి వచ్చి ఉంటారు. కారణాలు నాకు తెలిసినా, తెలియక పోయినా ఫరవాలేదు."
    'అయితే మంచిదే! మనమీ ఊరు వదలదలుచు కున్నట్టు ఒక్క ప్రాణి కి కూడా తెలియకూడదు."
    "అలాగే!"
    "వెళ్ళిన తరవాత కూడా ఇక్కడి వారికి అక్కడి మన ఉనికి తెలియ నివ్వ కూడదు."
    "అలాగే!"
    "వెళ్ళు, పాపం , పొద్దు పోయింది."
    దుర్గ మళ్ళీ అయన పాదాలకు మొక్కి వెళ్ళిపోయింది.
    ఆ తరువాత రెండో రోజు మధ్యాహ్నాని కంతా ఉప్పెనలా పొంగి పోయింది వార్తా ఆ ఊరంతా! అంతా 'ఎక్కడి కెళ్ళారు అంటే ఎక్కడి కెళ్ళారు?" అనుకున్నారు.
    శంకరనారాయణ గారి మంచితనమే ఆ ఊళ్ళో ఆ వాడ ఏ నోటంట విన్నా! రంగయ్య చౌదరి కనకదుర్గ స్వగ్రామాని కి వెళ్లి వచ్చాడు వీరి కోసం. అంత సుదీర్ఘంగా ఆలోచించిన శంకర నారాయణ గారు, అందరికీ అందుబాటులో ఉండేలా ఎందుకు దాక్కుంటారు? ఇంతటికీ దారణ మేమిటని కొందరు ఆలోచించారు. అరుణ అన్నారు అందరూ!"  
    మరి అరుణ ఏమైనట్టు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS