5
సురేంద్ర అమితోత్సాహం తో ఎదురు చూసిన శనివారం ఇట్టే వచ్చినట్లని పించింది. సురేంద్ర గదిలోకి వచ్చిన తరవాత రవిచంద్ర పని అల్లా నవలలు చదవడం, కాస్సేపు దిగులుగా ఏమీ మాట్లాడకుండా, కూర్చోవడం, అప్పుడప్పుడు ఆ దిగులును పోగొట్టు కోడానికి ప్రయత్నించడం. అంతే. రవిచంద్ర తండ్రిని విడిచి పెట్టి ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటి సారి. అయినప్పటికీ తండ్రిని చూద్దామని గాని, ఇంటికి తిరిగి వెళదామని గాని ఏమీ అనిపించలేదు. ఏమైనా ఆ విషయాలు జ్ఞాపకం వస్తే, కసి తోటి, హృదయం నిండా అవరించుకున్న దిగులు తోటి పళ్ళు కరుక్కోవటం ఎలా అతను ఇంకో విధంగా ఆ విషయాలను గురించి ఆలోచించలేక పోతున్నాడు.
సురేంద్ర మాత్రం దాదాపు రోజు లెక్క పెట్టుకుంటూ రిహార్సల్స్ కు వెళుతున్నాడు. అతని ఆత్రత ల్లా వస్తానని మాట ఇచ్చిన మేయరు వస్తాడో రాడో అనే. అనుకోకుండా నాగపూర్ కు ఏదో హిందీ సినిమా శతదినోత్సవ సందర్భంలో ఒక ప్రఖ్యాత నిర్మాత వచ్చాడు. సురేంద్ర ప్రత్యేకంగా పోయి అతన్ని తన నాటకం చూడటానికి రావాలని మరీ మరీ ఆహ్వానించాడు. సురేంద్ర ఉద్దేశ్యం ఏమిటంటే , అతన్ని ఏదో విధంగా ఆకర్షించి, అతను తయారు చేయపోయే చిత్రంలో చిన్న చాన్సు సంపాదించాలి. ఆ వారం రోజుల్లోనూ సురేఖ రెండు సార్లు సురేంద్ర గదికి వచ్చింది. రవిచంద్ర నిర్లిప్తత కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించి సురేంద్ర ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గురించి అడిగింది. సురేంద్ర మొదట చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించాడు కాని సురేఖ బలవంతం వల్ల అసలు సంగతి బయట పెట్టక తప్పింది కాదు. ఆ విషయాలు విన్న తరవాత మాత్రం సురేఖ కు ఎందుకనో అతని పట్ల అపరిమితమైన జాలి, సానుభూతి కలిగాయి.
ఆ శనివారం నాటకానికి పోకుండా ఉండడానికి రవిచంద్ర ప్రయత్నించాడు కాని వీలులేకుండా పోయింది. రవిచంద్ర కు రాత్రిళ్ళు బయటకు రావాలంటే ఎందుకనో మనసొప్పటం లేదు. వెలుగులు చిమ్ముతున్న నగరంలో జంటలు జంటలుగా దంపతులు ఎక్కడ చూసినా కనపడుతున్నారు రాత్రిళ్ళు బయటకు వెళితే. ఆ సుఖాన్నించి ఎవరో తనని ఒక్కడ్నీ వెలి వేసినట్లుగా అనిపించి మనశ్శాంతి కోసం అన్వేషిస్తున్న అతనికి అది మరింత దూరమయి , జీవితం అంటే విరక్తి కలుగుతున్నది. అందుకనే అతను వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నించాడు. చీకటి దేవత అతనికి ఇప్పుడు స్నేహితురాలయింది. లైటు వేసుకోకుండా చీకట్లో కూర్చోడం అతనికి ఎందుకనో మనశ్శాంతి ఇస్తున్నది.
రవిచంద్ర ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వీలు పడలేదు. సురేంద్ర ను ఏదో విధంగా కసురుకోనో, బ్రతిమాలు కోనో ఒప్పించే వాడే. కాని సురేఖ --అంతగా పరిచయం కాని- వ్యక్తీ అదే పనిగా రమ్మని వేధిస్తుంటే కాదని చెప్పడానికి అతని మంచితనం అడ్డు వచ్చింది.
ముగ్గురు కలిసి ధన్ వట్ రంగ్ మందిర్ కు కొంచెం ముందుగానే వెళ్ళారు. సురేఖ, సురేంద్ర గ్రీన్ రూం లోకి వెళ్ళారు. రవిచంద్ర హాలులోనే అటూ ఇటూ తిరగడం మొదలెట్టాడు. ఇంకా నాటకం ప్రారంభించటానికి చాలా సమయం ఉంది. విసుగు పుట్టి రవి హాలు బయటకు వచ్చి, ఆ వీధిలో అటూ, ఇటూ చాలాసేపు తిరిగాడు. చికాకును తప్పించుకోటానికి ఆ వీధిలోని చిన్న టీ బడ్డీ లో టీ తాగి కాసేపు అక్కడ కూలబడ్డాడు.
ఇక నాటకం ప్రారంభిస్తారనగా చిన్నగా హాలులోకి వెళ్ళాడు. అప్పటికి థియేటరు మనుష్యులతో నిండిపోయింది. అతనికి కొంచెం ఆశ్చర్యం వేసింది, ఒక సాంఘిక నాటకానికి, అందులోనూ టికెట్టు పెట్టిన నాటకానికి ఇంతమంది ప్రేక్షకులు రావటం చూస్తె. ఏదో రికార్డు సంగీతం మృదువుగా స్టేజి వెనక నించి వస్తున్నది. నెమ్మదిగా నడుచుకుంటూ ఇంతకూ పూర్వం తను కూర్చున్న సీటు వైపు చూశాడు. ఎవరో కూర్చున్నారు. లాభం లేదనుకొని ఇంకొంచెం ముందుకు వెళ్లి ఖాళీ సీట్లో కూలబడ్డాడు. కొంచెం ఉక్కపోతగా ఉంటె దస్తీ తీసి ముఖం తుడుచు కుందామని ఆయత్తుడవుతున్న సమయంలో పక్కనే ఎవరో "హలో" అన్నట్లనిపించి అప్రయత్నంగా అటు చూశాడు.
అతను రాజగోపాలం! రవిచంద్ర కొంచెం తత్తర పాటుతో "హాలో" అన్నాడు. రాజగోపాలం అక్కడ కనిపించడం రవిచంద్ర కు పెద్ద ఇబ్బందే కలిగించింది. అతను ఊహించాను కూడా లేదు మళ్ళీ రాజగోపాలాన్ని తను కలుస్తానని.
"వండర్! చాలా ప్లెజెంట్ సర్ ప్రైజ్ మిమ్మల్ని ఇక్కడ చూడడం. ప్రియా, ఇటు చూడు-- మిస్టర్ రవిచంద్ర." పక్క సీటులో కూర్చుని ఉన్న ప్రియంవద స్నేహపూర్వకంగా అదోరకమైన ఆప్యాయతతో చూసి "నమస్తే" అంది. రవిచంద్ర ఇబ్బందిగా చేతులు జోడించి , "కులాసా?' అని అడిగాడు.
ఇంతలో మైక్ లో ఎవరో ప్రేక్షకులకు స్వాగతం చెప్పి మేయరును అధ్యక్షస్థానం అలంకరించవలసిందిగా ఆహ్వానించారు. తరవాత "శ్రీ రాజగోపాలం నాటకాన్ని గురించి పరిచయం చేస్తారు" అన్న ప్రకటనను వినగానే రాజగోపాలం తన సీటు నించి లేచి నెమ్మదిగా స్టేజీ ఎక్కాడు.
ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేక పోయాడు రవిచంద్ర. ప్రియంవద కుతూహలంగా అటువైపు చూడసాగింది.
తన సహజ వాగ్ధాటి తోటి, సరసోక్తుల తోటి ప్రేక్షకులను ఆకట్టుకొని రాజగోపాలం నాటకాన్ని గురించి, అందులోని ప్రత్యెక విషయాలను గురించి చక్కగా చెప్పి తన సీటులో రవిచంద్ర పక్కనే కూర్చున్నాడు. మేయరు కూడా నాటకం విజయవంతం కావాలని , ఇటువంటి కళలకు తగినంత ప్రోత్సాహం ఇంకా బాగా లాభించాలని మామూలుగా అందరు ఇచ్చే అధ్యక్షోపన్యాసం లాంటిదే ఇచ్చి కిందికి దిగి వచ్చాడు.
నాటకం మొదలయింది. సురేఖ హాయిగా నాటించటానికే పుట్టిందా అన్నట్లుగా స్టేజీ పై కనపడ సాగింది. సురేంద్ర నాటకం లోని వేషంతో మొదటిసారిగా స్టేజీ మీదికి వచ్చినప్పుడు ఎందుకనో రవిచంద్ర కు ఒళ్ళు గగుర్పొడిచింది. సురేంద్ర తనకు స్నేహితుడుగా పరిచయమే గాని నటుడుగా కాదు. అతని హావభావాలు, పాత్ర పోషణ, సంభాషణ చెప్పే విధానము అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్య చెప్పే విధానము అన్నీ అద్బుతంగా ఉన్నాయి. మధ్య మధ్య ప్రేక్షకులు నాటకం మంచి రస పట్టులో ఉన్నప్పుడు హుషారుగా చప్పట్లు కొడుతున్నప్పుడు రవిచంద్ర కు ఎందుకనో హృదయం లో ఒక మూల సంతోషం లాంటిది కలిగింది. సురేంద్ర ఆ నాటకం లో బాగా రాణించసాగాడు. నాటకం పూర్తిగా పరిస్థితులు కల్పించిన కష్టాల మీద ఆధారపడి అల్లబడింది. మానవుడు ఎంత స్థిర చిత్తంతో ఉన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు పరిస్థితులకు ఏ విధంగా బానిసయ్యేది , పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక ఏ విధంగా తను అనుకున్న డానికి భిన్నంగా వ్యవహరించేది నాటకీయంగా ఉన్నప్పటికీ, కొంచెం సహజత్వం లోపించినప్పటికీ చాలా చక్కగా రూపొందించబడింది. చివరి సీనులో పరిస్థితులకు బానిసగా మారిన హీరో నిజాన్ని తెలుసుకోలేక ఒక అమాయికను కత్తితో పొడిచి చంపే సన్నివేశం నాటకాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్ళింది. ఆ సన్నివేశం లో సురేఖా సురేంద్ర లు ఇద్దరు పోటీపడి నటించారు. అటు తరవాత కధానాయకుడు నిజాన్ని తెలుసుకొని విలపించే సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను ద్రవింప జేసింది. సురేంద్ర ఆ సన్నివేశంలో చాలా బాగా నటించి పదేపదే ప్రేక్షకులచేత కంటతడి పెట్టించాడు. శోక రసాన్ని కురిపిస్తున్నట్లుగా అన్ని వాద్యాలు దాడి చేసిన సమయంలో ప్రేక్షకుల చప్పట్ల మధ్య నాటకం ముగిసింది.
పక్కనే కూర్చున్న రాజగోపాలం నెమ్మదిగా రవి చేయి పట్టుకొని, "నాటకం బాగుంది కదూ. యాక్టర్స్ ను పరిచయం చేస్తాను, రండి" అనిగ్రీన్ రూం వైపు నడవసాగాడు. రవి ఏదో చెప్పబోయినప్పటికి వినిపించుకోకుండా , "నాగపూర్ ఎప్పుడు వచ్చారు? నేను చెప్పలా నాగపూర్ అవతల తెలుగు వాతావరణం లేదనీ, మీరు భరించ లేరనీను! వెరీ గుడ్. మీరు వచ్చారు"అంటూ ప్రియంవద చెరిగిపోనీ చిరునవ్వుతో వెనక వస్తుంటే గ్రీన్ రూం లోకి నడిచాడు.
సురేంద్ర రంగు తుడుచుకుంటున్నాడు. "కంగ్రాచ్యులేషన్స్! అద్భుతంగా ఉంది ప్రదర్శన" అని రాజగోపాలం "ఇతను నా ఫ్రెండ్ మిస్టర్ రవి...." అని సురేంద్ర కు పరిచయం చేయబోయాడు.
అంత ఇబ్బంది లోనూ రవిచంద్ర పెదిమల మీద చిరునవ్వు వెలిగింది.
సురేంద్ర ఒక్క క్షణం డిల్లపోయి , మరుక్షణ మే కోలుకొని పెద్దగా నవ్వుతూ , "బావుంది మీ వరస. మీరు పరిచయం కాకపూర్వమే నాడు నాకు పరిచయం. మన పరిచయం మూడు సంవత్సరాల నాటి దైతే మా పరిచయం ఇరవై సంవత్సరాల నాటిది" అన్నాడు.
ఈసారి ఆశ్చర్యపడటం రాజగోపాలం , ప్రియంవదల వంతు అయింది. "అలాగా? ఐ యామ్ సారీ దెన్ . ఇదీ నాటకంలో ఒక సీన్ గాదు కదా?" అన్నాడు రాజగోపాలం. ప్రియంవద మాత్రం ఇంకా విస్మయం చెందటం మానలేదు.
తటాలున సురేంద్ర అడిగాడు. "అరెరే, నేను అడగటం మరిచిపోయాను. అసలు రవి మీకు ఎలా పరిచయం?"
"వారు ప్రియ అన్నయ్య కు ప్రియ మిత్రులు అన్న సంగతి కూడా సినిమాలో మాదిరి తరవాత తెలిసింది, మిమ్మల్ని మేము ట్రెయిను లో ఒకరి కొకరం పరిచయం చేసుకున్న తరవాత."
"అయితే టూకీగా వీడు నా బాల్య మిత్రుడు. అచానక్ గా ఇక్కడ కలిశాడు. ఇప్పుడు నా దగ్గిరే ఉన్నాడు" అని మూడు ముక్కల్లో కొట్టేస్తూ రంగు పూర్తిగా తుడుచుకోసాగాడు సురేంద్ర.
ఈ పరిచయాలను గురించి జరిగిన ఎంక్వైరీ గాభరా తగ్గిన తరవాత అన్నాడు రవి, "చాలా బాగా చేశావురా!" అని.
సురేంద్ర కళ్ళు ఆశ్చర్యంగా మెరిశాయి. "నీ ముఖం, నీవు సరిగా చూసి ఎడ్చావా? ఏదో అంటున్నావు గానీ......"
"లేదు. చాలా బాగుంది నాటిక. నీవేదో నాటకాల్లో వేస్తానని అనుకోవడమే గాని ఇంత బాగా స్టేజీ మీద రాణిస్తూన్నానని నాకు తెలియదు."
"థాంక్స్' అన్నాడు సురేంద్ర. ముగ్గురు నవ్వుకున్నారు.
సురేఖ వేషం మార్చుకొని, రంగు తుడిచేసుకొని, నెమ్మదిగా పక్క గది లోంచి అక్కడకు వచ్చింది. సురేఖ ను చూస్తూనే రాజగోపాలం కంగ్రాచ్యు లేషన్స్ చెప్పాడు. సురేఖ ప్రియం వద వైపు చూస్తూ నేమ్మదిగామందహాసం చేసింది.
సురేంద్ర షర్టు మార్చుకుంటూ , "థాంక్స్, రాజగోపాలం గారూ! అడగ్గానే మీరు వచ్చి నాటకాన్ని పరిచయం చేశారు" అన్నాడు.
"అదేమిటి, థాంక్స్ చెప్పవలసింది గ్రీన్ రూంలో కాదు, స్టేజీ మీద" అని రాజగోపాలం అనగానే అందరూ నవ్వారు.
అందరు బయటకు వచ్చిన తరవాత రాజగోపాలం అడిగాడు. "ఇంతకూ మీరు ఎదురు చూసిన నిర్మాత వచ్చాడా?' అని.
సురేంద్ర నిరుత్సాహంతో పెదిమ విరుస్తూ "వచ్చాడు . కాని ఏం లాభం? కంగ్రాచ్యు లేట్ చేయటానికి గ్రీన్ రూం లోకి రాలేదు కాబట్టి మన యాక్టింగ్ నచ్చలేదన్న మాట" అన్నాడు.
"అలా ఎందుకనుకోవాలి-- మన నాటకం తోటి తన్మయత్వం చెంది అభినందించడం మరిచిపోయాడెమో?"
సురేఖ మాటలకు మళ్ళీ నవ్వారు అందరూ. రవిచంద్ర కు గాలి స్వేచ్చగా వీస్తున్నట్లు అనిపించటం లేదు. మనసులో ఏదో తొందర, , వేగము, రాజగోపాలం , ప్రియంవద ఎదటి నుంచి బయట పడాలనే ఆత్రత "మరి మనం వెళదామా" అనేటట్లు చేశాయి.
రాజగోపాలం స్నేహపూర్వకంగా రవిచంద్ర చేయి నొక్కుతూ , "ఈసారి మీరు తప్పించుకోలేరు. రేపు తప్పకుండా మా ఇంటికి రావాలి" అన్నాడు.
'అవును. మీరు ఆనాడు ఇక్కడ దిగనందుకు వారు ఎంత బాధపడ్డారను కున్నారు? ఈ తడవ మీరు అభ్యంతరం చెప్పటానికి వీలు లేదు.' ప్రియంవద అందుకుంది.
"ఓస్, అదెంత పని. రేపు వీణ్ణి మీ ఇంటికి తీసుకొని వస్తాను, సరేనా?' అన్నాడు సురేంద్ర.
రవిచంద్ర ఇరుగ్గా అతన్ని చూశాడు.
"తప్పకుండా ...రేపు నాకు తీరిక కూడా. ఉదయం ఎదురుచూస్తుంటాను."
ఇంతలో కంపెనీ వాను వచ్చింది. సురేంద్ర, సురేఖ, రవిచంద్ర అందులో కూర్చున్నారు. జనం అప్పటికే వెళ్ళిపోయారు. థియేటర్ లో చెదురు మదురుగా మనుష్యులు ఉన్నారు. లైట్లు ఒక్కొక్కటి తీసి వేస్తున్నారు. థియేటరు గూడా ఒక్కొక్క అలంకరణనే తీసి వేసుకోవడం మొదలెట్టింది.
"గుడ్ నైట్ " అనే సురేంద్ర అరుపు తోటి వాను కదిలింది. తన కారు దగ్గిరికి నడుస్తూ రాజగోపాలం భార్యతో అన్నాడు. "ఇంకా కోలుకోలేదు. మనిషి దిగాలుగా, పరధ్యానంగానే ఉన్నాడు" అని.
"అదేమిటీ, ఆనాడు ఇక్కడ దిగనన్నాడు? మళ్ళీ ఎలా వచ్చాడు?"
ప్రియంవద మాటలకు చిరునవ్వుతో , "నేనీ వివరాలన్నీ అతడు బాధపడతాడని అడగలేదు. ఏమిటో పూర్ ఫెలో" అంటూ కారు స్టార్టు చేశాడు.
భర్త దగ్గిర ఒదిగి ప్రియ కూర్చుంది. ఆమె భుజం మీద ఒక చేయి వేసి నెమ్మదిగా ఎక్సిలెటర్ నొక్కాడు.
నున్నటి తారురోడ్డు మీద జర్రున కారు వెళ్ళిపోయింది.
