Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 10

                             
                                                           6
    "నేను రాను. నేనెక్కడికి రాదలుచుకోలేదు. దయ చేసి నన్ను విసిగించ దలుచు కాకపోతే నీవు వెళ్ళు, సూరీ!" అన్నాడు కొంచెం కోపంగానే రవిచంద్ర.
    సురేంద్ర మాత్రం అతన్ని వదల్లేదు.
    "రాజగోపాలం చాలా మంచివాడు రా! ఎందుకలా ఒంటరిగా కూచోవాలని కోరుకుంటావు? ఏమైనా మనస్సు కష్టపెట్టే సంఘటనలు జరిగితే మరిచిపోవాలి వాళ్ళను కాని, ప్రతిసారీ దాన్ని తవ్వుకుంటూ కూచుంటే ఎలా? అతని కంపెనీ లో నీవు అన్నీ మరిచిపోతావు. చాలా సంస్కార వంతమైన కుటుంబం అది. తెలుగు వాళ్ళు కాబట్టి మనం అంటే అభిమానం. పాపం ఒకసారి నీతో ట్రయిన్ లో పరిచయం అయిందో లేదో, ఎంత అభిమానంతో పిలుస్తున్నాడో చూడు. వాళ్ళను డిస్సప్పాయింట్ చేయటం నాకేమీ బాగాలేదు."
    సురేంద్ర రవిచంద్ర ను బయటకు గుంజి తాళం వేశాడు గదికి. ఇక రవిచంద్ర అయిష్టంగానే అతనితో బయలుదేరడం తప్ప ఇంకేమీ చేయలేక పోయాడు.
    సదరు లో బస్సు ఎక్కి బరిడీ లో దిగి, మళ్ళీ బరిడీ లో ఇంకో బస్సు ఎక్కి తిలక్ నగర్ చేరుకున్నారు. తిలక్ నగర్ లో రెండు మూడు నిమిషాల పాటు నడిచిన తరవాత ఒక అందమైన డాబా ముందు సురేంద్ర ఆగాడు.
    "ఇదే వారి ఇల్లు" అన్నాడు.
    ఆ అందమైన డాబా చుట్టూ చక్కటి ఫెన్సింగ్ ఉంది. గేటు తీసిన తరవాత ఒక పక్కగా చక్కగా నాటిన గులాబీ చెట్లు, గులాబీ గుత్తులతో అతిధులను ఆహ్వానిస్తున్నట్లు గా ఉన్నాయి. రకరకాల పూల చెట్లు ఆ ఇంటి అందాన్ని మరింతగా ఇనుమడింపజేశాయి. పోర్టికో లో ఒక పక్కగా కారు పెట్టబడి ఉంది.
    ఇద్దరూ డ్రాయింగ్ రూం లోకి వెళ్ళిన తరవాత సురేంద్ర "రాజగోపాలం గారూ" అని పిలిచాడు.
    డ్రాయింగు రూం చక్కగా అలంకరించబడి ఉంది. అందంగా అమర్చబడిన సోఫాల కింద మెత్తని తివాసి పరచబడి ఉంది. ఒక పక్కగా ముఖ్యమైన పుస్తకాలు పెట్టబడిన రాక్ ఉంది. ఇంకో వైపు రేడియో గ్రాం పైన ప్రియంవద రాజగోపాలం ఇద్దరు తీయించుకున్న పెళ్ళినాటి ఫోటో ఉంది.
    కర్టెను తోలిగించుకుంటూ ప్రియంవద వచ్చింది. అప్పుడే తలంటి పోసుకుంది కాబోలు జుట్టు ఇంకా ఆరలేదు. రెండు మూడు పాయలు దువ్విన తలకట్టు లోంచి తప్పించుకొని ముఖం మీదికి అందంగా పడుతున్నాయి ముంగురులు. ఎర్రటి బోర్డరు కలిగిన తెల్లటి చీరతో పాటు మందార రంగు జాకెట్టు ధరించింది. స్నిగ్ధంగా, స్వచ్చంగా, ప్రశాంతంగా ఉన్న ఆ వదనం ఆమె అందానికి వెలలేని ఆభరణం.
    అతిదులిద్దర్నీ చూడగానే మందహాసం చేస్తూ, "వారు తలంటి పోసుకుంటున్నారు, కూర్చోండి." అంది.
    ఇదరూ సోఫాలో కూర్చున్నారు. టీపాయ్ పక్కగా ఉన్న మరొక చిన్న బల్ల మీద ఆనాటి పేపర్లు పెట్టబడి ఉన్నాయి. అటుపక్కనే ఉన్న మరొక చిన్న బల్ల మీద పూల కూజాలో గులాబీలు అందంగా అమర్చబడి ఉన్నాయి.
    లోపలి నించి ఎవరో పద్నాలుగేళ్ళ పిల్ల -- పనిమనిషి కాబోలు వచ్చి మరాఠీ లో ఏదో చెప్పింది ప్రియంవద కు.
    ప్రియ అది విని వస్తున్న నవ్వు ఆపుకుంటూ సురేంద్ర వైపు తిరిగి " చిన్నపిల్లవాడి కన్నా మరీ అన్యాయం. ఆయనకు తలంటి పొసుకోవాలంటే ప్రాణం మీదికి వస్తుంది. నేనిప్పుడే వస్తాను" అంటూ లోనికి వెళ్ళింది.
    రవిచంద్ర నెమ్మదిగా లేచి కిటికీ వైపు నడిచాడు. కిటికీ రెక్క ఒకటి తెరిచి ఉంచటం మూలాన ఎండ లోనికి వస్తున్నది. కిటికీ లోంచి ఎదురుగా కనబడుతున్న ఎత్తయిన మేడల వైపు చూశాడు. ఎవరో బయటకు వచ్చి ఖాళీ గా ఉన్న ప్రదేశంలో బట్టలు అరవేస్తున్నారు. ఇరుగ్గా ఉన్న ఆ డాబా గదుల్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో చెప్పడం కష్టం! మన నాగరికత తో బాటు మేడలు కూడా, తలలు పై కేత్తినా చివర్లు కనబడకుండా ఉండేంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పట్టణాలలో స్వచ్చమైన గాలీ, నిష్కల్మషమైన నీరు దొరకడం దాదాపు అసాధ్యమయిపోయింది.
    వెనక్కి తిరిగి రవి రాక్ లోని పుస్తకాలు చూడటం మొదలెట్టాడు. అతనికి పుస్తకాలంటే ప్రాణం. ఎంత అశాంతి లో నయినప్పటికి అతనికి పుస్తకం ఎడారిలో ఒయాసిస్సు లా కనబడుతుంది. కుతూహలం ఆపుకోలేక అందులో అమర్చిన పుస్తకాలు చూడటం మొదలెట్టాడు.
    బెర్ ట్రాండ్ రస్సెల్ సాహిత్యం ఎక్కువగా కనబడింది. సోమర్పేట్ మామ్ నవలల తో పాటు ఎక్కువగా భగవంతుడి ఉనికిని గురించి అరా తీసే పుస్తకాలు అందులో ఉండడం అతణ్ణి ఆశ్చర్య పరిచింది. ఏమీ తోచక "ఎన్ ఎధియిస్ట్ విత్ గాంధీ" అనే పుస్తకం తీసి అటు ఇటు తిప్పటం మొదలెట్టాడు.
    రాజగోపాలం జుట్టు తుడుచుకుంటూ ఇంతలో హడావిడిగా బయటకు వచ్చాడు. "సారీ! సెలవుదినం వస్తే చాలు, మా ఆవిడ తలంటని ప్రాణం తీస్తుంది. అలాగైనా సరే నా తలను లంకించు కోని మొట్టికాయలు వేయవచ్చని ఆమె ఊహ."
    పగలబడి నవ్వాడు సురేంద్ర. "భలేవారు! పాపం, అనవసరంగా ఆవిడ మీద అభాండం వేస్తున్నారు" అన్నాడు తెరలు తెరలుగా వస్తున్న నవ్వు ఆపుకుంటూ.
    "నిజం , సర్! ఆమధ్య మగవాళ్ళ లో ఎక్కువ మందికి బట్ట తలలు కావడానికి, జుట్టు ఊడి పోవడానికి కారణం ఏమిటని ఎవరో పుణ్యాత్ముడు కమిటీ వేసి అరా తీస్తే , తలంటి పేరుతొ భార్యలు వేసే మొట్టి కాయల వల్లనే అని తెలిదిందట."
    ఈ మాటలకు రవిచంద్ర కూడా చిన్నగా నవ్వి, "తలంటు జుట్టును రక్షించడానికి గానీ, ఊడ గొట్టటానికి గాదు" అన్నాడు. రాజగోపాలం అందుకుంటూ , "కరెక్టు. కాని ఈ మొట్టికాయలు లేకపోతె ఆ ప్రయోజనం ఉండేది" అన్నాడు. అతను లుంగీ మీదనే ఉన్నాడు. తెల్లటి టర్కీ తవలుతో మధ్య మధ్య తల తుడుచుకుంటూ మాట్లాడుతున్నాడు. చెట్టంత మనిషి. బాగా నలుగు పెట్టుకొని తలంటి పోసుకున్నందు వల్ల కాబోలు, శరీరం మరింత ఎర్రబడింది.
    శరీరం మీద తుడవబడని నీటి బిందువులు అక్కడక్కడా మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఒక్క క్షణం విస్తుబోయి చూసిన తరవాత సురేంద్ర అన్నాడు. "మీరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఏ డైరెక్టరు అయినా చూస్తె అమాంతం మిమ్మల్ని హీరోగా  బుక్ చేసుకుంటారు."
    రాజగోపాలం ఒక్క క్షణం ఈ ఆకస్మికాభినందనకు విస్మయం చెంది, తెప్పరిల్లు కొని, "రక్షించారు . ఎప్పుడూ ఇలా ఉంటె, అంటే ఈ లుంగీ , ఈ టవల్ , ఈ నీరు కారే జుట్టుతో ఉంటె గాని అందం రాదన్న మాట. ఆ ప్రమాదం అన్ని వేళలా ఉండదు లెండి. అందువల్ల డైరెక్టర్లు బెడద నాకేమీ ఉండదు" అన్నాడు.
    ఇంకా రవిచంద్ర "ఎన్ ఎధియిస్ట్ విత్ గాంధి" అనే పుస్తకం పట్టుకొనే కూర్చుని ఉన్నాడు.
    అది చూసిన రాజగోపాలం, "అ పుస్తకం మీరు చదివారా?' అన్నాడు.
    "లేదు. దీన్ని గురించి విన్నాను."
    "ఏమని?"
    "ఈ సూటి ప్రశ్నకు జవాబు నా దగ్గిర లేదు. కాని వ్యక్తిగతంగా ఈ పుస్తకం రాసినాయన అంటే నాకు గౌరవం. ఆదర్శాల కోసం తనను ఆహుతి చేసుకొనే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉండడం వల్ల కాబోలు ఆయనంటే నాకు కొంచెం అభిమానం ఏర్పడింది."
    "పుస్తకాన్ని గురించి మీరు ఏమీ చెప్పలేదు."
    "క్షుణ్ణంగా చదవందే నేను ఏమీ చెప్పటానికి సాహసించను. క్షమించండి."
    "పోనీ, మీరు విన్న విషయాలయినా?"
    "ఆ విన్న విషయాలు ఏవో కొన్ని బయాస్ డ్ అభిప్రాయాలతో కూడు కున్నటు వంటివి. అటువంటివి చెప్పడం నా కిష్టం ఉండదు."
    రాజగోపాలం చిరునవ్వుతో సురేంద్ర వైపు తిరిగి, "మీరు వాన్ ఎలయిన్ మెంటు పాలసీ అవలంబిస్తున్నారేమిటీ? ఏమీ మాట్లాడటం లేదు" అన్నాడు.
    "పుస్తకాలంటే నాకు కొంచెం సరిపడదు లేండి. అందులోను ఫిలాసఫీ , భగవంతుడు -- ఇలాంటి విషయాలను డిస్కస్ చేశానంటే నాకు కొంచెం భయం. తెలిసిందే నాకు చాలా తక్కువ. పెద్ద పుస్తకాలు చదివితే తెలిసింది గూడా పోతుందేమో నని నేను అటు వంటి చెడ్డపని చేయను."
    "దట్స్ గుడ్! నిర్మొహమాటంగా చెప్పారు" అంటుండగా ప్రియంవద మూడు ప్లేట్ల లో వేడివేడి ఉప్మాతో వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS