"రవీ , లే . అలా బజారు వైపు వెళ్లి వద్దాం" అన్నాడు సురేంద్ర.
రవి అయిష్టంగా చూస్తూ "నేనురానులే . మీరు వెళ్లి రండి " అన్నాడు.
"నీ కోక్కడికి ఏమీ తోచదు . లే, లే. అలా మా కంపెనీ వైపు వెళ్లి వద్దాం" అన్నాడు సురేంద్ర అతని భుజం మీద చేయి వేస్తూ.
"లేవండి, రవి చంద్ర గారూ" అంది సురేఖ వానిటీ బాగు అటూ ఇటూ తిప్పుతూ.
రవిచంద్ర ఇరకాటం లో పడ్డాడు. అతను తన బట్టల వైపు చూసుకున్నాడు. బాగా మాసిపోయి ఉన్నాయి. పాంటు మడతలు పూర్తిగా పోయాయి.
షర్టు చేతులకు ట్రెయిను మురికి బాగా పట్టింది. అతనికి జుగుప్స కలిగింది. 'నేనెన్నడూ జీవితంలో అంత అసహ్యంగా ఉండలేదు" అని అనుకున్నాడు.
సురేంద్ర అతని సందిగ్ధావస్థ ను కనుక్కొని, "రవి భుజం మీద చేయి వేసి అతన్ని లోపల ఉన్న ఇంకో చిన్న గదిలోకి గుంజుకొని పోయి "బట్టలు మాసిపొయినాయి అని సందేహ పడుతున్నావా? ఫర్వాలేదు, వావి వేసుకో" అని పెట్టె దగ్గిరికి నడిచాడు.
రవిచంద్ర , "అబ్బే , అక్కర్లేదు . బాగానే ఉన్నాయి. డానికి కాదు..... " అంటూ ఇంకా ఏదో నసగబోయాడు.
"అరేయ్ , రవీ, నీవు నాదగ్గిర మొహమాట పడితే ఎలా చెప్పు! చిన్నప్పుడు నీకు ఎర్ర చారల లాగు ఒకటి ఉండేది. దాన్ని తోడుక్కోవాలని నాకెంత అభిలాష ఉండేది? నేను అడిగినప్పుడల్లా నీవు ఇవ్వలేదా? అలాగే నా లాగులు, చొక్కాలు నీవు తోడుక్కోలేదా ఏమిటి? పెద్ద దీనికి ఒక ఇష్యూగా చేస్తున్నావా? మనలో మనకు బెధాలేమిట్రా? ఇంకా నయం. భగవంతుడు గుడ్డిలో మెల్లలాగా నిన్ను నన్ను కలిపాడు. లేకపోతె నీ మొహమాటం తోటి, నీ వాలకం తోటి మాడేవాడివి. ఊ! త్వరగా తెములు" అని రవిని ఊపిరి పీల్చుకోడానికి కూడా సందివ్వ కుండా బాత్ రూం లోకి నెట్టేశాడు.
రవిచంద్ర స్నానం చేసిన తరవాత సురెంద్రబట్టలు వేసుకున్నాడు. తలుపు తాళం వేసి ముగ్గురు వీధిలో పడ్డారు.
ఆగొందులన్నీ దాటిన తరవాత కొంచెం విశాల మైన వీధులు వచ్చాయి. ఒకచోట బస్సు ఎక్కి బరిడీ కి చేరుకున్నారు. బరిడీ లో ఒక మూలగా ఉన్న వీధిలో ఉంది. సురేంద్ర వాళ్ళ కంపెనీ ఆఫీసు.
బయట ఏదో పేరుతొ బోర్డు ఉంది. లోపల నించి హార్మోనియం మోత, పాటలు వినబడుతున్నవి. సురేంద్ర సరాసరి కంపెనీ కంట్రాక్టర్ గదిలోకి దారితీశాడు.
బట్టతల, మీసాలు, గారపట్టిన పళ్ళు-- అయన ఆభరణాలు. కొంచెం భారీ శరీరం. సురేంద్ర ను చూస్తూనే, "ఒహోహో, హీరో సాబ్ , అవ్ -- అవ్]
" అంటూ సకిలింత లాంటిది చేశాడు. వెనకనే ఉన్న సురేఖ ను చూడగానే దాదాపు కుర్చీతో సహా పైకి లేచాడు. "అచ్చా, అచ్చా.....అప్ భీ --అయే ...బహుత్ ఖుషీ" అంటూ చక్కిలిగింతలు పెట్టినట్లుగా కిచకిచలు పెట్టాడు.
ముగ్గురు కూర్చున్న తరవాత "యాభై రూపాయలు కావాలి"అన్నాడు సురేంద్ర.
బట్టతల ముఖం నల్లబడింది. ఎండుకన్నట్లుగా చూశాడు.
"కావాలి-- అర్జంటు " అని రెట్టించాడు సురేంద్ర.
"నాటకం ఆడే రోజున ఇస్తాను పూర్తి డబ్బు" అని అతగాడు హిందీ లో చెప్పాడు.
"ఇవాళ యాభై , ఆవాళ మిగతాది .. ఊ! పాండే సాబ్ త్వరగా , నేను వెళ్లిపోవాలి."
"మరి రిహార్సల్స్?"
"సాయంత్రం వస్తాం సురేఖా , నేనూ" అన్నాడు సురేంద్ర.
అతడు అయిష్టంగా పర్సు లోంచి అయిదు పది నోట్లు తీసి సురేంద్ర చేతిలో ఉంచాడు.
"ఇక వెళదామా?' అన్నాడు ఇద్దరి వైపు తిరిగి.
ముగ్గురూ అక్కడి నుంచి బయట పడ్డారు. సురేంద్ర తో "మొత్తానికి అడ్వాన్సు అప్పుడే కొట్టేశావే?" అంది.
"వీణ్ణి నేను చచ్చినా నమ్మను. ఇంకా నాకు పాత నాటకం బాపతు డబ్బు రావాలి. నాటకం అయిన తరువాత చచ్చినా రాబట్టలెం వీళ్ళ దగ్గిర . ఛీ...ఛీ.... ఏం మనుష్యులు? కలక్షన్స్ బాగానే ఉన్నాయి. అనుకున్న ప్రకారం మనకు ఇవ్వటానికి చస్తారు" అన్నాడు.
ఎండ నడి నెత్తి మీదికి వచ్చింది. చెమటలు ధారాపాతం గా కారుతున్నాయి . ఎండాకాలం అవడం వల్ల దప్పిక కూడా కావడం మొదలు పెట్టింది.
సురేంద్ర ఒక పెద్ద హోటల్ లోకి దారి తీస్తూ , "ఇవాళ హుషారుగా మనం ఇక్కడ లంచ్ కానిద్దాం" అన్నాడు.
సురేఖ అంత ఉత్సాహంగానూ అతని వెంబడే లోనికి నడిచింది. రవిచంద్ర కొంచెం పస్తాయిస్తూ వారిని వెంబడించాడు.
ముగ్గురూ ఫామిలీ రూం లోకి నడిచారు. చల్లటి ఫాను గాలి వారి సేద తీర్చింది. మెత్తటి సీట్ల లో జారగిల బడితే , ఎండలోని అసౌఖ్యం , నీడలోని హాయి వారికి బోధ పడినట్లయింది.
రవిచంద్రను తదేకంగా చూడసాగింది సురేఖ. సురేఖ చూపులను అప్రయత్నంగా రవిచంద్ర కళ్ళు డీ కొన్నాయి.
ఆమె రెండు జడల్లోనూ ఒక జడ ముందుకు వచ్చింది. కుడి వైపున గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ ఆమె అందాన్ని ద్వీగుణీ కృతం చేసింది. మాట్లాడేప్పుడు కూడా మందహాసం లాంటిది చేయటం ఆమెకు అలవాటు. బహుశా అది నాటకాల్లో నటించడం వల్ల అలవాటుగా మారి ఉండవచ్చు.
భోజనం ఆర్డరిచ్చాడు సురేంద్ర. కాసేపు నిశ్శబ్దం. సురేంద్ర తటాల్న అడిగాడు రవిచంద్రను. "సీతను ఈ మధ్య ఎప్పుడైనా చూశావా?"
రవి పరీక్షగా అతని ముఖంలోకి చూస్తూ ఆ పేరు గలావిడను గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు.
"అదేరా, మీ ఇంటి పక్కన ఉండేది. చిన్నప్పుడు అందరం ఆడుకొనే వాళ్ళం. వాళ్ళ శంకరానికీ,మనకూ దోస్తీ."
"ఓహ్! ఆ సీతా? చంపావు పో! నేనెవరో అనుకున్నాను. అయినా అప్పటికి చిన్న పిల్ల. మీరు వెళ్ళిన కొద్ది రోజులకే వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టు జ్ఞాపకం. అయినా ఆపిల్ల ఇప్పుడు మన ముందు వచ్చి నిలబడినా గుర్తు పట్టనంతగా మారిపోయి ఉంటుంది. వయస్సు చాలా మార్పు తెచ్చి ఉంటుంది."
సురేంద్ర కు నిజానికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. రవిచంద్ర ను ఊరికే ఉంచటం ఇష్టం లేదు. అందుకనే చిన్నప్పటి ఆ విషయాలు , ఈ విషయాలు గుర్తుచేయసాగాడు. కాని పొడిపొడిగా జవాబులు ఇవ్వసాగాడు. వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నంత సేపు సురేఖ రవిని అప్పుడప్పుడు ఓరకంట చూడసాగింది.
ఇంతలో భోజనం వచ్చింది. రవిలో నిద్రపోయిన ఆకలి ఒక్కసారిగా మేల్కొన్నట్లయింది. కొంచెం అత్రంగానే భోజనం చేయసాగాడు. అయినప్పటికీ ఆ ఉత్తర దేశపు భోజనం అతనికి సరిపడలేదు. చపాతీల తోటి కడుపు నింపు కోటం కొంచెం కష్టంగానే అనిపించింది.
భోజనం తినటం పూర్తీ చేశాక ముగ్గురు బయటకు వచ్చినతరవాత సురేఖ వెళ్ళిపోయింది. ఇద్దరు సురేంద్ర గదికి చేరుకున్నారు. రవికి చాలా బడలిక గా ఉన్నట్లు అనిపించి పక్క మీద వాలి ఒత్తి గిల్లాడు. అమాంతం నిద్ర ముంచుకు వచ్చింది.
