6
నిశ్చేష్టుడై నిలబడిపోయాడు మాధవరావు. ఆమె మనో భావాలకు, చేతలకు అర్ధం చెప్పుకున్నాక అతని మనస్సుకి వూరట కలిగింది.
అప్పటి నుంచీ ఏదో మిషతో తను ఇంట్లో వుండగా వచ్చేది సుబ్బులు.
తనవంక ఆశగా, సిగ్గుగా, భయంగా చూస్తూ వెళ్ళేది. అప్పుడప్పుడూ ఏదైనా మాట్లాడేది. కళ్ళతోనే సాగిన ప్రణయం అది.
తండ్రి మరణంతో అనేక బాధ్యతలు నెత్తిన పడ్డాయి మాధవరావు కి. చెల్లెలు పెళ్లి, ఉద్యోగం - అప్పులు తీర్చడం , ఆస్తులు అమ్మడం, వీటన్నిటితో అలసిపోయిన మాధవరావు కి అందరూ చెప్పిన సలహా యిది.
'తెనాలి లో మంచి సంబంధం వుంది. మూడు వేల కట్నం యిస్తారు. ఆ పిల్ల మంచిది - చక్కనిది. నువ్వా సంబంధం వొప్పుకో. వల్లూరు లో కృష్ణమూర్తి గారి కొడుకు సత్యానందానికి మీ చెల్లెల్ని యిచ్చి ఆ కట్నం అతనికిచ్చి పెళ్లి అయిందనిపించు. దానితో యిద్దరూ వొడ్డున పడతారు. ఇల్లు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ అమ్మకు. అవతల తమ్ముడు చదువుకోవాలి-- ఇంకా చెల్లెలు వుంది --'
బంధువులందరూ ఏక కంఠం తో చెప్పిన ఈ సలహా పాటించక తప్పలేదు మాధవరావు కి.
విమలకి పెళ్లి చెయ్యక తప్పదు. తను సుబ్బుల్ని చేసుకుంటే విమల కి కట్నం ఎలా యివ్వగలడు?
బంధువుల సలహా శరణ్యం అయింది. ఇందుమతి ని పెళ్లి చేసుకున్నాడు.
తన పెళ్ళితో చిన్నబోయిన ముఖంతో వరండాలో స్తంభానికి అనుకు నిలబడ్డ సుబ్బులును తరువా తెప్పుడూ అతను చూడలేదు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికో.
తను చెయ్యలేని పని రఘు చేయగలిగాడు . డానికి కారణం కేవలం ధైర్యమే కాదు, వాడికి ఉద్యోగం వుంది. మంచి ఉద్యోగం. ఎవరి సహాయమూ లేకుండా చదువుకుని పైకి వెళ్ళాడు. చొరవ వుంది. సహకరించే చెల్లెలు వుంది. తను సుబ్బుల్నే చేసుకుని వుంటే విమల ఎంత గొడవ చేసేదో!
అప్పటి కిప్పుడు మళ్ళీ సుబ్బులు కనిపించింది. ఆమెకి తను సాయం చెయ్యాలి. తప్పదు.
ఆడవాళ్ళు అనేక విషయాల్లో విశాల హ్రుదయులుగా వుంటారు గానీ ఇలాంటి విషయాల్లో చాలా త్వరపడి ఆలోచించుకుని మనస్సు పాడు చేసుకుంటారు. ఇందుమతిని బాధ పెట్టడం తన ధ్యేయం కాదు.
తెల్లవారి కాఫీ త్రాగుతూ భార్యతో అన్నాడు.
'మన దక్షిణం వైపు గది ఖాళీగానే వుంటోంది కదా! ఎవరికైనా అద్దె కిస్తే నీకు తోడుగా వుంటారు' అని.
'అవును-- అత్తగారు పోయినప్పటి నుంచీ ఆ గది ఎక్కువ వాడడం లేదు -- మంచి వాళ్లెవరైనా వస్తే యివ్వండి. తోడుగా వుంటారు --' అన్నది ఇందుమతి.
వెంటనే సుబ్బలక్ష్మీ మాట అతను చెప్పలేక పోయాడు. పైగా సుబ్బలక్ష్మీ కి ఆ గది అద్దె కివ్వడం తన లక్ష్యం కాదు. ఉచితంగా యివ్వాలని వుంది.
అప్పటికేమీ మాట్లాడలేదు అతను.
ఆ సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే విశ్వనాధం అడిగాడు , 'నాన్నా రాత్రి నువ్వు బాబీ వాళ్ళింటి కి వెళ్ళావుటగా!' అని.
'అవును వర్షంలో తడుస్తుంటే లోపలికి పిలిచారు!'
'వాళ్ళమ్మ గారు నీకు తెలుసటగా!'
'అవును-- పూర్వం ఈ ప్రక్కన ఒక పెంకుటిల్లు వుండేది. అందులో వుండేవాళ్ళు--'
'వాళ్ళమ్మ చాలా మంచిది -- పాపం బట్టలు కుట్టి బాబీని చదివిస్తోంది -- వాళ్ళ ఇల్లు మరీ చిన్నది -- అద్దె కూడా ఎక్కువే -- ' ఎవరూ అడక్కుండానే చెప్పుకు పోయాడు విశ్వనాధం.
'నాతొ చెప్పలేదేమండీ!' అని అడగనే అడిగింది ఇందుమతి.
'చెప్పడాని కేముంది-- వాళ్ళ అవస్థ చూస్తె నాకు మనిల్లు యివ్వాలని పించింది ఇందూ! ఏమంటావ్!' అని చటుక్కున అనేశాడు మాధవరావు.
"అదా సంగతి! ఆ మాట అంటే నేను కాదంటానుటండీ! అది మనస్సులో పెట్టుకుని రాత్రి నుంచి బాధపడుతున్నారా? భలేవారండీ మీరు!' అని నిముషంలో తేల్చేసింది ఇందుమతి.
ఆఫీసుకు వెడుతూ సుబ్బలక్ష్మీ ఇంటికి వెళ్ళాడు మర్నాడు.
వచ్చిన పని చెప్పాడు క్లుప్తంగా -- "ఈవిధంగా మీ ఋణం తీర్చుకుంటున్నారా?, అని ప్రశ్నించింది సుబ్బలక్ష్మీ.
'మా బ్రతుకు లేలా గో వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఎందుకు మమ్మల్ని నవ్వుల పాలు చేస్తారు! దయచేసి మా సంగతి వొదిలెయ్యండి-' అని కూడా అన్నది.
నిన్ను నవ్వుల పాలు చేయడం నా ఆశయం కాదు సుబ్బులూ ! మీ అబ్బాయి చదువు పూర్తీ అయ్యేవరకూ మా ఇంట్లో వుండు. మా ఆవిడ చాలా మంచిది -- ఒకరి లాంటిది కాదు--' ప్రాధేయపడ్డాడు.
'విశ్వం చాలా మంచివాడమ్మా! తెలివి గలవాడు . వాడు కూడానూ ! నాకు చాలా సాయం చేస్తాడు. వెడదామమ్మా వాళ్ళింటికి! కాదనకు!' అని తల్లిని బ్రతిమిలాడాడు బాబీ.
వాడి కళ్ళల్లో దీనత్వాన్ని గుర్తించి కాబోలు సరే! అలాగే! కానీ నాకు మీరొక వాగ్దానం చేయాలి!' అన్నది. కొడుకుని ఏదో పని మీద అవతలికి పంపించి.
'తప్పకుండా! నేను ఆనాటి పరిస్థితులన్నీ నీకు వివరించి ఇప్పుడు చెప్పలేను. కానీ నిన్నిలా చూడవలసి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. నీకేదైనా సాయం చెయ్యకపోతే నా మనస్సుకి శాంతి వుండదు సుబ్బులూ!' అన్నాడు మాధవరావు ఆవేశంగా --
'మనిద్దరి పరిచయాన్ని గురించి వివరాలేమీ అక్కడి వాడికి తెలియనివ్వనని మాట యివ్వండి-- ' అన్నది సుబ్బలక్ష్మీ.
'నాకు ఆ మాత్రం తెలియదా! నీ గౌరవ మర్యాదలకు హాని కలిగే పక్షంలో నేను నిన్ను మా ఇంటికే ఆహ్వానించక పోదును-- సరే! రేపు మంచిది-- గది ఖాళీ చేయించి వుంచుతాను. సాయంత్రం రండి-- నీకు మా ఇల్లు తెలుసుగా!'
'తెలియందేముంది! ఆ ఇంటినీ అపరిసరాలనీ అరుతూన్న బాధ తిరిగి రగులుకొంటుంది. అదేగా మీరు నామీద చూపుతున్న గౌరవం!' అనబోయింది . కానీ అనలేదు--
తృప్తి నిండిన మనస్సుతో బయటికి వచ్చాడు మాధవరావు -
రఘుపతికి రాధతో పెళ్లి అని తెలిసి నప్పటి నుంచీ అతని మనస్సు సుబ్బులను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నది. ఈమాత్రం ధైర్యం తానెందుకు చేయలేక పోయాడని పదేపదే ప్రశ్నించు కున్నాడు. అప్పటి నుంచీ అతనిలో అశాంతి చెలరేగుతూనే వున్నది. ఈనాడతని మనస్సు కొంత వూరట చెందింది.
* * * *
కాలేజీ నుంచి వచ్చి అలసటగా కుర్చీ కి చెరబడిన సుమిత్ర కి రెండు ఉత్తరాలు యిచ్చింది చిట్టి. ఒక కవరు కుముదిని వ్రాసింది . హైదరాబాదు నుంచీ. రెండవది ఇన్ ల్యాండ్ కవరు. చిన్నన్నయ్య దగ్గర నుంచీ. సుమిత్రకి.

ఈసరికి నీ పరీక్షలు మొదలై వుంటాయి-- బాగా వ్రాస్తున్నా వనుకుంటాను. ఈసారి ఉత్తరంలో నీకొక ముఖ్యమైన విషయం వ్రాయదలచాను. నా కారణంగా నీ పెళ్లి ఆగిపోయిందని అందరూ అన్నందు కేమీ, నాలో నీపై గల వాత్సల్యం కొలదీ నైతే నేమీ నీకు నేను బి.ఏ వరకూ చదువు చెప్పించాలను కున్నాను. అదే విధంగా నీకు నెలనెలా , క్రమం తప్పకుండా డబ్బు పంపాను. నీకు స్కాలర్ షిప్ వచ్చిందని నువ్వు వ్రాసినా, అమ్మ పోయాక ఆవిడ మందుల ఖర్చు తగ్గింది కదా ఇంత డబ్బెందుకని నువ్వు చెప్పినా వినక, నేను నెలకింత అని తగ్గించకుండా పంపాను.
ఈ నాలుగేళ్ళల్లో నా సంసారంలో ముగ్గురు కొత్త సభ్యులు వచ్చారు. మొన్న మీ వదినకి ఆపరేషన్ చేయించినప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది. ఇక నేను కూడా పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి కదా! ఏమంటావు! పైగా నేను పంపే డబ్బుతో నువ్వు అన్నయ్య సంసారానికి ఇన్నాళ్ళూ సాయం చేశావే గానీ కాస్త సొమ్ము యినా దాచుకోలేదు -- అన్నయ్య మాత్రం ఎన్ని వెలకో ఇన్సూరెన్స్ కడుతున్నాడని తెలిసింది. మనుషుల్లో ఇన్ని మార్పు లోస్తున్నాయి కాబోలు! నీ పెళ్లి మాట అయన అసలే మర్చిపోయినట్లున్నాడు. నేను చెప్పదలచిందేమిటంటే , నువ్వు ఎం.ఏ చదివే పక్షంలో ఇక్కడి కి వచ్చి మా ఇంట్లో వుండు; లేకపోతె ఏం చెయ్యదలుచు కున్నావో వ్రాయి. ఇక నుంచీ మాత్రం నేను డబ్బు పంపలేను--
రఘుపతి.
ఈ ఉత్తరం చదివాక కుముదిని ఉత్తరం చదవాలని పించలేదుసుమిత్రకి చిన్నన్నయ్య చాలా ధైర్యంగా, తన మనస్సులో మాట సూటిగా చెప్పగల వ్యక్తీ . అతను వ్రాసిన దాంట్లో తప్పేమీ లేదు. రేపటితో పరీక్షలు అయిపోతాయి. ఇక ఏమిటి చెయ్యడం? ఇన్నాళ్ళూ ఈ డిగ్రీ గమ్యస్థానంగా పెట్టుకుని నడిచింది. ఇప్పుడిక మరొక గమ్యం వెతుక్కోవాలి.
పదిమంది ఆడపిల్లలూ ముచ్చటగా పట్టు పరికిణీలు కట్టుకుని సంక్రాంతి పేరంటం పిలవడానికి కొస్తే, చిన్నబోయిన ముఖంతో నిలబడిన సావిత్రికి కంచిపట్టు పరికిణి కొనడం, సుబ్బలక్ష్మమ్మ గారి మిషన్ మీద కుట్టు నేర్చుకుని 'మిషనుంటే నా బోటి వాళ్ళు కూడా కాస్తో కూస్తో సంపాదించవచ్చు' నని అనేక మార్లు అనుకున్న వదిన కి వాయిదాల పద్దతి మీద మిషన్ కొనివ్వడం. పిల్లలు ఫీజులు కట్టడానికి డబ్బు లేదని అన్నయ్య రెండు మూడు సార్లు అంటే తను వాళ్లకి పీజులు కట్టుకోడానికి డబ్బివ్వడం , యివేగా తను వాళ్ళకి చేసిన సహాయాలు!
'నేను చేయగలిగినంత వరకూ చేశాను-- ఇకనా పని ఐపోయింది -- నీ యిష్టం-- నీ బ్రతుకు బాట నువ్వే చూసుకో-- అన్నాడు చిన్నన్నయ్య. పెద్దన్నయ్య తన భవిష్యత్తు మాట ఏనాడో మర్చిపోయాడు. ఇప్పుడా యనకు విశ్వం చదువును గురించి ఆలోచన తప్ప మరొకటి లేనేలేదు. మిషను మీద గౌన్లు , జాకెట్లూ కుట్టి రెడి మేడ్ షాపులకి పంపి నెలకి పాతిక ముప్పై సంపాదిస్తూ వదిన బంగారం గాజులు చేయించు కుందే గానీ, 'నీకు మీ చిన్నన్నయ్య పంపిన డబ్బు నువ్వే దాచుకో సుమిత్రా! ఎందుకైనా ఉంటుంది.' అని అనలేదు.
ఇప్పుడెం చెయ్యాలన్నా దగ్గర డబ్బు లేదు --
ఉత్తరం టేబిల్ మీద పడేసి కుముదిని లేఖ విప్పింది సుమిత్ర.
డియర్ సుమిత్రా!
పరీక్షలు బాగా వ్రాశావను కుంటాను నిన్ను చూసి మూడేళ్ళు నిండాయి. ఇంకెన్నాళ్ళు కనపడకుండా వుంటావు -- ఈ సెలవులకి తప్పకుండా ఇక్కడికి రావలసింది. నీతో చాలా చెప్పాలని వుంది. ఇక్కడ ఎంతో మంది స్నేహం అయ్యారు. కానీ నిన్ను మరపించగల వాళ్ళెవరూ లేరు. ఈసారి నువ్వు రాకపోతే నాకు చాలా కోపం వస్తుంది. హైదరాబాద్ చూడని దానివి నువ్వొకతివే! నాకోసం, వూరు చూడడం కోసం తప్పక రావాలి.
కుముదిని.
ఏడాది స్నేహం తామిద్దర్నీ ఎంత గట్టిగా బంధించి వేసిందో తలుచుకుంటే ఆశ్చర్యం అనిపించింది సుమిత్రకి. ఆరోజులు జ్ఞాపకం వచ్చాయి. అయిదు నిమిషాలు మెదడు హుషారుతో నిండిపోయింది. తరువాత మళ్ళీ చిన్నన్నయ్య ఉత్తరం జ్ఞాపకం వచ్చింది.
అప్పట్లో అమ్మ పోరు భరించలేక పెద్దన్నయ్య సంబంధాల కోసం తిరిగాడు. తను చదువులో చేరడంతో పెళ్లి ప్రసక్తి అనేదే తేర వెనక్కి పోయింది. ఇప్పుడిక ఆ ప్రశ్నే లేదు. ఉన్నదల్లా రెండే మార్గాలు. చిన్నన్నయ్య దగ్గరకు వెళ్లి చదువుకోడం. ఇక్కడే వుండి ఉద్యోగం చూసుకోడం.... ఇన్నాళ్ళూ తనకోసం అన్నయ్య చాలా డబ్బు పంపాడు. ఇంకా అతన్ని కష్ట పెట్టడం తనకి ధర్మం కాదు. కనుక ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేసుకోడమే మంచిదని నిశ్చయించు కుంది సుమిత్ర.
