Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 10


    టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ రెండూ ప్యాసయింది గనుక ఉద్యోగం దొరకడం కష్టమేమీ కాదు.
    పరీక్షలు వ్రాసి యింటికి వచ్చాక పెద్దన్న అడిగాడు. 'పరీక్షలన్నీ అయిపోయాయీ కదూ! బాగానే వ్రాశావా?' అని.
    విశ్వం పి.యు.సి. వ్రాస్తున్నాడు. బాగానే చదివాడు. క్లాసు తప్పదని ఖచ్చితంగా చెబుతున్నాడు. సావిత్రి ఫిప్త్ ఫారం పరీక్షలు రేపో ఎల్లుండో మొదలౌతాయి.
    బాగా వ్రాశావా అని అడిగాడే కానీ, తరువాత ఏం చేస్తావని అతడు అడగలేదు. ఈ నాలుగేళ్ల లో మాధవరావు లో వచ్చిన మార్పు స్పష్టంగా గ్రహించింది సుమిత్ర. తలలు బ్రతికి వుండగా అతని హృదయంలో వుండే బలహీనతలు యిప్పుడు లేవు. ఇప్పుడతని ధ్యేయమల్లా ఒకటే. తన కొడుకుని తనలాగా గుమస్తాని చెయ్యకూడదు. వాడు తిండికి, బట్టకూ లోటు లేకుండా బ్రతకాలి. అంతేకాదు . తన కొడుక్కి తీసుకున్న కట్నంతో కూతురికి పెళ్లి చెయ్యాలన్న లంకె పెట్టుకో కూడదు. కూతురికి విడిగా కట్నం యిచ్చి పెళ్ళైనా చెయ్యాలి లేదా చదివించాలి. ఈ రెండు ధ్యేయాల కోసం అతను శ్రమిస్తున్నాడు.
    'నేను రేపు విశాఖ వెళ్లి చిన్నన్నయ్య ను చూసి అటునుంచే హైదరాబాద్ వెళ్ళొస్తానన్నయ్యా! కుముదిని చాలాసార్లు వ్రాసింది నన్ను రమ్మని' అని మాధవరావుతో చెప్పి ప్రయాణానికి అన్నీ సిద్దం చేసుకుంది. సేవింగ్స్ బ్యాంక్ లో మిగిలిన ఒకే ఒక్క వంద రూపాయలు డ్రా చేసుకున్నది. అదే ఇప్పుడు తనకి మిగిలిన డబ్బు. దాంతోనే రెండు ఊళ్లు తిరగాలి. పొదుపుగా ప్రయాణాలు చెయ్యాలి.
    రిక్షా ఎక్కబోతూ వుండగా ఇందుమతి వచ్చి వంద రూపాయలు చేతిలో పెట్టి 'దేనికైనా కావాలంటే దగ్గర వుంటుంది! వుంచుకో సుమిత్రా!' అన్నది ప్రేమ నిండిన కళ్ళతో చూసి.
    'నాకెందుకు వదినా? నీకేక్కడిది డబ్బు! వద్దులే ఉంచుకో!' అన్నది సుమిత్ర అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడాలో తెలియక.
    'నీ దగ్గర ఎంత డబ్బుందో నాకు తెలీదా సుమిత్రా! నాకు నువ్వెంత సహాయం చేశావో! నీకు నేనీమాత్రం చెయ్యలేనా? తీసుకో! అవసరం వుంటుంది.' అని బలవంతంగా చేతిలో పెట్టింది.
    'త్వరలో వచ్చేస్తాను వదినా?' అని మాత్రం అన్నది సుమిత్ర.
    ఆమెకి తెలియకుండానే కంఠం లో ఆర్ద్రత నిండిపోయింది.
    'నాకు సావిత్రి ఎంతో నువ్వూ అంతే సుమిత్రా! నేనెప్పుడూ నీ శ్రేయస్సు కోరుతూనే వుంటాను-- నువ్వెందుకో చాలా బాధపడుతున్నావు వారం రోజులుగా -- నేను అర్ధం చేసుకున్నాను-- నువ్వు చిన్నప్పటి నుంచీ నా దగ్గరే పెరిగావు -- త్వరగా తిరిగిరా సుమిత్రా! కష్టమో సుఖమో అందరం ఒకచోటే బ్రతుకు పంచుకుందాం -- ' అన్నది ఇందుమతి ఆవేశంగా. అలా అన్నప్పుడు ఆమె కళ్ళల్లో తిరిగిన నీటిని చూస్తూ కూర్చుండి పోయింది సుమిత్ర.
    రిక్షా కదిలి వేగం అందుకున్నది!
    'వెళ్ళగానే ఉత్తరం వ్రాయి చిన్నత్తా ! మర్చిపోకు!' అని చాలాసార్లు గుర్తు చేశాడు విశ్వం.
    తన భవిష్యత్తు ను వెతుక్కుంటూ వేడుతూన్న ప్రయాణం యిది. అనుకుంది సుమిత్ర. తన క్వాలిఫికేషన్ల కి ఏదో ఒజ ఉద్యోగం తప్పకుండా దొరికి తీరుతుందనే ధైర్యం వుంది. ఈ ప్రయాణంలో ఏదో ఒకటి సాధించుకు రావాలి. అని గట్టిగా అనుకుంది. రైలు చక్రాల చప్పుడు కూడా అలాగే ధ్వనించింది ';విజయీ భవ!' అన్నట్లు.
    యౌవనం ఆమెలో వైవాహిక జీవితం కావాలనే తీయని కోరికలను రేపడం లేదు. జీవితంలో తనకి తానుగా స్థిర పడాలనే ఆకాంక్ష ఒక్కటే వున్నది.
    "ఏం సుమిత్రా! వచ్చేశావా,' అని స్టేషన్లో రాధ పలకరించినప్పుడు . 'అవును వదినా! నిన్ను చూడాలని, మీతో కలసి ఒక వారం రోజులైనా వుండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకే వొచ్చాను! పిల్లలేరీ!' అంటూ ప్లాట్ ఫారం అంతా వెతికింది సుమిత్ర.
    'వారమేమిటి? నువ్వు మా దగ్గర వుండి ఎం.ఏ. చదువుకోకూడదూ! నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాం' అన్నది రాధ గబగబా.
    'ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం వదినా!' అని మౌనం వహించింది సుమిత్రా.
    'ఇక్కడ వుండకూడదా సుమిత్రా!' అన్నాడు రఘుపతి , సునిత్ర వెళ్ళే రోజున.
    'నువ్విప్పటికే చాలా కష్ట పడ్డా వన్నయ్యా! ఇంకా నిన్ను శ్రమ పెట్టడం ధర్మం కాదు. చదువుకి అంతెం వుంది! నేను ఇక ఉద్యోగం చెయ్యదలుచుకున్నాను. నీకు వీలుంటే సహాయం చెయ్యి.' అన్నది సుమిత్ర స్థిరంగా , ఆత్మ విశ్వాసం నిండిన కంఠం తో.
    'ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొనే వాళ్ళంటే నాకు చాలా యిష్టం చెల్లాయ్! నేనెలా ఈ స్థితికి వచ్చానో నీకు తెలుసుగా! నువ్వూ అలాగే కష్టపడి సంఘంలో గౌరవనీయమైన వ్యక్తిగా స్థానం సంపాదించుకో! ఇదే నా కోరిక!' అన్నాడు రఘుపతి.
    ముడురునీలం జరీ అంచున్న లేత నీలం పట్టు చీరే, ముదురు నీలం జాకెట్టు బుట్ట నిండా పళ్ళూ యిచ్చి రైలేక్కించింది రాధ.
    "విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్' అన్నది.
    'మళ్ళీ బెజవాడ లో దిగవుగా! 'అంటూ హైదరాబాద్ కి టికెట్ కొనిచ్చాడు రఘుపతి.
    'నా సంసారం , డానికి తగ్గ ఖర్చూ చూశావుగా! నామీదెం కోపం పెట్టుకోవని నమ్ముతున్నాను' అన్నాడు చివరికి తల వంచుకుని.
    'ఇది మరీ బావుంది! నీమీద నాకేం కోపం అన్నయ్యా! నువ్వంటే చాలా గౌరవం' అన్నది సుమిత్ర ఆప్యాయత నిండిన అశ్రు బిందువులు తుడుచుకుంటూ.
    ఆత్మబంధువులు అనబడేవారు దూషించినా కన్నీరు వస్తుంది. హృదయాన్ని తాకేటట్టు చల్లగా మాట్లాడినా కన్నీరు వస్తుంది. అందుకే కన్నీటికి అంత విలువ.
    రైలు కదిలింది. రైలుతో పాటు చిన్నన్నయ్య జీవితం కళ్ళకి కట్టింది.
    మొదటి నుంచీ వాడి జీవితమంతా పట్టుదలతోనే గడిచింది. ఎంత పట్టుదలో అంత జాలి గలవాడు వాడు. అందుకే కాలేజీ ఫీజుల కోసం అన్నయ్య ని అడగకుండా ట్యూషన్లు కుదుర్చుకునే వాడు.
    చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాడు. కొట్లల్లో ఎకౌంట్స్ చూసి పెట్టేవాడు. ఇవన్నీ ఇలా వుంచి సినిమాలు చూసేవాడు.  పుస్తకాలూ చదివేవాడు. వదినకి కాఫీ చేసిచ్చేవాడు. అమ్మకి పప్పు రుబ్బి పెట్టేవాడు. తనకి నోట్స్ లు వ్రాసిచ్చేవాడు. వాడి ఉత్సాహం చూస్తె తనకే ఆశ్చర్యం కలుగుతూ వుండేది.
    'మనిషికి ఉత్సాహం శక్తి నిస్తుంది! బ్రతకాలి, ఇంకా బాగా బ్రతకాలి అన్న ఆశ బలాన్ని యిస్తుంది. ఈ రెండింటి సాయంతో అనేకమంది జీవితంలో ఔనత్యాన్ని సాధించ గలుగుతున్నారు.' అనేవాడు. ఉపన్యాసాలు యివ్వడం చాలా సరదా!
    ఎం.ఎస్సీ చదవడానికి వాడు బయలుదేరిన రోజున అమ్మ దిగులుపడిపోయి అడిగింది. వున్న వూరు గనుక ఇంతవరకూ లాక్కోచ్చావు నాయనా! అంత చదువు ఎలా చదవగలవు! నీకు అన్నయ్య అంత డబ్బు ఎలా పంపుతాడు! ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదు?' అని బ్రతిమిలాడింది.
    'సంకల్ప బలంతో ఏదైనా సాధించగలననే ధైర్యం నాకుంది. నేనెలాగో చదవగలను లే అమ్మా! నీకేం బెంగ వద్దు-' అని చెప్పి వెళ్ళిపోయాడు రఘుపతి.
    అలాగే వాడి చదువు అయిపొయింది. ఉద్యోగమూ వచ్చింది. సహా ధర్మ చారిణి కూడా దొరికింది. పాలూ, తేనే సంపాదించుకుని కలబోసుకుని తాగేస్తున్నాడు. అదృష్టవంతుడు.
    సుమిత్ర నవ్వుకుంది. తనుగాని అసూయ పడడం లేదు కదా చిన్నన్నయ్య ని చూసి! అవును అదృష్ట వంతులను చూసి అసూయ పడడం మాత్రం అసహజమేం కాదే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS