Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 8


    వున్నది ఒకటే గది. అందులోనే వంట- భోజనాలు, పడకలు, అక్కడే బట్టలు కుట్టే మిషన్. పిల్లవాడు చదువుకునే టేబిల్ గది చూస్తె అక్కడ వుండే మనుష్యుల ఆర్ధిక పరిస్థితి అవగాహన అవుతోంది.
    లాంతరు పెద్దది చేసి టేబిల్ మీద పెట్టింది ఆవిడ. వయస్సు నలభై వుండవచ్చు. పాత చీరే కట్టుకుని ముతక జాకెట్టు వేసుకుంది. నుదుట తిలకం లేదు. వెంట్రుకలు దువ్వుకుని ముడి వేసుకుంది. చేతులకి గాజులు లేవు.
    'మీ ఇల్లెక్కడో చెప్పారు కాదు!' అన్నది కుర్చీ తుడిచి మాధవరావు దగ్గరకు జరిపి.
    'సత్యనారాయణ పురం లో -- ' అన్నాడు కుర్చుని తల తుడుచుకుంటూ.
    'ఇప్పుడు అంత దూరం వెళ్ళాలన్న మాట -!'
    ఆ గొంతు ఎక్కడో విన్నట్టే వుంది. కాదు-- ఆ గొంతు తను విన్నప్పటి గొంతు కాదు. చాలా మార్పులు వచ్చాయి. లాంతరు వెలుగులో ఆవిడ ముఖాన్ని మళ్ళీ పరీక్షగా చూశాడు. కాలం తెచ్చిన మార్పు స్పష్టంగా కనపడుతున్న , గతించిన సౌందర్య వైభవం తాలుకూ స్మృతి చిహ్నాలు అక్కడక్కడా మిగిలే వున్నాయి ఆవిడ ముఖంలో -- ఉత్కంట ను ఆపుకోలేక , 'మీరేమిటో -- తెలుసుకోవచ్చునా ? మిమ్మల్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం!' అన్నాడు.
    ఆవిడ చాకితురాలై వెనక్కి తిరిగి , "నా పేరు సుబ్బలక్ష్మీ -- మాది మొదటి నుంచీ ఈ వూరే -- ఆర్ధిక పరిస్థితుల మార్పులను బట్టి రకరకాల యిళ్ళల్లో నివాసం చేస్తున్నాను--' అన్నది నిర్లిప్తత నిండిన కంఠం తో.
    'నన్ను గుర్తుపట్టారా?' అన్నప్పుడు మాధవరావు కంఠం వణికింది.
    "మీరు -- మీరు -- ' తడబడుతూ అడిగింది.
    "నేను మాధవరావును-- ఇరవై ఏళ్ళ నాడు మనం ప్రక్క ప్రక్క ఇళ్ళల్లో వుండేవాళ్ళం -' కిటికీ లో నుంచీ బయటికి చూస్తూ నెమ్మదిగా అన్నాడు.
    "మీరా ?'
    ఆవిడ గొంతులో ఆవేదన, ఆశ్చర్యం, సంతోషం, విచారం అన్నీ ఒక్కసారిగా కదలడం గమనించాడు మాధవరావు. కోపం లేదు అని కూడా గుర్తించి ధైర్యం తెచ్చుకుంటూ, 'మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు ' అన్నాడు పశ్చాత్తాపంతో.'
    'మనం అనుకున్నవన్నీ జరగవు -- చూశారుగా ఇదీ నా జీవితం -- పగలంతా ఈ మిషన్ కుదతాను -- అబ్బాయి ఫిప్ట్ ఫారం చదువుతున్నాడు - ఇదే మాకు జీవనాధారం --'
    'నీకెప్పుడు పెళ్లయింది? భర్త ఎలా పోయాడు? నీకేం ఆస్తి లేదా!' మొదలైన ప్రశ్నలన్నీ కంఠం లో కదిలాయి గానీ ఒక్కటీ బయటికి రాలేదు. 'ఇదంతా నీవల్లనే నిజంగా నీవల్లనే' అని ఆవిడ అంటుందేమోనని ఆశించాడు. ఆవిడ ఆ మాట అంటే ఎంత బావుండునూ! అని కూడా అనుకున్నాడు. కాని సుబ్బులు-- కాదు సుబ్బలక్ష్మీ ఆ మాట అనలేదు--
    కొంచెం సేపు మౌనంగా వుండిపోయి 'మీకెంత మంది పిల్లలు? అమ్మగారు బావున్నారా ?' అనడిగింది.
    'అమ్మ పోయింది. ముగ్గురు పిల్లలు-- ఒక అబ్బాయి-- ఇద్దరమ్మాయిలు -- మా చెల్లెలు బి.ఏ చదువుతోంది-- తమ్ముడికి పెళ్లైంది . విశాఖ లో వుంటాడు-- అని చెప్పేసి ఇక చాలా? అన్నట్లు చూశాడు.
    కుర్రవాడు చదువుకోడం మానుకుని తమనే గమనిస్తున్నాడని తెలుసుకుంది కాబోలు 'చదువుకో బాచీ!' అని హెచ్చరించింది.
    'ఈ ఇంటికి అద్దె ఎంత?' అన్నాడు ఏదో ఒకటి అనాలని.
    'పదిహేను రూపాయలు కట్టడం చాలా కష్టంగా వుంది--' అన్నది.
    'మిషన్ కుట్టగా వచ్చిన కొద్దిపాటి డబ్బులో తిండి, కుర్రవాడి చదువూ అన్నీ జరగాలన్న మాట.' మాధవరావు ఆవిడ వైపు జాలిగా చూశాడు.
    బయట వర్షం ఉదృతం తగ్గింది. సన్నగా జల్లు పడుతోంది.
    'కాసేపు కూర్చోండి -- తడిసిపోతారు-- అన్నాడు బాచీ మాధవరావు ఉద్దేశ్యం కనిపెట్టి.
    "ఏ స్కూల్లో చదువుతున్నావ్ బాబూ నువ్వు!' అన్నాడు మాధవరావు.
    'ఎస్కే. పి.వి.వి.
    'మా అబ్బాయి కూడా ఆక్కడే -- వాడు ఫిప్ట్ ఫారం చదువుతున్నాడు. నీకు తెలిసే వుంటుంది. వాడి పేరు విశ్వనాధం -- అన్నాడు ఉత్సాహంగా.
    "ఎవరు? సి. విశ్వనాధమేనా?'
    'అవును -- కాంపోజిట్ మాధమేటిక్స్ తీసుకున్నాడు--'
    'ఓ! నాకు బాగా తెలుసండీ-- సత్యనారాయణ పురం నుంచీ వస్తాడు. నాకు తెలీని ప్రాబ్లమ్స్ చెబుతూ వుంటాడు--' బాచీ ఉత్సాహంగా చెప్పాడు.
    సుబ్బలక్ష్మీ తలవంచుకుని జాకెట్ల కు గుండీలు కుడుతూ కూర్చుంది......
    వర్షం తగ్గేవరకూ బాబీతో మాట్లాడి 'నేను వస్తానండీ!' అని లేచాడు మాధవరావు--
    'మంచిది!' అన్నది సుబ్బలక్ష్మీ ఏమీ పట్టనట్లు తల వంచుకుని.
    'జరిగిందంతా మర్చిపో సుబ్బులూ-- నన్ను క్షమించు -- నీకు చాలా అన్యాయం జరిగింది-- నీకేదైనా సాయం కావాలంటే అడుగు--' అని చెప్పాలని అతని హృదయం ఆరాట పడింది. కానీ ఆ అవకాశం ఆవిడ అతనికి యివ్వలేదు -- కనీసం తాను వెడుతున్నప్పుడు కూడా ఆవిడ లేచి బయటికి రాలేదు. చిత్రమైన ఆలోచనలు నిండిన మనస్సుతో ఇంటి త్రోవ పట్టాడు మాధవరావు. అతని మనస్సులోనే భావాలన్నీ ఎవరితోనైనా చెప్పుకోవాలనే ఆత్రుత కలిగింది. వెళ్ళగానే తువ్వాల అందించి మాట్లాడిన సుమిత్రతోనూ, భోజనం పెట్టి ఎదురుగా పీట వేసుకుని కూర్చున్న ఇందుమతి తోనూ చెప్పాలని మనస్సు తొందర పడింది. తమాయించు కున్నాడు. సుబ్బలక్ష్మీ కి ఏదైనా సహాయం చెయ్యాలనే సంకల్పం దృడ తరమైంది. ఎలా? ఏవిధంగా సహాయం చెయ్యగలడు!
    'ఏమిటండీ దీర్గాలోచన? రహస్యమా?" అని హాస్య మాడింది భార్య.
    వివాహమైనప్పటి నుంచీ తనకే సమస్య వచ్చినా ఆమెతో చెప్పకుండా వుండేవాడు కాదు అతను.
    నిజానికి ఏ సమస్యల కైనా పరిష్కారాలు తనకన్నా ఆమె బాగా ఆలోచించ గలదు. కానీ ఈ సమస్య వేరు. అపార్దానికి దారి తీసే అవకాశం యిందులో చాలా వుంది.
    అతనికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. బారెడు జడకి కుప్పీలు వేసుకుని పువ్వుల పరికిణీ, ఓణీ వేసుకుని చెంగున గెంతే సుబ్బులు కదులుతోంది కళ్ళముందు. చెంపకు చేరెడు కళ్ళు, నున్నటి బుగ్గలు, వొత్తుగా, మెత్తగా నల్లగా వుండే అందమైన జుత్తు, నవ్వే పెదవులు-- సుబ్బు అంటే ఎవరు యిష్టపడరు?
    రోజూ కిటికీ లో అడ్డం పెట్టుకుని తల దువ్వుకుంటూ ప్రక్క పెరట్లో నీళ్ళు తోడుతూన్న సుబ్బుల్ని చూస్తూ నిలబడి పోయేవాడు. చేతుల నిండుగా మట్టి గాజులు  గల గల లాడించుకుంటూ తిరిగేది సుబ్బులు . విమల కోసం అప్పుడప్పుడూ వచ్చేది. వరండాలో తనని చూసి టక్కున ఆగిపోయి వెనక్కి తిరిగేది!
    యుక్త వయస్సు లో మనసెప్పుడూ మృదువుగా వుంటుంది. అందమైన ఆలోచనలు చేస్తుంది. జాలితో కరిగిపోతుంది. ప్రేమతో పరుగులు పెడుతుంది. ఆవేశంతో ఎగిరి పడుతుంది. సుబ్బులుకు తండ్రి పెళ్లి చేయలేక పోతున్నాడనీ, వాళ్ళ కుటుంబం గడవడమే కష్టంగా వుందనీ చెప్పేది విమల. అలా చెప్పినప్పుడు మాధవరావు "నేను కట్నం లేకుండా సుబ్బుల్ని చేసుకుంటాను.' అనాలనుకునేవాడు , అనలేక పోయేవాడు.
    ఓరోజు మధ్యాహ్నం విమల , అమ్మా ఎక్కడికో వెళ్ళారు తానొక్కడే వున్నాడు. ఇంట్లో. సుబ్బులు విమల కోసం వచ్చి వెనుదిరిగి పోబోయింది.
    'సుబ్బులూ నీతో మాట్లాడాలి. అగు-' అన్నాడు.
    'మీతో మాట్లాడితే మా అమ్మ తిడుతుంది' అమాయకంగా అనేసింది సుబ్బులు .
    'ఫర్వాలేదులే -- కూర్చో -'
    'చెప్పండి -- వినేసి పోతాను-' గుమ్మం దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ అడిగింది.
    'నేనంటే నీ కిష్టమేనా?' ఏం మాట్లాడాలో తెలీక అలా అడిగాడు.
    'ఏమో నాకేం తెలుసు ! నే వెడతాను --' భయంగా కదిలింది సుబ్బులు.
    'నిన్ను నేనేం చెయ్యను-- ఇలా కూర్చో ' చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చో పెట్టి .'
    'నిన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నా నిజం చెప్పు-- నేనంటే యిష్టం లేడూ?' అనడిగాడు ధైర్యంగా.
    ఆ అమ్మాయి తనవంక విప్పారిత నేత్రాలతో చూసింది కొంచెం సేపు. తరువాత కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని, వొంగి తన పాదాలను కళ్ళ కద్దుకుని పరుగెత్తు కుంటూ వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS