Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 9


    "ఏమిటీ? పెద్దయ్యేదో చేస్తున్నాడు. ఓహో! గోమారి కి మందు రాస్తున్నాడా? నా దగ్గర గోమారికి మంచి మందుంది. ఇదిగో , ఇంటి కేళుతూనే నరిసి గానితో పంపిస్తాను. అదేం లాభం లేదు, రావయ్యా! మన్నాటికి మామూలే గానీ! అది సరే, ఎల్లయ్య నీ మెట్ట కొమ్ము కొడంటే పడి చస్తున్నాడు. ఆమని కసాలా అదీ గాక మోజు పడిన గొడ్డు! మంచి ధర పలుకుతుంది. నీకా, పని మూడు బాగా లొంగిపోయింది. ఇట్లారా.... రా, మాట్లాడుకుందాం....' అనంతయ్య నూ లాక్కున్నాడు. ఇంకో దిక్కు చూశాడు. 'అసలు సంగతి మరిచి పోయినాను. భాగీరధమ్మ!' కేకవేశాడు.
    అసలు సంగతి అది కాదని తెలుసు. అయినా, రంగయ్య ను సూటిగా విషయానికి మరల్చడం సాధ్యం కాదు. కొండ శిఖరాని కెక్కించి గానీ, కింద తోసెయ్యడు. గుమ్మం లో కొచ్చిన భాగీరధమ్మను చూడకుండానే చూశాడు.
    "సందకాడ వచ్చి చెబుదామా అనుకున్నాను. నిద్దుర పొద్దున్న ఇప్పుడెందు కొద్దు అనుకున్నాను. అది సరే! మొన్న మాలచ్చిమినీ దొడ్లో తోలిందెవరో తెలుసునా మీకు? తెల్దు . తాళం చెవుల్లెవనడం నిజమా! అబద్దమా!-- అదీ తెల్దు. సరే, ఆవు నసలు పొద్దున్న అనసూయమ్మ బైటికి తోలిందని గూడా మీకు తెల్దు గదూ?'
    లేచి గుమ్మం బైటికి వెళ్లి, వీధి లో తాంబూలం ఉమ్మేసి, కళ్ళకు చేయడ్డం పెట్టుకుని అటూ ఇటూ నింపాది గా చూసి లోపలి కోస్తూ కేకేశాడు.
    "సరస్వతమ్మ! గ్లాసుడు నీళ్ళు తే తల్లీ! నోరు కడుక్కుంటాను...'
    అందరి వైపూ దొంగగా చూస్తున్నాడు. లోపల నవ్వుకుంటున్నాడు. గ్లాసేత్తి పట్టుకుని నోట్లో గటగట పోసుకుంటున్నాడు. గొంతు క్రోవి విచిత్రంగా కిందికి పైకి కదులుతుంది. సరస్వతి చోద్యంగా అక్కడ చూస్తుంది. రంగయ్య సరస్వతి మేడలో మెరుస్తున్న హారం కేసి చూస్తున్నాడు. పాపం! ఆ పచ్చని కంఠం మీద హారం ఇక ఉండదు-- అది సరస్వతి కి తెలీదిప్పటికి.
    గ్లాసు కింద బెడుతూ అన్నాడు.
    "అన్నీ ముత్యాలే! బంగారైనా ఎంతుంటుంది? మహా అయితే అయిదొందలు, లేదంటే ఆరొందల ఖరీదు. అంత మాత్రానికే ఆ దెబ్బే గనుక తగరాని చోట తగిలి, ఆమె హరీ మనుంటే ....ఛీ! ఛీ!'
    అంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు!
    ఆ మాటల కర్ధమేమిటి? అపస్మారకంలో ఉన్నాడా? ఆశ్చర్యంగా , భయంగా చూశారు. రంగయ్య సంతోషం తురీయావస్థకు చేరుకుంది. గోడ కానుకుని కూర్చున్నాడు. మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుని, పంచ తంత్రం లో విష్ణుశర్మ రాజకుమారులకు కధ చెప్పిన పక్కీలో ప్రారంభించాడు.
    'సుబ్బరామయ్య రాత్రి పెళ్లాన్ని కొట్టినాడు. ఆమె దిమ్మ దిరిగి గంటసేపు పలక్కుండా పడిపోయింది.'
    'ఎందుకు? ఏం జరిగింది?'
    అప్పుడు కధ ప్రారంభించాడు కస్తూరి రంగయ్య. 'సరస్వతమ్మ ను కోడలుగా ఖాయం చేసి పది రోజులు కాలేదు గదా! ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది గదా! ఆరోజూ నేను అనుకున్నాను. సుబ్బరామయ్య ఇంట్లో సరస్వతమ్మ కలకల్లాడుతోంటే ఈ పాడు కళ్ళతో పొద్దున్నే చూస్తూ ఉండవచ్చు గదా అనుకున్నాను. అది సరే, నిన్న నేమయిందంటే -- అప్పుడే అన్నం తిని బీడీ కాల్చుకుని అట్లా వసారా లో కూచున్నా! గూనేంక డోచ్చి సుబ్బరామయ్య రమ్మంటున్నాడంటే ,  పోక తప్పుతుందా? పోయినాను. పోతూనే, అగ్గురారం సంబంధం ఎత్తినాడయ్యా! నేనేమో రాధాక్రిష్ణ కనుకున్నాను. సరే, పనిలో పని, ఇద్దరు కోడళ్ళ నూ తెచ్చుకోవాలను కుంటున్నాడెమో మంచిదే ననుకున్నాను. సోమవారం నాడు కనుక్కుని వస్తానని మాటిచ్చాను. లేచి వచ్చేటప్పుడు నాకేమనిపించిందో , నా నోరు పాడు గానూ, చెప్పొద్దూ! అనుమానపు ముండా కొడుకును! "రాధాక్రిష్ణకే గదూ!" అన్నాను. "కాదు సూర్యన్నారాయణ" కన్నాడు. కళ్ళు తేలేశాను. అదేమిటని అడుగుదామానుకునే సరికి అక్కడ లేడు మనిషి...రాత్రేమయిందంటే -- లచ్చిగా డోచ్చి కొడుకు పెళ్ళి చేసుకొవాల , మూన్నూర్లు అప్పియ్యమని పట్టినాడు. లచ్చి గాని కొడుకు జానెడు లేడు వాని కప్పుడే పెళ్ళంట! చూడు! చూడు ! నా కొడుకుల యవ్వారం! పోనీ, మన కెందుకు? జానేడుండనీ , బెత్తేడుండనీ అనుకుంటే, రైతులే అప్పులు తీర్చుకోలేక భూము లమ్ముకుంటుంటే నీడేట్లా తీరుస్తాడు! కూలికి పొతే కుండ గాలాల, లేకపోతె ఎండగాలాల. వల్ల గాదంటే , కాళ్ళు పట్టుకుంటాడు. సరే! చెప్పొద్దూ! పాడు కనికరం ముండా కొడుకును. అందులో పెండ్లి కార్యం, ఆ గొడవంతా అయ్యేటప్పటికి గోరకోళ్ళు నడినెత్తి కొచ్చినాయి. ముత్యాల మంచం ఒరిగింది. సుబ్బరామయ్య ఇంట్లోంచి ఘోల్లున ఏడ్పు! మీ సంబంధ మాకక్కర లేదని చెప్పి, మెళ్ళో వేసిన హారం మళ్ళీ తెమ్మంటాడు మొగుడు; వల్ల కాదంటుంది పెళ్ళాం! మాటామాటా పెరిగినట్లుంది! చేయి చేసుకున్నాడు. సుబ్బరామయ్య తెలివి సూడండయ్యా!
    అనసూయమ్మ నొచ్చి హారమడిగి రామ్మనక పోతేనేం/ అసలు బంగార నోద్దాన్నాక ఆ వెధవ హార మెవరి క్కావాల? మన ముంచుకుంటామా? ఆహా, మనకు మాత్రం సిగ్గూ, శరమూ లేవా? అని. అంతమాత్రం తెలీదూ------ ఎడం చేత ఇసిరి పారేస్తామని-------?' రంగయ్య కోపంగా ముఖం పెట్టుకున్నాడు.
    ఒకర్నొకరు పిచ్చివాళ్ళ లా చూసుకున్నారు.
    "తాంబూలం ఇచ్చేశాను, తన్నుకు చావం"డన్నట్లు--రంగయ్య వేదాంతి లా పై కప్పు కేసి చూస్తున్నాడు. ఎవ్వరేం మాట్లాడాలో తోచలేదు. రంగయ్య లేచి పై పంచె విదిలించుకుని అన్నాడు; 'నేను పోయోస్తాను, మీరేం భయపడొద్దు! సుబ్బరామయ్య తో నేను మాట్లాడి చూస్తానులే! తలలో పురుగులన్నీ ఒకచోట చేరినప్పుడు మాట్లాడాల! లేకపోతె తిక్కమనిషి! ఇదే మన్నా సంబంధమా , సంత బేరమా'? ఖాయం చేసుకుని మానుకుంటే రేపెవరేనా ఎట్లా వస్తారు? అధవా వచ్చినా, జరిగింది తెలుస్తుంది గదా? ఏమయ్యా! ఫలానా వాళ్ళు ఎందుకు మానుకున్నారని నన్నడిగితే నిజం వాళ్ళ ముఖాన కొడతా ననుకో! అదే ఎవర్నన్నా అడిగితె , నాకేమీ తెలియదయ్యాని ఆ గాడ్ది కోడుకంటాడా? అనడు....ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని .....అయ్యా! ఆడపిల్ల సంబంధం సజావుగా లేకుంటే ఇన్ని సిక్కులు. మీ కెందుకు? మీరుండండి....నేనున్నాగదా? నేనింకా సావలేదు గదా! మరెందుకు మీకు భయం?....'
    కోపం వచ్చినా , రంగయ్య నేం చెయ్యాలో తెలియదు.సరస్వతి తల తిప్పుకుని లోపలి కెళ్లాబోయింది . మెడ చుట్టూ చల్లగా తాకుతూ సర్ప పరిష్వంగం లా ఉన్న హారం!
    'రంగయ్యా!' మెట్లు దిగుతున్న రంగయ్య వెనక్కోచ్చాడు. విషాదం నటించాడు.
    'వద్దు, సరస్వతమ్మా! నా చేతుల్తో తీసుకపోలేను.'
    "ఫరవాలేదు, రంగయ్యా! ఇది మాకు సహాయం చేయటమే!'
    'సరస్వతీ!' అంది భాగీరధమ్మ బాధతో మందలిస్తున్నట్లు.
    'ఈ హారం మనది కాదమ్మా, సుబ్బరామయ్య గారిది....' స్తిమితంగా చిరునవ్వుతో.
    'నువ్వెళ్ళు , రంగయ్యా ! నువ్వేం చేస్తావ్?'
    'అంతే , తల్లీ! అంతే! నేనే కాదు, ఎవరం ఏం జేయ్యలెం! అయినా, నేనోక్కసారి...'
    'ఏమీ వద్దు....'
    'వాడెక్కడ రాసి పెట్టి ఉంటె అక్కడ జరుగుతుంది.' వెళ్ళిపోయాడు నెమ్మదిగా.
    'తొందర పడ్డామేమో , సరస్వతీ?' అన్నాడనంతయ్య.      
    "తొందరా! నాయనా! నువ్వోకసారేమన్నావు! పౌరుష జ్ఞాన కీర్తుల పరగే నేవీ, వాని సంపద ఒక పూట యైన జాలు! జ్ఞానాని కంటే , కీర్తి కంటే పౌరుషాన్ని ముందు చేర్చటం కేవలం పాద పూరణం కోసం కాదు. ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో కూడుకున్న పౌరుషానికి ప్రధమ స్థాన మిచ్చి తీరా లన్నావు."
    'కానీ, రంగయ్య మాటల్లో ఎంత నిజముందో మనకు తెలీదు.'
    'నిజమే ఉండొచ్చు.' వాసవి.
    'నీకెట్లా తెలుసు?'
    వాసవి నిట్టూర్చి , ఆరోజు జరిగిన సంగతి ప్రారంభించాడు. పగ్గాల కోసం వచ్చిన నన్నయ్య, ఆ విషయం ఈవేళ ఎందుకొస్తుంది? అన్న కుతూహలంతో ఆగిపోయాడు. ఎందుకో అంతా దిగులుగా కనిపించారు. "పొద్దున్నే రంగయ్యేందు కొచ్చినాడు? అరె! సరస్వతమ్మ మెళ్ళో హారం ఏమైంది/ అర్ధమైంది. ఒక్క నిమిషం ఊపిరాడనట్లయింది. ఎంతపని జరిగింది! ఇప్పటి దాకా అసలా ఆలోచనే లేదు. రోజూ సరస్వతమ్మ పెళ్లి నాడు ఎంత సంబరంగా ఉంటుందో తలుచుకుంటున్నాడు. పది రోజుల్నుంచీ ఆమెను చూస్తుంటే కడుపు నిండి పోతుంది. ఇప్పుడెట్లా ? ఎంతపని జరిగిపోయింది! భాగీరధమ్మ ముఖం చూస్తుంటే , తన ముఖం మీద ఉమ్మేసినా తప్పులేదు అనిపిస్తుంది. ఆరోజు సిన్నయ్య ఇందుకేనేమో సుబ్బరామయ్య దౌర్జన్యం సూపుతున్నా నోరెత్తలేదు. తన కంత మాత్రం తెలియక పోయే! లేకపోతె పెద్ద రైతు ఊరికి పెసిలెంటు , తన అసాములతో సంబంధం కలుపుకుంటున్న మనిషి అయన! తను జీతగాడు , మాదిగేనాయలు ఎదిరిచ్చడమా? తప్పే! తప్పే!అందుకు సరస్వతమ్మేం జేసింది? తనను నిలబెట్టి తోలోలి]చెయ్యాలసింది. చెప్పు తీసుకుని కొట్టినా బాగుండు!'
    నన్నయ్యకు తను మిద్దె సోమిగాణ్ణి 'కుక్కల్లా బతుకుతా మంటున్నారు.' అన్నమాట జ్ఞాపక మొచ్చింది. 'తను కుక్కలా గూడా బ్రతకలేక పోయాడు. సి! సి! తిన్న ఇంటికే బాధ తెచ్చి పెట్టినాడు. సోమి గాని, కేదో అన్యాయం జరుగుతుందని ఆక్రోశపడినాడు గానీ, ఇప్పేడెంత అన్యాయం సరస్వతమ్మ కు జరిగింది?'
    'అయ్యా! ఇదంతా నా వల్ల జరిగింది....' కంఠం వణుకుతుంది. అనంతయ్య లేచి వచ్చి నన్నయ్య ముఖం లోకి చూశాడు. నన్నయ్య తల దించుకున్నాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాడు. ఒక్క దెబ్బయినా ఒంటి మీద పడందే , కనీసం తిట్లన్నా తినందే మనసులో బాధ ఎట్లా తీరేది?
    'ఈ బండికి పెసరగట్టె అంతా వస్తుందా?'
    నన్నయ్య సోద్యంగా చూశాడు. ఈ లోకం వేరు. సంకొంచించకుండా ఈ లోకం లోకి రావడానికి ఇప్పుడు తనవల్ల కాలేదు. ఏదో అనబోయాడు.
    "పోవూ! ఆకలేస్తుందా? అన్నం తింటావా?"
    నన్నయ్య ఆ ప్రయత్నంగానే నవ్వాడు. అరగంట క్రితమే నన్నయ్య చద్ది దాని వెళ్ళిపోయాడు, అనంతయ్య చూస్తుండగానే! అదీ నవ్వుకి కారణం. ఆ కదిలే కన్నీళ్ళ లో నవ్వుల విద్యుత్తు వెలిగింది. వాసవి నవ్వాడు. సరస్వతి నవ్వింది. నవ్వలేకపోయింది భాగీరధమ్మ ఒక్కతే! నన్నయ్య వెళ్ళిపోయాడు.
    'సంబంధం కలుపుకోవడానికి మానవత్వం విడిచేయ్య వలసిన అవసరం రాకూడదు.....'
    'అంతేకాదు. వచ్చే మొగుడి కోసం ఉన్న ఆత్మాభిమానం వదులుకోకూడదు...'
    'మీ అమ్మను చూడండి!' అన్నట్లు సైగ చేశాడనంతయ్య. ముగ్గురూ ముసిముసిగా నవ్వుకున్నారు. భాగీరధమ్మ కు కోపమొచ్చింది.
    'ఏళ్ళు వచ్చినాయి గానీ, అంతా పిల్ల చేష్టలు! వీళ్ళలో పిల్లలెవరు? పెద్ద లెవరు?'
     'అదీ తెలీదూ? పిల్లలం మన మిద్దరమేననీ!' అన్నాడనంతయ్య.
    వాళ్ళిద్దరూ పక్కున నవ్వారు. భాగీరధమ్మ కింకా కోప మొచ్చి లోపలికి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS