పంట కళ్లం! ఒక వేపున వేరుశనగ కట్టే వామి! దాని చుట్టూ వరసగా కూర్చుని కాయలు కోస్తున్న వాళ్లు! కొంచెం దూరంలో ఎండ కడ్డంగా, నెరవాలు కట్టే మీద అన్చిన తడికెల కింద రెండు మూడేళ్ళ పిల్లలు! పాలుతాగే చంటి పిల్లలు మంచానికి కట్టిన పాత కొకల్లో రెండు చొప్ప కట్ట లానించి నిలబెట్టిన , వరి గడ్డి శయ్యం పిన; ఎడ్చేవాళ్ళు, తన్నుకుంటూ బూతులు అద్భుతంగా అభ్యాసం చేస్తూన్న వాళ్లు, కాయలు జోళ్ళు కారెట్లు నముకుతున్న వాళ్ళు, చీమిడి కారుతున్న వాళ్లు , చింకి పాతల వాళ్లు.... వీళ్ళ గొడవ పెద్దలు పట్టించుకోవడమే లేదు. వాళ్ళ ఆత్రం వాళ్ళది! డబ్బా కాయలు కొస్తే ఆరణాల కూలి! రెండు చేతులా కొస్తే , పొద్దు గూకేతలకి గానీ ఆ రెండు డబ్బా కాయలు కుప్పబడవు. కూటికి , పిల్ల దానికి పాలివ్వడానికి , దానికీ, దీనికీ లేస్తే ఆ కాయలు కావు. మధ్యాహ్నమూ కూడు తిని, రాత్రికి తినాలంటే ఆ ముప్పావలా డబ్బు ఏ మూలకూ రాదు. తప్పనిసరిగా మధ్యాహ్నం తిండి తలుచుకోకూడదు! ఆకలేసినప్పుడు కడుపు పట్టినన్ని నీళ్లు! అప్పుడప్పుడు రైతులు చూడకుండా వేరు సెనక్కాయలు నములుతూ ఉండటం! ఈ కూలి అన్యాయం, పొద్దు పొడిచిన కాడి నుంచీ పొద్దు గూకే దాకా వచ్చినా, కూలి ముప్పావలా! ఇదేమయ్యా , మారాజా! అంటే రైతు గోడు రైతుది.
'ఈ కాలంలో రైతుల కంటే కూలోల్లే మేలు! రైతు పాణం పోయేప్పుడు కూలి గిట్టుబాటు ఏ మాలోచిస్తాడు? నిజమే! డబ్బాకు ఆరణాలు అన్యాయమే! అయితే ఏం చెయ్యాల? ఇత్తనానికి కాయలు కొనేప్పుడు బస్తా డెబ్బయి రూపాయలు . అప్పు తీసుకునే వానికి ఆ కాయలే ఎనభై రూపాయలు! మాకాడ డబ్బు ఏడుంటాది? ఎనభై కే తీసుకున్నా....రెండు రూపాయల వడ్డీ! ఎకరాకు ఆరు డబ్బాల లెక్కన ఇత్తనమేసినా, వానదేవుడు బిగదీసినాడు. ఈ పొద్దు పంట ఎకరాకు పది, పన్నెండు డబ్బాల కాయలైతే అదురుష్టం! ఇప్పుడు బస్తా కాయల ధర ఏభై రూపాయలు! అమ్మక పొతే గతి లేదు. కాయలు కళ్ళం కాడి కొచ్చేతలికి నాకెన్ని ఖర్చులో సూడండి! మీరూ తలో ఇన్ని కాయలు కొకల్లో పోసుకునే పోతారు. అద్దిగదిగో! ఆ పిల్లదాని ఒళ్లో సూడండి! అదీ వరస. ఈ కాయల్లో కుక్కలకి కూడా కొంత భాగం! సరే! అయిన కాడికి అమ్ముదామనుకుంటాం-- వ్యాపారగా డోస్తాడు. వాసన నూనె బూసుకొని, సిల్కు సోక్కా తొడుక్కొని, సిగరెట్టూ నోట్లో పెట్టుకుని....వాడెం చేస్తాడు? పది కిలోలకూ రెండు కిలోల ఎక్కువ తూకం గుంజుతాడు. వానికి కాదని, మిషన్ కు తోల్దామా! బాడుగలు, కమిషన్లు, డబ్బుకు రాపురా, మాపురా! అని తిప్పుకోవడం-- ఈ మహా పంటకు ఈ గొడవంతా పడలేము. సరే! శవాన్నేట్లాగో కాల్చెయ్యాల! కాల్చేస్తాము. కాటికాపరి సుంకానికి తగులుకుంటాడు! కాటి కాపరేవడు? గయిర్నమేంటోడు. పన్నులు, బకాయిలు, జప్తులు ! సరే! ఈసారి పన్ను లేదు, ముందుకో? ఈసారిది, ముందుది తడిసి మోపే డయితుంది! ముందుకు మాత్రం పండుతాయనే గారంటీ ఏముంది? పండినా, రైతుకు ధర పలకాలన్న అలోచ నెవరికుంది? అప్పులోళ్ళ కేం జెప్పుకోవాల! సంవత్సరం దాకా సంసార మెట్లా జరగాల? గొడ్ల మేత మూన్నెల్ల కుంది. ఆ తరవాత? మేత కొనాల్నా? గొడ్ల నమ్ముకోవాల్నా? ఏం సెయ్యాలో మీరే సెప్పండి?' కూలోళ్ళ కూ కట్టాలు, రైతుకూ కట్టాలు....సుఖపడే దేవరు? ఎవరో వాళ్ళ కర్ధం కాదు. 'ఇంకా ఈ ఊరు వాళ్లు పున్నెం చేసుకున్నారు. లచ్చనంగా ఏరుంది, కడుపు నిండా తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి. మా ఊళ్ళో నీళ్లే లేవు.' వలస వచ్చిన కూలీ, తన ప్రాంతాన్ని పరిచయం చేస్తుంది. అంతా భయపడి పోతారు. ఈ యాలోచన , ఈ యాతన నుంచీ పారిపోవాల. "ఎల్లమ్మా! కత జెప్పవే!' మల్లమ్మ అడుగుతుంది. ఎల్లమ్మ మొదలు పెడితే, పుల్లమ్మ ఊ కొడుతుంది. 'రాజుగారూ, రాజుగారి ముగ్గురి పెళ్ళాలూ....' ఎవరి ఊహ అందినంతవరకూ వాళ్లు చూడటం లో మునిగిపోతారు. మధ్యలో , ఒకరి కుప్పలో కాయ లొకరు పోసుకుంటున్నారని, ఈశ్వరమ్మా, ఈరమ్మా తిట్లకు లంకించుకుంటారు. జుట్టూ జుట్టూ పట్టుకుంటారు. అంతా విడదీస్తారు. తీర్పు చెప్పిన వాళ్లూ తిట్లు తింటారు. అంతా కలిసి అందర్నీ తిట్టుకుంటారు. 'నోరు మూసుకోండి! కత పాడుజేసినారు....కానీయే.' కానిస్తుంది. ఈశ్వరమ్మ, ఈరమ్మ గూడా అందులో మునిగి పోతారు.
ఈసారి జొన్న విత్తన మాలస్య మయింది. పుబ్బ కార్తి లో పడవలసింది. చిత్త లో కుదిరింది. అప్పటి నుంచీ వర్షం లేకపోయినా, చల్లకాలం కనక కురిసే మంచుకే జొన్న పంట ఎదిగింది. ఎత్తు పెరగకుండా ఎన్ను ఏళ్ల మారింది. వేరుసెనగ కధ ముగిసిం తరవాత రావలసిన జొన్న పంట ఒక్కసారే వచ్చేసింది.
తూర్పు వైపున జొన్నలు రాసి పోసింది. తూరు పెత్తడానికి నాలుగు మెట్టు పలకల మీద నలుగురు మగవాళ్ళే క్కినారు. వాసవి, నన్నయ్య, మరో ఇద్దరు కూలాళ్ళు! నలుగురాడవాళ్ళు గూగు నిండుకోకుండా , తల చుట్టూ కొంగు చుట్టుకుని, చేటలతో ధాన్య మందుకుని వెళ్లి మగవాళ్ళ కందిస్తున్నారు. గొనె పట్టలు కప్పుకుని, చేత పోరకలతో బొంతు కొడుతూన్న మాదిగే మిరాశిదార్లు! గాలిలో ఎగిరి , దూరంగా వెళ్ళిపోతున్న నూగు, సన్న బొంతు, నున్న మట్టి! పచ్చగా జలజల మెట్టు పలకల కింద వాలి పడిపోతున్న జొన్నల శ్రవణ పేయమైన శబ్దం! అనంతయ్య గుడిసె లో కూర్చుని చూస్తున్నాడు. మెట్టు పలకల మీది కూలీలు గొంతెత్తి గంగాల పోలయ్య పాటందుకున్నారు. అందిస్తూన్న ఆడవాళ్ళు వంత అందుకున్నారు!
'గాలి విసరవయ్యా! గంగాల పోలయ్యా!
ఆ -- గాలి విసరవయ్యా!
కొమ్మలోనా ఆకు కూకుండే కదలకా,
కళ్ళాన కాపన్న సూపూ దిక్కులు సుట్టే,'
ఆ-- దిక్కులు సుట్టే,'
కడియాల గలగలలా, నాడిమీన రావయ్యా,
ఓ.....పోలయ్యా!
సత్తూ, చిత్తూల సాటా సక్కన్ని కొడకా!
సక్కని కొడకా?
గాలి విసరవయ్యా! గంగాల పోలయ్యా!,

'దండాలు , సోమీ!'
ఏదో ఆలోచనలో మునిగిపోయి అనంతయ్య తిరిగి చూశాడు.
'మంగలి నారిగాన్ని . సాయిత్రమ్మ పంపింది, సోమీ అయ్యగారికి పాణం బాగులేదంట....'
అనంతయ్య కు డొక్కలో బాణం గుచ్చుకున్నట్లయింది. కళ్లం వేపు చూశాడు. అంతా పనిలో మునిగి ఉన్నారు. లేచిఇంటి వేపు దారి తీశాడు. వచ్చిన మనిషికి అన్నం పెట్టించాడు. తనూ అన్నం ముందు కూచుని సహించక చెయ్యి కడుగు కున్నాడు.
భాగీరధమ్మ తనూ వస్తానంది. వెళుతూనే ఎట్లా ఉండేది చెప్పి పంపుతాననీ , సరస్వతి ఒక్కతే యెట్లా ఉంటుందని మాట్లాడుతూ, తొందరగా కొంత డబ్బు తీసి జేబులో వేసుకున్నాడు. పై పంచె భుజం మీద వేసుకుంటూనే గుమ్మం దాటాడు.
అపరాహ్ణ మయింది. అలవాటైన దారి వెచ్చ వెచ్చగా పాదాల్ని ముద్దు బెట్టుకుని వీడ్కోలు చేవుతుంది. చెప్పులు తెగిపోయినాయి! బాగు చేయించుకోవడానికి కిప్పుడు మాది గెవాళ్లు దొరకరు-- అంతా కళ్లాలలో ఉంటారు. మంగలి రెండు బారల ముందు వెళ్ళుతున్నాడు. మోకాళ్ళ పైకి పంచె కట్టుకున్నాడు. మోకాళ్ళ దాకా పాకిన దుమ్ము, తెల్లగా పొడరద్దినట్లుగా ఉంది. అన్నం తినబోయే ముందు కాళ్ళు కడుక్కోలేదేమో! తలకి యెర్రని తుండు చుట్టుకున్నాడు.
"ఎప్పటి నుంచీ ఒళ్ళు బాగాలేదు?' అడిగాడనంతయ్య.
'ఎప్పట్నించో యాడ్ది, సోమీ! నిన్న పొద్దున నేను గడ్డం చేసినా. నిన్న పొద్దు గూకేటప్పుడు పీరాగాని కొట్టం దగ్గర సూసినా-- అస్సలు సాయిత్రమ్మ పొద్దున ఈ సంగతి సెప్పెతలికి అచ్చెర మయింది. ఇదేందబ్బా! అనుకున్నాను.'
'సీరా అంటే....'
'వాడే సారాయంగడోడు.'
ఇంక మాట్లాడలేక పోయాడు. నరసింహం ఇట్లా ఎందుకైనాడు? అతని కధ తలుచుకుంటుంటే గుణనిధి, నిగమ శర్మ జ్ఞప్తి కోస్తున్నారు. సీతారామయ్య ఎంత సజ్జనుడు! అతనికి పుత్రుడుగా నరసింహాన్నివ్వడం చూస్తె విధి ఇందువల్ల ఏం ప్రయోజనం సాధించింది? ప్రపంచాని కేం చెప్పదలుచుకుంది? అన్న ప్రశ్న లేదురు పడతాయి. అర్ధమే లేదా? అంటే ఇంత విచిత్ర బంధవ్యాని కర్ధమే ఉండదా? ఉంటుంది...అదేమిటో మనం తెలుసుకోలేక పోతున్నామేమో? అమృతమూ, హలాహలమూ ఒక్కచోటే పుట్టాడమంటే ఇదే అర్ధమా? సీతారామయ్య కొడుకును గురించిన దిగులుతో తీవ్రదశ చేరుకొని మృత్యురూపంగా మారి విముక్తి నిచ్చింది. అతనికి తల్లి అయినందుకు అసలు శిక్ష అనుభవించింది వెంకమ్మ! కన్న కొడుకుతో క్రింద తోయబడి కాలు విరిగి మంచంలో కూర్చుని, ఏడాది పాటు నరకం లో ముంగి తేలి, బంధం తెంచుకుంది! తెగని బంధంతో, తెంపుకోలేని అనుబంధంతో ఈనాడు సావిత్రి! ఏం పాపం చేసుకుంది సావిత్రి? కాదు సావిత్రి పాపం చేసుకోవడం కాదు పొరపాటు చేసింది.
ఆరోజు నరసింహాన్ని చేసుకొంటానని పట్టుబట్టక పొతే సావిత్రి యెట్లా ఉండేది? ఇప్పుడంతా మారిపోయింది గానీ, ఇరవై ఏళ్ళ క్రితం గ్రామాల్లో, కారణం మునసబు గిరీలకు మంచి విలువ ఉండేది. అప్పట్లో నరసింహం ఈ ఊరి కరణం దగ్గర కరణం లెక్కలు నేర్చు కోవటాని కొచ్చి, రెండు మూడు నెలలు ఉండిపోయాడు. సీతారామయ్య కూ, కరణానికి స్నేహమూ, పైగా దూరపు బంధుత్వమూ.
"మీరూ కరణాలే కదా? మీ అబ్బాయిని మా కరణం దగ్గర శిష్యరికానికి పంపించరేమి?" అని తను నవ్వుతూ అడిగిన ప్రశ్నకు సీతారామయ్య చెప్పిన జవాబు ఇప్పటికీ జ్ఞప్తి కుంది; 'భీష్మునికి విలువిద్య రాకనే మనవల్ని ద్రోణున కప్పించారా?'
ఆ మాటతో సీతారామయ్య మీద గౌరవం కలిగింది. నరసింహం పద్దతి మాత్రం నచ్చేది కాదు. అదే పనిగా కూలి ఇచ్చి నాలుగు మైళ్ళు పట్నానికి పంపి, ఎవరితో నైనా సిగరెట్లు తెప్పించుకునేవాడు.పొలాల దారంట ఈలవేస్తూ , పాత సైకిల్లో పనిలేకున్నా తిరుగుతుండే వాడు! సాయంత్రాల ఏటికి నీళ్ల కెళ్ళే ఆడవాళ్ళ ను చూస్తూ ఏవో పాటలు పాడేవారు. సైకిల్ కట్టుపంచ, మోకాళ్ళ దాటిన వదులు జుబ్బా , ముక్కు కింద మాత్రం 'మకిలవలెన్ జుగుప్స విడి మానసమున్ కలగించి నైచు' మీసాలు, అంతకంటే ఏవగింపు కలిగించే అత్తరు ఘుమఘుమ లు ! తనకు అయిష్టమైన గుణాలు చాలా మందికి ఆకర్షణీయంగా కనిపించినవి. స్థితిపరుడు గనక అట్లా చూసేవారేమో?
తన నమ్మకాల మీద సవాలులా తన మీదనే ప్రయోగం జరిగింది. కరణం నరసింహానికి సావిత్రి నిస్తే బాగుంటుందని సూచించాడు. తనకి కోపమొచ్చింది. అయితే, అదే విషయాన్ని భార్య అదృష్టంగా భావించి మురిసిపోవడంతో ఆశ్చర్యం వేసింది. లోకమేమాలోచిస్తుంది? లోకం సంగతి పోనీ, తన భార్యమిటాలోచిస్తుంది? ఆస్తి ఉంది, అదీగాక ఒక్కడే కొడుకు, కండ్ల కద్దుకోవలసిన సంబంధం! వ్యక్తీ విలువ అక్కర్లేదా? వ్యక్తిత్వపు విలువ తెలుసుకోలేని వాడు ఆస్తి విలువ మాత్రం తెలుసు కుంటాడా? దానికి వాళ్ళిచ్చే సమాధానా లివి:
'ఆ....కుర్రవాడు, ఏదో తెలిసీ తెలియని వయస్సు........'
'సంసారం లో పడిపోతే ఎవరంతట వాళ్లే తెలుసుకుంటారు...'
ఆసమాదానాలు తనకు తృప్తి కలిగించలేదు. పిచ్చివాణ్ణి చూసినట్లు చూసి వెళ్ళిపోయాడు కరణం. రాఘవరెడ్డి , తనూ పురాణం చదువుతుంటే రాజశేఖరం తప్పకుండా హాజరయ్యే వాడు! రాజశేఖరం కొంతవరకూ మాతృభాష మాధుర్యం తెలుసుకున్నవాడు. సంఘ జీవితానికి కొంత వెలిగా బ్రతికేవారు!
దానికి కారణ ముంది. రాజశేఖరం ఒక్కగానొక్క తోబుట్టువు రెడ్డి కుర్రవాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఆస్తి అమ్మేసి ఏ పట్టాణానికో పోయి కాలం గడుపుదామని , గౌరవం చూపని చోట ఉండకూడదని తల్లి చాలసార్లనేది. మొదట కొన్నేళ్ళు వాళ్ళని ఊరు వెలివేసినట్లు కనిపించినా, కాలక్రమాన కట్టుబాటు సడలి పోయింది. కానీ, రాజశేఖరానికి ఒంటరి తనమే అలవాటయింది. ఆ ఒంటరితనమే అతనికి చక్కని ప్రవర్తన, మానసిక వికసమిచ్చిందేమో ననిపిస్తుంది. ఆ రాజశేఖరం ఒకనాడు పొలం లో కలుసుకున్నాడు.
'చాలా రోజుల నుంచీ మిమ్మల్ని ఒక సంగతి అడగాలను కున్నాను . కానీ మీ స్నేహం గూడా వదులు కోవలసి రావచ్చనే భయంతో........'
తలఎత్తి చూసేసరికి , తలదించుకుని నేలకేసి చూస్తున్నాడు.
'అయితే , కోపమొచ్చింది! ఇలాంటి కోర్కెలు పెట్టుకునే నాతొ స్నేహంగా ఉంటున్నావా?'
గాభరా పడిపోయాడు. నవ్వొచ్చింది.
'అబ్బాయ్! నీ కోరికకూ, నాకూ ఎక్కడన్నా సంబంధ ముందంటే నేను తప్పకుండా వినాలి....'
'కులాన్ని గురించి మీ అభిప్రాయ మేమిటి?'
'నువ్వలా అడుగుతుంటే నన్ను గురించి నాకే ఏదో ప్రశ్న ఎడురౌతోంది!'
'ఏమని?'
'నేను ఆత్మవంచనతో బ్రతుకుతున్నానా?' అని.'
'అహా....కాదు....కాదు'
'కాకపోతే నా నోటమ్మట వినవలసిన అవసరమే లేదు.'
అతని సుఖం చూసి వాతావరణం తేలిక చెయ్యక పొతే అతని కోర్కె లోపలే ఉంచుకుని పాపం బాధపదతాడెమో!
"ఏం! మాదిగే అమ్మాయిని చేసుకుంటావా?' అతను నవ్వాడు. 'కాదు, బ్రహ్మాణ అమ్మాయివే!'
'ఇక్కడ నీ ప్రశ్నకు, నా వ్యాఖ్యానికి చోటు లేదే!'
'ఉంది. తప్పకుండా ఉంది. ఆ అమ్మాయి తండ్రిగా!'
త్రుళ్ళి పడ్డారు.
