సాధారణ మానవుడు మహాత్ముడెల్లా గయినాడో అందు కాయన ఏం చేశాడో దాన్ని గూర్చి ఆలోచించదు ప్రపంచం! వ్యక్తిని అవతార పురుషుడుగా పూజిస్తుంది! చికిత్స మానివేసి, వైద్యుని భగవదంశంగా భావించినంత మాత్రాన, రోగి ఆరోగ్యం పొందగలగడం అసంభవమని అర్ధం చేసుకోలేదు.
* * * *
వాసవి అనుకున్నంతా జరిగింది. తననుకున్న పరిణామం రాకపోవచ్చునని భ్రమ పడకుండా సుబ్బరామయ్య త్వరలోనే రుజువు చేశాడు. ఆ పరిణామ మిలా ప్రారంభమయింది.
పొద్దున్నించి మాలచ్చిమీ (ఆవు) కనిపించలేదు. మధ్యాహ్నం దాకా ఎవరూ పట్టించుకోలేదు. సాయంత్రమయింది. గువ్వలు గూండ్లకు జేరుకుంటున్నాయి. ఊళ్ళో సంజ దీపాలు వెలిగినాయి! 'అంబా!' అంటూ హిమబిందు ఎదురు చూస్తుంది ఆత్రంగా. వాసవి, నన్నయ్య, అనంతయ్య -- ముగ్గురూ మూడు వేపులా బయలుదేరారు. చివరికి మాలచ్చిమి అనంతయ్య కళ్ళ బడింది. బందెల దొడ్డిలో , వాకిలి దగ్గరగా నిలుచొని మన వాళ్ళ కోసం దీనంగా చూస్తుంది. అనంతయ్య మనసు కలుక్కు మంది. కన్న బిడ్డ మీద దొంగతనం బనాయించి ఖైదు లో తోసినట్లయింది. మాలచ్చిమి ఎక్కడికీ పోదని, ఎవరి చేనులోనూ, మేయదని అందరికీ తెలుసు. ఇప్పుడీ విపరీత మేమిటి? ఎవరు చేశారీ పని? అయిపోయిన దాని కాలోచించడం కంటే మాలచ్చిమినీ తొందరగా విడిపించుకుని పోవడం మంచి దనుకున్నాడు. దగ్గరలో ఉన్న కట్టుబడి కంబన్న ను పిలిచాడు. సుబ్బరామయ్య నడిగి తాళం చెవి పట్టుకు రమ్మనీ, బందే జుల్మానా పంపుతావనీ చెప్పమన్నాడు. కంబన్న కర్ర చంక లో ఇరికించుకుని బయలుదేరాడు.
అనంతయ్య అక్కడున్న పీర్ల సావిడి అరుగు మీద కూర్చున్నాడు. గొల్ల గోపాలం మందతో పొలం నించీ వస్తున్నాడు. గొర్రెల కాలి గిట్టాల నించీ లేచిన దుమ్ము పొగలా కమ్ముకుంది. ఆ దుమ్ములో చిరంతన స్నేహ మాధుర్యం! ఆ తరిపి వెన్నెల్లో ఆ లేచిన దుమ్ము సాంబ్రాణి ధూపం పట్టినట్లుగా ఉంది.
కర్ర చప్పుడుతో కంబన్న వచ్చినాడు. 'సుబ్బరామయ్య ఊళ్ళో లేడు, తాళం సేవ్వు ఎక్కడుందో ఇంట్లో ఎవరికీ తెల్దంట.'
'తాళం చెవి లేకపోతె ఎవరు లోపల తోలినట్టు.'
'ఎవరు తోలినారో, మాకు తెల్దన్నారు.'
'ఎవరన్నారు?'
'రాదా కిట్టయ్య.'
'నన్నిక్కడే ఉంచి వెళ్లి పోతున్నావెం?' అని అడుగుతూన్న మాలచ్చిమి కేమీ చెప్పలేక మూగగా నడిచాడు అనంతయ్య. ఆ రాత్రి ఎవరూ సరిగా అన్నం తినలేక పోయారు. హిమబిందు అరుపు వింటున్న భాగీరధమ్మ కంట నీరు పెట్టుకుంది. ఏదో జరగబోతుంది అన్న ఊహ అందరి మనస్సులో దయ్యం నీడలా నిలిచింది. ఏం జరుగుతుంది?
ఇదంతా రజ్జ సర్ప భ్రాంతా? ఈ సమయంలో ఇట్లా జరిగి ఉండవలసింది కాదు. పది రోజుల నాటి సంఘటనకూ, ఇప్పుడు జరిగిన దానికీ పోలిక లేదు. అట్లాగే ఇప్పుడు జరిగినదానికీ, ఇంకో నెల రోజుల్లో సరస్వతి, పెళ్లి కూతురై కళకళలాడుతూ మెట్టినిల్లు గా సుబ్బరామయ్య ఇల్లు చేరుకుంటున్న కలకూ -- సమన్వయమెలాగో అర్ధం కాలేదు.
పదిరోజుల నాడు సుబ్బరామయ్య భార్య అనసూయమ్మ, పదుగు రాడవాళ్ళతో వచ్చింది. సంప్రదాయ ప్రకారం ముత్యాలు పొదిగిన హారం వేసి, తాంబూలం పుచ్చుకుని సగౌరవంగా వెళ్ళిపోయింది. ఆరోజు పొందిన సంతోషాన్ని తలుచుకుంటే, ఈ రోజు భయం వేస్తుంది. కలత నిద్రలో తెల్లవారింది. పొద్దు పొడిచి బార డెక్కెటప్పటికి మాలచ్చిమి 'అంబా!' అంటూ పరుగెడుతూ బిడ్డ దగ్గర కొచ్చేసింది. "నిన్నటి వేళ సంజ జామప్పుడు లేని తాళం చెవి, తెల్లవారక ముందే ఎట్లా వచ్చింది? సుబ్బరామయ్య రాత్రే వచ్చెసినాడేమో!"సంతృప్తి అన్ని అనుమానాల్ని సరిదిద్దుతుంది. 'అమ్మయ్య!' అనుకున్నారు. 'ఇంతమాత్రానికే రాత్రి ఎన్ని పాడు ఆలోచనలు?' అనుకున్నారు. ఎవరికి వారు మనసులో నవ్వుకున్నారు. ఆరోజు గడిచిపోయింది.
ఆరోజు ఎగువ చేలో కంది పండిందేమో చూసి రావాలని వాసవి చెప్పులు తొడుక్కుని బయలుదేర బోతున్నాడు. అనంతయ్య మెట్ట కొమ్ము కోడెకు కొమ్ముల సందునున్న గోమారి గీరి పసుపూ, ఆముదం కలిపి పట్టిస్తున్నాడు.
అప్పుడే వచ్చేశాడు తాంబూలం నములుతూ కస్తూరి రంగయ్య. కస్తూరి రంగయ్య నింట్లోకి రానివ్వడమన్నా, కొంప మీద గూబ వాలిందన్నా ఆ ఊళ్ళో వాళ్లకి అమిత భయం! అయన మహా లౌక్యుడు. ఆ లౌకికమంతా ఇతరుల్ని ఇబ్బందులలో పెట్టి ఆనందించడం లోనే వినియోగిస్తాడు. అయితే, అయన రాకను ప్రత్యక్షంగా అడ్డగించగల వాళ్ళు కూడా లేరు. అంతటి వశీకరణ శక్తి కస్తూరి రంగయ్య అధీనంలో ఉంది. కసాయివాడు నరకడానికి తీసుకెడుతూ గొర్రె పిల్ల మెడ దువ్వుతూ, దాని నోటికి ఆలుమో, అవిసె మొక్కలో అందించినట్టుంది!
'ఎందుకానయ్యా, ప్రయాణం?' చిరునవ్వుతో.
"ఎగువ చేని వరకూ.'
'ఎగువ చేనికా? ఎందుకూ!' ఆశ్చర్యంగా , చేయరని పని చేస్తున్నట్టు. లేకపోతె, ' ఎంత అమాయకుడివి కాకపొతే ఎగువ చేని కేడెతావయ్యా!" అన్నట్లూ!
"ఏం లేదు, కంది అయిందేమోనని."
'కందా!" మళ్ళీ ఆశ్చర్యంగా నే.
వాసవి కి విసుగేసింది. చిరాకు కనిపెట్టాడు. చలాకీ రంగయ్య. లాభం లేదు, ముందుగానే విసిగిస్తే రసభంగ మవుతుంది!
'నిన్నగాక మొన్న నేనట్లా పోయోచ్చినా....అంతా దొరగాయ! మన మిద్దరమూ విత్తన మేసింది ఒక్క రోజే గదూ! పునర్వసూ శుద్ధ దశమి గదూ? ఆహా ....ఏకాదశియో...'
వాసవి పలకలేదు...అయినా జ్ఞప్తికి లేదు.
'ఇంకా వారం ఉండాలి! ఇంతకూ ముందే కావలసిందే ననుకో! నీ యంచనా గూడా రైటే. నువ్వేం తెలీని వాడివా? అమ్మా! అయితే, తోలి కాపు కా యందు కుంటే గదూ? పూత పట్టేటప్పటికి , వట్టి గొడ్డు కారుపెక్కుననీ, చేతావాటా అని మేఘాలాడతాయి , పూత రాలిపోతుంది. మళ్ళా పూత , మళ్ళా రాలిపోవడం , మళ్ళా పూత....మళ్ళీ -- ఇదీ వరస! ఏం కాలమో! ఏం పంటలో! మనిషి మారిపొయినాడు, వాన దేవుడు బుద్ది మార్చుకున్నాడు! రామ! రామ! నిన్న చెప్పిన మాట మీద ఇయ్యాల నిలబన్న నాయాలు లేడు......
వాసవి ఉలిక్కిపడ్డాడు! విషయ మింకా తనలో దాచుకునే వాసవి లో భయాన్నీ, కుతూహలాన్నీ కలిగించ గలిగినందుకు రంగయ్య కు ఉత్సాహం కలిగింది. అప్పుడే చెప్పడమా? ఉహూ ఇంకా తనలో తనే మానసికానందమనుభవించాలి! వాసవి లొంగిపోయాడు తనకు. ఇక అతన్ని లక్ష్య పెట్ట నవసరం లేదు.
