రాఘవేంద్ర ప్రశ్నకి ధనమ్మగారు కాస్త మొహం ఎర్రబర్చుకుని "దాని యిష్టమా? నా యిష్టమా నువ్వుమాత్రం యీ అబ్బాయి సమ్మంధం బెడిసిపోనివ్వకు.....అదే ఏనా మాట- నీ కుమారుడి వివాహం సంగతి నే చూస్తా...." హుకుం జారీచేసిన తీరుగా అని ఆమె అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయిన దిక్కుకేసి రెండుక్షణాలు తదేకంగా చూసి "అసాధ్యురాలు నా కొడుకు పెళ్ళి తన కూతురు సమ్మంధం-ఈ రెంటికి ముడివేసిందే" నని గొణుక్కున్నాడు రాఘవేంద్రరావుగారు.
లేచి "అయితే నే వెళ్ళిరానా తల్లీ" అన్నాడు గదిలోకి కేకవేస్తూ రాఘవేంద్రంగారు. "ఆఁ" అన్న మాట విని "సరే! అప్పు తిన్నాకా తప్పుతుందా? ఉప్పు తింటే ఫర్వాలేదు-గాని అప్పు తింటే మాత్రం చాకిరీ తప్పదు-" అంటూ నిష్క్రమించాడు.
13
మర్నాడు భాస్కరానికి సురేఖను చూపించాలని వేళ సైతంగా నిర్ణయించింది ధనమ్మగారు. ఆ మాటను ఖచితంగా ఆమె ఒకసారేనా, సురేఖతో అనలేదు.
అయితే నేం? సురేఖ పసిపిల్ల కాదుగదా? దొడ్డమ్మ తనను మూడు ముస్తాబులు చేసింది ఎందుకో తెల్సుకున్నది.
"అది కాదు దొడ్డమ్మా....." అని ఏదో చెప్పబోయింది.
"ఏది కాదే? బంగారుతల్లీ" ధనమ్మగారు నిలదీసింది.
"మరి నేను ఎమ్మే చదువు కోవాలనుంది దొడ్డమ్మా....."
"ఎందుకు చదువుకో కూడదు? పైగా ఇప్పుడు మాత్రం నీకేం తక్కువా? బి.ఏ. అయితివిగా...." నాన్నదామె.
గునిసింది సురేఖ.
"ఇటు చూడు" ధనమ్మగారు సురేఖ గెడ్డం పట్టుకుని ఎత్తితిలకం కాస్త దిద్ది- "మీ పెద్ద నాన్నగారు అంత పెద్ద ప్లీడరు.... మరి ఆయన భార్యను నేను ఆఖరికి స్కూలు కూడా దాటలేదూ.....ఏమంటావు?...." అని "అయ్యో ఉండు కాటుక తెస్తా" నంటూ ఆమె లేచి వెళ్ళింది.
నిలువు టద్ధంలోకి చూసుకుంది సురేఖ పెళ్ళికూతురు ముస్తాబుకు కాస్త తక్కువే గాని ఇంచుమించు అంతా ఉంది.
"ఏం బాధరా బాబూ?..... ఇలా దేవేరి లా ఉండాలా? కొంపదీసి రాబోయే ఆ 'వరుడు' కూడా మా పెద్దనాన్న గారంత ప్లీడరు కాడు గదా?" అనుకుంది. తనలోనే నవ్వుకుంది.
ధనమ్మగారు వాస్తవానికి పెద్దబాల శిక్షగన్నా పెద్ద పుస్తకాల జోలికి ఎక్కువగా పోనేలేదు-అదే ఆమె గర్వం కూడా, కాని ఆమెకు సురేఖను పెద్ద చదువులు చదివించాలనే ఉంది.
తనకు అన్నివిధాల అన్ని అవసరాలు తీరుస్తున్న దొడ్డమ్మదగ్గర సురేఖకు భయమున్నదే గాని ఇప్పుడీ పెళ్ళి చూపుల కామె అవలంభిస్తున్న తీరు తనకు నచ్చలేదు.
"ఆప్యాయంగా కొనుక్కున్న బొమ్మనా నేనూ?" అని గొణుక్కుంది. దొడ్డమ్మ తిరిగిరాగానే ఆమె కేసి ఉక్రోషంగా చూసింది.
"ఏమిటే! నీ బాధ.... మీ అమ్మా నాన్నా రాలేదనా? నేనున్నాగా.....అదీగాక శ్యామలం నేనంత అంటే అంతే వింటాడు- మొదట అబ్బాయ్ నీకూ, నువ్వు అతడికి- మీ ఇద్దరి సంగతీ నాకూ నచ్చిందో మీ అమ్మా నాన్నలదెంతసేపూ? వాళ్ళూ వస్తారూ...... లే...... లే.....మేరుగ్గా ఉండు" ధనమ్మగారు ఉత్సాహం నింపజూసింది.
తనను అపార్ధం చేసుకున్నదేమో ధనమ్మ గారని నొచ్చుకుంది సురేఖ.
అవతల రాఘవేంద్రంగారు సతీ సమేతంగా వచ్చి ఈ పెళ్ళి చూపుల పెత్తనం నిర్వహిస్తున్నాడు. అందుకనే సురేఖ ధనమ్మగారి నెదుర్కొనలేదు. పరాయివాళ్ళెవ్వరేనా ఇంట మసలు తున్న ప్పుడు- ఎంత "గొప్ప విషయమేనా సరే-నా మాట కెదురాడకూడదు" అన్నాది ధనమ్మగారి శాసనం.
"కాదూ కూడదూ" అనే విషయాలను ఆమెకు ఒంటరిగా ఉన్న అదునుచూసి చెప్పాలి. సురేఖకు ఆ సంగతి బాగా తెల్సును.
"నేను ఎమ్మే చదువుతాను....." అద్దంలోని బొమ్మతో అన్నట్లు అన్నది.
"చదువు...... నేను వద్దనను..... అతగాడు కూడా 'ఎమ్.ఎస్సీ.' చదువుతున్నాడు- అదీగాక పెళ్ళీ అనగానే అప్పుడే అయిందీ దీనికెన్ని చూడాలి?...అన్నీ తెమిలేసరికి నీ ఎమ్మే కాకపోతుందా?.....గనుక నంగిరితనం వోడకు... ధనమ్మ కూతురిలా డాబుగా వుండు" ఆమె హెచ్చరించింది.
"ఎమ్మే చదవడనికి రెండేళ్ళు...." సురేఖ మెల్లిగా అనబోయింది.
"పాతికేళ్ళవనీ...... ముందీ అబ్బాయ్ ని స్థిర పరుచుకోనీ..... ఇక పేచీలు మాను..... నన్ను ఎదిరించకు .... ఆదిన మీ అమ్మ ఎరుగదు మీ అయ్యా ఎరుగడు" ఆమె మాటలతో సురేఖ దుఃఖం గొంతులోకి వచ్చింది.
ధనమ్మగారు కాస్త మెత్త బడ్డది..
"అది కాదే వెర్రికానా- పిల్లవాడు సలక్షణమైన వాడు..... చూడు మరీ" అని పట్టుచీరె విసవిసలాడ అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
ఉన్న వూళ్ళోనే వూరు గనుక సుబ్బారావు దంపతులు కుటుంబం అంతా వచ్చారు. వసంత మొదట రానని పెళ్ళికూతురు గనుక సిగ్గుపడ్డది గాని, తర్వాత "అన్నకు కాబోయే ఇల్లాలెలా" ఉంటుందో వనే ఉబలాటంతో బయలుదేరి వచ్చింది.
అసలు హడావుడీ అంతా రాఘవేంద్రం దంపతులదే- మరి ఎంతైతే మటుకు ధనమ్మగారు ఆమె మాటల్లోనే చెప్పాలీ అంటే "అన్నీ ఉండి ఆ ఒక్క ఐదోతనం లేనిది" కదా!
* * *
'సిగ్గు' అనేది స్త్రీ సహజమైన ఆభరణమే గాని, నాగరికతా విరుద్ధమైన లక్షణ మేంగాదు గనుక సురేఖకు కూడా పుట్టెడు సిగ్గు ముంచుకు వచ్చింది.
తీసుకువచ్చి కూచోబెట్టగానే పొట్లంలా ఒదిగి కూచుని తల దించుకున్నది.
అయితే అది ఆ పిల్లకు ఎంతోసేపూ నిలువలేదు ఎదుట కూచున్న వ్యక్తి-తనను చూడ వొచ్చిన వరుడూ 'భాస్కరమే' అని చూసిన క్షణంలోనే ఆమె ఆపాదమస్తకమూ సంభ్ర మాశ్చర్యాలతో నిండి వొణికిపోయింది.
భాస్కరం కూడా అనుకోకుండా పిడుగు నెత్తిన పడ్డట్లు హతాశులైపోయాడు.
అపరాధం చేసినవాడిలాగ, మలిన మొహంతో, దగ్ధ హృదయంతో కూర్చుండిపోయాడు.
ఈ ఇద్దరూ దిగాలుపడి ఉండటాన్ని తతిమ్మా వారు గమనించనేలేదు. వారిలాంటి వేమీ వూహించనేనా లేదు కదా?...
"ఎంత అక్రమం! పద్మావతి ఇతగాడు తనను ప్రేమిస్తున్నాడనే విశ్వాసంతోనే బ్రతుకుతున్నదే.... ఎంత దగా ....? ఎంత మోసం..... ఛీ...." కనుబొమలు ముడివేసింది సురేఖ.
ఆమె మనసులో తనను ఎంత తిడుతున్నదీ భాస్కరానికి తెలిసిందన్నట్లు అతడి అస్తవ్యస్థత సూచిస్తున్నది.
నాలుగూ దులిపేసి, పదిమందిలోనూ ఈ వ్యవహారం తేల్చేద్దా మనుకుంది సురేఖ. కాని నోరు విడలేదు. ఔడు కర్చుకుని ఊరుకున్న దంతే.
భాస్కరం దూరం ఆలోచించానేమో అనుకుని పెళ్ళిచూపులకు అంగీకరించాడు. కాని....
కార్యవాదితనం మంచిది ఖడ్దవాదితనం గంటే అనుకున్నాడు. కాని ఇక్కడ పరిస్థితులు మరీ అనుకోని విధంగా ఉన్నాయి.
"చూడగానే ఒప్పుకున్నామా?? పిన్ని సత్యాగ్రహం తాత్కాలికంగా తప్పించుకుందాము. పరిస్థితులనించి తాత్కాలికం గా పారిపోదాము." అనుకున్న తన ప్రయత్నాలు విషమఫలితానికే దారితియ్యడంతో హతాశుడైపోయాడు.
జానకమ్మగారు సురేఖను ఎంచి ఎంచి చూడటంలో మునిగిపోయింది. సుబ్బారావుగారు మాత్రం నీరైపోయి స్తబ్దుగా కూర్చున్న కొడుకుని చూసి, విస్తుపోయాడు.
"నిజంగా వీడికి ఇంత సభా పిరికితనమేం చెప్మా? .......కొంపదీసి 'లాయర్' చదువుకు పంపించానుగాదు వీడు చివరకి కోర్టులో పిల్లికూన ఐపోను" అనుకున్నారు.
"అమ్మాయి రెండు జెడల సర్దా ఉన్నదా?" జానికమ్మగారడిగింది.
ధనమ్మగారు సగర్వంగా నవ్వింది.
"బి.ఏ. ప్యాసయిందండీ ..... పాటలంటారా? పాడుతుంది గాని ఏదీ దాని ఇంగిలీషు చదువులు ప్రాణాలు తోడేస్తున్నాయి" అన్నదామె.
జానికమ్మగారు భాస్కరానికి చాలా యిష్టమైన రెండు జెడల గురించి అడిగింది. కేవలం భాస్కరానికి తన ఔదార్యం చెప్పడానికి మాత్రమే. సాధార్నంగా వసంతకు కూడా ఆమె రెండు జెడలు వెయ్యదు. ఒక్క భాస్కరం ఉన్న నలుగు రోజులూ వాడి తృప్తి కోసరం కూతురికి రెండు జెడలు అల్లుతుంది.
ఈసారి 'బి.ఏ అనగానే జానికమ్మగారి మనసు చివుక్కుమంది. ఎందుకు వచ్చిన 'బి.ఏ - బియ్యం కడగనా? మొగుడు అలిసి వస్తే సేదతీర్చనా? అని లోపల లోపల విసుక్కుంది కాని తన కూతురు పెళ్ళి యీ "ధనమ్మ" చేత ఉన్నది గనుక ఆమె యీ మాటకు మాటను మరోవిధంగా అందించింది.
"మావాడు ఎమ్మెస్సీ పూర్తవ్వాలీ అంటున్నాడు కాని అమ్మా! చదువులూ అంటే ఎలా? మన అచ్చటా ముచ్చటా తీరాలా? వద్దా?" అన్నదామె.
"ఇంతకీ అబ్బాయి ఏమనడేమ్! మా సురేఖ కూడా 'ఎమ్మే' అయివస్తా నంటోంది" -అన్నది ధనమ్మగారు.
అందుకు బదులు జానికమ్మగారు భాస్కరం కేసి తిరిగి "అంటే రెండేళ్ళా? ఏం నాన్నా? నీ చదువు కన్నా చిన్నదా? పెద్దహ్దా?" అన్నది. అంతలో నాలిక్కర్చుకుంది. భాస్కరం పలకలేదు. ఉలకలేదు.
"అమ్మా! పాట పాడమనవే" అన్నది. అంతలో సన్నగా వసంత. కాని "ఆ పిల్ల వాలకం చూడగా రాధల్లె ఉంది" అని గుసగుసగా అన్నది జానికమ్మగారు భర్తతో-ఆయనేమంటాడూ?....
"సురేఖ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వస్తారనుకున్నాను సుమా!" అన్నది జానికమ్మగారు.
"వాళ్ళది అక్షింతల పెద్దరికమేలే.....నేనే. రాయలేదు. వస్తారులెండి" స్వాతిశయంగా అన్నది ధనమ్మగారు.
జానకమ్మగారు సురేఖ అందాన్ని చూసి మురిసిపోయింది-"భాసడికి యీపిల్ల అక్షరాల చాలును...వాడి ముక్కుతీరుకీ దీని మొహం దీటాగును....చిల్కా గోర్వంకా అగుదురు" అనుకుంది.
"సరే!...." నన్నది ఆమె ఏదో ఆలోచనల మధ్య బయటకు నోరు జారి.
రెండువేపులా నలుగురు పెద్దవాళ్ళూ మాటలాడుకుంటూ ఉండగా సురేఖ, భాస్కరం ఇద్దరూ తమ ఉనికినే మరిచినట్లు నిర్లిప్తంగా ఉండిపోయారు.
"సురేఖ నన్ను వొద్ధంటుంది." "ఎందుకంటే తనకు నేను పద్మావతితో స్నేహం చేస్తున్నాను అని తెల్సు." అనుకున్నాడు భాస్కరం.
"ఈమె ఇప్పుడు పద్మావతికి మీ భాస్కరం నన్ను చూడవొచ్చాడూ అని ఓ ఉత్తరం రాసి పడేస్తే? నన్నభయం కలిగింది.
"అమ్మ బాబోయ్! నా గతేంగాను?" అనుకుని ఒకసారి కళ్ళెత్తి క్షమాపణగా సురేఖను చూశాడు.
కాని రాతిబొమ్మలా కూచుందామె.
"ఇక నా బ్రతుకు పరువు నిండింది" అనుకున్నాడు.
"పద్మ నమ్మదు."-
మొత్తనికి యీ పెళ్ళిచూపుల తంతు సవ్యంగా సంప్రదాయయుక్తంగా లేనందున, ధనమ్మగారు కాస్త నొచ్చుకుంది. జానికమ్మగారు బాధపడ్డది.
సముఖాన రాయబారం కాదు గనుక "తెలియబరుస్తాము" అని లేచారు భాస్కరం కుటుంబంవారు.
"తప్పకండా! మా రాఘవేంద్రానికి మీరు నాలుగూ నిర్మొహమాటంగా చెప్పండి.....అతగాడేం పరాయి వాడు గాదూ .... పైగా మీకు కాబోయే వియ్యంకుడు కూడాను.....అన్నట్లు ఏదీ? వసంతా! అమ్మ దొంగా?..... యింతసేపూ నిన్ను చూడనే లేదు సుమా? మా సురేఖను చూశావా?" అంటూ ధనమ్మగారు వసంతను దగ్గరకు చేర్చుకుని తల నిమిరింది.
సురేఖ అప్పటికే బాధతోనూ కోపంతోనూ తడబడ అడుగులేస్తో గదిలోకి వెళ్ళిపోయింది.
