14
పద్మవతికీ సురేఖకీ అరమరికలు లేవు. ముఖ్యంగా ఒకమ్మాయి ప్రేమ వ్యవహారంలో పరిభ్రమిస్తున్న ప్పుడు, తన గుండెలకు దగ్గరగా ఉన్న మరో నేస్తాన్ని ఎన్నుకుని కబుర్లు కథలూ చెప్పు కుంటుంది. సురేఖకు స్పష్టంగా పద్మావతి మనసులో భాస్కరం మూర్తీభావించి కూచున్నాడని తెలుసు.
భాస్కరం గురించి స్వయంగా తనకు గలిగిన పరిచయంవల్ల ఆమెకు తెలిసింది చాలా తక్కువ, "అతను మంచివాడే ..... ఆఖరిక్ మొన్న పార్కులో కూడా ఒక్కమాట కూడా తనను చంచల దృష్టితో చూడలేదే?" అనిపించింది.
"పద్మావతి గుండెలు తీసేపని నే చెయ్యలేను.....భాస్కరం పద్మావతి నేస్తం కాడని తెలిస్తే అది వేరేమాట! నేను ఈ భాస్కరాన్ని వరించలేను-దొడ్డమ్మకి చెప్పేస్తాను" అని మధనపడ్డది సురేఖ.
అయితే ధనమ్మగారు మాత్రం భాస్కరం చెక్కిన విగ్రహంలాగ, తీర్చిదిద్దిన బుద్దిమంతుని లాగ ఉన్నాడనే నిర్ణయానికి వచ్చేసింది. ఆమె వూహలు ఆలోచనలూ ఎవరి అదుపు ఆజ్ఞలకు లొంగవు కదా!
* * *
తిరిగి యింటికి వస్తున్నప్పుడు భాస్కరం చెరుపు చేసినట్లు దిగాలుపడి ఉండటాన్ని జానకమ్మ గ్రహించింది. గాభరాపడ్డది. కూడా ..... "పోనీ ఈ సమ్మంధం వద్దురా!" అని పైకి వాడిని సంతోష పెట్టడానికి అవాలనుకుంది గాని "చూస్తూ చూస్తూ నిక్షేపంలాంటి సమ్మంధాన్ని ఎలా కాదంటామూ?" అని అందామనుకున్న మాట అలాగే మింగేసి,
"ఏరా! భాసా! తల నొప్పిగా ఉందా?" అనడి గింది.
"లేదు."
భాస్కరం ముభావానికి వసంతా, సుబ్బారావు గారూ కూడా నొచ్చుకున్నారు.
"అన్నయ్యకి పెళ్ళి యిష్టంలేదు" అని బయటటకి వినపడకుండానే అనుకుంది వసంత.
"ఎందుకో అడగనా?" అని తలపోసింది.
సుబ్బారావుగారు "చుట్ట కాల్చుకొందువా?" అనుకున్నాడు.
కాని పిల్ల లందరి ఎదుటా, బండీలో చుట్ట కాల్చగల ధైర్యం లేక వూరుకున్నారు.
రెండు మూడుసార్లు జానకమ్మగారు మాత్రం ఏదో అనబోయి ఆనయ మాట్లాడుతాంలెమ్మని వూరుకున్నది.
ఆమెకు 'సురేఖ' సమ్మంధం రామరామ సమ్మత మవుతున్నది.
* * *
భోజనాలకు అంతా యాంత్రికంగా లేచారు. వసంత అన్నయ్య ప్రక్కనే కూచుని తఃదేకంగా అతనికేసే చూస్తున్నది. భార్య ఎప్పుడే క్షణాన ఏమాట అంటుందో-నన్నట్లు సంసిద్దంగా కూచున్నారు పీటమీద సుబ్బారావుగారు. శిక్ష పడ్డవాడు అనుభవించడానికి అంగీకారం తెలుపుతున్నట్లు తల దించుకుని కూచున్నాడు భాస్కరం.
"ఊఁ.....మీరు కూచోండి! పిల్లలు ఆకలితో ఉన్నారూ" అన్నది జానకమ్మ. అంటూనే నెయ్యి వడ్డించి.
"ఏమో బాబూ! నా కోడలు మరీ 'ఎమ్మే ఎస్సే' లు చదవడం నాకు నచ్చదు" అన్నది.
'కాని ఈ అమ్మాయి ఎమ్మే చదువుతుందిట. ఆనక ఉద్యోగం చేస్తుందిట.' భాస్కరం ఆశగా అన్నాడు.
పిన్నికి "ఇక ఈ సురేఖ వైనం నచ్చదు" అనుకున్నాడు-రెండు మెతుకులు మునిపంట కొరికాడు. ఆశగా ఆమెకేసి చూశాడు.
"ఎవరన్నార్రా నీతో?- చెప్పిందా?" ఆమె కూర వెయ్యబోతున్నదల్లా ఆశ్చర్యపడి నిలబడ్డది-
"పద్ధ వేస్తాం, అంతేగా" అంటూ వసంత సలహా యిచ్చింది-అన్నయ్య మాటాడకుండా ఆదుకుని-
"మరేఁ" అన్నాడు భాస్కరం. అతని ఉద్దేశం ఈ సమ్మంధం వొద్దవేస్తామని-అంచేతనే వెంటనే అంగీకారం చూపించాడు. కాని, జానికమ్మగారికి ఈ సలహా మరో రకంగా అర్దమైంది. "ఆ అమ్మాయిని ఉద్యోగం వొద్దనేస్తామని" అనుకున్నాదామె.
"మా బాబే! వెయ్యేళ్ళాయుష్షు-లేపోతే అయినింటి కోడలికి ఉద్యోగాలెందుకు చెప్పూ?" అన్నాది.
గతుక్కుమన్నాడు భాస్కరం-
"అది కాదు పిన్నీ....." అన్నాడు.
"ఏది కాదూ?"
"నాకు యీ సమ్మంధం ఎందుకనో నచ్చలేదు." అందామనుకున్నవాడు భాస్కరం నోరు మెదపలేదు.
"వసంత పెళ్ళి అభాసు అవకూడదు" అనుకున్నాడు. అదే గొణుక్కున్నాడు.
"అది సరేగాని, నువ్వు ఆ అమ్మాయి పాట పాడనందుకు కోపగించుకున్నావుకదూ? మరి దాచి వూసెత్తవేమ్" సుబ్బారావుగారడిగాడు.
"సిగ్గు కాబోలు నాన్నా!" వసంత చెప్పింది.
"సిగ్గేమిటి? ఇరవై యేళ్ళు ముడ్డి క్రిందకు వస్తున్నాయి-స్వాతిశయం అంతా ఆ ధనమ్మ పెంపకం.....పోన్లే. నేనేం పాటలు పాడుతున్నాను గనుక." అన్నది జానకమ్మగారు.
జానకమ్మగారికి సురేఖ ఎందుకనో "వచ్చింది" అన్నమాట. ఆమె "అయిష్టత"వల్ల కూడా స్పష్టమవుతూన్నది.
అదే భాస్కరాన్ని మరింత కృంగదీసింది.
వసంతా, భాస్కరం లేచి చేతులు కడుక్కున్నాక రహస్యంగా జానకమ్మగారు భర్తతో "మన వసంత సమ్మంధం స్థిరపడాలీ అంటే మనం సురేఖను ఒప్పుకోవాలనిపిస్తోందండీ" అన్నది.
"సురేఖకేం తక్కువ?" సుబ్బారావుగారు తన అంగీకారంతోపాటు "తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అనే తన పాలసీని కూడా బయట పెట్టుకున్నారు.
"మరి భాసడు కట్నం వొద్ధంటున్నాడండీ!"
"వసంతకు యివ్వద్ధంటాడా?"
"నా కర్మ!..... మీ కొడుకు తత్వం నాక్ ఇంత పిసరు బోధపడదు......వసంతకు సరదాపడి యివ్వవచ్చునట గాని మనం పుచ్చుకోకూడదుట.....ఇదేం చట్టమో" నన్నదామె.
సుబ్బారావుగారు లాయరైపోయాడు.
"ఇదుగో అమ్మాయ్! విను......మొదటిది వాడు నీ కొడుకు. మీ కొడుకు అని అనవాకు- నా కొడుకే అయితే 'లాయరీ' వెలిగించును-నువ్వే సైన్సు చదివించావు-లౌక్యం లేకుండా చేశావ్? పోతే చట్టాన్ని ఏమీ అనకు- దాన్ని చదువుకుని నేను బ్రతుకుతున్నాను" అన్నాడాయన.

"బాగానే ఉంది వరస." అని మళ్ళీ ఆమె "ఒక్కటి తోస్తున్నదండీ" అన్నది భర్తకి తాంబూలం అందించి.
"ఏమిటీ అంటే- ఈ సమ్మంధం ఖాయపర్చుకుని - పై ఏడాదికి ఈ పెళ్ళి చేయడం- ఈ ఏడాది వసంతకు ఆ మూడు ముళ్ళూ వేయించడమూను....." అన్నది.
"బాగుంది."
"ఈలోగా ఆ అమ్మాయిని ఓ ఏడాది చదువుకోమందాం......"
"నీ ఇష్టం" - సుబ్బారావుగారు పగటి నిద్రకు కాస్త అవకాశం దొరికితే చాలు "దాసుడు"గనుక ప్రక్కమీద వాలి అటుతిరిగి 'గుర్రు' పెట్టసాగాడు.
జానికమ్మ అవతలిగదిలో కొడుకు కూతురు ఏం చేస్తున్నారో చూద్దామనుకొన్నది గాని ఆమెకు లేవ బుద్దివెయ్యలేదు.
భర్తకు విసురుతూ కూచున్నది. భోజనానికి కూడా లేవలేదామె.
"వాడు పెళ్ళి అంటే మొరాయిస్తున్నాడు. బహుశా సంసారం కృంగిపోతున్నదని బెంగ కాబోలు అంతే..... లేకపోతే ఈ ధనమ్మ సమ్మంధంలో, లోపమెక్కడ? అమ్మాయి చదువుకున్నదీ అన్న అభ్యంతరం తనకి ఉండాలిగాని తన కొడుక్కి కాదు గదా?"
"కట్నం వద్దూ, అంటే పోనీ మానేస్తానూ?"
"అమ్మో! ఎంత పరువుతక్కువ.......గతిలేని వాడా? గోత్రంలేనివాడా? వాడు ఛీ! నేను ఒప్పుకోను..... కట్నం తీసుకోవాల్సిందే..... కావాలంటే వాడిపెళ్ళాంపేర బ్యాంకులో వేసుకోమను..నాకేం కావాలా?" ఇలా తలపోస్తూనే ఆమె లేచి ఒక్క ఆవేశాన భాస్కరాన్ని "బాసా" అని కేక వేసింది.
భాస్కరం వసంత కూడా గాభరాగా వచ్చారు.
అమెలేచి వంటఇంటికేసి వెడుతూ "వసంతా! నాలుగూ ఎత్తిపెట్టమ్మా!" అన్నది.
భాస్కరం నిర్విన్నుడై "అమ్మా! నువ్వు భోంచేశావా?" అన్నాడు.
"నీకు అంతగా నమ్మకం లేకపోతే నా పరువు కాపాడ్డానికి కట్నం తీసుకుని-ఆనక నీ పెళ్ళాం పేర బ్యాంకులో వేసుకో" మన్నదామె కోపంగా. వాస్తవానికి ఆమె కనుకొలకుల్లో అప్పుడే నీళ్ళు నిండు కొస్తున్నాయి.
"ఛీ! ఇదా పిలుపు!"
విసురుగా వెళ్ళిపోయాడు భాస్కరం.
"ఇంత అపార్ధం చేసుకుంటావనుకోలేదు. పిన్నీ" అని బాధపడ్డాడు.
వసంత "అమ్మా! రామ్మా" ఆనంది ఏమనాలో తోచక.
జానికమ్మగారాపూట అంతా కోపంగానే ఉంది. ఎవ్వరితోనూ మాట్లాడలేదు.
"నీ పెళ్ళి ఎంతో నాకూ వాడిపెళ్ళి అంతేనో, అన్నది ఒకటి రెండుసార్లు వసంతనుద్దేశించి.
"సవతి తల్లిని, గనుక వాడిలా నా మాట కాదంటున్నాడ"న్నదే ఆమె బాధ-
భాస్కరం సురేఖను 'నచ్చలేద'ని చెబితే చాలు ననుకున్నాడు. కాని వసంతకు ధనమ్మగారీ కుదిరిన సమ్మంధం చెడగొడుతుందేమోనని భయం.
