11
భాస్కరం విచలిత హృదయంతో ఆ రాత్రంతా గడిపాడు, "పద్మావతిని తను ప్రేమిస్తున్నాడు. అందులో అతని దోషమెంత? పద్మావతి దోషమెంత? అసలు ప్రేమించడం దోషమా?"
"పాదరసం పాత్రను అంటదంటారు. తామ రాకు మీది నీటిబొట్టు దాని వంటదంటారు. అటువంటి వ్యక్తులున్నూ ఉంటారన్నది నిజమే కావచ్చు! కాని, పాత్ర లేనిదే పాదరస మెక్కడ? ఆకు లేనిదే నీటిబిందువు ఎక్కడ? మనిషి పరిస్థితులను నింధించినకొద్దీ కూడా అతనిని ఆలోచనలు తప్పుదోవకే ఈడుస్తున్నవి-
"ప్రేమించడంలో దోషమేమీ లేదు. సరే ....కాని, ప్రేమకి ఒక పర్యవసానమున్నది కదా?"
"ఒక యువకుడూ, ఒక యువతీ ప్రేమించు కున్నారూ అంటే పెళ్ళి చేసుకోడమే కదా సవ్యమైన పరిణామం!...."
కాని యిది అన్ని వేళలా అంటే తన విషయంలో పొసగుతుందా? అన్నదే భాస్కరం సమస్య......
"పద్మావతిని పెళ్ళి చేసుకోవాలి" అని ఇటీవల బలంగా అనుకుంటున్నాడు భాస్కరం-కాని ఇప్పుడు దానికి అనేకమైన అవాంతరాలు అతన్ని చిక్కుల్లో పెడుతున్నాయి.
పిన్నికి యీ విషయం చెప్పాలీ అంటేనే భయం-"తనలోని యీ బలహీనతకు ఎవరినో నింద చేయడం ఎందుకు?"
పిన్నితో "పద్మను నేను ప్రేమిస్తున్నానూ" అని చెప్పలేకపోడానికి పిరికితనమే కారణం. అందువల్ల రాగల దుష్ట పరిణామాలను వూహించుకున్నాడు. వాటి నెలా తట్టుకోడమో తనకు తెలియదు.
జానకమ్మగారికి పట్టుదల ఎక్కువ - స్త్రీ సహజమైన అహంకారం, మంకుతనం ఆమెలో మరిన్నిపాళ్ళు ఎక్కువే ఉన్నవి కూడా.
తనకంటే భాస్కరాన్ని మిన్నగా ప్రేమించగల వ్యక్తి గాని, శక్తిగాని ఉంటుందని ఆమె వూహించలేదు. "అధవా ఉన్నా, ఆమె అది సహించదు కూడా."
ఆ సంగతి భాస్కరానికి అప్పుడప్పుడు అనుభవానికే వస్తుంది.
"పిన్ని వద్దంటే?"
"వద్దంటుంది, వద్దంటుంది" అనిపించింది. భాస్కరం ఆందోళనతో అటూ యిటూ పక్కలో దొర్లుతూ గడిపాడు.
* * *
జానకమ్మగారి దృష్టిలో 'వివాహం' వేరు - "అల్లుడు కాబోయేవాడికి తాను ఇల్లు గుల్లచేసి కట్నం పోస్తున్నదా? లేదా? తన కొడుకేగా? అంత తీసిపోయాడు? పెళ్ళిళ్ళతో ఇల్లు గుల్ల అనడం లోక విరుద్ధమైన సంఘటనయా?" అన్నదామె ఆలోచన.
వరకట్న నిషేధచట్టమనేది ఉండి రెండువైపులా కొంపలు కూలకుండా నిలబెడుతుందని ఆమె నొప్పించగలగడం అసాధ్యం.
"లోక సామాన్య విషయానికి సంప్రదాయానికి చట్ట మేమిటి? ఇవాళ 'కట్టడి' ఏమిటి? అదీ గాక నా కూతురికి నేను కట్నం యివ్వనంటున్నానా? నా కొడుక్కి వద్దూ అవడానికీ" అంటుందామె తరుచు భర్తతో.
"రేపూ, పెళ్ళికి మంత్రాలూ వద్దు - తాళి కట్టనూ వద్దు - మీ బిడ్డలకు కాయితం ముక్క పెళ్ళిళ్ళు చాలునూ అంటే శాసనంగా, వూరు కోడమేనా?" ఆమె భర్తను నిలదీస్తుంది. "సంప్రదాయం 'అచ్చటా' 'ముచ్చటా' అన్నీ గోదార్లో కలియాల్సిందేనా ..... భాసడు వెర్రివాడు. ఇంకా పసివాడు-వాడికీ, వసంతకీ మనం అధికారం యిస్తే ఎద్దు నడిగి గంతలు కట్టడమే" నంటుందామె.
సుబ్బారావుగారు ఎటూ చెప్పడు. కొడుకు "కట్నం వొద్ధన్నాడూ" అని వసంత వచ్చి అంటేనూ వూరుకున్నాడు. ఇల్లాలు ఇలా వాదిస్తేనూ వూరుకున్నాడు.
చుట్ట మాత్రం రంజుగా కాల్చుకుంటాడాయన; ఇలా జానకమ్మగారు నాలుగూ దులిపేస్తున్నప్పుడు "ససేమిరా" మాటాడడు.
"జానకమ్మగారు పోనీ ఎందుకొచ్చిన గొడవ, భాసది మాటే విని ఆలోచిద్దాం" అని ఎంతో ఆలోచిస్తుంది ఒక్కోసారి. కాని కట్నం యివ్వడం దోషం కానప్పుడు-కట్నం ఇచ్చినవాళ్ళు పుచ్చుకుంటే పాపమెలా అవుతుందో ఆమెకి అర్ధంగానేలేదు.
"వాడికి 'సురేఖ' ను చూడటం యిష్టంలేదు. ఎందుకంటే వాడికి ఖర్చు లంటే భయం ...... అందుకనే వెర్రినాగమ్మవాడు! ఈ కట్నం కాసులు పట్టవని సాకులు చెబుతున్నాడు" అనుకున్నదామె.
కాని రామ రామ ఆమె గత నలుగు రోజుల్లోనూ భాస్కరం మూర్ఖతకు వేరే ఇదేనా కారణముంధాని అనుమానించింది. అందుక్కారణం వాడు "తిండి సరిగా తినడు-నిద్ర కూడా పోడంలేదల్లే ఉంది. కళ్ళు పీక్కుపోయాయి." అనే ఆమె బెంగ-ఇందులో ఏదో రహస్యం మున్నదనుకుందామె-స్త్రీ ఇటువంటి రహస్యం ఉందని భావించిందో-దాన్ని చేధించక మానదు. పైగా జానకమ్మగారి మాతృహృదయం దాని నిర్మూలించనిదే నిద్ర పోదల్చుకోలేదు కూడా-
పైగా జానకమ్మగారు భాస్కరానికి "పిన్ని"-తల్లి కూడా కాదు.
"నేనేం వాడి తల్లినేమో జాలిపడ్తానూ అనుకోకండి! వాడు నన్ను పిన్నీ అంటాడు. నేను 'పిన్ని' నండీ! వాళ్ళ అమ్మ నాకంటే వాణ్ణి ప్రేమించేదా? మీ భ్రమ-నేను వాడికి 'పిన్ని' ని"-అంటుందామె భర్త సుబ్బారావుగారితో.
"పిన్నీ, నువ్వు అమ్మకన్నా ఎక్కువ" అని "వాడు" అన్నప్పుడల్లా ఆమెకు గర్వంగా ఉంటుంది. అదే సుబ్బారావుగారి చుట్ట హాయిగా కాలడంలోని రహస్యం కూడా. ఈ సంగతి ఆయనొక్కడికే తెలుసు.
12
'ధనమ్మ' అన్న పే రా మెకు అక్షరాల తగును. అంతేకాదు. అందు కామె ఔదార్యం కూడా ఏమీ తీసిపోదు. వాస్తవానికి సురేఖ కన్న కూతురు కాదన్న మాటే గాని, అంతకంటే ఎక్కువే ఆమెకు-భర్త ఆర్జించిన ఆర్జనను ఆమె దుర్వినియోగం చేయలేదు గాని "చేతికి ఎముక లేదూ" అనిపించుకునే మేరకు దానధర్మాలు చేసింది. అందరూ ఆమెను 'స్తుతించి' కాస్త బాగుపడ్డానికి అలవాటు పడటంతో ఆమెకు కూడా తనకు తెలిటని దర్పమూ, అహంకారమూ పేరుకున్నాయి. అవే ఆమెలో వయస్సు ముదిరినకొద్దీ పెరిగి సురేఖ మీద కూడా మక్కువగా రూపొందాయి.

కొందరి మనుషుల్లో ఔధర్యమూ, దానగుణమూ కూడా అహంకారాన్ని పురస్కరించుకొనే ఉంటాయి. ధనమ్మగారిలో ఉన్న ధర్మనిరతికి కూడా ఈమాత్రం వర్తిస్తుంది. "ఆమె మాట కెదురు జరగకూడదు. ఆమె కావాలనుకున్నది లభ్యమై తీరాలి" అదీ ఆమె నైజం.
"ఏం నా కోరిక ఎందుకు చెల్లకూడదు? నాకేం తక్కువ?" అదీ ఆమె ప్రశ్న.
వసంతను చూసి చేసుకుంటాను అని ఉత్సాహంగా తల వూపిన యువకుడు ముకుందరావు ఆమె దగ్గర ఉండి, కొంత ఆర్దికమైన సంరక్షణను కూడా పొంది, చదువుకున్నాడు. ముకుందరావు తండ్రి రాఘవేంద్రరావు ధనమ్మకేం దగ్గరి బంధువు కాడు. కాని ఆవిడ మాత్రం నాలుగైదు ఆ కుర్రవాని విద్యాభ్యాసాన్నీ పురస్కరించుకు సాయంజేసింది.
రాఘవేంద్రరావు "తన కుర్రవాడు ఉండటానికి ఏరంత ఇల్లు ఉన్నది గనుక కాస్త ఆశ్రయం ఇమ్మని" వచ్చాడు ధనమ్మ దగ్గరికి.
"బుద్దిమంతుడైతే ఆశ్రయంమేం కర్మ హోటలు కూడు కూడా తిననివ్వనూ" అన్నదామె.
"నీ చలువను వాడో గ్రాడ్యుయేటు అయితే చర్మం వొలిచి చెప్పులు కుట్టించనా తల్లీ? ఎందుకంటే ఈ రోజుల్లో వాణ్ణి హాస్టలో ఉంచడం-కోరివుండి కొరివితో తల గోక్కోడమే నని వాళ్ళమ్మ బాధ" అన్నాడు రాఘవేంద్రగారు.
ధనమ్మకూ, రాఘవేంద్రానికీ ఉన్నది వేలువిడిచిన చుట్టరికమే గాని దరిమిలాను పెరిగింది.
మాటలకు ఉబ్బిపోయే మనిషి గనుక ధనమ్మ గారు "ఒప్పుకుంది ముకుందాన్ని". అధికారాన్ని చలాయించే బాధ్యతతో సహా యింట ఓ గది నిచ్చి చేరదీసింది"-మొదటి రోజుల్లో ఆమెకు వేరే ఒక ఉద్దేశమున్నా తర్వాత తర్వాత ఆమె ముకుందరావు పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుంది.
ముకుందరావును తాను పెంచుకోవడం, దత్తు చేసుకోడం అక్కరలేదు తనకు. గ్రాడ్యుయేటు అయిన అమ్మాయి-సురేఖ ఉన్నది. కాని సురేఖకు "బుద్దిమంతుడవుతాడు, చెప్పినట్లు వింటాడు. ఈ ముకుందాన్ని కడుదునా?" అనుకున్నది కూడా ఆమె. కాని రాఘవేంద్రరావు తన అంతస్థుకు ఏవిధంగానూ తూగలేడని ఆమె తీర్మానించుకున్నది.
"నా కొడుకూ, కూతురూ కూడా సురేఖయే" ననుకుంటుంది ధనమ్మగారు.
ముకుందం చదువుకు ఆమె నాలుగైదు వేలు రొక్కం యిచ్చిందీ అంటే తానై పిలిచి యివ్వలేదు. రాఘవేంద్రరావు తన "ఇంటిమీద" తీసుకున్నాడు. అతనికి గల పిత్రార్జితన్ని-తన కొడుకు చదువుకు వాడుకున్నా డావిధంగా అతగాడు.
ఐతే ధనమ్మగారి ఔదార్య మెక్కడా? అనవొచ్చును గాని ముకుందరావు చదువుముగిసింది. ఉద్యోగమైంది. ఒక ఇంక్రిమెంట్ కూడా వొచ్చింది ఐనా ఆమె "అప్పు" అన్నమాట "మాటవరస"గా నేనా అడగలేదు.
ఆవేళ రాఘవేంద్రరావుగారు వచ్చాడు. కండువా మెడమీద అటూ యిటూ సవరించుకుని వినయంగా కూచున్నాడు. ధనమ్మగారు దేవీ భాగవాతం చదూకుంటుంది. తలఎత్తి చూసింది.
"రా! అన్నయ్యా! కూచో" మన్నది.
"ఎందుక్కాచోను తల్లీ! ఇవాళ నేను ఇంత ఇదిగా ఉన్నాను అంటే అదంతా నీ చలవేనమ్మా వెల్లీ"-అతను కూచున్నాడు.
ఆమె పుస్తకం మూసి కళ్ళజోడు తీసిపెట్టెలో పెడుతూ "ఆఁ ..... నాదేముందిలే ..... అంతా స్వర్గాన ఉన్న ఆయన చలవ. ఆయన రెండు చేతులా భగవత్క్రుపవల్ల ఆర్జించి పోశారేమో .....నేను యీనాడు యిలా నిలబడగలిగానేమో ....." అన్నది ధనమ్మగారు.
వంటవాణ్ణి "సూరప్పా" అని కేకేసి "ఈయనకు మజ్జిగ కంచు గళాసులో పోసి యియ్యి" మని పురమాయించింది.
నేరుగా రాఘవేంద్రగారి కేసి చూసి "ఐతే అన్నయ్యా! మీవాడు ముకుందమూ, నువ్వూ ఒక్క మాటకు వచ్చేరా?" అన్నది. అంటే కట్నం విషయంలో సుబ్బారావుగారి సమ్మంధం నిర్ణయమయిందా? అన్నదామె ప్రశ్న.
"భలేదానివే నమ్మాయ్! మాదేముంది. పైగా కుర్రవాడు, వాడిదేముంది? ఎద్దు నడిగా? గంతలు కడతాము .... అంతా నీచేత బెట్టాను-నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం .....ఆపైన ఫాలాక్షుడి కృప."
"మనదే ముందయ్యా! అంతా దైవకృప. ఆయన ఆనాడు రెండు చేతులా ఆర్జించి పోయారు. ఈనాడు నేను దాన్ని సద్వివియోగం చేసుకుంటున్నాను" అన్న దామె మళ్ళీ . సాధార్నంగా భర్తను తల్చుకుని తన ఔదార్యాన్ని ఆయనకు అంకితం చేయడం ఆమెకు మాటలమధ్య అలవాటుగా వస్తూన్నదేను.
"ఈ పెళ్ళి నీ చేతులమీదుగా అవ్వాలి" మజ్జిగ త్రాగి గ్లాసు నక్కడ పెడుతూ చెప్పాడు రాఘవేంద్రరావుగారు. "దాంతో నేను ఋణ విముక్తుడను కూడా అవ్వాలని ఉంది."
"అంటే కట్నం నాలుగుకీ తక్కువా ఆరుకి ఎక్కువా గాకండా అడిగావన్నమాట?" అన్నదామె అతని ఆంతర్యం గ్రహించినట్లు నవ్వి. "అది సరే కాని, యిప్పుడు నిన్ను నా బాకీ తీర్చమనీ, ఇల్లు తీసి వాకిట్లో పెట్టుకుంటున్నానుటయ్యానేనూ? నన్ను పదిమందిలో చులకన చెయ్యాలనే గాని" అన్న దావిడ దర్జాగా చూస్తూ.
'ఛాఛా! నెత్తిన చెయ్యి పెట్టుకుని మరీ చెబుతున్నా ..... నిన్నన్నవాడు పుట్టగతులు లేకుండా పోతా దనుకో" అన్నా డతగాడు. కాస్త యిసింటా జరిగాడు.
"నువ్వు వాడికి గార్డియన్ వనుకో. అందుకని కాస్త నీ హోదాకు తగ్గట్లు ఉండాలని అడిగానంతే .... ఈ యిష్టం .... ముకుందం విలువ యివాళ నువ్వు నూటపదార్లు అన్నా నాకు సమ్మతమే......"
రాఘవేంద్రానికి తనపై గల ఈ గౌరవానికీ, గురికీ ధనమ్మ ఉబ్బిపోయిందనడానికి ఆమె ఉచ్చ్వాసం నింపుకున్న తీరే నిదర్శనం.
ఆమె అడిగింది. "అది అలా ఉంచు......ముందీ మాట చెప్పు అన్నయ్యా!.....మీ వియ్యంకుడి కొడుకు భాస్కరం గురించి నీ అభిప్రాయం ఏమిటి?
ఇది తన సొంత విషయం గనుక యీసారి ధనమ్మగారు తను కొంచెం యిసింటా జరిగింది.
రాఘవేంద్రరావుగారు కాస్త నిరుత్సాహపడ్డాడు కాని తప్పుతుందా-రెండు క్షణాలు భాస్కరాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నట్లు ఆలోచించాడు.
"అతగాడికేం? మణిపూస.....అందులోనూ నీ కళ్ళకి అగుపించి నచ్చితే అది రత్నమే అవ్వాలి ..... మంచివాడేననిపిస్తోంది" అన్నాడు.
"సరిలే!.....మా సురేఖకు కేవలం నవ మన్మథుడు లాంటి వాడైతేనే చాలదు....ఈ ధనమ్మ అల్లుడు అవ్వాలీ అంటే వాడు నలకూబరుడే అయినా సరే, తెలివీ తేతా ఉంటేనే గాని తూగలేడు......పైగా సురేఖ కూడా నన్ను పోలినది చాలా తెలివైన పిల్ల ......."
"ఔనౌను! పెంచినందుకుగాను అది నీ ముక్కుగుద్ది పెరిగిందనుకో ...." రాఘవేంద్ర రావు అన్నాడు. "నిజంగా నువ్వు అన్నమాటకూడా ఆలోచించాలి .... అంధ మేమేనా కొరుక్కుని తింటామా?...... సరే..... మరోసారి నలుగుర్ని కుర్రవాని గురించి వాకబుచేసి చెబుతానుగా ...... నీ కార్యం ఒకటీ, నాది యింకోటీ గాదు."-అని నమ్మబలుకుతూ కాస్త గొంతు తగ్గించి "ఇంతకీ అమ్మాయ్ సురేఖ ఉందా? ఇంట్లో" అనడిగాడు.
"ఉన్నది కాబోలు...... లోపల ఏవో ఉత్తరాలు రాసుకుంటున్నది......సరే నువ్వు మాత్రం నీ అప్పు గురించి ఏమీ చింతపడకన్నాయ్! అప్పులూ, ఆస్తులూ శాశ్వతాలు కాదు ...... అయినింటి యీ సమ్మంధం స్థిరపడాలి .... అదీ ముఖ్యం" ఆమె చెప్పింది.
"బాగా అన్నావు తల్లీ! ఇంతకీ రేపే గదూ, యీ భాస్కరం వాళ్ళ అమ్మా, నాన్నా అంతా వస్తున్నారూ సరే.....పిల్లది చూస్తానందా?"
