
10
తాత ముత్తవలతో గుంటూరు తిరిగి వచ్చిన రాజశేఖర మూర్తి అయిదవ ఫారం లో చేరాడు. స్కూలు ఫైనల్ పరీక్షకు చివరి రెండు సంవత్సరాలు ముఖ్యమైనవి. రాజశేఖర మూర్తి చదువు ఎన్నడూ అశ్రద్ధ చెయ్యలేదు. వయస్సు వచ్చే కొద్దీ కొత్త ఊహలు, కొత్త భావనలు కలగటం సహజం . జానకీ రామచంద్రుల వివాహం వ్యక్త వయస్కుడైన రాజశేఖర మూర్తి హృదయంతరాళం లో గిలిగింతలు పెట్టినది. కానీ అది తాత్కాలికము. రాజశేఖర మూర్తి గణిత శాస్త్రం కోరి పుచ్చుకున్నాడు. ఆల్జీబ్రా (సంఖ్యా గణితము) కొందరికి గుండెలో గాభరా పెడుతుంది. కాని రాజశేఖర మూర్తికి అది చాలా తేలిక అనిపించింది. జామెట్రీ "రేఖా గణితము) అతనికి పానీయా ప్రాయం అయింది. సంస్కృత సాహిత్యం మీద అతనికి ఆసక్తి మెండు. రఘు వంశం లో మహాకవి కాళిదాసు వ్రాసిన ఒక్కొక్క శ్లోకాన్ని అనుసరించి అనుష్టుస్ వృత్తం లో స్వంతంగా వేరొక శ్లోకం వ్రాయటం మొదలు పెట్టాడు.
వెంకటా చలపతి గారికి రాజేశ్వరీ దేవి చనిపోయిన నాటికి ముప్పయి అయిదు ఏళ్ళయినా లేవు. ఆయనను మళ్ళీ వివాహం చేసుకోమని తల్లి సీతమ్మ గారు, అన్న సుబ్బారావు గారు, ఇతర బంధు మిత్రులు బతిమాలారు. "రెండుసార్లు తల బొప్పి కట్టింది. ఇంక నేను చేసుకొని పొమ్మన్నారు వెంకటా చలపతి గారు.
"ఎల్లకాలం నిన్నెవరు కనిపెట్టు కుంటారు రా, నాయనా? నేనేమో ముసలిదాన్ని అయిపోయాను. బతికినన్నాళ్ళు ఇంక బతకబోను. నీకొక తోడూ చూపించి నా దారిన నే కళ్ళు మూసుకుంటే నాకే బాధా ఉండదు. నా మాట విను, తండ్రీ " అని నెత్తిన నోరు పెట్టుకుని చెప్పింది సీతమ్మ గారు. ససేమిరా వల్ల కాదన్నారు చలపతి గారు.
అయన జీవితం లో వెలుగే ఆరిపోయింది. ఏ రెండు మూడు సంవత్సరాలు శ్రీదేవి తో సుఖంగా సంసారం చేశారో అంతే-- ఆ తరవాత సుఖమన్నది లేదు. రాజేశ్వరీ దేవినీ అంతగానే ప్రేమించారాయన. అయితేనేమి సంసారం లో సుఖమన్నది లేకపోయింది. కన్న కొడుకును దగ్గిర ఉంచుకుని చదువు సంధ్యలు చెప్పించుకోలేక పోయారు. తనకు ప్రాణం పెట్టిన అత్తమామలనూ , కొడుకునూ ఇల్లు వెడల గొట్టాడన్న అపకీర్తితో తల ఎట్టుకోలేక పోయారు. వ్యాపారమూ చితికి పోయింది. బతకలేక బడి పంతు లన్నట్టు మారుమూల పల్లెటూళ్ళో ఓనమాలు దిద్దిస్తూ తలదాచు కోవలసి వచ్చింది. అదీ దినదిన గండంగా తయారయింది. ప్రతి సంవత్సరం ఇన్ స్పెక్టర్ రావటం , ఈ ఉపాధ్యాయుడు ట్రెయినింగ్ కాలేదు కనక ఇంతోటి ఉద్యోగానికి తగడని వ్రాసి పోతుండటం పరిపాటి అయింది. 'అరవై ఎల్లోచ్చాక చదువుకోక మన్ను కొట్టుకుంటావా?' అన్నట్టు ఇప్పుడింకా నాకు ట్రెయినింగేమిటని మొండి కేసి కూర్చున్నారు వెంకటా చలపతి గారు. ఈసారి ఇన్ స్పెక్షను లో కొత్తగా వచ్చిన ఇన్ స్పెక్టర్ ఇంకా కొంచెం తీవ్రంగా వ్రాసి పోయాడు. సంవత్సరం లోపల ఈ ఉపాధ్యాయుడ్నీ తొలగించి సుశిక్షితుడైన ఉపాధ్యాయుడి ని నియమించక పొతే ఈ స్కూలు కిక రికగ్నినేషన్ తీసివేస్తా మన్నాడు.
రాజశేఖర మూర్తి స్కూలు ఫైనల్ పరీక్షలకు వెళ్ళాడు. అన్ని పరీక్షల లోనూ చక్కగా వ్రాశాడు. పెద్ద మార్కులతో పాసవుతానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. వేసవి సెలవులకు మామూలుగానే వీరన్న పేట వెళ్ళాడు. రామచంద్ర మూర్తి కరిణీకం పరీక్షలు పాసయి, ప్రస్తుతం స్వంత ఊరు కరిణీకం తండ్రి గారు చేస్తున్నారు కనక తాత్కాలికంగా పొరుగూరి కరిణీ కమేదో ఖాళీ అయితే ఇంటి దగ్గరే ఉండి ఆ కరిణీకం చెయ్యటం ప్రారంభించాడు. ఆ కిందటి మాఘ మాసం లోనే పునస్సంధానం జరిగింది. జానకీ దేవి కాపరానికి వచ్చింది. రెండు సంవత్సరాల తరవాత జానకీ దేవి ని ఇప్పుడే చూశాడు రాజశేఖర మూర్తి.
"జ్ఞాపకం ఉన్నానా, వదినా?' అన్నాడు రాజశేఖర మూర్తి.
"లేదయ్యా! అయిదు పిలకల అబ్బాయి ఎవరో పెళ్ళిలో పల్లకీ వెంట నడవటం , బండి తోలటం జ్ఞాపకం . కొంపదీసి ఆ అబ్బాయివి కాదు కదా?' అన్నది జానకీ దేవి.
అప్పటి తన రూపాన్ని జ్ఞాపకం తెచ్చుకుని సిగ్గు పడ్డాడు రాజశేఖర మూర్తి.
'అదే, వదినా , ఆ అయిదు పిలకలే ఇప్పుడు అయిదు వేల పిలకలయ్యాయి."
వదినా, మరిదీ నవ్వుకున్నారు.
"ఏం, వదినా , మా అన్నయ్య ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళటం లేదటగా?"
"అయితే కరిణీకం ఎవరు చేస్తున్నారటా?"
"దానిదేముందిలే, వదినా! సంవత్సరాని, కొకమాటు శిస్తులు వసూలు చేసేయ్యటం , పద్దులు వ్రాసేయ్యటం."'
"చూద్దాం గా, మీ రాణి గారు వచ్చినప్పుడు నువ్వింట్లోనే కూర్చుంటావో, ఉద్యోగమే చేస్తావో?"
"నీలాంటి రాణి గారే వస్తే, వదినా, నేను ఉద్యోగమే చెయ్యను. పద్యాలు వ్రాసుకుంటూ , పాటలు పాడుకుంటూ ఆ రాణీ గారి సన్నిధానం లోనే కూర్చుంటాను."
జానకీ దేవి సిగ్గు పడింది.
రాజశేఖర మూర్తి వీరన్న పేట వచ్చి ఒక పక్షమైనా కాలేదు, గుంటూరు నించి ఉత్తరం వచ్చింది. దుర్గాప్రసాదరావు గారికి జబ్బుగా ఉన్నదట, వెంటనే రాజశేఖర మూర్తిని తీసుకుని వెంకటాచలపతి గారిని రమ్మని వ్రాశారు. వెంటనే బయలుదేరారు. ఎందుకైనా మంచిదని సీతమ్మ గారు కూడా బయలుదేరింది. గుంటూరు వెళ్లి చూసేసరికి దుర్గాప్రసాదరావు గారు స్పృహ లో లేరు. వెంకటరత్నం గారు పక్కన కూర్చుని ఉన్నారు. మాణిక్యమ్మ గారు రాజశేఖర మూర్తి ని భర్త దగ్గిరికి తీసుకు వెళ్లి, "ఇదిగో, రాజు వచ్చాడు. చూడండి." అన్నది. రాజశేఖర మూర్తి తలమీద చెయ్యి వేసి కళ్ళ నీరు పెట్టుకున్నారాయన. డాక్టరు వచ్చి, ఇంజక్షన్ ఇచ్చి, పరిస్థితి విపత్కరంగా ఉన్నదని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి తెల్లవారు ఝామున మూడు గంటల వేళ ఆ మహర్షి ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది.
రాజశేఖరమూర్తి గొల్లుమన్నాడు. తల్లి పోయినప్పుడు బుద్ది తెలియదు. పినతల్లి పోయినప్పుడు దగ్గిర లేడు తాతగారి మరణం రాజశేఖర మూర్తి బుద్ది తెలిసిన తరవాత స్వయంగా చూసి అనుభవించిన మొదటి విపత్తు. అందులోనూ ఆయన తనను గుండెల మీద పడుకో బెట్టుకుని భారత భాగవతాలు నూరి పోసిన తాతయ్య తన అభివృద్ధి కోసమే జీవితాన్ని అర్పితం చేసిన తాతయ్య దగ్గిర నేర్చుకున్నదంతా ఒక ఎత్తు నిత్యమూ దేవీ పూజా దురంధరుడే! ఆ దేవి ఆయన్ని ఎందుకు రక్షించ లేదు?
వెంకటాచలపతి గారు కొడుకును దగ్గిరికి తీసుకున్నారు. మాణిక్యమ్మ గారి సంగతి చెప్పనే అక్కరలేదు. ఆమెకు ఒకదాని తరవాత ఒకటి విపత్తులు. సీతమ్మ గారు, రుక్మిణమ్మ గారు ఆమెను పట్టుకోలేక పోయారు. ఆమె కన్నీటి ధార భాగీరధీ ప్రవాహమే అయింది.
11
దుర్గా ప్రసాదరావు గారి మరణంతో మాణిక్యమ్మ గారు ఒంటరిదయింది. అయన కన్నులు లేనివాడైనా ఇంటిలో ఒక పురుషుడు ఉన్నాడంటే అదొక పెద్ద ధైర్యం. రాజశేఖర మూర్తి ఇంకా కుర్రవాడు. అతనికి పై చదువులు చెప్పించవలసి ఉన్నది.
అక్కడ వెంకటాచలపతి గారి ఉద్యోగ పరిస్థితి కూడా తృప్తి కరంగా లేదు. దినదిన గండం నూరేళ్ళ యుష్షు లాగ ఉన్నది. అయినా, ఇంక తన ఏకైక పుత్రుడితో ఎడబాటు ఎవరిని ఉద్దరించడానికి? రాజశేఖర మూర్తి భవిష్యదభివృద్ది కోపం గుంటూరు లో ఉండక తప్పదూ కనక తను కూడా మళ్ళీ పల్లెటూరి కాపరం ఎత్తి వేసి గుంటూరు వచ్చి ఏదో కొత్త జీవనాధారం చూసుకుంటే అటు మాణిక్యమ్మ గారికి సహాయంగా నూ ఉంటుంది. ఇటు ఇన్ స్పెక్టర్ల బెదిరింపు లూ తప్పుతాయి. అన్నిటికన్న కొడుకును కనిపెట్టుకుని ఉండనూ వచ్చు అనుకున్నారు వెంకటా చలపతి గారు. వెంకటరత్నం గారూ, సుబ్బారావు గారూ కూడా ఈ ప్రతిపాదన బలపరిచారు.'
