Previous Page Next Page 
ఇందుమతి పేజి 8


                                   8
    రాజశేఖర మూర్తి నాలుగో ఫారం చదువుతున్న రోజుల్లో ఒకనాడు వీరన్న పేట నించి దుర్వార్త వచ్చింది. రాజేశ్వరీ దేవి మళ్ళీ ప్రసవించి పిల్లతో కూడా స్వర్గస్థురాలయిందనీ, రాజును  వెంటనే తీసుకుని రమ్మనీ సుబ్బారావు గారు రామచంద్ర మూర్తి ని పంపారు. దుర్గాప్రసాదరావు గారూ, మాణిక్యమ్మ గారూ తమ అల్లుడికి పట్టిన దుస్థితి కి ఎంతో బాధపడ్డారు. తమ బిడ్డ కేమో ఆయువు చెల్లి ఆ కాలంలో పోయింది. అల్లుడు మళ్ళీ వివాహం చేసుకుని ఎలాగో సుఖంగా ఉన్నాడు కదా అని సంతోషిస్తుంటే ఈ వైపరీత్యమేమిటి?
    రాజశేఖర మూర్తి తన తండ్రి వీరన్న పేటలో కాపరం పెట్టిన తరవాత ఆ ఊరు వెళ్ళటం ఇదే మొదటిసారి. అంతకు ముందు ఒకమారు చిన్నతనం లో సీతమ్మ గారు తనతో తీసుకు వెళ్లి నెలరోజులు ఉంచుకుని మళ్ళీ తీసుకు వచ్చి దిగ బెట్టింది. ఈ మధ్యకాలం లో వెంకటాచలపతి గారు, సీతమ్మ గారు వారికి వీలైనప్పుడు గుంటూరు వచ్చి చూసి  వెళుతుండేవారు. రాజేశ్వరీ దేవి తను బతికి ఉన్నంత కాలం సవతి కొడుకును దూరంగా నే ఉంచింది. కాని చివరికి ఆ సవితి కొడుకే వచ్చి తన కర్మ కాండకు కర్త్రుత్యం వహించక తప్పలేదు. శోకం మూర్తీభవించినట్టు, కన్నీరు గడ్డ కట్టుకు పోయినట్టు మాటా మంతీ లేకుండా కూర్చున్న వెంకటా చలపతి గారు కొడుకును చూడగానే ద్రవించి పోయారు. పద్నాలుగేళ్ళయినా నిండని కుమారుడి భుజ స్కందాల మీద ఇద్దరు తల్లుల శ్రాద్ధ కర్తృత్వం మోపవలసి వచ్చినందుకు అయన కుమిలి పోయారు.
    వెంకాయమ్మ గారూ, ఆవిడ సంతానం , అక్క చెల్లెళ్ళూ, వారి కొడుకులూ కూతుళ్ళూ అంతా దిగారు. వెంకాయమ్మ గారు అయిన వారినీ కాని వారినీ తిట్టి పోసింది. సీతమ్మ గారిని, "నువ్వే నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నా" వన్నది. ఎదురుగా లేని మాణిక్యమ్మ గారిని, "నీ ఏడుపు మండిపోనూ, నీ కళ్ళు కాయలు గాయా!' అని మరీ మరీ శపించింది. "ఈ దిక్కుమాలిన సంబంధం ఎందుకు తీసుకు వచ్చి కట్టావురా భగవంతుడా!" అని ఆ భగవంతుడికి కూడా నోటికి వచ్చినట్టు శాపనార్ధాలు ముట్ట చెప్పింది.
    జరగవలసిన కార్యక్రమం జరిగిపోయింది. రాజశేఖర మూర్తి గుంటూరు వెళ్ళిపోయాడు. ముండిత శిరస్కుడైన రాజును చూసి మాణిక్యమ్మ గారు గోల్లుమన్నది. కంట తడి పెట్టుకున్నారు దుర్గాప్రసాద రావుగారు.
    రాజేశ్వరీ దేవి పోయిన నాటి నించీ వెంకటా చలపతి గారికి రాజు ఏకైక లక్ష్య మైనాడు. క్రిస్ మష్ సెలవులకు, వేసవి సెలవులకు ప్రతి సంవత్సరం రాజును వీరన్న పేట తీసుకుని వెళ్ళేవారు. దసరా సెలవులకు మాత్రం దేవీ పూజల వల్ల గుంటూరు లోనే ఉండవలసి వచ్చేది. ఆ పది రోజులూ వెంకటా చలపతి గారూ సీతమ్మ గారూ కూడా వచ్చి గుంటూరు లోనే ఉండటం మొదలు పెట్టారు.

                                 9
    సెలవులకు వీరన్న పేట తరుచు వెళ్లి వస్తూండటం తో రాజశేఖర మూర్తి కి తన తండ్రి వైపు చుట్టపక్కా లందరూ బాగా పరిచయం అయ్యారు. తల్లిలేని పిల్లవాడని వారందరికీ రాజు మీద అపరిమితమైన దయ. ఏటేటా స్కాలరు షిప్పు లతో చక్కగా చదువు కుని వృద్ది లోకి వస్తున్నాడని గౌరవము. స్వంత అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని లేని రాజశేఖర మూర్తికి పెద తండ్రి గారైనా సుబ్బారావు గారి పిల్లలే సహోదరు లయ్యారు. రామచంద్ర మూర్తి ని అన్నా అనీ, శారద ను చెల్లీ అని ఆపేక్షగా పిలిచేవాడు. వాళ్ళు కూడా అంతటి అపేక్ష చూపించేవారు. శారద కు రామచంద్ర మూర్తి పెద్దన్నయ్య, రాజశేఖర మూర్తి చిన్నన్నయ్య.
    రామచంద్ర మూర్తి వీరన్న పేటకు అరుమైళ్ళ దూరంలో ఉన్న బస్తీ కి రోజూ సైకిలు మీద పోయి హైస్కూలు లో చదువుకుని వస్తుండేవాడు. శారద పినతండ్రి గారి స్కూలు లోనే నాలుగో క్లాసు వరకు చదివి అంతటితో ఆపి, నాటి నుండీ తల్లి వద్ద గృహ కృత్యాలు నేర్చుకుంటున్నది.
    రాజశేఖర మూర్తి నాలుగో ఫారం పాసయిన సంవత్సరమే రామచంద్ర మూర్తి స్కూలు ఫైనలు పాసయ్యాడు. అతని చదువు అంతటితో ఆపించి కరిణీ కపు పరీక్షలకు పంపించాలని సుబ్బారావు గారి ఉద్దేశం. స్కూలు ఫైనలు పరీక్ష అయిన వెంటనే రామచంద్ర మూర్తి కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. రామచంద్ర మూర్తి పేరుకు రామచంద్రుడు గాని, సూర్యదేవుని వంటి శరీర చ్చాయ కలవాడు. స్కూలు ఫైనలు వరకు చదువుకున్నవాడు. ఆస్తి కలవాడు. కరిణీ కం ఉన్నది. ఇక సంబంధాలు కేమి లోటు? వీరన్న పేటకు పది మైళ్ళ దూరంలో ఉన్న సూరం పల్లి అనే గ్రామ కరణం గారు తమ కుమార్తె ను జానకిని రామచంద్ర మూర్తి కి ఇస్తామని కబురు పెట్టారు. వేయి న్నూట పదహార్లు కట్నం, వెండి పళ్ళెం, వెండి చెంబు, పట్టు బట్టలు , అలక పాన్పు మీద రిస్టు వాచీ బహుమానం , ఆడపడుచు కు నూట పదహార్లు , అత్తగారికి పట్టు చీర ఇచ్చారు. వారిది సంప్రదాయ పూర్వకమైన కుటుంబం. పిల్ల నల్లనిది కానీ ఆకర్షణ కల ముఖం. స్త్రీల పాటలు, మంగళ హారతులు బాగా పాడగలదు. రామచంద్ర మూర్తి తల్లి తండ్రులతో కూడా ఆ ఊరికి పోయి పిల్లను చూసి వచ్చి నచ్చిందన్నాడు. జ్యేష్ట మాసం లో పెళ్లి నిశ్చయ మయింది.'    ఇదే సమయం లో రాజశేఖర మూర్తి ఉపనయనం కూడా చేస్తే బాగుంటుందన్నారు సుబ్బారావు గారు. ఖర్చు కొంత కలిసి వస్తుంది కదా అని సరే అన్నారు వెంకటా చలపతి గారు. రాజు వేసవి సెలవులకు వీరన్న పేటలోనే ఉన్నాడు. దుర్గాప్రసాద రావు గారికి వ్రాసి అయన ఉద్దేశం కూడా కనుకున్నారు. అంతకన్న కావలసింది ఏమున్నదన్నారయన.
    వారం రోజులు ముందుగా గుంటూరు వెళ్లి దుర్గా ప్రసాదరావు దంపతులను వెంట బెట్టుకుని వచ్చారు వెంకటా చలపతి గారు. వెంకట రత్నం గారినీ , వారి కుటుంబాన్నీ కూడా ఆహ్వానించారు. బ్రహ్మ సమాజవాది అయిన వెంకట రత్నం గారికి ఉపనయనాలు కిట్టవు. అయినప్పటికీ భార్య నూ కుర్రవాడ్నీ ఆనాటికి పంపుతామన్నారు. అన్న ప్రకారం రుక్మిణమ్మ గారూ రవీ రేపు ఉపనయనం అనగా వచ్చి దిగారు.
    ముందు వీరన్న పేటలో రాజశేఖర మూర్తి ఉపనయనం. తరవాత మూడు రోజులకు సూరం పల్లిలో రామచంద్ర మూర్తి వివాహం. రాజుకు చెవులు కుట్టించారు. పంచ శిఖలు పెట్టించారు. సంధ్యా వందనం నేర్పించారు. సుబ్బారావు గారు, సుభద్రమ్మ గారు పీటల మీద కూర్చుని కార్యక్రమం అంతా జరిపించారు. కుమారుడి ఉపనయనం స్వంతంగా జరిపించలేక పోయినందుకు వెంకటా చలపతి గారు విలపించారు. దుర్గాప్రసాద రావు గారు, మాణిక్యమ్మ గారు, సీతమ్మ గారు కంట నీరు పెట్టుకున్నారు. కేశ ఖండన సమయంలో స్కూలు పిల్లలు వెక్కిరీస్తారేమోనన్న భయం కలిగింది రాజశేఖర మూర్తికి. కాని కిందటి సంవత్సరం ఒక మారు ముండనం అనుభూతమయినదే కదా! ఆశీర్వాదాల సమయంలో దుర్గాప్రసాదరావు గారు బంగారపుటుంగరం చేయించి పెట్టారు. మాణిక్యమ్మ గారు వెండి పళ్ళెము , రుక్మిణమ్మ గారు వెండి గిన్నె, సుబ్బారావు గారు వెండి గ్లాసు బహూకరించారు. రవికి ఈ తతంగ మంతా వింతగా తోచింది.
    ఉపనయనానంతరం అందరూ రామచంద్రమూర్తి పెళ్ళికి సన్నద్దులయ్యారు. పంచ శిఖలతో, పుళ్ళు పడిన చెవులతో పెళ్ళికీ పోవటానికి సిగ్గుపడ్డాడు రాజశేఖర మూర్తి. కాని కుతూహలం అణుచుకో లేకపోయాడు. ఇంతకూ ముందు బ్రహ్మ వివాహాలే కాని బ్రాహ్మణ వివాహం చూడలేదు.
    పెళ్ళికి ముందు రోజున రామచంద్ర మూర్తి కి స్నాతకం. అతడు కాశీకి పోతానని బెదిరించటం, మేనమామ కుమారుడైన రంగారావు వచ్చి బతిమాలి, బట్టలు పెట్టి, చెల్లెలినిస్తానని వెనక్కి తరలించటం అంతా వింతగా తోచింది రాజశేఖర మూర్తి కి.
    మరునాడు సూరం పల్లిలో వివాహం. అన్న రామచంద్ర మూర్తి తలంటి పోసుకుని పట్టు బట్టలు కట్టుకుని, ముఖం మీద బాసికము, బుగ్గ మీద నల్ల బొట్టు , నుదుట కుంకుమతో నిలువు బొట్టు ధరించి వివాహ మండపం లో తనకై అమర్చిన పీట పై కూర్చున్నాడు. కొంత మంత్రాంగం జరిగిన తరవాత జానకీ దేవిని తట్టలో కూర్చో బెట్టి ఆమె మేనమామ వివాహ మండపానికి తీసుకు వచ్చి రామచంద్ర మూర్తికి  ఎదురుగా అమర్చిన పీట పై కూర్చో బెట్టాడు. ఇద్దరూ బ్రాహ్మణులూ మధ్య ఒక ఉత్తరీయం తెరగా పట్టుకున్నారు. రాజశేఖర మూర్తి తన వదిన గారిని చూశాడు. ముఖం మీద కల్యాణ పు బొట్టు, బుగ్గన చుక్క, రెండు భుజాలపై వెనక్కి విరిచి కట్టిన తెల్లని జరీ అంచు ఉత్తరీయము, తెల్లని జరీ చీర పై బంగారు వడ్డాణము , మెడలో చంద్ర హారము, చేతులకు నాలుగు జతల బంగారపు గాజులు, చెవులకు జూకాలు, తలపై నాగరము జడకు కుప్పెలు-- వీటితో లక్ష్మీ దేవిలా ఉన్నదను కున్నాడు. నలుపైతే నేమి ఆమె కనుముక్కు తీరు అపురూప శిల్పం లా ఉన్నది.
    మంత్ర పఠనం నదీ ప్రవాహం లా జరిగిపోతున్నది. ముహూర్తం సమీపించింది కాబోలు అన్న లేచాడు.
    "మాంగల్యం తంతు నానేన మమజీవన హతునా కంఠ బధ్నామి సుభగేత్వం జీవ శరదాం శతమ్." వధూ కంఠనా మంగళ సూత్రం బంధించాడు. ఆ తరవాత తలంబ్రాలు పోసుకున్నారు. అన్నగారి ముఖంలో పట్టరాని ఆనందము. వదిన ముసిముసి నవ్వులు, కొంటె చూపులు. వదిన చేతులు చిన్నవి. తలంబ్రాలు ఎక్కువ పట్టవు. అన్నగారి కరతలాలు విశాలమయినవి. చారెడు చారెడు తలంబ్రాలు రెండు చేతులా తీసుకుని వదిన మీద ఊపిరాడకుండా పోశాడు. ఆమె ఓడిపోయింది. కాని ఆ ఓటమి లో కూడా ఆమె కానందమే!
    సాయంత్రం వదువునూ వరుడ్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి పూల చెండ్లాట ఆడించారు. శారద చేమంతి పూల్ చెందు తెచ్చి వదిన చేతిలో ఉంచి అన్నకు వెయ్యమన్నది. వదినకు సిగ్గు తలమునక లయింది. ఆమె వెయ్యలేదు. శారద బతిమాలింది. ఆమె కదలలేదు. శారద వదిన గారి నడుం మీద చక్కిలి గింతలు పెట్టింది. ఆ అదటు తో చెండు చెయ్యి జారి కింద పడ్డది. జానకీ దేవికి కోపం వచ్చింది. శారద చెండు తీసి అన్న కిచ్చి వెయ్యమన్నది. జానకి చెయ్యి పట్టలేదు. రామచంద్ర మూర్తి కోపించి చెందు ఆమె మీద విసిరాడు. అది ఆమె వక్షానికి తగిలి కింద జారి ఒడిలో పడ్డది. కోపంతో చెందు తీసి ఆమె అతని ఒడిలోకి విసిరింది. అతడు మళ్ళీ విసిరాడు. ఆ తరవాత అట రమ్యంగా సాగింది. శారద చప్పట్లు కొడుతూ చెండ్లాట పై పాట పాడింది. అమ్మలక్క లందరూ ఆనందించారు. దూరంగా నిలుచిని వీక్షీస్తున్న రాజశేఖర మూర్తి మనస్సు ఉప్పొంగి వెయ్యి కోర్కెలు చెలరేగాయి.
    రాత్రి పల్లకీ లో ఊరేగింపు జరిగింది. సన్నాయి మేళం వారు త్యాగ రాయ కృతులు, జావళీలు, జానపదులు పెళ్లి పాటలు పాడారు. రాజశేఖర మూర్తి పల్లకీ పక్కనే నడిచాడు ఊరేగింపు జరిగినంత సేపూ. ఆ సమయంలో తానొక లక్ష్మణ స్వామి ననుకున్నాడు. పల్లకీ లో కూర్చుని ఉన్నంత సేపూ అన్నగారి చూపు వదిన మీదనే ఉన్నది. వదిన తలవంచుకుని కూర్చుని ఉన్నది. భర్త వైపు ఒక్కమారైనా చూడలేదు. రాజశేఖర మూర్తి ఏదో మిష పై అన్నను పలకరించాడు. అతడు ముక్తసరిగా జవాబిచ్చాడు. మళ్ళీ జానకి దేవిని తన నిశిత దృక్బాణాలతో ఉ=ముంచెత్తి వేశాడు. అన్నగారికి తన కన్న వదినే ఎక్కువ కాబోలు అనుకున్నాడు రాజశేఖర మూర్తి.
    పెండ్లి అయిన మరునాడు సాయంత్రం రెండెడ్ల బళ్ల మీద పెళ్లి వారు సూరంపల్లి నుండి వీరన్న పేటకు ప్రయాణ మయ్యారు. వధూవరులిద్దరూ ఒక బండి లో కూర్చున్నారు. శారద ను, రాజశేఖర మూర్తి ని కూడా దానిలోనే కూర్చోమన్నారు. రాజశేఖర మూర్తి సారధి అయ్యాడు. పాలేరు ముందు తాళ్ళు పట్టుకుని నడుస్తుంటే , రాజశేఖర మూర్తి ఎద్దుల్ని తోలుతూ వోగ పై కూర్చున్నాడు. లోపల వదిన కూ అన్నకూ మధ్య శారద కూర్చున్నది. జ్యేష్ట మాసపు వెన్నెలలు పగలంతా ఎండలో కాలిన భూదేవికి శీతలోపచారాలు చేస్తున్నవి. చెమట కు తడిసిన శరీరాల పై చిరుగాలులు తగిలి ఆహ్లాదం కలిగిస్తున్నాయి.
    బండిలో వెనక భాగం లో ఒక చెయ్యి పై ఒరిగి అనంత శయసుడులా పడుకున్న రామచంద్రమూర్తి కన్నులు జానకీ దేవి మీదనే ఉన్నాయి. జానకీ దేవి వోగ పై కూర్చున్న మరిది భుజాల మీదుగా నిశీధం లోకి చూస్తున్నది. మధ్యగా కూర్చున్న శారదకు నిద్ర వస్తున్నట్లున్నది, తూలుతున్నది.
    రాజశేఖర మూర్తి ముందుకు చూస్తున్నాడే కాని, అతని అంతస్చాక్ఖువు వెనకకే తిరిగి ఉన్నది. రామచంద్ర మూర్తి జానకీ దేవి కుడికాలి చిటికెన వేలి మీద గిల్లాడు. "అబ్బా" అని కాలు దగ్గిరికి లాక్కున్నది. జానకి, చేతికి అంటిన పసుపు, పారాణి ఆప్యాయంగా నుదుట పెట్టుకున్నాడు రామచంద్ర మూర్తి . ఛీ! అన్నది జానకి. అదేమీటన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు రాజశేఖర మూర్తి . ఏమీ ఎరగని వాడిలా కళ్ళు మూసుకున్నాడు రామచంద్ర మూర్తి  చిరునవ్వు నవ్వింది జానకీ దేవి. తియ్యని భావనలు మనస్సులో నిండిపోయాయి రాజశేఖర మూర్తి కి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS