రాజశేఖర మూర్తి పరీక్షా ఫలితాలు తెలిశాయి. అనుకున్నట్టే పెద్ద మార్కులతో పాసయాడు. ఇక ముందు కర్తవ్య మేమిటన్న సమస్య ఎదురయింది. కాలేజీ చదువులు చదివించలేమేమో అన్న భయం పట్టుకున్నది. ఒకవేళ కష్టపడి ఇంటర్ మీడియట్ చదివించినా ఆ పైన ఏ డిగ్రీ కోర్సో చదివించలేక పొతే రెండు సంవత్సరాల చదువూ వృధా , పైగా రెండేళ్ళ వయస్సూ గడిచి పోతుంది. కనక రెండే మార్గాలు. కనీసం బి.ఎ వరకూ చెప్పించగలిగెనా ఉండాలి. లేకపోతె కాలేజీ చదువుల మీద ఆశ పెట్టుకోకుండా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కో కూర్చోబెట్టాలి. సుబ్బారావు గారు రెండవ మార్గాన్నే బలపరిచారు. ఆయనకు పెద్ద చదువులలో అంత నమ్మకం లేదు. కరిణీ కం చేసుకుంటున్న అయన ద్రుక్పరిధి లో తాలూకా ఆపీసు గుమస్తాలూ, రెవెన్యూ ఇన్ స్పెక్తర్లూ గొప్ప ఉద్యోగస్తులు. ఆపై ఉద్యోగాలన్నీ తమబోటి వాళ్లకు కావని అయన నమ్మకం. అందుచేతనే రామచంద్ర మూర్తి ని స్కూలు ఫైనల్ తోనే మానిపించి కరిణీకం లో చేర్పించారు. వెంకట రత్నం గారికి పెద్ద చదువుల పై అభిమానమే కాని, పెద్ద చదువు లంటే ఎంత ఖర్చుతో కూడుకొన్న విషయాలో ఆయనకు స్వానుభవం వల్ల తెలుసు. అందుచేత వెంకటా చలపతి మాణిక్యమ్మ గార్ల ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అయన రాజును ఇంటర్ మీడియట్ చదివించమని గట్టిగాచేప్పలేక పోయారు.
చివరికి రాజశేఖర మూర్తి తానె నిశ్చయించు కున్నాడు. ఇంటర్ మీడియట్ చదవాలి. బి.ఎ. చదవాలి. వీలైతే ఎమ్. ఎ. కూడా చదివి మామయ్య అంతటి వాడు కావాలి. రాజుకు అదే ఇష్టమైతే ఉన్న పది ఎకరాలూ తెగనమ్మ వలసి వచ్చినా సరే పై చదువులు చెప్పిస్తానన్నారు మాణిక్యమ్మ గారు. ఉపాధ్యాయుడు గా కొంత అనుభవం గడించిన చలపతి గారు ప్రైవేటు ట్యూషన్లు ప్రారంభిస్తే కుమారుడి చదువుకు కావలసిన డబ్బు గడించ లేకపోను లెమ్మనుకున్నారు. వ్యాపారం లో ఒక మారు గట్టి దెబ్బ తిని ఉన్నందు వల్ల మళ్ళీ వ్యాపారం లో దిగటం ఇష్టం లేక పోయిందాయనకు.
రాజశేఖర మూర్తి గుంటూరు లో కొత్తగా పెట్టిన హిందూ కళాశాల లో ఇంటర్ మీడియట్ లో చేరాడు. రవి చాలాకాలం నుంచీ పని చేస్తున్న క్రైస్తవ కళాశాలలో చేరాడు. హిందూ కళాశాల లో అయితే స్కాలరు షిప్పు దొరకవచ్చు నని రాజశేఖర మూర్తి ఆశ. ఆ ఆశతోనే స్కాలరు షిప్పు కు దరఖాస్తు పెట్టాడు. స్కూలు ఫైనల్ పరీక్ష లో అతడు తెచ్చుకున్న మార్కులు చూసి సంతోషించి కాలేజీ అధికారులు పూర్తి స్కాలర్ షిప్పు మంజూరు చేశారు.
ఇప్పుడు మాణిక్యమ్మ గారు, వెంకటా చలపతి గారు, సీతమ్మ గారు అందరూ కలిసే ఉంటున్నారు రాజశేఖర మూర్తి ని కనిపెట్టుకుని. వెంకట రత్నం గారి పెరటి ఇల్లు నలుగురూ ఉండటానికీ, రాజశేఖర మూర్తి చదువుకోడానికి చాలదని ఆ ప్రాంతం లోనే వేరే చిన్న ఇల్లు ఎనిమిది రూపాయలకు అద్దెకు తీసుకున్నారు వెంకటా చలపతి గారు. రాజశేఖర మూర్తి వయస్సు తో బాటు పొడుగు ఎదిగాడు. నూనూగు మీసాలు వరిస్తున్నవి. ఇంతవరకు నిక్కర్ల తో గడిపాడు. ఇంక నిక్కర్లు బాగుండవు. కాలేజీ కి నిక్కర్ల తో వెళితే నవ్వుతారు. బట్టలు శుభ్రంగా ఉండాలి. కనీసం ఒక అరడజను చొక్కాలు, అరడజను పాంట్లూ కావాలి. ఇంటర్ మీడియట్ పుస్తకాలు స్కూలు పుస్తకాల లాగ కాదు. అన్నీ ఖరీదైనవి. రవీ, రాజశేఖర్ మూర్తి ఇప్పుడు వేరు వేరు కాలేజీ లలో చదువుతున్నారు. మునపటి లాగ రవి పుస్తకాలు ఉపయోగించు కోటానికి వీలు ఉండదు. సుబ్బారావు గారి దగ్గిర రెండు వందల రూపాయలు అప్పుగా తీసుకుని కావలసిన ఖర్చులు చేశారు వెంకటా చలపతి గారు. తన రెండెకరాల పొలం మీద రాబోయే పంట తో అప్పు తీర్చు కుంటా నన్నారు.
ఇల్లిల్లూ తిరిగి పది మంది పిల్లల కు ప్రైవేట్లూ కుదుర్చుకున్నారు. ప్రతిరోజూ ఉదయం రెండు గంటలు, సాయంకాలం మూడు గంటలు , ఒక్కొక్క ఇంట ఒక గంట సేపు ఇద్దరేసి పిల్లలకు కలిపి పాఠాలు . ఒక్కొక్క పిల్లవాడికి అయిదు రూపాయలు జీతం. ఆ విధంగా నెలకు ఏభై రూపాయలు గడించడానికి ఏర్పాటు చేసుకున్నారు వెంకటా చలపతి గారు.
రాజశేఖర మూర్తి కాలేజీ లో చేరినప్పటి నుండి సీతమ్మ గారికి అబ్బాయి పెళ్లి చెయ్యలేదే అన్న బాధ పట్టుకున్నది. ఆవిడ పాతకాలపు మనిషి. రామచంద్ర మూర్తి కి ఈ వయస్సు కు పెళ్లి అయిపొయింది. అతడిప్పుడు చక్కగా కాపరం చేసుకుంటున్నాడు. రాజశేఖర మూర్తి కి కూడా ఈ వయస్సు లోనే పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుందని ఆవిడ ఉద్దేశం. పైగా రాజేశ్వరీ దేవి దివంగతు రాలై న నాటి నుంచి ఆ ఇంట్లో పసుపు కుంకుమలె కరువయ్యాయి. గృహలక్ష్మీ లేని ఇల్లు అదేమీ ఇల్లు? వెంకటా చలపతి గారు మళ్ళీ వివాహం చేసుకుంటారన్న ఆశ ఆమెకు లేదు. తాను బతికి ఉండగా ఆ ఇంట్లో మళ్ళీ శ్రీదేవి అవతరించాలి. తత్కారాంబుజ స్వర్ణ కంకణనిక్వాణాలు మళ్లీ ధ్వనించాలి. తత్పాదమంజీరాల ఘలం ఘలలు మళ్లీ వినిపించాలి. రాజశేఖర మూర్తి , అతని వదువూ ముచ్చటగా ఇంట తిరుగుతుంటే చూచి తాను తృప్తిగా కన్ను మూయ్యాలి. పాపం దుర్గాప్రసాదరావు గారికా అదృష్టం లేదు.
"వాడికిప్పుడు పెళ్లి కేం తొందర, వదినా? చదువు కుంటున్నాడు కదా, చదువు కానివ్వండి. బి.ఎ. అయిన తరవాత వాడికి వచ్చిన పిల్లని వాడే చేసుకుంటాడు." అన్నారు మాణిక్యమ్మ గారు. ఆవిడవి ఆధునిక భావాలు. ఆవిడ ఎక్కువ చదువు కున్నది కాకపోయినా, బస్తీలో పుట్టి, బస్తీలో పెరిగి , బస్తీలలో జీవితం అంతా గడిపింది. ఆమె అన్నగారు విశ్వనాధం గారు బెంగుళూరు లో కాలేజీ ప్రొఫెసరు. అయన ఆధునిక భావాలు కలవాడు. ఆయనకు బాల్య వివాహాలు, వరకట్నాలు నచ్చవు. ఇటు దుర్గాప్రసాదరావు గారి వైపు వెంకట రత్నం గారు బ్రహ్మ మాతమయాయి. సంఘ సంస్కరణాభిలాషి. విశ్వనాధం గారి కన్న ఒక మెట్టు పైన, విధవా వివాహాలు, వర్ణాంతర వివాహాలు అయన ప్రోత్సహిస్తారు.
"చలపతి పద్దెనిమిదేళ్ళ కే పెళ్లి చేసుకుని ఏంబావుకున్నాడు కనక, రాజునైనా కొంతకాలం ఈ పెళ్ళిళ్ళూ పెటాకులు లేకుండా చదువుకోనివ్వండి." అన్న మాణిక్యమ్మ గారి వాదన లో అపశ్రుతి గోచరించింది సీతమ్మ గారికి. కాని ఆవిడ మనస్సు ఉండబట్టలేదు. రాజశేఖర మూర్తినే కదిపి చూసింది.
"ఛీఛీ! ఇప్పుడెం పెళ్లి , మామ్మా? బి.ఎ. అయిన తరవాత కాని చేసుకోను" అన్నాడు రాజశేఖర మూర్తి.
అమ్మమ్మదీ, మనుమడి దీ ఒకటే మాట" అనుకున్నది సీతమ్మ గారు.
సీతమ్మ గారు వాంచించినట్లు కావాలని పెళ్లి సంబంధాలు వెతక్కపోయినా , కాలేజీ లో చదువు కుంటున్న కుర్రవాడు ఒకడు ఉన్నాడంటే సంబంధాలు వాటంతట అవే వస్తాయి. "ఇప్పుడు మా కక్కర్లేదు బాబూ! " అని గట్టిగా చెప్పగలిగితే తప్ప మొహమాటాలు, బలవంతాలూ , చివరికి మెడ వంపులూ తప్పవు.
రెండు మూడు తెలిసీ తెలియని సంబంధాలు వెతుక్కుంటూ వస్తే, "మా అబ్బాయి కిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లే" దని వెంకటా చలపతి గారే చెప్పి తిరగ గొట్టేశారు. మరొకసారి దూరపు బంధువుల సంబంధం ఒకటి వచ్చింది. "చేసుకోకపోతే మానె, ఊరికే వచ్చి చూసి వెళ్ళండి. మీకు నచ్చింది అంటే అబ్బాయి బి.ఎ. అయిన తరవాత నే చేసుకోవచ్చు. నిజానికి మాకూ తొందర లేదు. అమ్మాయి మూడవ ఫారం చదువుతుంది. మీరూ చేసుకుంటా మూ అంటే అమ్మాయిని కూడా స్కూలు ఫైనల్ దాకా చదివిస్తాము. ఆ తరవాతే చేసుకోవచ్చు." అని బతిమాలాడారు. ఇక ఏమీ అనలేక మొహమాటం కొద్దీ, "సరే, చూసి వద్దాములే" అని కొడుకుని బతిమాలి తీసుకు వెళ్ళారు వెంకటా చలపతి గారు. పిల్ల తెల్లనిది. అయితే ముఖంలో కళా కాంతులు లేవు. నుదురు ఎత్తు చప్పిడి ముక్కు, పొడుగాటి గడ్డం . "పుటాకారా దర్పణం లా ఉన్న"దనిపించింది రాజశేఖర మూర్తికి. "తెల్లని పిల్ల గదా, ఒకసారి చూస్తె వదిలి పెట్టరులే !' అనుకున్నారు ఆ పిల్ల తల్లిదండ్రులు. నచ్చినదీ, లేనిదీ తరవాత తెలియ చేస్తామని వచ్చేశారు. వెంకటాచలపతి గారూ, రాజశేఖర మూర్తి. తరవాత వారికి ఏమీ వ్రాయటానికి తోచక ఊరుకున్నారు.
మరొక సంబంధం వచ్చింది. దగ్గిర బంధువులే. సీతమ్మ గారి వైపు వారు. కాదు కూడదని బలవంతం చేసి దగ్గిరి ఉండి తీసుకు వెళ్ళారు రాజశేఖర మూర్తి ని. వెంకటాచలపతి గారు చూసిన అమ్మాయే కనక అయన వెళ్ళలేదు. రాజశేఖర మూర్తి ని మచ్చిక చేసుకుని ఒప్పించ వచ్చు లెమ్మను కున్నాడు పిల్ల తండ్రి. రాజుకు వారింట రాచమర్యాదలు జరిపారు. కలిగిన కుటుంబం. రాజశేఖర మూర్తి కి ఎక్కువ ఆస్తి పాస్తులు లేవని వారికి తెలుసు. పల్లెటూరి వారికి ముఖ్యంగా వరుడి వైపు కావలసినవి ఆస్తి పాస్తులు . అయినా కుర్రవాడు గుణవంతుడు, చక్కగా చదువు కుంటున్నాడు, తండ్రి గారి ఆస్తికి, మాతా మహుల ఆస్తికి ఏకైక వారసుడు, తమకా మగపిల్లలు లేరు కనక తమ ఆస్తిలో కొంత భాగం ఎలాగూ చెందుతుంది. కనక ఫరవాలేదను కొన్నారు. రాజశేఖర మూర్తి కన్యను చూశాడు. నల్లగా ఉన్నది. ముఖంలో ఏమాత్రం ఆకర్షణ లేదు. నాలుగో క్లాసు తో పల్లెటూరి చదువుకు స్వస్తి చెప్పిందిట. ఒంటి నిండా నగలు పెట్టుకున్నది. కాసుల పేరు, దండకడియాలు, చెంప స్వరాలు, వడ్డాణము వగైరా కోమటి అక్కలా ఉన్నదను కున్నాడు రాజశేఖర మూర్తి.
