"ఓహో! మంచి ఉద్దేశమే."
"ఏం మంచో? పిన్ని నన్ను బాగానే చూస్తుంది. కాని, ఆవిడ చాదస్తాలు నాకు బాధగా ఉంటాయి. స్నేహానికి, బంధుత్వానికి కూడా అంతస్తులే కావాలంటారామె."
నవ్వేశాడు ధర్మారావు. "ఏ వ్యక్తీ పరి పూర్ణుడు కాదన్నారు కదా? అలా కాకుంటే అందమే లేదు. మరి నాకు సెలవా?"
"అయ్యో! చెప్పడం మరిచాను. మీ భోజనం కూడా ఇక్కడే. బాబయ్య గారు కూడా మరీ మరీ చెప్పమన్నారు."
"తప్పదంటారా?"
"అర్ధిస్తున్నాను. తప్పదని శాసించే అధికారం నా కెక్కడిది?"
"స్నేహం లో అధికారం లేదంటారా?"
"అల్ రైట్ . అయితే ఈ రాత్రి భోజనానికి మీరిక్కడే ఉండాలని అధికార పూర్వకంగా చెబుతున్నాను."
"చిత్తం."
ఇద్దరూ పకాపకా నవ్వేసుకున్నారు.
సరిగా అదే సమయంలో న్యాయమిత్ర సతీ సమేతంగా రంగం లోకి ప్రవేశించడం తో క్షణ కాలం నవ్వులు మాయమై నిశ్శబ్దం ఆవరించింది.
"నమస్కారమండీ" అన్నాడు ధర్మారావు మర్యాదగా లేచి.
"ఓ ధర్మారావు గారా? నమస్కారం!' ఆప్యాయంగా పలకరిస్తూ చేరువలోనే మరొక కుర్చీలో కూర్చున్నాడు మిత్రా . మిత్రాగారి భార్య ముఖం చాలా అప్రసన్నంగా ఉన్నది. ఒక్కసారి సత్యాదేవి ముఖం లోనికి తీక్షణంగా చూచింది. 'వాడితో నీకా నవ్వులేమిటి?' అన్నట్టున్నాయా చూపులని ముగ్గురూ భావించారు.
"చూడు, సుమిత్రా. "లోపలికి పోబోతున్న ఆమెను న్యాయ మిత్ర మాటలు అపు చేశాయి. "ఈయన ధర్మారావు గారు. మన సెంట్రల్ జైలు కు కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ . సార్ధక నాములని వినికిడి." అంటూ నవ్వేశారు.
"అలాగా? సంతోషం నాయనా" అన్నదామె ధర్మారావు నుద్దేశించి. శిల్పి మలచిన విగ్రహం లా నిలబడిపోయిన ధర్మారావు యాంత్రికంగా నమస్కరించాడు.
"వీరు సుమిత్రా దేవి గారు, మా సతీమణులు. మాట మహా దురుసు, మనసు మహా మంచి. అసలు సుబ్బలక్ష్మీ గారు, మిత్రాగారి భార్య గనక సుమిత్ర గా మారిపోయారు.' అంటూ హాలు దద్దరిల్లేటట్లు నవ్వాడు న్యాయమిత్ర. సత్య శృతి కలిపింది.
"చాల్లెండి. కొత్త అబ్బాయి దగ్గర కూడా మీ ధోరణి మీదే." చిరుకోపం ప్రదర్శించింది సుమిత్ర. "ఆయనకు కొత్తా పాతా పెద్దా చిన్నా లేదు నాయనా. అయన ధోరణే ఆయనది. మరేమీ అనుకోకు" అన్నది ధర్మారావు తో.
చిరునవ్వుతో అన్నాడు ధర్మారావు ; "ఇందులో అనుకోవడానికి ఏముందండీ? ఇంత చక్కటి స్వభావం ఎంతమంది కుంటుందంటారు!"
"కరెక్ట్ . సరి అయిన మాట చెప్పారు ; నాకు నచ్చారు, ద్జర్మారావు గారూ. "అది న్యాయమిత్ర విసురు.
"ఓహో! ఇంకేం? అయితే ఎవరూ నచ్చని మీకు, నేటికి ఒక్కరైనా నచ్చారు. అదే పదివేలు. మాట్లాడు కొంటుండండి. నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను." అంటూ సత్య లేచి వెళ్ళిపోయింది.
భోజనాల దగ్గర మాటలలో అన్నాడు ధర్మ్రారావు: "మీ గురించి చాలా చాలా, మరో విధంగా ఊహించాను. ఇంత సరసంగా నాతొ మాట్లాడతారని ఊహించలేదు."
బిగ్గరగా నవ్వేశాడు మిత్ర. "నిజమేలే. వినే ఉంటారు. అయితే పూర్తిగా కాదు సగమే. విన్నారన్న మాట. న్యాయమూర్తి గా న్యాయ పీఠం పై కూర్చున్నప్పుడు నేను కేవలం న్యాయాన్ని తూచి బేరీజు వేసే యంత్రాన్ని మాత్రమే. అక్కడ నాలో మరో చలనం ఉండదు, ఉండకూడదు. కాని ఇది ఇల్లయ్యా. సతీమణి సమక్షం లో నల్లరాయిలా కూర్చుంటే ఊరుకుంటుందా? ఇక్కడ గృహస్త ధర్మం నెరవేర్చాలి. నవ్వులూ, పువ్వులూ , హస్యాలూ వినోదాలూ అన్నీ ఉంటాయి ఇక్కడ."
మనస్తూర్తిగా వారితో పాటు, వారిలో ఒకడుగా నవ్వేశాడు ధర్మారావు.
"కృతజ్ఞుడి ని . కొత్తవాడినీ, చిన్నవాడినీ అయినా మీలో ఒకడుగా ఆదరించి, గౌరవించి పంపుతున్నారు. నమస్కారం " అన్నాడు. ధర్మరావు సెలవు తీసుకుంటూ. "సెలవివ్వండి అమ్మా, నమస్కారం."
"అమ్మా" అన్న అతడి సంబోధన కు సంతానం లేని సుమిత్రా దేవి దేహం పులకరించి పోయింది.
"మంచిది నాయనా" అన్నది మనస్పూర్తిగా.
సత్యాదేవి కి మౌనంగానే నమస్కరించి వెనుదిరిగిన ధర్మారావు ను వెన్నంటి వినవచ్చాయి వారి మాటలు.
"కుర్రాడు తెలివైన వాడె. సూర్యకిరణాల లాగే ఉన్నాడు!' సుమిత్రాదేవి వ్యాఖ్యానం.
"ఆ ఆ! అదే , అదే మరి. అతడి పనులు కూడా సూర్యకిరణా ల్లాగే చురుకు చురుకు మని పోడుస్తున్నాయని గోల పెడుతున్నారు ఉద్యోగస్తు లందరూ" అంటూనే మిత్ర తన సహజ ధోరణి లో పెద్దగా నవ్వేశాడు.
11

ఖైదీలు అందరూ భోజనాలు చేస్తుండగా జేయిలు సూపరింటెండెంట్ ధర్మారావు, పోలీసు సూపరింటెండెంట్ అర్జున రావు మాట్లాడుకుంటూ అటు వచ్చారు. అధికారుల నిద్దరినీ ఒకేసారి చూడడంతో ఖైదీలు అలజడి తగ్గించి భోజనాలు చేయసాగారు. పోలీసులు కూడా ప్రాణం లేని బొమ్మల్లా నిల్చున్నారు.
"ఏమిటిది?" పోలీసు సూపరింటెండెంట్ అడిగాడు ఒక పోలీసును.
"ఏముంది సార్? కూర్చుని తినమరిగి , ప్రతి వాడూ అడుగడుగునా 'అది లేదు, ఇది లేదు' అని మా ప్రాణాలు తోడేస్తున్నాడు. నిష్కారణం గా గొడవ పెట్టడం మరీ నేర్చుకున్నారు ఈ మధ్య" అంటూ ఒక్క చూపు ధర్మారావు పైకి విసిరాడు. అందరి శ్లేష ను ధర్మారావు గ్రహించ గలిగాడు. అర్జున్ మరి మాటలు పొడిగించకుండా అంతా మౌనంగానే పర్యవేక్షించి నిష్క్రమిస్తుండగా ఏ మూల నుంచో ఒక ఖైదీ వచ్చి అర్జున్ కాళ్ళకు చుట్టేసుకున్నాడు.
"ఏమిట్రా?' అధికార పూర్వకంగానే అరిచాడు అర్జున్.
"నాకు నాలుగు రోజుల నుంచి జ్వరం, బాబూ! ఇవ్వాలే కాస్త తగ్గింది."
"అయితే?"
"డాక్టరు గారు పాలు రొట్టె ఇమ్మన్నారు. వీళ్ళు ఇవ్వడం లేదు. పని చేయమంటున్నారు. అన్నం తినమంటున్నారు. అదే తింటే మళ్ళీ తిరగబెట్టి చచ్చిపోతాను. ఇంటి కాడ నాకు పెళ్ళాం, పిల్లలు న్నారు. ముసలి తల్లి ఉంది" అంటూనే ఘొల్లు మన్నాడు ఖైదీ.
అర్జున్ చూపులు ధర్మారావు మీదికి తిరిగాయి. ధర్మారావు తీక్షణ దృక్కులు వార్డెన్ పైన పడ్డాయి.
"చూశారా? ఇదీ వీళ్ళ ధోరణి. ఇలాగే ప్రతి దానికీ గొడవ పెడుతున్నారు. తప్పుడు వెధవలు .......' వరసగా అశ్లీల పదాలు వదలసాగాడు వార్డెన్.
"అగు." గర్జించాడు ధర్మారావు. "ఇతడికి జ్వరం వచ్చిన మాట వాస్తవమేనా?"
"నిజమే బాబూ!" ఖైదీ లందరూ అన్నారు.
"వట్టిది. తప్పుడు వెధవలు. దుక్క లాగ ఉన్నాడు చూడండి. మీది జాలి గుండె అని కనిపెట్టి ఇలా నాటకాలు మొదలెట్టారు" అన్నాడు వార్డెన్.
"డోంటాక్ రబ్బిష్ (చెత్త మాట్లాడకు)"-- అర్జున్, ధర్మారావు లిద్దరూ ఒక్కసారే అరిచారు. "జేయిలు డాక్టరు గారిని ఇప్పుడే ఒకసారి రమ్మనండి." ఒక కాన్ స్టేబుల్ ను పరుగెత్తించాడు ధర్మారావు.
పావుగంట లో జేయిలు డాక్టరు హాజరయ్యాడు. "ఈ ఖైదీ ని పరీక్షించండి . "ధర్మారావు ఆజ్ఞాపించాడు.
డాక్టరు చూచి చెప్పాడు. "ఇతడికి నాలుగు రోజుల నుండీ జ్వరం ఉందండి. ఇవ్వాళే తగ్గింది. ఇంకా కొంచెం ఉంది. పాలు, రొట్టె తీసుకోమని ఉదయం చెప్పాను. అదీకాక ఇతడు ఇంకా క్వారంటేయిన్ లో రెండు రోజులుండాలి . ఇవ్వాళే రప్పించేశారు మరి, వీళ్ళు!"
ఇద్దరు సూపరింటెండెంటుల వాడి చూపులకు గిలగిల లాడిపోయిన వార్డెన్ గడగడ వణికి పోయాడు. "క్షమించండి . ఈ తప్పు కాయండి." పడి పడి దణ్ణాలు పెట్టాడు.
"అతడి కవసరమైన పాలూ, రొట్టె ఇప్పించు. ఇటువంటి రిపోర్టు లు నా చెవిన పెడటానికి వీల్లేదు" తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు ధర్మారావు.
"చిత్తం." చేతులు నులుపుకున్నాడు వార్డెన్.
ఖైదీ మొర పెట్టుకుంటున్నాడు : "ఏదో గడ్డి కరిచి ఈ జెయిలు పాలబడ్డాను. నా పెళ్ళాం పిల్లలు తిండి లేక మాదిపోతున్నారు. అష్టకష్టాలు పడుతున్నారు. ఒక వీళ్ళకు లంచాలు, కూడా ఎక్కడ ఇవ్వగలరు? లంచాలు లేవని, నావాళ్ళు నన్ను చూడడానికి వస్తే కలుసుకోనివ్వడం లేదు. ఉత్తరాలు అందనీయడం లేదు. మాకష్టాలు ఎన్నని చెప్పుకోము, బాబూ?"
"సరేలే, అన్నీ నేను నెమ్మది పరుస్తాను గా?' భరోసా ఇచ్చాడు ధర్మారావు. "ఇప్పుడు మీ భోజనాలేలా ఉంటున్నాయి?" జనాంతికంగా ప్రశ్నించాడు ఖైదీ లందరినీ.
"మార్పు లేదు, బాబయ్యా. వెనకటి కంటే ఘోరంగా ఉంటున్నాయి ." వందలాది గొంతుకలు ఒక్కసారే అరిచాయి.
ఒక్క నిట్టుర్పు వదిలాడు ధర్మారావు. అర్జున్ , డాక్టర్ . అతడు మరి మాటలు లేకుండానే నడక సాగించారు. అర్జున్ అతడి ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్, ధర్మారావు ధర్మారావు నివాసానికి దారి తీశారు.
