"ఇన్ స్పెక్టర్ అర్జున్ ఎటువంటి వారు?' హటాత్తుగా తలెత్తి ప్రశ్నించాడు ధర్మారావు డాక్టరు ను.
నవ్వాడు డాక్టరు. "ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు."
"అభ్యంతరమైతే అక్కర్లేదు కాని, వీలైతే దయచేసి చెప్పమని కోరుతున్నాను."
ఈసారి డాక్టరు బింకం సడలించాడు. "నిజం చెప్పాలంటే మంచివారే. చాలా మంచి హృదయం. కాని ఆ మంచి ప్రదర్శన కాదు. అదీ నేను గ్రహించింది."
"అంటే?"
"ఏదో మొక్కుబడిగా ఉద్యోగ నిర్వహణే కాని, ధర్మ నిర్వహణ గురించి ఆలోచించరు. అసలు ఏదో తేలికగా తోసుకు పోవడమే గాని, ఏ విషయాన్నీ గురించి, ఏ వ్యక్తీ ని గురించి ప్రత్యేకంగా, లోతుగా ఆలోచించరు. "ఒహ" అని పలకరించిన ప్రతి వాడినీ స్నేహితుడు గానే భావిస్తారు. ఎవ్వరికీ స్వలాభం కోసం చూచుకొని స్నేహశీలి.అందుకే ఆశ్రితులు ఎక్కువ. ఈ ఆశ్రిత బృందం వల్ల అయన అసలు మంచితనం మాటున పడిపోయి, నలుగురి వంటి వారేనని చూపరులు అనుకోవడం కద్దు ."
జేయిలు డాక్టరు గుణవంతుడూ, సహృదయుడు కావడం వల్ల క్రమంగా డాక్టరు కూ, ధర్మారావు కూ స్నేహం అధికం కావడంతో ఆ జేయిలు స్థితి గతులన్నీ కూలంకుషంగా తెలుసుకో గలిగాడు ధర్మారావు.
ఆ జెయిలుకు ధర్మారావు కంటే ముందు సూపరింటెండెంట్ గా పనిచేసిన అయన, అయన ఒక్కడే మిటి, ఇంచుమించు అందరూ కూడా చాలా స్వార్ధంతో ప్రవర్తించే వారు. ఖైదీలను నిర్జీవ పదార్ధాలుగా చూచేవారు. వారికి కేటాయించిన ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. కంట్రాక్టర్, సూపరింటెండెంట్ లాలూచీ అయి డబ్బు మిగుల్చుకుంటూ చాలీ చాలని తిండి, అందునా నిలబడి పోయినదీ, పాడై పోతున్నది కూడా ఇస్తారు. జబ్బు చేసిన ఖైదీ లకు మందుల విషయం లోనూ అంతే. సరయిన మందులు కావలసినన్నీ కొనరు. పాలు, మాంసం, మంచివి ఇవ్వరు. రొట్టె పాతబడి, బూజు పట్టి ఆకుపచ్చ రంగు తిరిగిపోయింది, ఎండి పోయినదీ పడేసేవారు. పోయిన సూపరింటెండెంట్ అందుకే ఏమీ లేక కట్టు గుడ్డలతో వచ్చిన వాడు , బాంకు అక్కౌంటు, తెరిచాడు. భార్య బిడ్డలను ముత్యాల నగలు, పట్టు వస్త్రాలతో ముంచి ఎత్తాడు. కాంట్రాక్టరు సరేసరి. లక్షలు లక్షలు అర్జిస్తున్నాడు.
"మరి ఖైదీల నుంచి ఫిర్యాదులు వెళ్ళేవి కాదా?' అని అడిగాడు ధర్మారావు.
వీరహాసం చేశాడు డాక్టరు. "మీకు కొత్త. వాళ్ళు ఫిర్యాదు చేయాలంటే మాటలా? అది ఎందరి చేతుల్లోంచి వెళ్ళాలి? అధికారులలో సానుభూతి చూపే వారెంత మంది? సహకరించే వారెంత మంది? సత్యధర్మాలను అనుసరించే వారెంత మంది?"
"ఊ!" బరువుగా మూలిగాడు ధర్మారావు.
"ఒక్క ఉదాహరణ చెబుతాను, చూడండి." డాక్టరు తిరిగి ప్రారంభించాడు. "నా ఉద్యోగమే పోయే పరిస్తితు లేర్పడ్డాయి, ఒక ఖైదీ రోగికి ఇచ్చే ఆహారం విషయం లోనూ, మరొక ఖైదీ అధికారుల నిర్లక్ష్యం వలన చనిపోయిన విషయం లోనూ. నేనూ న్యాయ మార్గాన్నే పోతాను. దొంగ సర్టిఫికేట్లివ్వడం అమానుషంగా ప్రవర్తించడం నేనూ చెయ్యను. అదే అతడికి బాధగా ఉండేది. నన్ను బెదిరించాడు. మన్యం ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయించాడు. అయితే నేనూ పట్టుదల కలవాడినే. అసలు విషయాలు అధికారులు దృష్టికి తెచ్చేసరికి, అతడి ఉద్యోగమే పోయినంత పనయింది. రివర్షన్ లో వేళ్ళాడి క్కడి నుంచి."
ధర్మారావు మాట్లాడలేదు.
డాక్టర్ అన్నాడు తిరిగి : "చూడండి , ఎక్కడో అక్కడక్కడ ఉంటుంటారు. అటువంటి వాళ్ళు. వాళ్ళ నుంచి అందరికీ చెడ్డ పేరు కలిగిస్తారు కొంతమంది. ఖైదీల విషయం లో ప్రభుత్వం ఎన్నో సౌకర్యా లేర్పరచింది. కాని ఈ మధ్య వాళ్లు మాత్రం అవి అందనీయకుండా దేవునికీ, భక్తుడి కీ మధ్య పూజారిలా అడ్డుపడతారు."
అంతా విన్న ధర్మారావు చాలాసేపు మౌనంగా ఏమో ఆలోచిస్తూ ఉండి పోయాడు. తర్వాత మెల్లగా అన్నాడు. "అయితే, డాక్టర్! నేను గొప్పవాడినని, ఆదర్శ పురుషుడి ననీ చెప్పటం లేదు.
కాని....."
"కాని? ఏమిటి?"
"లోకం లోని పీడితులూ, బాధితులూ నాకు అనునిత్యం కన్నీళ్లు తెప్పిస్తారు. వీటికి విరుగుడు కోసం నేను అనుక్షణం అంతరాంతరాలలో విపరీతంగా ఆలోచిస్తున్నాను. మనం లోకమంతటి కోసం కాదు కదా, ఒక దేశం కోసం, కనీసం ఒక రాష్ట్రం కోసం కూడా ఏ ఘనకార్యం చేయలేము. కాని మనవంటి వారందరూ కలిస్తే మన పరిసరాలలో కొంత మార్పు తెగలమనీ , కొందరి నైనా మనుష్యు లుగా తిరిగి దిద్దగల మనీ నా ఆశ నమ్మిక కూడా! ఇందుకు మీ సహకారం ఉంటుందా?"
"మిస్టర్ ధర్మరావ్!" సంతోషంగా ఆలింగనం చేసుకున్నాడు డాక్టర్. "ఉంటుంది . పూర్తీ సహకారం ఉంటుంది."
12
లోనికి వస్తున్న ధర్మారావు కు ఎదురేగి తీసుకువచ్చ్జి కూర్చో బెట్టింది సత్య.
"హల్లో , గుడ్ మార్నింగ్ " అన్నాడు ధర్మారావు. హాట్ తీస్తూ న్యాయ మిత్ర ను ఉద్దేశించి "గుడ్ మార్నింగ్ , మీరూ ఇక్కడే ఉన్నారని మీ బంగళా లో చెప్పారు" అన్నాడు తిరిగి అక్కడే ఉన్న అర్జున్ ను ఉద్దేశించి.
అర్జున్ , న్యాయమిత్ర -- ఇరువురూ చిరునవ్వుతో తిరిగి అభివాదన చేసి ధర్మారావు ను మర్యాద చేశారు.
"ఈ జడ్జి గారూ, ఆ ఎస్ పి గారూ కలిస్తే గంటలు గంటలు నిమిషాల్లా గా నీరసించి పోతాయి. ఇక ఈ సూపరింటెండెంట్ గారు కూడా కలిస్తే ఇంకెలా అవుతాయో?' అని చమత్కరిస్తూ సత్య అందరికీ కాఫీలు ఇచ్చి తానూ సమావేశం లో కూర్చుంది.
"ఏమిటిలా వచ్చారు/ ఏమైనా పని ఉందా?' న్యాయమిత్ర ప్రశ్నించాడు ధర్మారావు ను.
"పని లేదు, కానీ, చిన్న పని ఉన్నదనే చెప్పాలి." నసిగాడు ధర్మారావు.
"భలేవాడివోయ్!"
ముగ్గురూ నవ్వేసుకున్నారు.
"పోనీ , మన అర్జున్ గారిలాగా, ఆదివారం గనుక మీ ఇల్లు పావనం చేశానని చెప్పేయక అంత మొగమాటం దేనికండి?' అంటూ సత్య న్యాయమిత్ర వైపు తిరిగింది. "అయినా ఏమిటి బాబయ్యా, మీరు? స్నేహితులను ఎందుకు వచ్చారని అడుగుతారా , ఎక్కడైనా ?"
"మరి ముసిలాళ్ళం కదూ? మాకా పట్టింపులన్నీ ఉండవు. సరే... ఇక నీ స్నేహితుడి నెప్పుడూ అలా అనను. సరేనా?"
మళ్లీ అందరూ హాయిగా నవ్వుకున్నారు.
చాలాసేపు ఇష్టాగోష్టి అనంతరం, స్వగృహని కేగేముందు అన్నాడు ధర్మారావు: "ఒక చిన్న మాట. రేపు వచ్చే శుక్రవారం , అంటే పదిహేడవ తారీఖున ఖైదీలకు పిండి వంటలతో భోజనం పెట్టించాలని అనుకుంటున్నాను."
శ్రోతలు ముగ్గురూ విస్మయాశ్చర్యాలతో విడ్డూరంగా చూచారు.
"ఆ దినం మీ పుట్టినరోజా?" సత్య నెమ్మదిగా ప్రశ్నించింది.
ఒక్క క్షణం ఆగి అన్నాడు ధర్మారావు: "కాదు. నేను పుట్టినందు వల్ల లోకాని కంతటి కి కాకపోయినా, ఒక్క వ్యక్తీ కైనా సంపూర్ణ మైన మేలు జరిగితే నా పుట్టిన రోజుకు ప్రత్యేకత. కాని ఎందుకు? నేను పుట్టి ఎవరి నుద్దరించానని?"
"మరి?' మిత్రా సూటిగా చూచాడతన్ని.
"ఒక విధంగా అది నా జీవితం లో ప్రత్యేకమైన రోజు....."
ధర్మారావు ను పూర్తిగా మాట్లాడనీయక అర్జున్ అడ్డు తగిలాడు. "మీ సంతోషాన్ని మారే రూపంలో నైన ప్రదర్శించి దాన ధర్మాలు చేసుకోండి కానీ, ఖైదీల కిటువంటి వన్నీ నేర్పారా మరి చెప్పక్కర్లేదు."
"అదేం మాటండీ? వాళ్ళు మాత్రం మనుష్యులు కారా?' ధర్మారావు వాదన.
అర్జున్ అసహాన వదనంతో అన్నాడు : "ఆ చర్చంతా దేనికండీ? దొంగ వెధవలకు పిండి వంటలూ, పరమాన్నాలూ , పట్టు వస్త్రాలూ పెట్టడానికా కారాగారాలు? మీరు కొత్తగా వచ్చారు. ఉద్యోగానుభవం తక్కువ. మీ కిటువంటివి తెలియవు. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఖైదీల నెంత కఠినంగా కరుకుగా చూస్తె అంత మంచిది. వస్తా . వస్తానండి, మిత్రాగారూ!" అంటూనే మరి సంభాషణ కవకాశమీయకుండా వడివడిగా వెళ్ళిపోయాడు.
న్యాయమిత్ర తటస్థంగా ఉండిపోయాడు ఎటూ మాట్లాడకుండా.
ధర్మారావును గేటు వరకూ సాగనంపిన సత్యా దేవి అన్నది: "మీరు మనస్సులో చాలా బాధ పడుతున్నట్లు న్నారు. పోనీ, అర్జున్ గారి మాటలకేం ? మీరు జేయిలు సూపరింటెండెంట్ కదా? మీ ఇష్ట ప్రకారమే కానీయండి."
"అవును. నేనూ అలాగే అనుకుంటున్నాను."
"ఒక మాట."
"ఏమిటి?"
"అర్జున్ అట్లా మాట్లాడతారే కాని, అయన దుర్మార్గులు , కఠీనుడు కాదు. మనసు మంచిదే.
............
"ఆలోచన తక్కువ.కేవలం అంటి పెట్టుకు పోయే స్వభావం . అంతే"
"కావచ్చు."
పరధ్యానంగా మాట్లాడుతూ తనను తదేకంగా చూస్తున్న ధర్మారావు చూపులను ఎదుర్కోలేక సత్య కనుదోయి వాలిపోయింది. పెదవుల పై ఆమెకు తెలియకనే చిరునగవు నర్తించింది.
"సెలవా, మరి?"
అతడి కంఠం లోని అపూర్వ మర్ధవానికీ, ఏదో తెలియని అస్పష్ట అనురాగ స్వరానికీ చకిత అయి తలెత్తి చూచింది సత్యాదేవి. ఇద్దరి కనులలో ఏవో మూగ భాషలు!
"సెలవు" అవనత నేత్రియై హస్త ద్వయాన్ని జోడించింది, ఏవేవో మధుర భావాలతో.
అస్పష్టమైన కోరికలతో మనసులు విడివడలేక విడివడ్డాయి.
13
ఖూనీ నేరం చేసిన ఒక ఖైదీ కి ఆనాడు మరణ శిక్ష అమలు జరుగబోతున్నది. న్యాయాధికారు లందరూ హాజరయ్యారు. తన ప్రియురాలిని తీసుకుని పోయిన మరొక వ్యక్తిని బల్లెం తో పొడిచి చంపి వేశాడోకడు . అతడిని న్యాయ స్థానం మరణ శిక్షతో దండించు తున్నది.
తప్పనిసరిగా ఆ దృశ్యం చూచి వచ్చిన ధర్మారావు మనస్సంతా వికలమై పోయింది. చెప్పరాని బాధతో సుడులు తిరిగిపోయింది అతడి హృదయం. తల్లితో మాట్లాడడానికే మనస్సు అంగీకరించలేదు. భోజనం చేయలేకపోయాడు. మిత్రుడు డాక్టర్ మాట్లాడించినా , తానె మాట్లాడలేక పోయాడు. స్నేహితురాలు సత్యను కలుసుకోవాలని పించలేదు. బలస్మరణానికి గురి అయిన ఆ పాతికేళ్ళ యువకుని పైననే అతని మనసూ, మెదడూ నిలిచి పోయాయి.
అర్ధరహితంగా కాళ్ళు తీసుకుపోయిన చోటికి నడిచాడు.
