Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 8


                                       9
    ధర్మారావు ఆగమన వార్త వినగానే గృహంతర్భాగం నుండి బయటకు వచ్చి స్వాగత వచనాలు పలికి సాదరంగా లోనికి తీసుకు వెళ్ళాడు పోలీసు సూపరింటెండెంట్ అర్జున్. పరస్పరాభివాదాలైన తర్వాత అయన ప్రైవేటు గదిలో కూర్చున్నారు ఇద్దరూ.
    "నన్నిలా ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవిస్తున్నందుకు కృతజ్ఞుడిని" అన్నాడు ధర్మారావు.

                              
    అర్జున్ గంబీరంగా నవ్వి ఊరుకున్నాడు, సిగరెట్ ఆఫర్ చేస్తూ. మర్యాద కు అందుకుని , అర్జున్ ను పరీక్ష గా చూచాడు ధర్మారావు. కొద్ది తేడా లో తన వయస్సే ఉండవచ్చు. యువకుడూ, స్పుర ద్రూపీ కూడా. కాని ఈ అందం చాటున ఉన్న గుణం అత్యున్నత మో, అత్యల్పమో ఇంకా తెలియదు.
    "మీరు ఎక్కడ చదివారు?" ప్రశ్నించాడు అర్జున్.
    సమాధానం చెప్పాడు ధర్మారావు.
    "పాపం; అయితే ఈ ఉద్యోగాలూ, అంతా కొత్త అన్నమాట!' అన్నాడు క్రీ గంట చూస్తూ. "నా సర్వీసు అయిదు సంవత్సరాలు. ఈ ఉద్యోగం మూడు సంవత్సరాల నుండి" అన్నాడు తిరిగి , తన ఆధిక్యాన్ని తెలియ చెబుతున్నట్లు.
    అది యధాలాపంగా చేస్తున్న సంభాషనొ లేక ఏమైనా అంతరార్ధాలు ఉన్నాయో గ్రహించడానికి ప్రయత్నిస్తూ మెల్ల మెల్లగా కాఫీ సిప్ చేస్తున్న ధర్మారావు కు భుజంగం రాకతో ఆ సమావేశపు అర్ధం తేటతెల్ల మయింది.
    "ఓ! ఏం, ఇటు వచ్చారు, భుజంగం గారూ? రండి, రండి." పోలీసు సూపరింటెండెంట్ కంట్రాక్టర్ ను అత్నీయుడిని ఆహ్వానించినట్టు ఆహ్వానించాడు. "ఈయన భుజంగరావు గారు, మన జైలు కాంట్రాక్టరు. ఇంకా మీకు పరిచయమై ఉండరు. చాలా మంచివారు. నాకు ముఖ్యులు లెండి" అంటూ పరిచయం చేశాడు ధర్మారావు కు.
    తలపంకించాడు ధర్మారావు. "పరిచయ మైంది లెండి."    
    అతడి సమాధానానికి అర్జున్ , కాంట్రాక్టరు ఇద్దరూ ముఖ ముఖాలు చూచుకున్నారు. ఒక పావుగంట సేపు వాతావరణాన్ని నిస్తబ్ధత ఆవరించింది.
    "మరి సెలవిప్పిస్తారా?" ముందుగా భుజంగమే లేచాడు.
    ఎవరి దారిన వారు చీలిపోయాక , ముగ్గురూ కూడా తక్కిన వారిని గురించి ఒక్కలాగే అనుకున్నారు -- ఘటికులు!' అని.

                                       10
    "మిమ్మల్ని ఇవాళ మాయింటికి ఆహ్వానిస్తున్నాను." కారు దిగి గుమ్మం లో అడుగు పెడుతూనే చెప్పింది సత్యాదేవి.
    "అయితే మీరనుకున్న మంచి ముహుర్తం ఇదన్న మాట?' అంటూ నవ్వాడు ధర్మారావు.
    "అవును" సత్య చిరునవ్వు నవ్వింది. "మీరూ రావాలి." అన్నది దయామయితో.
    "నేనెందు కమ్మా? అబ్బాయి వస్తాడు' అన్నది దయామయి.
    "ఇద్దరూ రావాలి."
    ధర్మారావు కలుగ జేసుకున్నాడు. "అమ్మ ఎక్కడికి రాదు. బలవంతం చేయకండి."
    "సరే, మీ అబ్బాయి గారినైనా పంపండి."
    "ఎన్నింటికో?"
    "సాయంత్రం నాలుగు గంటలకు."
    "సరే. ఇక సాయంత్రం నాలుగయ్యే సరికి, నేను మరిచిపోయినా, అమ్మ మరిచిపోనివ్వదు. నన్ను బంగీ కట్టి అయినా మీ ఇంటికి పంపేస్తుంది."
    ధర్మారావు మాటలకు ముగ్గురూ తేలికగా నవ్వుకున్నారు.
    సాయంత్రం ధర్మారావు న్యాయ మిత్ర ఇంటికి వెళ్ళేటప్పటికి వీధిలోనే జవాను సిద్దంగా నిల్చుని ఉన్నాడు. నమస్కరించి , దేవేంద్ర భవనం లా ఉన్న ఆ భవంతి లో మూడవ అంతస్తు కు తీసుకు వెళ్ళాడు. మౌనంగా గది చూపించి నౌకరు నిష్క్రమించాడు. కొద్ది క్షణా లాగి స్ప్రింగ్ డోర్ తోసి, లోపలికి ప్రవేశించాడు ధర్మారావు.
    తలవంచి ఏదో వ్రాసుకుంటూ తన ఆగమనాన్ని గ్రహించని సత్యాదేవి కి వినిపించే టట్లు చిన్నగా దగ్గాడు.
    తలెత్తి చూచి, పరమ సంతోషాదరాలు ప్రదర్శిస్తూ, లేచివచ్చింది సత్య.
    "రండి. నమస్కారం. కొద్దిగా ఆలస్య మైతే మరి రారేమో అనుకున్నాను."
    "క్షమించాలి. సకాలంలోనే వచ్చి ఉండేవాడిని. దారిలో అర్జున్ గారు తటస్థ పడితే ఓ అరగంట కాలం సంభాషణలో మింగుడు పడిపోయింది."
    "నయం. మనుష్యులే మింగుడు పడిపోనందుకు సంతోషించాలి."
    ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు. కూర్చున్న తర్వాత తీరికగా గదంతా చూచినా ధర్మారావు "నేను ముందే ఊహించాను లెండి -- మీది ఉత్తమ కళా హృదయం అయి ఉండవచ్చు నని."అన్నాడు.
    "ఊ! ఎందు వల్లనో?' మెరుస్తున్న కళ్ళతో అడిగింది సత్య.
    "ఏముంది ? కళాకారులకూ, రచయితలకూ ఏ విషయం లోనైనా విమర్శ నాత్మక పరిశీలన అధికంగా ఉంటుంది. ఆరోజున జీవితం గురించి, న్యాయా న్యాయాల గురించి, ధర్మా ధర్మాల గురించి మీరు ఖైదీ గౌతమ్ తో అన్న మాటలు నన్నా విధంగా ఆలోచింప జేశాయి."
    "ఓహో! అయితే ఈ లెక్కన తమరూ కవసర కారులో, చిత్ర కారులో అయి ఉండాలన్న మాటేగా?"
    నవ్వేశాడు ధర్మారావు. "పరస్పర శ్లాఘనకు కాదను కుంటాను, మన ఈ సమావేశం?"
    "కరెక్ట్ . అందుకు కాదు. "నవ్వుతూనే అంది సత్యాదేవి.
    నౌఖరు తెచ్చిన కాఫీ ఫలహరాలను ఇద్దరూ మౌనంగానే స్వీకరించారు.
    "ఇవాళ నా పుట్టిన రోజు. " మెల్లగా చెప్పింది సత్య. "ఈ ప్రత్యేకమైన రోజుననే మిమ్మల్ని ప్రత్యేకంగా మా యింటికి రప్పించాలను కున్నాను. మీరు నా ఆహ్వానం మన్నించి వచ్చారు. థాంక్స్."
    "కృతజ్ఞుడి ను. కాని ఇదేమిటి? పుట్టిన రోజు పార్టీ అతిధిని నేనొక్కడినేనా?"
    ఒక విధమైన గంబీర్యంతో అన్నది సత్య. "ప్రతి సంవత్సరం ఈ ఒక్కరు కూడా ఉండేవారు కాదు. ఈ ఏడు ఎందుకో మిమ్మల్ని పిలవాలని పించింది."
    "అదేమిటి ?"
    "అదంతే." విషాదంగా నవ్వింది. సత్యాదేవి . "పుట్టినరోజు అనగానే విధిగా తల్లీ, తండ్రీ గుర్తుకు రావడం సహజం కదా? మా అమ్మగారు నా చిన్నప్పుడే పోయారు. అందువల్లనో, మరెందు వల్లనో నా కంత కోరిక ఉండదు ఈ పుట్టిన రోజు వేడుక లంటే. కాని మా నాన్నగారు అందుకు పూర్తిగా విరుద్దం. అయన దగ్గరుంటే ఈ రోజున ఇక నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం ఉండదు. చంటి పిల్ల లాగ ముస్తాబు చేసి, భారీ ఎత్తున విందులు చేస్తారు. నేను మాత్రం ఇంతే" అంటూ వాజు లోని గులాబీలు రెండు తీసి తల్లి ఫోటో ముందు ఉంచింది.
    "పుట్టిన రోజని నాకు మీరు ముందుగా చెప్పి ఉండవలసింది. ఇలా ఉత్త చేతులతో రావడం నాకు సిగ్గుగా ఉంది." నొచ్చు కుంటున్నట్లు అన్న ధర్మారావు మాటలకూ సమాధానంగా --
    "ఫర్వాలేదు. ఎందుకో చెప్పలేను కాని, మీరాకే నాకు వెయ్యి కానుకల పెట్టుగా ఆనందంగా ఉన్నది. మనః పూర్వకంగా ఇచ్చినది , తీసుకున్నదీ ఏదైనా మహత్తరమైన కానుకే" అంది.
    "విష్ యూ హాపీ బర్త్ డే." వాజులో గులాబీ తీసి చేతి కందిస్తూ అన్నాడు ధర్మారావు.
    ప్రపుల్ల వదనంతో అందుకున్న సత్య, తన తలలో పూవ్వులున్నప్పటికి ఆ పుష్పాన్ని సంతోషంగా తలలో తురుము కోవడం చూచి ధర్మారావు మనస్సు లో అమితంగా ఆనందించాడు.
    "తీసుకోండి ." ఆమె అంతవరకూ తుది శోభలు కూరుస్తున్న చిత్రాన్ని ధర్మారావు చేతిలో ఉంచింది. పరీక్షగా చూచాడు ధర్మారావు. ఆసీనుడైన గౌతమ బుద్దుని శిరస్సు వెనుక ప్రకాశ వంతమైన వెలుగు నీడలా చక్రం, సుమాంజలి ఘటించిన సుజాత!
    "ఓ మీరు చిత్రకారిణి కూడానా? ఇంత వరకూ మీతో మాట్లాడుతున్నానన్నమాటే కాని, మీరు చేస్తున్న పనిని నేను గమనించనే లేదు సుమండీ!"
    పారిజాతాలు విరిసినట్లు మధురంగా నవ్వింది సత్య. "నా పుట్టిన రోజు కానుకగా మీకా చిత్రాన్ని మనః పూర్వకంగా ఇస్తున్నాను."
    "పుట్టిన రోజుకు అతిధికి కానుక ! కొత్త పద్దతిని సృష్టించారా మీరు, నాకోసం?"
    "అవును. కొత్త పద్దతులను ప్రేమించి , అలజడి ని రేపే కొత్త మనిషి కదూ, మీరు ? అందుకు."
    ధర్మారావు ఆశ్చర్య బుధి లో నిమగ్నుడై తేరుకునే లోగా తిరిగి ఆమె అన్నది : "ఖైదీల విషయం లో మీరు అనుసరిస్తున్న కొత్త పద్దతులు, మీ ఆదర్శాలూ నిజంగా నన్ను కదిల్చి వేశాయి, ధర్మారావు గారూ! సరిగా నావీ అవే ఉద్దేశాలు. ప్రపంచం లోని ఈ ఘోరాలను చాలా వరకు అలా సౌమ్య మార్గం లోనే పరిష్కరించాలని నా ఆశ. కాని నాన్నగారితో అంటే తేలికగా చంటి పిల్ల మాటలా కొట్టి పారేస్తారు -- 'అలా బంగారు లోకాల కోసం కలలు గని తెలిపోకు. ఇది నిజ ప్రపంచం." అంటూ. నాకు పరిష్కార మార్గం తోచదు. కాని అంతరాంతరాలలో ఏదో బాధగా ఉంటుంది యీ ఖైదీలనూ, దీనులనూ , ఆర్తులనూ చూస్తె. అసలు ఆ పద్దతిలో ఆలోచించే వారు ఎవరైనా ఉంటారా అని కూడా అనిపించేది. కాని నా ఆదర్శాలు మూర్తీభవించిన వారు ఒకరున్నారని మీరు ఉద్యోగంలో ప్రవేశించిన మర్నాడే విన్నాను. దీనుల గుండెలలో దీప శిఖలా వెలుగుతున్న మిమ్మల్ని, అధికారం, చేపట్టిన మర్నాడే అధికార వర్గాలలో విపరీత సంచలనం రేపిన మిమ్మల్ని చూడకుండానే గౌరవించాను. పరిచయం లేకుండానే అభిమానించాను. పరిచయమైణ తర్వాత మీరు సార్ధక నాములని నిర్ధారించు కున్నాను. నా ఆనందానికి హద్దులు లేవు. అందుకే, కోరి మీ స్నేహం వృద్ది చేసుకుంటున్నాను. మిమ్మల్ని చూచిన ప్రధమ క్షణం లో దయాధర్మాల ప్రభువైన ఆ గౌతమ బుద్దుడెందుకో నా మనస్సులో మెదిలాడు. అందుకే ఈ చిత్రాన్ని నేనే స్వయంగా చిత్రించి మీ కిచ్చాను. ఎన్ని కష్టనిష్టూరాలేదురైనా, మీరీ ధర్మచక్రాన్ని విడనాడరాదనీ నా కోరిక."
    మాటలకు తావులేక ఆశ్చర్యం విప్పారిత నేత్రాలతో తిలకిస్తున్న ధర్మారావును చూచి కొంచెం సిగ్గుపడింది సత్య.
    "క్షమించండి. విపరీతావేశం ప్రదర్శించా ననుకుంటాను." అంటూనే లేచి లోపలికి వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు ధర్మారావు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన ఆమెలో పూర్వావేశపు చాయలు మచ్చు కైనా లేవు.
    'అలా పూల తోటలోకి వెళ్దాం. పదండి" అన్నది. ధర్మారావు మౌనంగా అనుసరించాడు.
    "మీ అభిమాన విషయాలేమిటి? సంగీతం మొదలెనవేమైనా వచ్చుననుకుంటాను" అన్నాడు తోటలో మొక్కల మధ్య కూర్చుంటూ.
    "ఏం? మీకా చిత్రాన్ని వేసిచ్చాననా?' ఎదురు ప్రశ్నించింది సత్య. నవ్వుతూ చెప్పింది. "ఏదో అంతంత మాత్రపు ప్రవేశమే. విశేష ప్రజ్ఞ లేమీ లేవు. కాకుంటే , చూడండి -- ఎందరు చేసి పెట్టె వారున్నా, ఏదైనా మన ఆత్మీయులకు మనం స్వయంగా చేసి పెట్టుకోవాలనే కోరిక ఇంచుమించు ప్రతివాళ్ళ కూ అంతరంతరాలలో ఉంటుందేమో? అలాగే కొనడాని కెన్ని దొరికినా నేను స్వయంగా చిత్రించి మీకు ఇవ్వగలిగితే అదొక తృప్తి , అంతే."
    "నా అదృష్టాన్ని ఏమని పొగడాలో తెలియడం లేదు. మీకు ఎందుకింత అభిమానం నా మీద ?"
    "ఆ మాటే నేనూ తిరిగి అంటే?" కొంటెగా మెరిశాయి సత్య నేత్రాలు.
    "అయితే మీ నన్నగారేక్కడ ఉంటున్నారు?' మాటమార్చాడు ధర్మారావు.
    "మద్రాసు లో . అయినా, ఒక చోటేమిటి? తరచుగా ప్రయాణాలలో నే ఉంటారు. తెలుసుగా మీకు -- అయన ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , అని? అందుచేతనే ఇక్కడ, పినతండ్రి గారింట్లో ఉంచారు. తల్లి లేదు; ఆయనకు తీరిక ఉండదు. అందుచేత నన్ను తీర్చిదిద్దడానికి పిన్ని దక్షత అవసరమని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS