Previous Page Next Page 
అర్పణ పేజి 9


    "ఏమిట్రా?' అన్నది జానకి ఈసారి అయోమయంగా.
    "కాకపోతే ఏమిటమ్మా! దానికి అంతటికీ మూలం నువ్వూ. నాన్నగారికి తెలియకపోతే నీకు తెలియదూ? అయన ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు నాకూ, పార్వతి కీ పెళ్లి కుదరదని చెప్పలేక పోయావా? చూస్తున్నావు కదా , మా సఖ్యత? ఈ విధంగానే దాంపత్య జీవితంలో జరిగితే ఇక మా ప్రాణాలకు సుఖం సున్నే. ఇప్పటికైనా నాన్నకు అర్ధ మయ్యేలా చెప్పు" అన్నాడు రాజు. తల్లి మీద తన కోపాన్ని దులపరించి.

                                      7
    ఆరోజంతా రాజుకు ఆలోచనలతో గడిచి పోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో సంభాషిస్తున్నా అన్నింటి మధ్యా తన జీవిత సమస్యే మెదులుతున్నది. ఆ విషయానికి సంబంధించిన సంగతులే ముసురుతున్నాయి.
    పార్వతిని పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. తండ్రి చూస్తె నిశ్చయంగా, దృడంగా అంటున్నట్లున్నాడు. పైగా కావలసినంత డబ్బు తీసుకుని అడవి లోకో, చైనా లోకో పొమ్మంటున్నాడు కూడా. తల్లి సంగతి సరేసరి! పెద్ద తరహ తప్పించి, అంతా అమాయకత్వం. ఇక తనేం చెయ్యాలో, నిజాన్ని వాళ్ళ కెలా వ్యక్తపరచాలో , వాళ్ళ నిర్ణయం వల్ల ముందు ముందు రాబోయే తన నూరేళ్ళ  జీవితపు అనర్ధాలను ఎలా దర్పణం లో లాగా వాళ్లకు చూపించాలో అర్ధం కావటం లేదు. ఇంకా పార్వతి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. ఏమైనా ఆమె గనక తనను వ్యతిరేకించి మాట్లాడ బోతే ముందే బెదర గొట్టాలి.
    ఆలోచనను మధించి మధించి, చివరకు ఒక నిర్ధారణ కు వచ్చాడు రాజు.
    అప్పుడు సాయంకాలం నాలుగు గంటలయింది. రాజు మనః పధం లో తిరిగి తిరిగి, ఒక కోలుక్కి వచ్చేసరికి అంత వేళ అయింది. మహోత్సాహ మయంగా ఉన్నది ఆ సమయం ప్రపంచానికి.
    రాజు ఇంట్లోకి అడుగు పెడుతుండగానే అతని కళ్ళు పార్వతి కోసం వెదుకు లాడాయి.
    "పార్వతి ఏదమ్మా?' అని అడిగాడు, కాఫీ పట్టుకుని ఎదురైన తల్లిని.
    "తోటలో తిరుగుతున్నట్టుంది" అని ఆమె సమాధానం ఇచ్చింది నెమ్మదిగా. రెండు గుక్కల్లో కాఫీ తాగి పడమటి వైపున ఉన్న ద్వారం లో నుంచి పెరటి వైపు వెళ్ళాడు రాజు.
    ఎక్కువ విశాలంగా లేకపోయినా ఆ స్థలం లో పెద్ద చెట్లు గుబురుగా చుట్టూ ఉన్నాయి. మధ్య భాగంలో కంపెనీ నుండి తెప్పించిన పువ్వుల తీగలు, గులాబి మొక్కలు వేయించారు రామనాధం గారు. పువ్వులు ఒయ్యారంగా గాలితో సయ్యాటలాడుతున్నాయి. ఆ పూల మొక్క లుంచిన కుండీల మధ్య పార్వతి చేతులు కట్టుకుని అన్యమనస్కంగా , ఆలోచనా దీనురాలై తిరుగుతున్నది.
    రాజు ఒక్క క్షణం అజ్ఞాతంగా ఉండి పక్క నుంచి ఆమెను పరకాయించి చూశాడు.
    కట్టుకున్నది ఉల్లి పోరలాంటి తెల్ల చీర. ఎంత పొందికగా కట్టినా, బట్టల్లో దాగకుండా లీలగా స్పష్ట మవుతున్న శరీర భంగిమ. మెడలో నగ లేదు. నుదుట సన్నటి బొట్టయినా కనిపించలేదు. ఎడమ చేతికి వాచీ తప్ప ఇంకేమీ లేవు చేతులకు. ఏదో బొంబాయి ఫాషన్ ల జడలను పైకి కట్టింది. రాజుకు ఆమెను చూడగానే జుగుప్స కలిగింది. తన తలదన్నే వారెవరూ లేరన్నట్లు పచార్లు సాగిస్తున్న పార్వతి ని చూస్తె, అసహ్యం, తెలియరాని విద్వేషం అతనిలోకి చొచ్చుకు వచ్చాయి. ఆమెతో ఆ సమయాన మాట్లాడా లనిపించ లేదతనికి. అయినా తప్పని సరి. ఆమెతో విషయాన్ని ఖండితంగా తేల్చుకునే వరకు మనశ్శాంతి ఉండదు.
    రాజు ముందుకు నడిచి తన రాకను తెలియజేస్తూ గొంతు సవరించు కున్నట్లు దగ్గాడు.
    పార్వతి అతన్ని చూసి ఆశ్చర్యపడింది మొదట. తర్వాత అతని వైపు చూసి, "ఏం, బావా, ఇలా రావడం?" అన్నది నవ్వుతూ. పార్వతి మనోహరంగా నవ్వడమయితే నవ్వింది కానీ, రాజు సంమోహితుడు కాలేదు ఆ నవ్వుకు. తమకు ఇష్టం లేని వాళ్ళ మీద అభిమానం ఎక్కడ కలిగి పోతుందో నని బెదరడం కూడా ఒక లక్షణం . ఇష్టాయిష్టా లకు వ్యతిరేకంగా పోయేది అ వేగం. ఆ అనుభూతికి అభిముఖుడైనట్లు రాజు కొన్ని క్షణాలు  మౌన వ్రతం స్వీకరించవలసి వచ్చింది.
    "ఏమిటి , బావా , ఆలోచిస్తున్నావు?' ప్రశ్నార్ధకంగా అతని వైపు చూసింది పార్వతి.
    "నీతో ఒక విషయం మాట్లాడాలి పార్వతీ!" అన్నాడు రాజు.
    పార్వతి కిలకిలా నవ్వింది. "సూటిగా చెప్పకుండా ఒక విషయం మాట్లాడాలంటూ చెప్పాలా, బావా?"
    "ఇది చాలా ముఖ్య విషయం. అందుకే నిన్ను దానికి తగిన పరిస్థితిలోకి తీసుకు రావాలని అలా అన్నాను."
    "అలాగా!"
    "మనిద్దరికీ పెళ్లి చెయ్యలాని నిశ్చయించు కున్నారు మనవాళ్ళు. నీకు తెలుసా, పార్వతీ?" అన్నాడు రాజు అతి సామాన్యమైన సంగతి చెబుతున్నట్లు -- దూరంగా , పోరుగొంటిలో ఉన్న పొగడ చెట్టు వైపు చూస్తూ.
    పార్వతి నవ్వును మందహాస రూపంలో ఉంచలేక ప్రపుల్లమైన ముఖంతో నవ్వుతూ , రాజు కళ్ళల్లోకి చూచింది. ఆమె భావాలను పరిశీలించాలనే ఆత్రుతతో సరిగ్గా అప్పుడే రాజు కూడా ఆమె ముఖంలోకి చూచాడు.
    ఇంకా పార్వతి ప్రపుల్ల హాసం తోనే "ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండి పోతామా బావా?' అంది. ఆమె అర్ధం చేసుకోకపోవడం రాజుకు విసుగు తెప్పించింది. అయినా పైకి తేలలేదు.
    "పెళ్లి చేసుకునే మాట కాదు. మనిద్దరినీ భార్య భర్తలు చెయ్యడానికి నిర్ణయం జరుగుతుంది. ఇది అనాలోచితంగా చేస్తున్న వ్యవహారం" అంటూ ఆగాడు రాజు.
    పార్వతి ముఖంలో ఒక వన్నె తగ్గింది. "నీ  ఉద్దేశం ఏమిటి, బావా?' అంది గులాబీ ఆకులను వేళ్ళతో స్పృశిస్తూ.
    "వధూవరులు తమ ఇష్టాయిష్టాలు పరస్పరం తెలుసుకుని ఒప్పుకుంటేనే శ్రేయస్కరమని నేననుకుంటాను. అది ఉత్తమం కూడా" అన్నాడు రాజు.
    "అవును. కొంతవరకు నిజమే!" ముక్తసరిగా అన్నది పార్వతి.
    చెప్పవలసిందేదో ఖండితంగా చెప్పెయ్య టానికి తహతహ లాడుతుంది రాజు అంతరం.
    "ముందుగా నేనడిగినదానికి అడ్డదోవలు తిప్పకుండా తిన్నగా సమాధానం చేవుతావా పార్వతీ? ఇందులో దాగుడు మూత లాడటానికి ప్రయత్నించినా, కేవలం ఆటగా పరిగణించినా మన జీవితాలే బలి అవుతాయి. తర్వాత విచారించినా లాభం ఉండదేమో! అందుచేత ఏదీ దాచకుండా , పంతాలకు పోకుండా మనసులో ఉన్న మాట చెప్పు."
    పార్వతి నాసా పుటాలు ఎగరేస్తూ ." అయితే చెప్పవలసిందేదో చెప్పు మరి!" అంది. అమెది అంతా పసిపిల్ల వాటంగా ఉంది ఆ సమయంలో.  
    "నన్ను పెళ్లి చేసుకోవడం నీకు మనసులో ఇష్టం ఉండదని నాకు తెలుసు , పార్వతీ! అది స్పష్టంగా, ఎవరికీ భయపడకుండా పైకి చెప్పెయ్యి . అదే నేను కోరేది. ఆ పైన నేను ఈ పెళ్లి జరగకుండా చూస్తాను. ఏం? ఏమంటావు?"
    అతను సమాధానం కోసం ఎక్కువసేపు నిరీక్షించ నవసరం లేకుండానే పార్వతి కయ్ మంది. "అదేమిటి , బావా? నిన్ను చేసుకోవడం నాకిష్టం లేడూ? ఎవరు చెప్పారు? నేను నిన్ను తప్ప మరెవరినీ చేసుకోను గాక చేసుకోను!"
    రాజు ఉలిక్కిపడ్డాడు. పార్వతి తన అయిష్టత ను గుర్తించిందో లేదో ఆమె ముఖ భావం వల్ల సహా స్రాంశమైన తెలియలేదతనికి. అలా మాట్లాడటమే తప్పయిందని పదేపదే ఉసూరు మన్నాడు మనసులో. ఇప్పుడు ఈ పార్వతిని, మొండి ఘటాన్ని, మరొక వైపు మళ్ళించడమనేది మాటలతో సాధ్యమయ్యే పని కాదు.' ఇక జాప్యం  చేస్తే లాభం లేదు-- అనుకున్నాడు రాజు. ఏమైతే అయింది; ఆ వివాహం పట్ల తన విముఖతాన్ని సృష్టి కరిస్తే నే ఆమె మనసు కూడా విరగావచ్చు. అప్పుడది తనకు ఆనందాయకమే. అయోమయంగా  తిరిగి సంభాషణ ప్రారంభించాడు.
    "పార్వతీ! సరిగ్గా ఆలోచించే అంటున్నావా?' అన్నాడు.
    "నిశ్చయంగా!" అన్నది పార్వతి అవసర ముఖంగా నిలబడి.
    "వివాహానికి ముందు వదూవరు లిద్దరూ ఒకరి నొకరు అంగీకరించ గలిగినప్పుడే అది హర్షించదగిన సంస్కార భావాలతో కూడిన వివాహ మవుతుందని ఒప్పుకుంటావు కదూ, పార్వతీ?"
    "ఇందాకనే అవునన్నానుగా?"
    "అయితే నా అభిప్రాయం తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు" అన్నాడు రాజు.
    "ఏమిటి ?" తల ఎత్తి అతన్ని చూచింది పార్వతి. అంతరాంతరాల్లో అతను చెప్పబోయేది ఆమెకు తెలుస్తున్నది కొద్దిగా. అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టమున్నా, లేకపోయినా ఆ సందర్భం లో , ఆ క్షణం లో బరువుగా, బాధగా అనిపించింది పార్వతి కి.
    "ఈ వివాహం జరగకూడదు!" అన్నాడు రాజు కాస్త బొంగురు పోయిన గొంతుతో. పార్వతి మాట్లాడక పోవడంతో ఆమె వైపు చూడకుండానే, "ఈ విషయంలో నాకు భిన్న మైన, ప్రత్యేకమైన అభిరుచులు ఉన్నాయి. అదీకాక నువ్వు నన్ను అంగీకరించడమే ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను నీవంటి యువతికి తగనేమో కూడా" అన్నాడు చివరి మాటలు నెమ్మదిగా వ్యక్తపరుస్తూ. ఎంత నిష్కర్షగా చెప్పాలను కున్నా రాజులో కొంత సంకోచం అడ్డు వచ్చింది.
    ఎంత తిరస్కారం! పార్వతి మెదడు లో బరువూ, బాధా తగ్గి , ఆ స్థానం లో కోపమూ, ఉక్రోషమూ మంటల లాగా వెలిగి, నసాళం బద్దలు చేశాయి.
    రాజు తన అందాన్ని, అంగీకరించలేకనే తిరస్కరిస్తున్నాడని భావించింది పార్వతి. తనను తన ఎదురుగానే వేలెత్తి చూపి, హేళన చేస్తున్నట్లు ఊహించిన పార్వతి ముఖం కుంగి పోతున్న సూర్య బింబం లా కందిపోయింది. మనుషులు వేరు, మనసులు వేరు. మాటలు కూడా వేరే. మనుషులను, మాటలను తెలుసుకొనడం సులభ సాధ్యమే అయినా, మనసులను గుర్తించడం కష్టం. ఎదటి వ్యక్తీ మనస్సు లో ఏముందో గుర్తించాలనే తీవ్ర ప్రయత్నం లోనే పూర్తిగా బోల్తా పడుతుంటారు మానవోత్తములు. ఎదటి మనిషి అంతర్యంలో ఏముందో ఊహించి , తను ఊహించినది నిజమని ఆకారణంగా అపోహల్లో పడటం, భ్రమించడం -- అదంతా తప్పటడుగు వెయ్యటం గాక మరేమిటి? అయినా మనుషుల చిత్త స్థైర్యం బలవత్తర మైనదిగా ఉండదు. అనుకున్నదే అక్షరాలా నిజం అనే తత్త్వం చాలామందికి బాగా ఉంటుంది. పీక తెగగోసుకున్నా అప్పటికి ఆ భావం మారేది లేదు. పార్వతి స్వభావం బొత్తిగా అట్లాటిది కాకపోయినా ఆ పిల్లకు కొన్ని సమయాల్లో ఆత్మ విశ్వాసం మహా వృక్షం లాగ పెరిగిపోతూ ఉంటుంది.
    ఆసాంధ్యరాగపు సుమనోహర సమయంలో అటువంటి స్థితిలో పడింది పార్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS