Previous Page Next Page 
అర్పణ పేజి 10

                              
    పార్వతి ముఖంలో ఏ క్రోధారుణ రేఖలు ప్రతి ఫలిస్తున్నాయో , ఆమె హృదయంలో ఎన్ని అగ్రహావేశనదాలు తరంగోన్మత్తం అవుతున్నాయో అని ఆమె వైపు చూడడానికి సాహసించలేక పోతున్నాడు రాజు.
    'ఎంత తిరస్కారం! ఊ మరెంత అవమానం!" అని ఇంకా అనుకుంటూనే ఉంది పార్వతి  . ' ఇలాటి అభిప్రాయాన్ని మొగమాటం లేకుండా అతను చెప్పయ్య గలడని ముందే తెలుసు. తీరా అతను చెప్పివేశాక ఇంత కోపం ముంచుకు వస్తున్నది. ఇతని కోసం తను దుఃఖించవలసిన ఆవసరం లేదు. ఇతన్ని తలదన్నే వాళ్ళు తనకు భర్త కావటానికి కోరతారు. కాని....కాని.......'
    లోపల వేడిగా ఉంది. మనసు, హృదయం , శరీరం అంతా కుతకుత లాడిపోతున్నట్లు గా ఉంది. పగ, కసి, విద్వేషం , కోపం ఎలా తీర్చుకోవాలి?
    సరోజ సౌందర్యం చూచిన తర్వాతే ఇతను  తనను మరింత నిస్సాకారంగా చూసి, కొనగోటికి పనికి రానంతగా తీసి పారేస్తున్నాడు. ఇతనికి ఇంత సౌందర్య పిపాస ఎందుకు ఉండాలి? సరోజను ఎందుకు అంత అందం ఉండాలి?
    ఒక్క క్షణ కాలం అనుభవ శూన్య, అమాయకురాలు అయిన పార్వతి హృదయ కుహరం తో సరోజ పైన ఈర్ష్య తలెత్తింది తేలు పిల్లలా. కానీ చదువు కున్నది కావడం వల్లా, అంతో ఇంతో ఆత్మబలం కలది కావడం చేతా తప్పు తెలుసు కుంది మరుక్షణం లో. ఒళ్ళంతా చెమటలు కమ్మాయి. అసూయ విషంలా పనిచేస్తుంది. అవసరం వస్తే దానిలో పడి చావవచ్చు కూడా.
    వెనువెంటనే పార్వతికి సరోజ మీద ప్రేమ ఉప్పెనలా పొంగింది. "సరూ ఈరాజు లాటి వాళ్లకు  ఎప్పటికీ లొంగిపోదు' అనుకున్నది -- చిన్ననాటి చెలిమి వల్ల తెలుసుకున్న తన స్నేహితురాలి సుగుణాలను మనః ఫలకం మీద మరొకసారి దర్శిస్తూ.
    'ఇక ఏం చెయ్యాలి? రాజు పైనే తన పగ తీర్చుకోవాలి. అతను ఆశించినదీ, అనుభవించ కోరినదీ అందకుండా చెయ్యాలి. తనను ఇంత దుఃఖ పెట్టి అవమాన పరిచి, చిన్నతనం నుంచి అనేక విధాలుగా వేధిస్తున్న ఈ యువకుడిని పెళ్లి చేసుకుని అతని ఇష్టాలకు వ్యతిరేకంగా ఉంటూ ఎడిపించాలి. సాధ్యమైతే తనవిలువ అతడు తెలుసుకునేటట్లు చెయ్యాలి. కాకపోతే ఎందుకు అంత దురహంకారం ఇతనికి? ఈ గర్వం సడలగొట్టి తగిన శాస్త్రి చేస్తే తనకు తృప్తి కలుగుతుంది. మామయ్య తన మాటనే పాటిస్తాడు ; తనెంత చెబితే అంత. ఈ పెళ్లి ఎలా జరగకుండా ఉంటుంది?' పార్వతి ఆవేశంగా ఏవేవో నిర్ణయాలు చేసుకుంది. కోపోద్రేకంలో వివేకం నశించడం సహజమే. కర్తవ్యాన్ని గురించి తర్కించు కుంటూ కూడా పార్వతి , తన జీవిత గమనం ఎలా ఉంటుందో మున్ముందు -- అనే విషయమై ప్రత్యేకించి ఆలోచించలేదు. ఆమెలో ప్రతీకార వాంఛ లాంటి దేదో పరవళ్ళు తొక్కుతుంది.
    "మనిద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా జీవితం భరించలేనిదై పోతుంది. అందుకే  నాన్నగారితో చెప్పెసేయ్యి. మన వివాహం జరగడానికి వీల్లేదని . ఏం? ' అక్కడ ఒక బెంచీ మీద కూర్చున్న రాజు ఆ మాటలు అని పార్వతిని చూడడానికి కాస్త సాహసించాడు.
    పార్వతి చిన్న నవ్వు నవ్వింది. "నీకు ఇష్టం లేకపోతె నువ్వే మామయ్యతో చెప్పలేవా, బావా? నేనే చెప్పాలని ఏముంది?"
    పార్వతి నవ్వులోనే భావం గ్రహించలేక పోయాడు రాజు.
    "నన్నాగారు నే చెప్పేది సరిగ్గా వినడానికి ప్రయత్నించరు. ఇక అర్ధం చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంది?అందుకే నీచేత చెప్పించవలసి వస్తోంది" అన్నాడు ఆ అమ్మాయి వంక చూస్తూ.
    "నీ మాటలే వినిపించుకోని వాళ్ళు నా గొడవ అంతకంటే వినరు. నువ్వేదో నాకు లేని గొప్పని అంటగడుతున్నావు." అంది పార్వతి.
    "అలా కాదు , పార్వతీ! నీకీ పెళ్లి ఇష్టం లేదని నాన్నతో స్పష్టంగా చెప్పు. నువ్వేం చెప్పినా శ్రద్దగా వింటారని నా ఉద్దేశం."
    నవ్వు రాకపోయినా పకపకా నవ్వింది పార్వతి. "మంచి బావవే! అబద్దం అడమంటావా ఆయనతో ? నీకైతే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను పూర్తీ అంగీకారం తో ఉన్నాను. అల్లాంటప్పుడు నాకీ పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పడం?"
    రాజు మెల్లిగా లేచి పార్వతి దగ్గరకు నడిచాడు. "చెప్పటానికే ముంది, పార్వతీ? మన జీవితాలను రక్షించుకోవడం తప్ప ఇందులో మహా అబద్దం ఏముంది? కావాలంటే -- నేనే ముందుగా నువ్వు ఇష్టపడటం లేదని చెప్పనా , నాన్నతో?"
    అనంగీకారం సూచిస్తూ , "ఏమో?" నీ ఇష్టం నేను మాత్రం చెప్పడం సాధ్యం కాదు. దరిద్రపు అబద్దాలు ఆడలేను" అన్నది పార్వతి అంతలో గంబీరంగా ముఖం మార్చి.
    రాజు ఉడికి పోయాడు. "ఆ మాటకి , నువ్వాడు తున్నది అబద్దం కాదూ?"
    పార్వతి విస్మయంగా అతని వైపు చూచింది. "అబద్దమా? ఎలా అనుకున్నావు?"
    "నీకు నన్ను పెళ్లి చేసుకోవడం అయిష్టమైనా ఎందుచేతనో బయట పెట్టకుండా ఉన్నావు." పరీక్షగా పార్వతి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాజు.
    పార్వతి మొహం మాడ్చు కొంది. "నేనేమీ అబద్దం ఆడటం లేదు. ఆ అవసరం నాకు లేదు" అన్నది.
    "పార్వతీ! చెబుతున్నాను విను. మనసులో దురుద్దేశాలు లేకుండా పైకి చెడ్డ మాట పలికినా అది తప్పని మనస్సాక్షి ని ఒప్పించ లేము. ఇక మనసులో ఏదైనా గుప్తం చేసి పైకి నటిస్తే తాత్కాలికంగా ఎదుటి మనిషికి అది ఆనందం కలగజేయవచ్చు గాని అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. అదే ప్రేమ విషయం లో అయితే మరీను. ఆలోచించుకో."
    "బాగుంది . నేను అబద్దం అడే మనిషిని కాను. మామయ్యతో ఈ విషయం గురించి నేనేమీ చెప్పను" అంటూ పార్వతి తొందరగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది.
    రాజు మాత్రం చాలాసేపు సంధ్య వేళ ఆ కనుచీకటి లో కూర్చుండి పోయాడు. అతనికి తను ఏం చేస్తే పార్వతి లోంగుతుందో అనూహ్యం అయింది. జానకమ్మ అటు వైపు రావడం చూచి లేచి లోపలికి వెళ్ళిపోయాడు.
    జానకమ్మ కొడుకు కూ, పార్వతి కి మధ్య జరిగిన సంభాషణ కొంత స్పష్టాస్పష్టంగా విన్నది. పార్వతి అంటే అతనికి అంత విముఖత ఉన్నదని జానకమ్మ గ్రహించలేక పోయింది ఇంతకాలం . ఏదో  పై పై అల్లరులు, కోపాలు అంతే కాని మనస్సులో సహజమైన ప్రేమాభిమానాలు ఉండకుండా పోతాయా అనుకున్నదామె చాదస్తంగా. రాజు పార్వతిని తిరస్కరించడం , ఆమెతో కలిసి ప్రత్యేకంగా మాట్లాడాడం -- అన్నీ చూస్తుంటే ఈ వైముఖ్య వైరాశ్యాల వల్ల రాజు భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగ పెట్టుకున్నది. కాని ఇన్ని అరాటాల మధ్య, భయాల మధ్య ఆమెకు మౌనమే శరణ్య మయింది.

                                    8
    చిరుగాలి వచ్చి శరీరాన్ని గిలిగింతలు పెడుతున్నది. దూరంగా కొన్ని ఇళ్ళు దాటి వీధుల కొసల్లో నుంచి లీలగా వేణు గానం వినిపిస్తుంది. గాలి తెరల చల్లదనం వేణు గీతికతో కలిసి సమాకర్షి అవుతున్నది. వెన్నెల తరంగాల వెల్లువలు భూమి మీదకు తెల్లగా ప్రవహిస్తున్నాయి. చంద్రుని పట్ల క్రుతజ్ఞులై హాయిగా గాడ సుషుస్తి లో సుఖిస్తున్నారు అందరూ. రాజుకు నిద్ర కంటికి చేరలేదు. ఆలోచనల తీవ్రత లో బుర్ర పూర్తిగా వేడెక్కి స్వాధీనం తప్పింది. నిద్రాదేవి కోసం కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు. కనురెప్పలు బిగించడం తో ఎక్కువయ్యాయి సమస్యా వేదనలు. తుదకు నిద్రాదేవి కూతవేటు దూరంలో కనిపించినట్టే కనిపించి మాయమయింది.
    రాజు లేచి కూర్చున్నాడు. పై గదిలో నుంచి క్రిందకు చూచాడు. చావడి లో జానకమ్మ గారు, వీధి ఆసారా లో రామనాధం గారు నిద్రిస్తున్నారు. పార్వతి గది కొద్ది దూరంలో ఉంది. రాజు మెల్లిగా లేచి పార్వతి గది వైపు నడిచాడు, సందేహస్పందనతో కూడిన హృదయాన్ని కట్టుదిట్టం చేసుకుని.
    గదిలోకి చప్పుడు చెయ్యకుండా వెళ్ళాడు. బెడ్ లైట్ వెలుగుతున్నది. ఒక పక్కకు ఒరిగి ప్రశాంతంగా నిద్ర పోతుంది పార్వతి. అప్పుడే ఆ అమ్మాయికి నిద్ర పట్టినట్లు ముఖం మీద ఇంకా చెదరని చిరునవ్వు తెలియజేస్తున్నది. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఒక్క గడియారం చప్పుడే లయ తప్పకుండా వినిపిస్తుంది.
    రాజు, పార్వతి ని మెల్లగా తట్టి లేపాడు. పార్వతి ఉలిక్కిపడి లేచి కూర్చుని రాజును చూసి "ఏమిటి, బావా ?' అంది తల గోక్కుంటూ.
    "ఇక్కడ కాదు. పద మేడ మీదకు. అక్కడ మాట్లాడుకుంటే ఇంకెవ్వరికీ మన మాటలు వినిపించవు" అన్నాడు రాజు.
    పార్వతి ఆశ్చర్యంగా చూసి, బద్దకంగా ఒళ్ళు విరుచుకుని రాజును అనుసరించింది. ఏదో బోధిస్తాడు కాబోలు అని విసుక్కుంది. మనసులో అతనేం చెబుతాడో అనే ఉత్కంట లేకపోలేదు.
    పార్వతిని తిన్నగా బాల్కనీ లోకి తీసుకు పోయాడు రాజు. తను కూర్చుంటూ పార్వతి కి మరొక కుర్చీ చూపించాడు.
    అతని ఆనతి ప్రకారం కూర్చుని ఆకాశం లోకి చూచింది పార్వతి. తెల్లని వెన్నెలతో ఆకాశ మంతా ముచ్చట గొలుపుతూ కనిపించి, అక్కడ కాసేపు విహరించి వద్దామా అనిపించింది. తెల్లని మబ్బు తెరలు ఆకాశపు అంచులు దాటి వస్తున్నాయి. మంచి కోరికలు పుట్టించే వెన్నెల. సౌందర్యాన్ని ఉపమించడానికీ, మధురానుభావాలను గుర్తు తెచ్చుకోవడానికి , మధురానుభావాలను గుర్తు తెచ్చుకోవడానికీ ప్రోత్సహించి వెర్రెత్తించే వెన్నెల. దూరంగా నల్లగా కనిపించే కొబ్బరి చెట్లు వెన్నెల నంతా తామే అనుభవిస్తున్నట్లు తలలూపుటూ గర్వంగా, ఠీవి గా , ఊగిస లాడుతూ ఆ సుధాకర తేజస్సు కు మరి కొంత అందాన్ని సంతరించి పెడుతున్నాయి. అటువంటి రాగమయ వాతావరణం లో పార్వతి పరవశించింది.
    "పార్వతీ!" అని పిలిచి ఆమెను ఈ లోకానికి తీసుకు వచ్చాడు రాజు.
    పార్వతి "ఏం?' అన్నది తన సౌందర్యవలోకనాన్ని మానకుండానే. కానీ ఆమె ధ్యాస. అతను చెప్పబోయే మాటల పైనే నిలిచింది.
    "మనిద్దరం ఒకచోట పెరిగాము. అన్నిట్లో పాలు పంచుకున్నాం. ఎంత శత్రువుల్లాగా మేలిగినా స్నేహితుల్లాగా కూడా ప్రవర్తించ వలసి వచ్చేది. అనురాగం మన మధ్య లేకపోయినా అప్పుడప్పుడు అభిమానం చూపుకున్నాము. అంతర్యాలు ప్రతి కూలించినా సర్దేసు కున్నాము." చెబుతూ ఆగాడు రాజు.
    పార్వతి కి అతను చెబుతున్న దాని సారాంశం అంతు పట్టలేదు. చెప్పిన దానిలో కొన్ని అబద్దాలుగా అనిపించాయి. తనపట్ల అంతమాత్రపు దయ కూడా ఎప్పుడూ అతను చూపించలేదు.
    "నిజంగా బావనని నామీద నీకు అభిమానం ఉంటె , నన్ను అర్ధం చేసుకుని జవాబు చెప్పడానికి ప్రయత్నించు, పార్వతీ! ముందుగా నేను నిన్ను అర్ధిస్తున్నది అదే." రాజు మరో వైపు చూస్తూ అన్నాడు.
    "సంగతి చెబితే కదా నేను ఆలోచించడానికైనా అవకాశం? ఎక్కువ ఉపోద్ఘాతాలు నీవి!"
    రాజు కొంతసేపు మౌనం వహించాడు.
    "నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదంటున్నావు. కానీ నాకు ఉంది. ఈ మాట పదే పదే చెప్పి నిన్ను కించ పరచడం ఇష్టం లేక పోయినా అనవలసి వస్తున్నది. డానికి కారకురాలివి నువ్వు కూడా. నీలో ఏదో లోపం ఉందని నేను తిరస్కరిస్తున్నా నెమో అని బాధపడకు. కోరితే నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించేవారు దొరక్క పోరు, ప్రపంచంలో. కానీ నిన్ను చేసుకుంటే నువ్వే మాత్రం సుఖపడలేవు. నీమాట అలా ఉంచి నేను ఆనందించ గలగడం కల్ల. ఇదంతా చెప్పెదేందుకంటే ఇకనైనా నా మాట విని చేతులు కాలక ముందే నాన్నగారితో చెప్పి, ఈ వివాహం ఆపించడానికి ప్రయత్నించాలి నువ్వు. నాన్నగారు నీమాటంటే శ్రద్దగా అలోచిస్తారనే నిన్ను ప్రాధేయ పడుతున్నాను." అన్నాడు రాజు.
    రాజు మాటలతో ఆ చల్లని వెన్నెల కూడా వేడి పుట్టించింది, పార్వతి లో. ఆ భావం ముఖంలో కనుపించ నీయకుండా తగిన జవాబు లిచ్చి తప్పించు కోవాలని నిశ్చయించు కుంది. అందుచేత పైకి మామూలుగానే నవ్వింది.
    "ఎవరినయినా ప్రేమించావేమిటి, బావా?"
    ఆ అమ్మాయి దరహాసలీల రాజుకు కాస్త ధైర్యాన్ని , మరికాస్త చనువును ప్రసాదించింది.
    "ప్రేమ మాట కాదిక్కడ. నీ మనసు మార్చుకున్నావా? అది చెప్పు."
    పార్వతి కొంత సేపటి వరకు బయటకు, లోతైన వెంనేల్లోకి చూస్తూ కూర్చుంది. ఆమె ఆలస్యం అతనిలో అత్రుతను అధికం చేసింది. అడిగిన ప్రశ్నేఅడిగాడు. చివరికి గొంతు పెగిల్చింది పార్వతి.
    "క్షమించాలి , బావా! నేను మామయ్యతో నువ్వు చెప్పమంటున్న విషయం చెప్పలేను. ఒకరి బలవంతానికి లొంగి పోయే టంత మనో దౌర్బల్యం నాలో లేదు. నాకూ ఆత్మ విశ్వాసం ఉంది."
    రాజు చిరుకోపం ప్రదర్శించాడు ముఖం లో. "అనుకుంటున్నావు , గొప్ప యోచనాపరురాలివని. ఇది వినోదం కోసం జరుగుతున్న నాటకం కాదు. ముందు ముందు మధుర స్వప్నాలను నిజం చేసుకోవలసిన జీవితంలో నిప్పులు పోసుకున్నట్ట వుతుంది. ఆ సంగతి ఇప్పుడు తెలియదులే! అంతా మించి పోయిన తర్వాత తెలుసుకున్నా లాభం ఉండదు." అన్నాడు తనకేం పోయిందన్న ధ్వనిలో.
    "నువ్వు నీకు ఇష్టం లేనిదాన్ని వదిలించుకోవాలని చూస్తుంటే నాకు ఇష్టమైన దాన్ని నేను దక్కించు కోవాలను కుంటున్నాను." అంది పార్వతి.
    "అంటే?' అన్నాడు అర్ధం కాక.
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బావా!" పార్వతి గంబీరంగా అంది గారాబం మిళాయించి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS