Previous Page Next Page 
అర్పణ పేజి 8

                                 
    ప్రముఖ రచయిత్రి చేసిన సున్నితమైన ప్రకృతి వర్ణన లా , హస్తవాసి గల చిత్రకారుడు గీసిన అందమైన వర్ణ చిత్రం లాగ, మధుర గాయకుడు పాడిన గానం మాదిరి ఉన్నది ఆ శుభోదయం. తూర్పు వైపు కనిపించే ఆ అందమంతా , భక్తులకు పరమాత్ముడి చిరునవ్వు లాగ, పరమేశ్వరి లాలన లాగా అనిపిస్తుంటే బావుకులకూ , కవులకూ కవితా ప్రేయసి చిరు కోపంగా నూ, ప్రకృతి దేవి ప్రేమ బహూకృతి గానూ కనిపిస్తున్నది.
    తూర్పు వైపు కిటికీ లో నుంచి ఆ తెల్లవారు జామున బయటికి చూచినా రాజుకు వ్యక్తావ్యక్తంగా అవే భావాలు పుట్టాయి, అంతరాంతరాల్లో . కానీ వాటిని స్పష్టంగా తెలుసుకునే టందుకు, తెలియజేసే టందుకు అతను కవి కాడు; భక్తుడు అంతకంటే కాడు.
    పూర్వాద్రి లో నుండి బాల భానుడు పైకి లేస్తున్నాడు. ఆరోజు రాజుకు చెప్పరానంత ఉల్లాసంగా ఉంది. అందుచేత నే అతను కొంతసేపైనా భూమాత అందచందాలను పరిశీలించగలిగాడు. సర్వ ప్రకృతీ, సకల చరచరాలూ అతన్ని ఆకర్షించాయి ఆరోజు. మనిషి జీవితంలో ప్రతి దినం ఆనంద పూరితం కాజాలదు. ఒక్కొక్క రోజు ఉంటుంది -- అపూర్వ మైనది, అనుస్మరణీయమైనది. బాహ్య ప్రపంచం లోనూ, స్వయం ప్రవృత్తి లోనూ ఎన్ని మార్పులు వచ్చినా అంతరంగికంగా మరిచి పోలేనటువంటి రోజు లుంటాయి. చెప్పేదేమీటంటే -- చెడ్డ రోజైనా, మంచి రోజైనా మరుగు పడి పోకుండా జ్ఞాపకం ఉండిపోతుంది.
    బాగా మగ అలంకరణ పూర్తి చేసుకుని బయట పడబోతున్న రాజును అడుగు లోనే నిలేశారు రామనాధం గారు. మహా బాగా ఇరుకున పడ్డాడు రాజు.
    రాజుకు వయసు పెరుగుతున్న కొద్ది తండ్రి పైన అసదృశమైన గౌరభిమానాలు వృద్ది అయినాయి కాని, చిన్ననాటి తత్త్వం అతన్ని వదిలి పెట్టలేదు. తండ్రి ఎదట పడి నాలుగు మాటలు మాట్లాడటానికే అతనికి సాహసం లేదు. ఇంట్లో అవసరమైన చోట్ల  కూడా అతి ముభావంగా సంచరిస్తారు తండ్రీ కొడుకులు. అటువంటి తండ్రి కొడుకుని ఆపి సంభాషించటానికి పూనుకున్నా, ఆ కుమార రత్నం ఒక విధాన నిలిచి నాలుగు మాటలు మాట్లాడినా గానీ విశేషమనే చెప్పాలి.
    ఒకమాటు కొద్దిగా గొంతు సర్దుకుని, "నీ పెళ్లి విషయ మోయ్!" అన్నారు రామనాధం గారు.
    రాజు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. అసలే అంతంత మాత్రపు సరసంలో ఇలాంటి పిడుగు లాంటి మాటే అఘోరించాలీ? ప్రత్యుత్తరం రాలేదు రాజు నుంచి. చేసుకున్న కర్మానికి అతను వేసుకున్న హవాయ్ జోడు సగానికి పైగా అరిగిపోయింది. నేలకు కాలు రాస్తూ ఆలోచనామగ్నమాన్సుడై నిలబడ్డ రాజును చూసి చూసి, రామనాధం గారు మళ్ళీ రెట్టించారు.
    "నీ పెళ్లి ఈ మూడు నెలల్లోగా జరిగి పోవాలని నా ఉద్దేశం " అన్నారు తాపీగా -- అగ్గిపుల్ల వెలిగించినంత తేలికగా.
    రాజు మూసుకుపోయిన గొంతు కాస్త విడివడక తప్పలేదు. ఎవరిని చేసుకోవాలి? ఎక్కడైనా సంబంధం చూశారా ఏమిటి? అనే సమస్యల మధ్యా, మరికొన్ని అనుమానాల మధ్య సతమత మవుతూ వాటి నన్నింటినీ కప్పి పెడుతూ, పైకి ఏదో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వెనక్కు వెళ్ళనా, ముందుకు రానా -- అన్న ఈ వ్యవహారం లో మరికొన్ని భయాలుకూడా మిళితమై ఉన్నాయి.
    "చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాను, నాన్నగారూ" అన్నాడు జంకుతూ.
    వెంటనే రామనాధం గారు "ఇప్పుడు చదువంటావు, రేపు ఉద్యోగం రావాలంటావు . సరే. నువ్వు ఆలోచించుకో. ఇప్పటికే ఆలస్యం జరిగింది. పార్వతికి నిన్ను చేసుకోవడం అంగీకారమే" అన్నారు.
    తండ్రి చెప్పిన ఆఖరి వాక్యం రాజు మెదడుకు ఆశని పాతం అయింది.
    "ఏమిటి? తనకు పార్వతి ని ఇచ్చా, పెళ్లి? ఇంత దృడ నిశ్చయంతో ఉన్నారా వీళ్ళందరూ? ఎలా తలపెట్టారు ఈ పెళ్లి? పార్వతి కి , తనకు ఒక్క క్షణం కూడా పడదే! మేనరికం ఉంటె చిన్నతనం లో హాస్య మాడటం అందరి కుటుంబాల్లో నూ ఉన్న విషయమే. అంత మాత్రానికి, విధిగా జరిగి తీరాలని ఎక్కడుంది? పైగా, పార్వతి కి , తనకు మధ్య ఉన్న ద్వేషం సామాన్యమైనది కాదు. ఈ పరిస్థితుల్లో పార్వతిని విమర్శించక తప్పదు. అందరు యువతుల్లాంటిది కాదు పార్వతి. ఆమెకు వేరే వేషాలున్నాయి. తనకు చాలా వరకు పార్వతి ఉద్దేశాలు, ఊహలు తెలుసు. అసహ్యకరంగా కనిపిస్తుంది ఆమె నడత తనకు. అది ప్రేమ లేకపోవడం వల్లనే కావచ్చు. ఏమైనా తమ ఇద్దరి భావాలూ రైలు పట్టాలాగా ఎక్కడా కలియవు. ఒకవేళ కలిసినా మనో వేగంతో వస్తున్న జీవితపు రైలు ను దభాలున కూల్చేస్తాయి.
    'ఛీ! ఆమెను చేసుకోవడం అసంభవం. ఈ విషయం లో , తండ్రి అంటే తన కెంత భయ భక్తులున్నా పిరికి వాడు కాకూడదు! చెప్పవలసింది నిర్మోగమాటంగా చెప్పలేక పొతే ఆ తర్వాత అవస్థ పడాలి. చేతులారా జీవితాన్ని దుఃఖ మయం చేసుకున్నట్ల వుతుంది.   తనను సరోజ అమితంగా ఆకర్షించింది. సున్నితమైన మనస్తత్వం, సహజ లావణ్యం ఉన్న స్త్రీని పొందటమే అదృష్టం. ముందుగా తన హృదయగత భావాన్ని వీళ్ళకు విశదపరచాలి. ఇక్కడ వెనక దీస్తే బ్రతుకంతా అన్యాయం!"
    "చెప్పవోయ్ , రాజూ! ఏమంటావు? ఏం నిశ్చయం చేసుకున్నావు? అవతల పని ఉంది. తొందరగా తెముల్చు. తర్వాత మీ అమ్మతో ప్రస్తావిడ్డాము." తొందరపడుతూ పైకి తాపీగా అడిగారు రామనాధం గారు.
    "నేను పార్వతి ని పెళ్లి చేసుకోలేను , నాన్నగారూ! అది ఎంత మాత్రం జరగకూడదు." అన్నాడు రాజు జరగబోయే పరిణామాన్ని ఊహిస్తూ.
    "ఆ! " ఒక్కమారు నిర్ఘాంత పోయారు రామనాధం గారు. అయన ఎదురు చూసినది, ఆశించినదీ ఆ జవాబు కాదు. తన బావగారికి ఇచ్చిన వాగ్దానం ఈనాటి వరకు మొక్క వోనిది గానే ఉన్నదని దృడంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షం వరకూ సాగిన నమ్మకాన్ని ఎవరో నిలువునా కూలదోసి నట్లయింది.
    అందుచేతనే రాజు సమాధానం విన్నంత లో రుద్రులయ్యారు. అయన వంక చూశాడు రాజు. రామనాధం గారు పైకి ఆగ్రహావేశాలతో కనిపించలేదు. కళ్ళు చెప్పుకో దగినంత క్రోధం గానూ లేవు. అయితే అంతవరకూ ఉప విష్టు లై ఉన్న కుర్చీని వెనక్కు ఒక్క తోపు తోసి, అంతు తోచనట్లు పచార్లు సాగించారు. ఆయనలో జరుగుతున్న మానసిక సంఘర్షణను ఊహించాలని ప్రయత్నించినప్పుడంతా రాజు హృదయం, మెదడు అడిరిపోతూ ఉన్నాయి.
    కొసకు నిశ్శబ్దాన్ని కళంక పరుస్తూ, "అయితే ఎప్పుడు ఈ నిశ్చయానికి వచ్చావు?' అన్నారు గంబీరంగా.
    రాజు ఎటువంటి సమాధానం ఇవ్వాలో అప్పటి కప్పుడు మెదడు కు సరఫరా చేశాడు. తను చిన్నతనం నుండి ఆ నిర్ణయం లో ఉన్నట్లు చెబితే దాన్ని వట్టి మొండి తనం కింద కొట్టి పారేయడానికి అవకాశం ఉంది. బాగా జ్ఞానోదయం అయిన తర్వాతే తను యుక్తాయుక్తా లను యోచించుకున్నట్లు యుక్తి యుక్తంగా చెప్పాలి.
    రాజు గొంతు సవరించుకుని రామానాధం గారితో అన్నాడు: "నేను కాలేజీ లో చేరిన తర్వాత ఆలోచించు కున్నాను, నాన్నా! సరిపడలేదు."
    రామనాధం గారు రాజు వైపు సూటిగా చూస్తూ, "అలా ఆలోచించుకున్న పక్షం లో నాతొ వెంటనే చెప్పి ఉండవలసినది . ఇప్పుడు -- పార్వతి అంగీకారం తీసుకున్న తర్వాత -- ఆ పిల్ల మనసు నొప్పించడం అసంభవం" అన్నారు ఖండితంగా.
    "అది కాదు, నాన్నగారూ! పార్వతి కి కూడా నన్ను చేసుకోవడం ఇష్టం లేదు." రాజు చెప్పిన కొత్త విషయం  విని అదిరి పడ్డారు రామనాధం గారు.
    "ఎవరు చెప్పారు?' ఆత్రుతగా అడిగారు.
    రాజు కొంచెం సంకోచించి, "నేను భావిస్తున్నాను." అన్నాడు.
    రామనాధం గారు తేలికగా ఊపిరి తీసుకుని, "అలా చెప్పు! ఏమో అనుకున్నాను. పార్వతి నిన్ను పెళ్లి చేసుకోవడం తన అంగీకారమేనని మొన్ననే చెప్పింది." అన్నారు ఒక విధమైన గాడ విశ్వాసంతో మాట పూర్తీ చేసి.
    రాజు స్థితి మాత్రం మిన్ను విరిగి మీదపడి నట్లు అయింది. "పార్వతి తనను పెళ్లి చెసుకొవడానికి ఎలా ఒప్పుకున్నది? అలా ఎప్పుడూ జరగడను కున్నాడు తను. చిత్రం! ఏమన్నా పెంకి తనానికి అన్నదేమో? ఇదేదో ఖండితంగా పార్వతి ఎదటే తేల్చుకోవాలి. కానీ, ఆమెలో పట్టుదలను మరింత రేకెత్తించినట్లు కాదు కదా?"
    రాజు అలోచిస్తున్నంత లో జానకమ్మ అక్కడికి మెల్లగా వచ్చింది. ఆమెను చూస్తూ రామనాధం గారు ఇక ఆగలేక పోయారు . "నీ కొడుకు పార్వతి ని చేసుకో నంటున్నాడు. ఇప్పుడు అలా కాదంటే వల్ల గాదు. ఈ పెళ్లి జరిగి తీరాలి!"
    అయన ఆవేగపు మాటలు ఆమెకు సరిగ్గా అర్ధంకాలేదు. "ఏమిట్రా ?' జానకమ్మ కొడుకు వైపు ప్రశాంతంగా చూచింది.
    "పార్వతి ని చేసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా! డాన్ని పెళ్లి చేసుకుని నేను సుఖ పడలేను" అన్నాడు. తల్లి రాగానే రాజు హృదయం కుదుట పడింది కొంతవరకు.
    అతని మాట పూర్తీ కాకుండానే రామనాధం గారు విరుచుకు పడ్డారు.
    "అహ! సుఖ పడలేని వాడివి నాకా మాటా ముందరే చెప్పావు కావేం? ఇప్పుడు నేనందరి మధ్యా చెడ్డవాడ్ని కావాలి!మాట తప్పినవాణ్ణి కావాలి! స్వయంగా బావగారికి వాగ్దానం చేసిన వాణ్ణి-- పోనీ , అదేదో సర్దుకు పోదామనుకున్నా -- పార్వతి దగ్గర ఒప్పించుకుని, ఇప్పుడు అమాంతంగా అన్యాయం చెయ్యనా? ఎన్నటికీ  జరగదు. ఆ పిల్లని నేను నొప్పించ లేను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది" అంటూనే రాజు వైపు తిరిగి, "నీ కిష్టం లేదని దాన్ని బెదిరించి ఈ పెళ్లి చెడగొట్టబోగలవు! నీ వెన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు" అన్నారు తీవ్ర కంఠస్వరంతో.
    "వీల్లేదు , నాన్నా! మీరు నిర్భందిస్తే నేను పెళ్ళే మానుకుంటాను. వాగ్దానాలు చెదతాయనే , మీరంతగా బాధపడుతున్నారు. ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవిత పర్యంతం నేనెంత ఆవేదన పడాలో ఆలోచించారు కారు !" అన్నాడు రాజు గంబీరమైన ముఖ కవళికలతో.
    తండ్ర్రీ కొడుకుల సంభాషణ వింటూ దిగ్భ్రాంతి లో మాట రాక నిర్విన్నురాలై ఉండిపోయింది జానకమ్మ. ఉద్రేకంతో రామనాధం గారి శరీరం చెమటలు పట్టింది.
    "ఏమైనా పార్వతి ని వివాహం చేసుకునే పక్షంలో ఇక్కడ నిన్ను ఉండనిస్తాను, ఈ ఇంట్లో. అలా కాకపొతే మళ్ళీ ఈ గడప తోక్కకు. ఈ ఊళ్లోకే రావద్దు. ఏ అడవులకో పో. కావలిస్తే ఈ ఖజానా అంతా మోసుకు పోయి ఎక్కడ సుఖపదతావో పడు. మా కళ్ళ మాత్రం మళ్ళీ పడకు. ఒకవేళ నువ్వోచ్చినా నీ తల్లిని గాని, తండ్రి ని గాని చూడలేవు. ఇక ఆలోచించుకో . చెప్పవలసింది చెప్పాను."
    జానకమ్మ నిర్ఘాంత పోతూ, "అదేమిటండీ!" అంటూ ఉండగానే కంపిస్తూ గబగబా వీధి లోకి నడిచి ఎటో వెళ్ళిపోయారు రామనాధం గారు.
    రాజుకు మాత్రం తండ్రి చివర అన్నమాటలు కేవలం  బెదిరింపు గా తోచాయి, కానీ అయన మాటల్లోని నిస్చితత్వం భయపెట్టక పోలేదు. కోపంతో, వాడిన వదనంతో తన గది లోకి పోయాడు. జానకమ్మ కూడా కొడుకుని అనుసరించింది.
    "రాజూ! పార్వతి ని పెళ్లి చేసుకుంటే ఏమయిందిరా? అందం ఉంది, చదువు వుంది. ఏమిటి, లోపం ?" అంది అమాయకంగా.
    రాజుకు మండింది. "ఆహా! ఆ మొహం అందాన్ని నువ్వే వర్ణించాలి! లేకపోతె నన్నొక గుడ్డి వాడి కింద జమకట్టి , నాకీ ప్రపంచంలో ప్రతి వస్తువూ వర్ణ విభేదం లేకుండా కనిపిస్తుందనుకుంటున్నావో?" అన్నాడు. ఆ మాటలు రాజు హృదయం లో మండుతున్న దావాగ్ని నుండి చెదిరిన అగ్ని కణాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS