"చిత్తం , గురూ! అలాగే తమరు కూడా నన్ను 'మరకతం గారూ' అని మన్నించటం మాని హాయిగా "మర్కటం' అని పిలిస్తే, ఈ జీవి ఎంతో సంతోష పడుతుందట. ఏమంటావు , సుధా!" నవ్వుతూ డాక్టర్ సుధేష్ణ ను అడిగింది మరకతం.
డాక్టర్ సుధేష్ణ తదేక ధ్యానంగా ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నది.
ఆకాశంలో ఒకే ఒక తార ప్రకాశిస్తున్నది. అది శుక్రతార. పడమటి దిక్కుగా కొండ మీద పంచమి చంద్రుడుదయించాడు. చూపు మేర వరకూ మైదానం , మైదానానికి చివర కొండ , కొండ మీదిగా నీలాకాశం లో చంద్ర వంక! మెరిసిపోతూ శుక్రతార!
దివినుండి భువి కి జారుతూ , తెల్లని , పలచని మేలి ముసుగు లాగా వెన్నెల!
ఎవరో ఇంద్రజాలికుడు తన మంత్రదండంతో వో అద్భుతమైన చిత్రాన్ని మన కళ్ళ ఎదుట సృష్టించినట్లున్నది.
"శుక్ల పంచమి జ్యోత్స్న సుఖ పెట్టు నన్ను! ఓ భావుకురాలా! ఇక లే. చీకటి పడింది, పోదాము . స్వర్ణ గారికి, సారీ, స్వర్ణ కు ఆకలి వేస్తున్నదట. ఇదిగో, ఈ పక్షులంతా హాస్టల్ గూడు చేరుకోవద్దూ! పద, పద!" అని డాక్టర్ భుజాన్ని తట్టింది మరకతం.
ఇందిర నవ్వుతూ, "మర్కటం! స్వర్ణతో నీ పరిచయానికీ గుర్తుగా నీ ఇంగ్లీషు, తెలుగు కలగపులగం మానుకో. చస్తున్నాం వినలేక" అన్నది.
"సభ వారంతా, ఒప్పుకుంటే , మనం అట్లాగే మానుతాం. నాకూ విసుగ్గానే ఉంది. కనక ఇక మీదట మనం ఆచ్చ తెనుగే మాట్లాడతాము." అన్నది అభయ హస్తమిచ్చే ఫోజులో మరకతం.
అంతా నవ్వుతూ లేచారు.
స్వర్ణ -- "నేనొక ప్రశ్న అడిగాను. జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం చిక్కదని. వాటి సంగతి ఏమిటని అడిగాను. మీ నుండి జవాబెమీ లేదు!" అన్నది.
డాక్టర్ నిదానించి స్వర్ణ వంక చూసింది. ఒక్క క్షణం ఆగి -- "స్వర్ణ గారూ! మీ ప్రశ్న ఎంత చక్కగా ఉంది! నిజమే! జీవితంలోని అన్ని సమస్యలకూ పరిష్కారం చిక్కదు. సంఘం, చట్టం, సంస్కారం -- ఎన్నో పరిష్కారానికి అడ్డంగా ఉండి పోతాయి. ఆ సమస్యలు అలాగే మిగిలి పోతాయి" అన్నది.
మరకతం చటుక్కున -- "సుధా! ఆ మాట అబద్దం. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. ఏ పరిష్కారమూ లేకపోతె చావుతో అన్ని సమస్యలూ తీరిపోతాయి"అంది.
డాక్టర్ సుధేష్ణ ముఖంలో కలవరం కనిపించింది. మరకతం భుజం మీద చెయ్యి వేసి-- "ప[పిచ్చిగా మాట్లాడకు. పిరికిపందలు సమస్యలను ఎదుర్కోలేక చావును కోరుకుంటారు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే బుద్ది,మంతుల లక్షణం. పద, పద! మీ ఇంటి దగ్గర నిన్ను దింపి వెడతాను. స్వర్ణ గారూ! మీ ఇంటికి నేను రావడం మీకు అభ్యంతరం కాదుగా?" అన్నది.
"డాక్టర్! మనం ప్రతి రోజూ కలుసుకొంటూ ఉంటే ఒకరి నుండి ఇంకొకరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. తప్పకుండా రావాలని నా ప్రార్ధన" అంది స్వర్ణ.
అంతా చెదిరి పోయారు.
రాను రాను స్వర్ణకూ, మరకతానికి, డాక్టర్ సుధేష్ణ కూ మధ్య స్నేహం ఎక్కువయింది.
మరకతం అంటే స్వర్ణ కు ఎంతో ఇష్టం. ఆమె జీవితం నవ్వులు పూచే తోట లాగా, నందనవనం లాగా కనిపించుతున్నది. ఎప్పుడూ గలగలమని శబ్ధస్తూ ప్రవహించే జీవవాహిని లాంటి జీవితం మరకతానిది. అట్లా బ్రతకడం ఒక వరం!
డాక్టర్ సుధేష్ణ అన్నా స్వర్ణ కు చాలా ఇష్టం. ఆలోచించే కళ్ళూ, చక్కటి ముఖం, సన్నగా నాజూకుగా ధ్వనించే గొంతూ , సూటిగా , స్పష్టంగా చెప్పే మాట తీరూ-- ఇవన్నీ స్వర్ణ కు ఎంతో నచ్చాయి. అందుకే సహజంగా మితభాషిణి అయిన స్వర్ణ వీళ్ళిద్దరి దగ్గరా చనువుగా ఉంటుంది.
వీళ్ళిద్దరే కాక , పద్మ అన్నా స్వర్ణ కు ఇష్టం. కాస్త తొందరపాటు మనిషన్న మాటే గాని, ఎంతో కష్టపడి పనిచేస్తుంది. తెలివి గలది. ఎమ్. ఎస్. సి లో లెక్కలలో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చింది. అమెరికా వెళ్ళాలని కలలు కంటున్నది. మధ్యతరగతి వాళ్ళకు అట్లాంటి కలలు ఫలించటం ఎట్లా?
స్వర్ణ మనస్సులో అమెరికా వెళ్ళటానికి పద్మ కు సాయం చెయ్యాలన్న కోరిక తల ఎత్తింది. అయితే దాన్ని ప్రకటించితే పద్మ అన్యధా భావించవచ్చు.
ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో సాధారణంగా ఆత్మాభిమానం హెచ్చుగా ఉంటుంది. అవివాహితులై ఉంటే మరి ఎక్కువగా ఉంటుంది.
ఈ మాట మీదే ఒక మారు కాలేజీ లో నలుగురూ చేరి మాటా మాటా అనుకొన్నారు.
"అసలు ఆత్మాభిమానానికీ, పెండ్లి కీ సంబంధం ఏమిటీ? అభిమానం అనేది పుట్టుకతో వచ్చే గుణం. అది ఎవరికయినా ఉండవచ్చు. ఇట్లా నలుగురు చేరి పిచ్చి మాటలు అనుకొంటారు కనుకనే నలుగురాడవాళ్ళు చేరితే 'ప్రమాదవనం' ఏర్పడింది అంటారు మావారు!" అంది జూవాలజీ లెక్చరర్ వనజ, చిరాకుగా.
"వెరీ గుడ్. పేరు దొరక్క చస్తున్నా. ప్రమాదవనం అన్న పేరు చక్కగా అతికింది! మీవారికి నా కృతజ్ఞత తెల్పు. మేము చర్చించలేని అన్నీ ప్రమాదకరమైన విషయాలే. ఇప్పుడు ప్రమాదకరంగా నీ సంగతే చర్చిస్తాము, విను! నీకు ఇద్దరు పిల్లలున్నారు. మన కాలేజీ లో ఏదైనా పార్టీ జరిగితే సంచీ తెచ్చుకొంటావు. అందులో మూడో నాలుగో ఫలహారాల పొట్లాలు దోపుకుని ఇంటికి పోతావు. ఇది అందరికీ తెలిసిందే! మేము నవ్వుకొంటామని నీకు తెలియదా? తెలిసి ఎందుకు చేస్తున్నావు? నీ పిల్లలకు టిఫిన్ ఇవ్వాలన్న కోరిక మీద. కొని ఇవ్వకూడదా? ఉహు! డబ్బు ఖర్చు! ఇది ఆత్మాభిమానం కలవాళ్ళు చేస్తారా? పెళ్ళి కాని నిర్మలా, ఇందిరా, పద్మా -- వీళ్ళేప్పుడేనా చేశారా? ఇప్పుడు చెప్పు, పెండ్లి కి , ఆత్మాభిమానానికి సంబంధం ఉందా? లేదా?" సవాలు చేస్తున్నట్లుగా అంది మరకతం.
"ఓయబ్బో! మిగిలితే పోనీ పిల్లలాకేనా తీసు కెడదాం అని తీసుకొన్నా. మహా లావు అభిమానవంతులు బయలు దేరారు. అందుకే నలుగురూ గుసగుసలు పోతున్నా, ఇల్లు మారకుండా ఉండడం! యెట్లా మారతాం? భార్య పోయి ఆరేండ్ల పిల్లతో సతమాత మౌవుతున్న అబ్బాయి! ముసలి తల్లి! దేవుడు మేలు చేస్తే ఆ సామ్రాజ్యాన్ని నీవే ఎలవచ్చు! ఇట్లాంటి వన్నీ మీలాంటి గొప్ప అభిమానవంతులు చేసే పని! మీ లాంటి అల్పులు కాదు!" అంటూ విసురుగా వెళ్ళిపోయింది వనజ.
మరకతాన్ని గురించి వనజ అన్న మాటలకు అంతా నొచ్చు కున్నారు. కాని, మరకతం మాత్రం హాయిగా నవ్వుతూ -- "పిచ్చి వనజా! వట్టి ఉద్రేకం మాత్రమే!" అన్నది.
పద్మకు సహాయం చెయ్యాలన్న కోరిక ఎట్లా బయట పెట్టడం? నేర్పుగా , పద్మ మనసు నొప్పించకుండా చెయ్యాలి! స్వర్ణ మరకతం సాయాన్ని కోరింది.
ఒక సుముహూర్తాన సాయం సమయంలో పద్మను ఒప్పించడానికి మరకతం ఒప్పుకొన్నది.
* * * *
సాయంత్రం మాములుగా తోటలో అంతా ఆసీను లయ్యారు.
ఉపోద్ఘాత మేమీ లేకుండా మరకతం పద్మతో -- "అమ్మడూ! నీ కల నిజం కాబోతున్నది! అమెరికా వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించు. స్వర్ణ నీకు అప్పుగా ఆరు వేలు ఇవ్వడానికి ఒప్పుకుంది. అదీ ఎంతో బలవంతం మీద! వడ్డీ పది పర్సెంట్. పదేళ్ళ లోగా తీర్చాలి. లేకపోతె ....."
మరకతం మాట పూర్తీ కాకుండానే పద్మ -- "థాంక్స్ , స్వర్ణా! క్షమించు. నా డబ్బుతో పొతే నాకు తృప్తి. నీ మంచి మనస్సు నాకు తెలియదా? నీ డబ్బుతో పొతే నేనేదో తప్పు చేసినట్లు భావం కలుగుతుంది. మరేం అనుకోకు. మర్కటం కొంటె మాటలు నాకు తెలుసునులే" అన్నది.
స్వర్ణ -- "పద్మా! నాకు బోలెడు డబ్బు ఉంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. నాకా డబ్బు ఏ విధాన ఉపయోగించదు. కనీసం భవిష్యత్తు మీద ఎన్నో బంగారు కలలు కంటున్న నా స్నేహితురాలి కోసం ఉపయోగిస్తే , నా మనస్సు కు డబ్బు సద్వినియోగ మయిందన్న తృప్తి కలుగుతుంది. ఈ తృప్తి నాకు కలగాలంటే నీవు తప్పక డబ్బు తీసుకోవాలి. నీవు తెలివి గలదానివి. అమెరికా వెళ్లాలని ఎంతో ఇష్ట పడుతున్నావు. నీలో విద్యా తృష్ణ అధికంగా ఉంది. అందుకే నీకు సాయం చెయ్యాలని నా కోరిక. నా కోరిక కాదనకు. మనస్సు ఎంతో కష్టపడుతుంది! ధన గర్వంతో నీకు సహాయం చేస్తానని అంటున్నాననుకోకు. నీకు సహాయం చేయడం వలన డబ్బు సద్వినియోగమవుతుందన్న ఆశ!" అని బ్రతిమాలింది స్వర్ణ.
"ఎప్పుడూ బెట్టు చేసే వాళ్ళనే బ్రతిమాలుతారు. స్వర్ణా! నీ కంత డబ్బు ఎక్కువగా ఉంటె, ఓ పది వేలు నా ముఖాన కొట్టరాదూ! హాయిగా ఉద్యోగం మానుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉండి పోతాను!" అన్నది మరకతం నవ్వుతూ.
"నువ్వా?' పనీ పాటా లేకుండా, కాలేజి కి రాకుండా ఇంట్లో కూర్చుంటావా? నమ్మదగిన సంగతే! అదివారాలు కూడా హాస్టల్ కి వచ్చి సాయంత్రం ఏడు గంటల దాకా కబుర్లు చెప్పి కొంపకు పోతావే! నువ్వు పని మానుకుని ఇంట్లో కూర్చోడమా? హరి హరీ!సూర్యుడు పడమర ఉదయించడూ?" అన్నది పద్మ.
అది నిజమే! మరకతం ప్రతి రోజూ ఎనిమిది గంటలకే కాలేజీకి వస్తుంది. అంతా వెళ్ళిపోయిన తరవాత స్నేహితురాండ్ర తో కబుర్లు చెప్పుకొని ఏ ఏడు గంటలకో ఇంటికి పోతుంది.
"నా ఊసు నీ కెందుకుగాని, ముందు డబ్బు తీసుకోడానికి ఒప్పుకో , తల్లీ! నిన్ను ఒప్పించడానికి వీశెడు ఆముదం కావాల్సి వచ్చేటట్లుంది. నాకింకా అవతల బోలెడు పనులున్నాయి. వెళ్ళి కీచకుల వారిని చూడాలి!" అన్నది నవ్వుతూ మరకతం.
పద్మ నవ్వింది.
స్వర్ణ కళ్ళలో కనపడిన ప్రశ్నకు సమాధానంగా మరకతం -- "సుదేష్ణ అన్న వచ్చాడు. భారతం లో సుధేష్ణ అన్న కీచకుడేగా! భారతంలో కీచకుడి కి పర స్త్రీ సైరంధ్రి మీద మనస్సు పోయినట్లు మా కీచకుడి కి పర స్త్రీ వ్యామోహం కలుగుతుందేమో? ఇప్పటికి మాత్రం చాలా మంచివాడు. అసలు పేరు రాజ గోపాల్. నాగపూర్ లో డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నేను ఆలస్యం చేస్తే మా కీచకుల వారికి కోపం వస్తుంది. కనక, త్వరగా తెములు, పద్దాలు!" మరకతం పద్మను తొందర పెట్టింది.
