Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 8

 

                                     
    సాయంత్రం అయిదు గంటలయింది. స్వర్ణ ఇంటి ముందున్న లాన్ లో కుర్చీలు వేసుకొని స్వర్ణ, ఇందిర, పద్మావతి , విజయ కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు. మరో రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి.
    ఇంతలోనే ఉషస్సు లాగా వచ్చింది మరకతం.
    "ఇందూ! ఎందెందుగానక ఇందే ఉంటానని విని ఇటు వచ్చాను. ఏమిటీ 'టాకు' తున్నారు? ఏమండోయ్! నేను ఈ కుర్చీలో ;సిట్తో ' వచ్చా?' నవ్వుతూ అడిగింది మరకతం.
    "రా, రా! సమయానికి రాకపోతే , మరి దేనికోనా అన్నారట. వచ్చి సిట్టు! స్వర్ణా! ఈవిడ మరకతం. మేమంతా ముద్దుగా 'మర్కటం' అంటాములే!ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వతూ తిరిగే రకం, పాపం, జబ్బు చేసి రెండు నెలలు మెడికల్ లీవు పెట్టింది. అందుకే నీవు కాలేజీ లో చేరినప్పుడు ఈ మర్కట దర్శనం కాలేదు నీకు. మర్కాటం! స్వర్ణ బి.ఏ లోనూ, ఏమ్.ఎసి సి లోనూ నా జూనియర్. చక్కని గేయాలు వ్రాస్తుంది. బాగా పరిచయమయితే గాని, ఆవిడ ప్రతిభ నీకు కనిపించదు." అంటూ స్వర్ణకూ, మరకతానికి పరస్పర పరిచయం చేసింది ఇందిర'.
    "అదేమిటే ఇందిరా? ఇన్ని రోజుల నుండి ఈ సంగతి మాతో చెప్పలేదేం మరి?" నిష్టూరంగా ఇందిరను అడిగింది పద్మావతి.
    "అదంతేలే , పద్దాలు! కవిత్వం గురించి, రచన గురించి నీకేం అండర్ స్టాండౌతుందిలే? నాబోటి సరసురాలైతేనే ఇట్లాంటి వన్నీ ఎంజాయించేది. అందుకనే ఇందిరా ఈ సంగతి నాతొ టేల్లింది. అట్టే నీవకు!" అంది మరకతం.
    అంతా నవ్వారు.
    మరకతం అంతే. తా ననుకొన్నదేదో ముఖాన అనేస్తుంది. చాలామంది మరకతం మంచి హృదయాన్ని చూసి నవ్వులాటగానే తీసుకుంటారు. ఏ కొద్ది మందో తనను తిరిగి అన్నా , మరకతం నవ్వుతూ అన్నీ దులుపు కొని పోతుంది. అందరి తోటీ చనువుగా, నవ్వుతూ, నవ్విస్తూ తిరుగుతూ ఉంటుంది. ఎవరేమన్నా మనసులో పెట్టుకోదు.
    "అమ్మాయిలూ! కాఫీ గెట్టిస్తా కాని, కాలేజీ కబుర్లేంటి? అదిగో, మన పండ్ల భద్రి "కమ్ము' తున్నది. రా, అమ్మడూ! నీ కోసమే ఈ కుర్చీ ఖాళీగా ఉంచాము. సంగతులు వ్వాటటా?" నవ్వుతూ మేధమేటిక్స్ లెక్చరర్ నిర్మలను ఆహ్వానించింది మరకతం.
    "సంగతులు కావాలా తల్లీ నీకు! విను. సూర్యుడు  తూర్పున పుట్టి పడమరనే అస్తమిస్తున్నాడట. రోజు రోజుకీ ధర లెక్కువవుతున్నాయట . ఆంధ్ర దేశంలో ఇంటింటా ఒక రచయితో, రచయిత్రో వేలుస్తున్నారట. ఇంగ్లీషూ , తెలుగూ కలిసి గొట్టేవాళ్ళు లేక ఈ రెండు నెలలూ కాలేజీ చిన్న బోయిందట. మరకతం తాను లేకపోయినా కాలేజీ ని తిరిగి వెలుగులో నింపడానికి ఈ వేళే డ్యూటీలో చేరి, అప్పుడే 'అని, అనిపించుకో అత్తగారూ!' అనడం మొదలు పెట్టిందిట. సంగతులు ఇక చాలా? ఇంకా కావాలా?' నవ్వుతూ జవాబిచ్చింది నిర్మల.
    మరకతం తో ఇంతవరకు మాట్లాడకుండా నవ్వుతూ వింటున్న స్వర్ణ నెమ్మదిగా -- "నిజమే! మీరు చాలా తమాషాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ క్రియను తెలుగులోకి మలుచుకొంటున్నారే! కొత్త రకం ప్రయోగ మన్న మాట!" అంది.
    "హమ్మయ్య! ఇంతవరకూ మీరు 'మాట్లాడని మల్లె మొగ్గ' అని ధింకుతున్నాను. మరేనండి! మీరైనా నా ప్రతిభ కనిపెట్టారు. తెలుగు కీ, కన్నడానికి ఒకే లిపి కనిపెడుతున్నారట. నేనూ ఆ కోవలోనే తెలుగు క్రియనూ, ఇంగ్లీష్ క్రియనూ కలిపి ముడి పెట్టటానికి సాయశక్తులా కృషి చేస్తున్నాను. ఇది పూర్తీ కాగానే పి.హెచ్.డి తప్పకుండా రావాలి మరి!" అంది మరకతం , ఎంతో సీరియస్ గా.
    "ఇట్లా పోచికోలు కబుర్ల తో కాలం గడపక పొతే నీవూ ఏదైనా వ్రాయకూడదు?' మందలిస్తున్నట్లుగా అంది నిర్మల.
    "పండ్ల భద్రీ! ఏవో రెండు కాకమ్మా, పిచ్చికమ్మ కధలు నీవి అచ్చయినాయని మహా టెక్కుగా ఉన్నట్లుంది నీకు. ప్రతి వాళ్ళూ రచన చెయ్యవచ్చు. కాని విమర్శ చెయ్యలేరు. నేను మంచి విమర్శ కురాలిని. మిమ్మల్నీ మీ రచనలనూ బాగా విమర్శించి, మీరూ, అవీ కూడా బాగు పడేటట్లు చేస్తాను. గొప్పపని అంటే అట్లాంటిదే" అంది మరకతం నవ్వుతూ.
    "ఏడ్చినట్లుంది. ఒక చోట చదివాను -- విమర్శకులు కొజ్జాల్లాంటివారని, వాళ్ళు సృష్టించలేరు గాని సృష్టిని వికారం చెయ్యగలరని. విమర్శించటం కూడా ఒక గొప్పే? మెడ మీద తలకాయ ఉన్న ప్రతివాడూ విమర్శించవచ్చు. విమర్శకులు సృష్టించలేరు! అంతే! ఏదీ? ఒక రచన చెయ్యి, చూద్దాము!" సవాలు చేస్తున్నట్లుగా అంది నిర్మల.
    "రచన చెయ్యడ మంటే నీ ఊహ ఏమిటి? ఏదో గీకడమేనా? అట్లాగయితే జాబు వ్రాయడం కూడా రచనే మరి. రచన అంటే ఏదో ఒక ఆదర్శాన్ని మనస్సులో పెట్టుకొని, ప్రపంచాన్ని వెలుగులోకి నడిపించగలిగేది. నీకున్న ఆశయాలతో ఏదో ఒక దానిని రచన మూలకంగా లోకానికి చెబుతావు. ప్రపంచంలో నీకు కనపడిన సమస్యలను రచన మూలకంగా నలుగురి ముందూ ఉంచి పరిష్కారం ఏమిటో రచన మూలకం గానే అడుగు. అంతే కాని, నీ పిల్లల గురించీ, మీ శ్రీవారిని గురించీ, నీ పడకటింటి ముచ్చట్ల గురించీ వ్రాస్తే ఏం ఘకార్యం సాధించినట్లు? ఆషాడం లోనో, శ్రావణం లోనో మొగుణ్ణి విడిచి పుట్టింటి కి పోలేని పెళ్ళాలూ, పెళ్ళాన్ని విడిచి పెట్టలేని మొగుళ్ళూ , కాలేజీ లో చేరి అమ్మాయిలతో ప్రేమాయణం జరిపే అబ్బాయిల కధలూ, అష్టకష్టాలు పడి అబ్బాయిలను వలలో వేసుకొన్న అమ్మాయిల కధలూ , ఆడపిల్లల వెంటపడే లెక్చరర్ల కధలూ- ఇట్లాంటి రచనల వలన సంఘానికి జరిగే ప్రయోజనమేమిటి? ఇవి చెత్త గాదూ? వీటి వల్ల ఏం సాధించారు? జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక సమస్య తీసుకో. దానిని నీ ఊహతో కధగా రూపకల్పన చేసి, సమస్యను నీకు తోచిన విధంగా పరిష్కరించటానికి ప్రయత్నించు. అంతేకాని , పనికి మాలినవి వ్రాసి విలువ గల కాలాన్ని వృధా చెయ్యడమెందుకూ?" మరకతం గొంతు అనుకోకుండానే గంబీరంగా పలికింది.
    ఇందిరా నవ్వూతూ , "మర్కటం! చాలా ఉద్రేకంలో ఉన్నావు. స్వర్ణా! ఈవిడ గ్లాస్ మంచి నీళ్ళిస్తావా? పాపం, స్పీచ్ ఇచ్చే గొడవలో ఇంగ్లీషూ, తెలుగు కలగా పులగం మరిచిపోయి అచ్చ తెలుగే మాట్లాడింది! కాసిని నీళ్ళను తాగడాని కిచ్చి , కాసిని ముఖాన కొడితే తేరుకొని  మళ్ళీ మనలో పడుతుంది!" అన్నది.
    స్వర్ణ కూడా నవ్వుతూ, "మరకతం గారూ! 'ఒక సమస్యను తీసుకొని పరిష్కరించాలి ' అన్నారు. జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం చిక్కదు. సమస్యలు కొన్ని ఇతరులు సృష్టించేవి. కొన్ని మనమే సృష్టించుకొనేవి. అన్నింటికీ పరిష్కారం చిక్కదు. కొన్ని అపరిష్కృతంగానే ఉండిపోతాయి. మరి వాటి సంగతో?" అని అడిగింది.
    మరకతం జవాబు ఇచ్చేంతలోగానే గేటు దగ్గర కారు ఆగటం, అందులో నుండి ఒక యువతి లోపలికి రావడం జరిగాయి.
     ఇందిరా, పద్మావతీ , విజయా ఆమెను-- "రండి, రండి, డాక్టర్! బహుకాల దర్శనం" అంటూ ఆహ్వానించారు.
    ఇందిర -- "మరకతం లేకపోతె , మా దగ్గరికి రారన్న మాట! ఇంతేనా మా మీద అభిమానం!" అన్నది నిష్టూరంగా.
    మరకతం నవ్వుతూ, "స్వర్ణగారూ! ఈమె డాక్టర్ సుదేష్ణ. ప్రపంచం లో నేను ఏం చేసినా, నన్ను అభిమానించే ఏకైక అభిమాని. సుధా! ఈమె స్వర్ణ. నేను జబ్బుతో రాజన్న దగ్గర ఉన్నప్పుడు ఈవిడ ఈ కాలేజీ లో జాయినయ్యారు. అందుకే ఈవేళ పరిచయం చేసుకొని, కబుర్ల సంచీ విప్పు కొంటున్నాము" అని అన్నది.
    నిర్మల నవ్వి, "డాక్టర్ గారూ! పొద్దు పోతున్నది వాచ్ మెన్ గేట్లు వేసేస్తాడు. ఇక మేము పోమా?' అని అన్నది.
    "గో! గో! హాస్టల్ లో మొగుడూ, పిల్లలూ ఎదురు చూస్తూ ఉంటారాయే మరి!" అంది మరకతం.
    అంతా నవ్వారు. నిర్మల అవివాహిత.
    "అయితే, నే వెడతాను. మావారు ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారు!" నవ్వుతూ మరకతాన్ని కవ్వించింది పద్మావతి.
    మళ్ళీ అంతా నవ్వారు. నిర్మల, పద్మావతి , ఇందిర అవివాహితులు. స్వర్ణ ఇంటికి రెండు వందల గజాల దూరంలో ఉన్న హాస్టల్లోనే రెసిడెంట్ ట్యూటర్లు గా ఉంటున్నారు.
    మరకతం పద్మావతి చెయ్యి పట్టుకొని లాగి కూర్చో బెట్టి , "అమ్మడూ! పెళ్ళి కావాలని మహా కలవరిస్తూన్నట్లున్నావు. నీవు ఏది ఎక్కువ కోరుతున్నావో తెలియటం లేదు. ఒకమారేమో 'మావారు-- నవారు' అంటావు. చాలా మర్లేమో 'అమెరికా' అంటావు. ఇంతకూ నీకు దేనిమీద మోజు? భర్త మీదా? లేక అమెరికా మీదా?' అని నిలదీసి అడిగింది.
    పద్మ నవ్వి, "ముందు అమెరికా మీద. తరువాత భర్త మీద" అంది.
    అమెరికా అనగానే స్వర్ణ కళ్ళు మిలమిల మెరిశాయి.
    మరకతం -- "స్వర్ణ గారూ! మీ కండ్లు ఎంతో అందంగా ఉంటాయి. అమెరికా అంటే మీ కళ్ళలో కొత్త కాంతి కనిపించింది. కొంపదీసి మీకు కూడా అమెరికా పిచ్చి ఉందా? మా పద్మకు అమెరికా పిచ్చి తల కెక్కింది. పోవడానికి డబ్బు లేదు. కనీసం పది వేళయినా ఉంటె గాని అమెరికా వెళ్ళలేము. డబ్బు కూడాబెడుతున్నాను. పూర్తీ కాగానే ఈవిడను అమెరికా తోలి నేను సుఖపదతాను! మీకూ ఆ పిచ్చి ఉంటే చెప్పండి -- మరి కాస్త డబ్బు కూడ బెట్టి , మిమ్మల్నీ పంపుతాము" అని అన్నది.
    ఇందిర వెంటనే -- "స్వర్ణ కు నీ సాయం అక్కర్లేదు. మనలాంటి వాళ్ళని పది మందిని అమెరికా కి పంపగల స్తోమతు ఉంది. స్వర్ణ సంగతి నీ కసలు తెలియదుగా? ఇంచుమించు చిన్న సైజు జమిందారిణి అనుకో. ఈవిడ అన్నగారు అనంత పురం లో డాక్టర్ గా ఉంటున్నారు. ఎంత మంచివాడో చెప్పలేను. అయన స్వర్ణ కోక్కతెకే కాదు, మా అందరికీ అన్నే!" అన్నది.
    "శుభం! తెలియకపోయినా , ఈ క్షణం నుండి స్వర్ణ గారి అన్న నాకూ అన్నే . సెలవుల్లో అన్నగారి దగ్గరకు స్వర్ణ గారితో నేను హాజరు. ఏమంటారు స్వర్ణ గారూ!" అని అడిగింది మరకతం.
    స్వర్ణ చిరునవ్వుతో, "మరకతం గారూ! మీరు మా ఇంటికి రావాలంటే ఒక షరతు." అని అన్నది.
    "ఒకటేమిటి? ఎన్నయినా పెట్టండి. ఏం చేస్తాం మరి? 'హయర' క తప్పదు!" అన్నది మరకతం నవ్వుతూ.
    "అయితే , నన్ను మీరు , 'స్వర్ణ గారూ'అని పిలవడం మాని "స్వర్ణా' అని పిలవండి, చాలు" అన్నది స్వర్ణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS