Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 10

 

    "అప్పుగానే కదా?" సందేహంగా అడిగింది పద్మ.
    "నోటా? పత్రమా? సుబ్బరంగా ఎగగొట్టు !" ఉచిత సలహా ఇచ్చింది మరకతం.
    "అందుకే నిన్ను "మర్కటం" అనేది. అన్నీ కోతి మాటలే! కోతి చేష్టలే! కాని, ఆ కోతి చేష్టల వెనక ఉన్న మనస్సు నాకు తెలుసు. అది వెన్న! మరకతం, నీవు మాణిక్యానివి! నీ బోటి....."
    పద్మ మాట పూర్తీ కాకుండానే మరకతం --- "వజ్రాన్ని! వైదూర్యాన్ని! మరిటా బంగారు తల్లి వటా!" అంటూ నవ్వింది.
    "నిజంగానే బంగారు తల్లివి! పొరపాటున కూడా ఇతరుల వస్తువులు వాడవు. అమ్మాయిలకు కానీ, స్టాఫ్ లో కానీ ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళకి రేయింబవళ్ళు సేవ చేస్తావు. స్వర్ణా! కాలేజీ లో మరకతానికి ఉన్న పేరేమిటో తెలుసా? "ప్రియబాంధవి' అని. ఎవరి కే కష్టమొచ్చినా ఆదుకొంటుంది. ఇలాంటి వాళ్ళంతా కారణజన్ములనుకో! మరకతం! నీ లాంటి కూతురు పుట్టడానికి నీ తల్లితండ్రులు ఎంతో పూజ చేసి ఉండాలి!" పద్మ కళ్ళలో గౌరవం , వాత్సల్యం కనిపించాయి.
    స్వభావానికి విరుద్దంగా మరకతం జవాబు చెప్పలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండి పోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉన్న ముఖంలో నీలి నీడలు క్షణ కాలం దోబూచులాడాయి.
    స్వర్ణ కళ్ళు మెరిశాయి. మనసులోనే 'నిజంగా మరకతం వెల లేని రత్నం!' అనుకోని మరకతం భుజం మీద చెయ్యి వేసి-- " ప్రియబాంధవీ! పద్మను ఒప్పించినట్లేనా?" అని అడిగింది.
     చిరునవ్వుతో మెరిసిపోతున్న స్వర్ణ ముఖం వంక ఒక్క క్షణం చూసి మరకతం -- "నేనే మగవాడినయి ఉంటె నిన్ను అమాంతం ఎత్తుకొని పోయి రాక్షస వివాహం చేసుకోనేదాన్ని... స్వర్ణా! నీ కళ్ళలో అమృతం సోవ లున్నాయి!" అన్నది తన్మయత్వం గా.
    పద్మ నవ్వుతూ "స్వర్ణ చామన ఛాయబ్బా! కాస్త తెలుపయితే 'ఊర్వశి' బిరుదు కొట్టేదే!" అన్నది.
    "తెలుపైనా కళ లేని ముఖాలు ఎన్ని లేవు! స్వర్ణ అందమంతా ఒంటి తీరులో ముఖ్యంగా కళ్ళలో కొట్టవచ్చినట్లు కనిపించుతుంది. బహుశా ఈ కళ్ళ తోటే నూర్జహాన్ జహంగీర్ ను వల్లో వేసుకొని ఉంటుంది!"
    "వెరీ గుడ్! కవిత్వం మాట్లాడుతున్నావు. మరకతం! మనం ప్రారంభించిన సంగతి ఏమైనట్లు?" నెమ్మదిగా అడిగింది స్వర్ణ.
    "దీనికి మరకతం రాయబార మెందుకు, స్వర్ణా! డబ్బు ఇస్తావని నీవు ముందుకు రావటం నా అదృష్టం. నిజంగానే అమెరికా వెళ్ళాలని ఎన్నో కలలు కన్నాను. ఇంత డబ్బు ఎప్పుడు సమకూరుతుందని దిగులు పడే దాన్ని! నా కోరికను తీర్చడానికి భగవంతుడే నీన్నీ రూపంలో పంపాడు! తప్పక నీ సహాయంతో అమెరికా వెడతాను. నీ డబ్బు తిరిగి నీకు ఇవ్వడానికి ఆలస్యమైతే అన్యదా భావించకు. రేపటి నుండే  అమెరికా వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభిస్తాను." పద్మ మాటల్లో సంతోషం, కృతజ్ఞత వెల్లి విరిశాయి.
    స్వర్ణ ముఖంలో సంతృప్తి కనిపించింది.
    మరకతం నవ్వుతూ -- "హమ్మయ్య! ఇప్పటికి పీర్లు గుండాన పడ్డాయి! ఇక నేను వెళ్ళాలి. స్వర్ణా! పద్మను అమెరికా పంపడానికి సిద్దపడిన దానివి, నన్ను సుదేష్ణ ఇంటి దాకా పంపడానికి సిద్దపడు" అని అన్నది.
    తెల్లబోయి స్వర్ణ -- "ఇప్పుడా? టైమెంతయిందో తెలుసా? ఆరున్నర కావస్తున్నది!" అన్నది.
    "అయితే అయింది లే! టైముతో మనకు పనేమిటి? ;కాలానికి కళ్ళెం వేస్తాం! లోకానికి పరదా వేస్తాం! బ్రతుకంతా నవ్వుల పందిరి! మనసంతా పువ్వుల పందిరి!' అంటూ బ్రతికే వాళ్ళం మనం. పద, పద, పద్దాలు! హాస్టల్ లో నీ బిడ్డలు తల్లిని గానక తల్లడిల్లి పోతూ ఉంటారు! పో!" అన్నది మరకతం.
    "చూడు స్వర్ణా! ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు ఎంత వాడిగా ఉన్నాయో? పాత స్నేహితురాలిని నన్ను 'ఫో! ఫో' అంటూ మెడ పట్టి గెంటుతున్నది. నిన్న గాక మొన్న వచ్చిన నిన్నేమో కాకా పడుతున్నది!" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది పద్మ.
    మరో పదిహేను నిమిషాలకు స్వర్ణ కూడా తయారై టేబుల్ దగ్గరికి పోబోయింది.
    "డియర్, ఈరోజు కి నీ 'లవర్' వెంట రానక్కర లేదు. ఈ వేళకి అది అనవసరం" అన్నది మరకతం.
    'లవర్' అంటే స్వర్ణ చిన్న ట్రాన్సిస్టర్.
    మరకతం మాటలు విన్న స్వర్ణ ప్రశ్నార్ధకంగా మరకతం వైపు చూచింది.
    నవ్వింది మరకతం.
    "కళ్ళు మాట్లాడతాయని కావ్యాల్లో చదవటమే కాని, కళ్ళారా చూడలేదోయ్! నీ కళ్ళు మాట్లాడతాయి! 'విశాల నేత్రాలు' సినిమా తీస్తే హీరోయిన్ గా నువ్వు చక్కగా పనికి వస్తావు! మా రాజన్న కు కూడా నీ ట్రాన్సి స్టర్ లాంటిది ఉంది. అందుకని వద్దన్నాను. పద!" అని స్వర్ణ ను తొందర పెట్టింది మరకతం.
    ఇద్దరూ రిక్షాలో ఎక్కి పోయారు.
    ఆ వేళ డాక్టర్ సుదేష్ట ఇల్లు కొత్తగా కనుపించింది స్వర్ణ కళ్ళకు.
    సుదేష్ణ ఇంటి ముందున్న పూల తోట నందన వనంగా మారిపోయింది.
    నందన వనం అని వినటమే కాని, అది ఎట్లా ఉంటుందో ఎవరూ చూడలేదు. అది ఈ తోట కంటే అందంగా ఉంటుందని అనుకోలేరు!
    స్వర్ణ ఇంటికి లాగే సుదేష్ణ ఇల్లు కూడా ఏకాంతంగా తపస్సు చేసుకొంటున్నట్లు ఉంది.
    ఆ రోజు పున్నమి.
    వెన్నెలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. మనస్సు మీద అందమైన పలచని మేలి ముసుగు కప్పుతుంది. దానిలో నుండి చూస్తె, ప్రతి వస్తువు ఎంతో అందంగా ,అద్భుతంగా ,  కనబడుతుంది.
    అడుగు ముందుకు వేయటం మరిచి, స్వర్ణ తదేక దీక్షగా తోట వంక చూసింది.
    రంగు రంగుల పూలు వెన్నెలలో మెరిసిపోతున్నాయి.
    తెలుపు, ఎరుపు, పసుపు రంగుల చంద్ర కాంతలు దారి వెంట వరసగా ఉన్నాయి. పూలన్నీ విచ్చి, వజ్రాలూ, రత్నాలూ , మరేవో అపురూపమైన మణులూ చెట్ల మీద పెర్చినట్లుగా ఉన్నాయి.
    వాటి బ్రతుకే బ్రతికు! తమ సౌందర్యంతో కొద్ది కాలమైన ప్రపంచాన్ని మోహింప చేసి, మరపురాని అనుభూతి గా మిగిలిపోతాయి. వాటి అందాన్ని చూడటానికి హృదయం కావాలి. వెన్నెల కావాలి.
    గోడ పక్కగా వరసగా నాటిన జినియా మొక్కలకు మొక్కకు నాలుగైదు పూల వంతున పూచాయి. భూదేవి చేతిలో సవిలసంగా ధరించిన పూల గుత్తులు లాగా ఉన్నాయి ఆ మొక్కలు!
    గుబురు పొదలాగా అల్లుకొన్న సన్నజాజి గుబురు లోని పూలు , విరబోసుకున్న జుట్టుతో చిక్కుకొన్న ముత్యాల్లాగా ఉన్నాయి.
    పెద్ద పెద్ద పొద్దు తిరుగుడు పూలు , కొద్దిగా రేకులు ముకుళించుకొని, మరి కొన్ని గంటల తరవాత ఉదయించబోయే సూర్యభగవానుడికి అర్ఘ్య మివ్వడానికి సిద్దంగా ఉన్నట్లనిపించాయి.
    అప్పుడే విచ్చుతున్న పారిజాతం పూలు , ముత్యాల్లాగా మెరిసి పోతున్నాయి.
    వీటన్నింటిని మించి, అద్భుతమైన దృశ్యం మరొక్కటి కనిపించింది.
    సుధేష్ణ గ్వాలియర్ నుండి ఒక రకం పూల విత్తనాలను తెచ్చి చల్లింది. వాటి పేరు ఆమెకు తెలియదు.
    అవి అరంగుళాల మొక్కలుగా మాత్రమే పెరుగుతాయి. చిన్నచిన్న పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఒక్కొక్క గుత్తి దోసేడంత ఉంటుంది.
    ప్రకృతి సుందరి పైట చెరగు మీద ఎవరో ప్రజ్ఞా శాలి రంగు రంగుల పూలను చిత్రించాడు! ఈ చిత్రాన్ని మానవుడు రచించలేదు!
    బహుశా మయుడు ఆకాశం లో విహరిస్తూ , వెన్నలలో భూమి అందాన్ని చూసి, తనలో ఉన్న సౌందర్య తృష్ణ తీరేటట్లు ఈ దృశ్యాన్ని ఇక్కడ రచించి ఉంటాడు.!
    పగలంతా దాగిన అందం, రాత్రి వెన్నెలలో షికారుకు బయలుదేరినట్లయింది!
    చిన్న నవ్వు విని స్వర్ణ ఈ లోకంలోకి వచ్చింది.
    ఎదురుగా డాక్టర్ సుధేష్ణ , మరకతం నవ్వుతూ నిలుచున్నారు.
    "ఇంతవరకూ మా సుధమ్మ ఒక్కతే భావుకురాలని అనుకొన్నాను. నీవు ఆవిడని మించి పోయావే. తోటకు దిష్టి కొట్టగలదు, జాగ్రత్త! అయినా, ఇంత తన్మయత్వం పనికి రాదు. ఏమంటావు , రాజన్నా? నీ రహస్య స్థలం నుండి బయటికి రా. స్వర్ణ తోటను కళ్ళప్పగించి చూస్తె, నీవు స్వర్ణ ను కళ్ళప్పగించి చూస్తున్నావు! ఇక నన్నా ఇద్దరూ లోపలికి రండి."
    మరకతం మాటలకు సన్నజాజి పొద మాటు నుండి ఒక ఆకారం లేచి నెమ్మదిగా అడుగులు వేస్తూ, డాక్టర్ సుధేష్ణ దగ్గరికి వచ్చి నిలబడింది.
    ఆరడుగుల విగ్రహం, పంచ కట్టిన తీరులో తెలుగు తనం ఉట్టి పడుతున్నది. ముఖంలో తెలివీ, ఆకర్షణా ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి.
    "రా, స్వర్ణా! లోపలికి రా! వెలుగులో పరిచయాలు చేస్తాను." అన్నది సుధేష్ణ , చిరునవ్వుతో.
    సిగ్గుపడుతూ లోపలికి అడుగు పెట్టింది స్వర్ణ.
    "అన్నా! ఈమె స్వర్ణ కుమారి. ఇంగ్లీష్ లెక్చరర్. మాకు మంచి స్న్ర్హితురాలు. స్వర్ణా! మా అన్న రాజగోపాల్. నాగపూర్ లో పని చేస్తున్నాడు." అంటూ పరిచయం చేసింది సుధేష్ణ.
    "పేరు తప్పు చెప్పావు సుధా! రాజ గోపాల్ కాదు కీచకరావు!" అంది మరకతం నవ్వుతూ.
    స్వర్ణ సిగ్గుపడుతూ , "నమస్తే" అని కళ్ళెత్తి చూసి, మరుక్షణమే కళ్ళు వాల్చుకోంది.
    "నమస్తే! రండి లోపలకు రండి." మర్యాదగా లోపలకు ఆహ్వానించాడు.
    లోపలికి వెడుతూ గమనించింది స్వర్ణ -- రాజగోపాల్ చేతిలో బుల్లి ట్రాన్సి స్టర్ . ముద్దులు మూట గడుతున్నది. 'దిల్ అపనా, ఔర్ ప్రీత్ పరాయీ' అన్న పాట సన్నగా వినవస్తున్నది.
    "రాజన్నా! వెన్నెలే మనసు మీద మోహేనీమంత్రం లాగా పనిచేస్తుంది. పైగా ఈ సంగీతం కూడానా? ప్రమాదం సుమీ!" నవ్వుతూ హెచ్చరించింది మరకతం.
    ఎప్పుడూ అంతగా మాట్లాడని స్వర్ణ , చిరునవ్వుతో -- "వెన్నెలా, సన్నని సంగీతమూ చక్కటి కాంబినేషన్! ఒంటరిగా వెన్నెలలో సన్నని సంగీతం వింటూ చనిపోవాలని నా కోరిక!" అన్నది.
    "వండర్ ఫుల్!" అన్నాడు రాజగోపాల్ చిన్నగా.
    "రాజన్నా! మీ అందరికీ సౌందర్య తృష్ణ అధికంగా ఉంటె, నాకు ఆకలి ఎక్కువగా ఉంది. తొందరగా తిని నా కొంపకు పోవాలి. స్వర్ణా! ఎందుకయినా మంచిది -- ముందుగానే హెచ్చరిస్తున్నాను, విను. నువ్వు రాత్రికి ఇక్కడ బందీవి! రేపు ప్రొద్దున్న టిఫిన్ తిన్న తరువాత విడుదల లభిస్తుంది. స్నేహితురాలివి కాబట్టి రాబోయే ఆపద ముందుగానే చెబుతున్నాను , జాగ్రత్త!" అన్నది మరకతం.
    స్వర్ణ ముఖంలో కలవరపాటు కనిపించింది. "డాక్టర్! రాత్రంతా ఉండవలసిన పనేమున్నది? భోజనం కాగానే నేను వెళ్ళి పోతాను!" నెమ్మదిగా అన్నా, స్వర్ణ ముఖంలో దృడ నిశ్చయం కనిపించింది.
    "మరకతం మాటలకు భయపడకు , స్వర్ణా! నీ కిష్టం లేకపోతె వెళ్ళి పొడువు గాని, భోజనం చెయ్యగానే నిన్నూ, మరకతాన్నీ డ్రాప్ చేస్తాను , సరేనా? అనవసరంగా కలత పడకు" అన్నది సుధేష్ణ , నెమ్మదిగా.
    భోజనాల దగ్గర సంభాషణ అంతా రాజగోపాల్ , మరకతం మధ్యనే జరిగింది. మాములుగానే మాటకారి గాని స్వర్ణ, కొత్త వ్యక్తీ సమక్షంలో బొత్తిగా మాట్లాడ లేకపోయింది. డాక్టర్ సుధేష్ణ కూడా స్వర్ణ లాగే మిత భాషిణి.
    భోజనం మధ్యలో ఒక్కసారి మరకతం -- "రాజన్నా! ఈవేళ తెలుగు పేపర్ చదివావా?' ఘుమఘుమ లాడే న్యూస్ ఉంది" అన్నది.
    "ఉహు. తెలుగు పేపర్ చూడలేదు. ఇంగ్లీష్ పేపర్ చూశాను. కొత్త వార్త లేమీ లేవే!" అన్నాడు రాజగోపాల్ కుతూహలంగా.
    "ఇంగ్లీష్ పేపర్ లో ఇలాంటివి వెయ్యడానికి వీలుండదులే! పేపర్లో -- 'రాష్ట్రంలో కామ నివారణ కు గట్టి చర్యలు' అని పడింది. ఇది గొప్ప సంగతి కాదూ?" అంటూ లేచి ఎడమ చేత్తో పేపర్ తెచ్చి రాజ గోపాల్ కు చూపించింది మరకతం.
    తెల్లబోయి చూస్తున్నారు స్వర్ణా, సుధేష్ణా.
    పేపర్ చూసి పకపకా నవ్వాడు రాజగోపాల్. మరకతం నెత్తి మీద చిన్నగా మొట్టి, "అందుకే నిన్ను 'మర్కటం' అనేది! అచ్చు తప్పు అని చెప్పవేం? క్షామ నివారణకు గట్టి చర్యలు అని పడక, పొరపాటుగా 'కామనివారణకు' అని పడింది! ముద్రా రాక్షసుడు మింగి వేశాడు లే వత్తును! ఇది చెప్పకుండా జోకు తున్నావా?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS