6
ఎన్ని చీరలు మార్చినా ఏదీ నచ్చలేదు, శాంతికి. ఆఖరుకు పాల నురుగులాంటి తెల్లని వస్తాలు ధరించి బయల్దేరింది. 'ఇంత కాలానికి చూడబోతున్నాను, ఏనాటి నుంచో చూడాలనుకున్న శాంతినికేతనాన్ని' అనుకుంటూ ముస్తాబు ముగించి తలుపుతీసి హాల్లోకి వచ్చింది. ధరించిన దుస్తుల ధవళవర్ణంతో పోటీ పడుతున్నట్లుంది, ముంగురులలో ముడిచిన శ్వేత పుష్పమాలిక.
హాల్లో కూర్చున్న రాజా ఒక్క క్షణం శాంతిని రెప్పవాల్చకుండా చూచి, "అబ్బ! సరిగా గంట పట్టింది, మన ముస్తాబుకు!" అన్నాడు.

శాంతి కొద్దిగా నవ్వి వెళ్ళిపోబోతూంటే చుట్టూ చూచి రాజా, "నిజంగా ఎంతందంగా ఉన్నావు! శాంతినికేతన్ కి శాంతి దూతలా వెళ్ళుతున్నావు" అన్నాడు.
ఆ మాటలకు శాంతి గతుక్కుమంది. "ఏమిటితడి అతి చనువు! ఎంతో మంచివాడనుకున్నాను. ఛీ!' అని లోలోన అనుకుంటూ తిరస్కారంగా చూచి అక్కడినుంచి వెళ్ళి పోయింది. అది సిగ్గుగా భావించి నవ్వుకున్నాడు, రాజా.
దారిలో శ్రీహరి చెల్లెల్ని అనేక ప్రశ్నలు వేశాడు. "అంత సంతోషంగా బయల్దేరి, ఇంత ముభావంగా వున్నావేమే, శాంతీ? ఆ దృశ్యం చూడు, ఈ భవనం చూడు" అంటూ ఎన్నో కబుర్లు చెప్పాడు. "ఇంతకూ అమ్మమీద బెంగ పెట్టుకున్నావా, ననంగారి మీదా?" అని హాస్యం చేశాడు. అయినా శాంతి హృదయం కరుగలేదు. అందరితోనూ కూడా చాల ముభావంగా ఉంది. రాజామాత్రం ఎప్పటి హాస్యధోరణిలోనే చాల సరదాగా ఉన్నాడు.
బోల్పూరు సమీపంలో టాక్సీ దిగి టాంగా ఎక్కారు. ఇరుకుగా ఎగుడు దిగుళ్ళతో ఉన్న ఆ బాట యిలాగే ఉండడం చాలా విచారకరం" అన్నాడు, రాజా.
"ఔను, బాబూ ఏమిటీ దారి మరీ యిలా వుంది?" అంది పద్మ విసుగ్గా.
"అంటే, అది మన ఓర్పుకు పరీక్షన్న మాట! గొప్ప పుణ్యక్షేత్రాలకుగానీ, పవిత్ర ప్రదేశాలకుగానీ వెళ్ళే మార్గాలన్నీ దుర్గమం గానే ఉంటాయి. కష్టం తర్వాతే సుఖమున్నదని నిరూపించుతాయన్నమాట!" అంది, శాంతి.
"శభాష్, శాంతీ! నా చెల్లెల్ననిపించావు" అన్నాడు శ్రీహరి కొంటెగా పద్మనూ, రాజానూ చూస్తూ.
"మహాప్రభో! ఒప్పుకున్నాం." రెండు చేతులూ జోడించింది పద్మ. "మీరూ, మీ చెల్లెలూ చాలా గొప్పవాళ్ళు. మా తమ్ముడెలా వేగుతాడోకాని."
"నీలాగే" అన్నాడు శ్రీహరి, కొంటెగా కళ్ళు చికిలిస్తూ.
"ఆపుజేద్దూ, వదినా!" శాంతి విసుక్కొంది.
విశ్వభారతి సాక్షాత్తూ శాంతి నిలయమే. ఆహ్లాదకరమైన ఆ నిర్మల రమణీయ వాతావరణంలో అడుగిడుతూనే మైమరచిపోతారు. జాతి మత దేశ వయోభేద రహితమైన విద్యా సంస్థ. ప్రత్యేక పరిధులలో బంధింపబడని, వివిధ రూపాలలో విన్యాసమొనర్చే విద్యాధరీ నిలయం. మహర్షి దేవేంద్రనాధ టాగూర్ తపోభూమిగా అవతరించి, 'శాంతినికేతన్' గా ఆకృతి పొంది, విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ పవిత్ర హస్తాలలో పరిణతి నంది, విశ్వభారతిగా విస్తరించి విశ్వజనీనత నందిన విద్యాపీఠం అరమరికలు లేక అధికార ఆసహ్యతలకు దూరమై వెలుగొందుతున్న పవిత్ర గురుశిష్య సంబంధం. వినీలాకాశం క్రింద తరుచ్చాయలలోని తరగతులలో తర్ఫీదు నందుతున్న విద్యా కళాతపన్వులు.
దేశ సంస్కృతి నంతనూ చాటిచెప్పే ఆ శాంతినికేతన్ ను, ప్రాక్పశ్చిమాల మేళవింపుతో వెలుగొందుతూన్న ఆ విద్యాపీఠాన్ని, ప్రకృతి పూజారిచే ప్రతిష్టితమైన ఆ అవమాన ప్రకృతి పాఠశాలను చూచి ముఘ్డులు కానివారు అరుదు. పటకుటీరాలు, పటిష్టమైన రాతిభవనాలు కూడ సమసౌందర్యాలు ఒలకబోస్తున్నాయి. హాస్టల్సు, లైబ్రరీలు, చీనా భవనం, అతిథి భవనం, శిక్షావిభాగం, కళావిభాగం, ఆరు ఋతువులలోను గురుదేవునికి నివాసాలైన శ్యామలి, ఉత్తరాయణ, ఉదయాన, ఉధీచి, పునశ్చ, కోణార్క్ భవనాలు, నృత్య - నాటిక లను ప్రదర్శించే రంగస్థల వేదిక అత్యంతమైన అందంతో గోడలనిండా వివిధ వర్ణచిత్రాలతో నేత్రానందం చేస్తున్నాయి. మనస్సును హాయి పరిచే సుందర సుమవనం ఒక చోట. చక్రాకృతి ద్వారాలుగల శ్రీ నికేతన్ ఒక చోట. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క తీరుగా హుందాతనం ఉట్టిపడుతూన్న గురుదేవుని చిత్రపటాలు అసంఖ్యాకం. కుటుంబికులతో, ప్రఖ్యాత పురుషులతో, విశిష్ట వ్యక్తులతో ఆయన ఉన్న ఛాయాచిత్రాలు అనేకం. డెబ్బై ఏళ్ల వయస్సులో తీయబడిన చాయాచిత్తం - శ్వేత వస్త్రాలతో, గుండెల నంటుతూన్న గడ్డంతో, తీక్షణ నేత్రాలతో, ఆజానుబాహువైన అపురూప సుందరమూర్తి - విశేషంగా ఆకర్షిస్తుంది అందర్నీ. అది చూచిన శాంతి మదిలో రాజా తనకు బహూకరించిన చిత్రం మెదిలింది. అప్రయత్నంగానే ఆమె నేత్రాలు రాజామీదకు తిరిగాయి. అతడు కూడా ఆమెనే చూస్తున్నాడు. చూపులు కలియడంతో రాజా వదనంలో భావయుక్తమైన చిరునవ్వు లాస్యం చేసింది. గంభీరంగా ఉన్న శాంతి వదనంలో ఏ భావమూ ద్యోతకం కాలేదు.
అయిదేళ్ళ బిడ్డల దగ్గరినుండి అరవై ఏళ్ల వృద్ధులవరకూ ఉన్న ఆ అద్వితీయ విద్యా నిలయాన్ని చూచి మంత్రముగ్ధ అయింది శాంతి. 'సాంద్రనీల తరుచ్చాయలలో పచ్చిక తివాచీలపై సాగుతున్న స్వేచ్చా విద్యారాధన హృదయైక వేధ్యంగా ఉంది. కొందరు అక్కడక్కడా చెట్ల క్రింద కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది విశ్వజనీనత నందిన విద్యా నిలయం. సర్వమానవ సౌభ్రాత్రతకు 'పునాది అయిన ఆలయం. కళాధిదేవతకు నిత్యకళ్యాణ వేదిక. పరమాత్మ స్వరూపులైన పసిహృదయాల పచ్చతోరణం. బహుముఖ విద్యోపాసన. పసిబాలురు ఉన్నారు: పండు వృద్ధులు ఉన్నారు. అందరూ విద్యాపిపాసులైన మానవులే! కళకళలాడే ఈ అద్వితీయ ప్రకృతి పాఠశాలలో చిరంజీవివైనావా, రవీంద్రదేవా! ధనం ఉండవచ్చు, విద్య ఉండవచ్చు, వివేకం ఉండవచ్చు. కాని ఈ త్రిగుణ సమ్మేళనంతో, ఆచంద్రార్క యశశ్శోభతో అలరారగల ఇంతటి మహాత్కార్య నిర్వహణాశక్తీ, దీక్షా ధీరత్వాలూ ఎక్కడుంటాయి? రాష్ట్రానికొక్క రవీంద్రు డవతరించినా చాలు, ఈ భువినే దివిగా రూపొందింపవచ్చు! ఈ అశాశ్వతన్ని శాశ్వతంగా, ఆనిత్యాన్ని అనంతంగా, నిత్యసత్యంగా రూపొందింపవచ్చు!" శాంతిలో బహుముఖ స్రవంతి అయిన ఆలోచనా వాహిని, రాజా మాటలతో అడ్డుకట్ట వేసినట్టు ఆగిపోయింది.
"మానవుడు జీవించే కాలపరిమితి చాలా అల్పమైనది. ఈ అల్పవ్యవధిలో అసల్పమైన ప్రగతి సాధించాడు, గురుదేవుడు. అశాశ్వత భౌతిక రూపంతోనే అంతరంగమందలి అమృతానికి శాశ్వతరూపం సృష్టించిపోయాడు. స్వహస్తాలతోనే తన సంగీత సాహిత్య చిత్రలేఖనాత్మక విచిత్ర స్వరూపాన్ని - స్మృతిచిహ్నాన్ని - విశ్వభారతిని విశ్వంలో నిర్మించి తప్పించుకోవడం ఆ మహామహునికే చెల్లింది."
"అవును. భౌతికంగా ఆయన మరణించినా ఈ విశ్వభారతిలోని ప్రత్యణువూ, ప్రతిరేణువూ, ప్రతి భవనమూ, చెట్లూ, చేమా అన్నిటా ఆయన శాంతిరూపమే గోచరిస్తుంది. శృంఖలారహిత స్వేచ్చా విద్యోపాసన చేసే ఈ పసిబాల లందరి వదనాలలో ఆ గురుదేవుని నిర్మలాత్మస్వరూపమే, దివ్యామృతారంగచ్చాయలే లాస్యం చేస్తూ కన్పిస్తున్నాయి" అన్నాడు శ్రీహరి, భక్తిప్రపూరిత మానసంతో.
7
విశ్వభారతి దర్శించి వచ్చిన శాంతి ఏదో స్వర్గలోకంలో విహరించి వచ్చినంత ఆనందంతో తృప్తిగా హాయిగా నిద్రపోయింది. ఉదయం లేస్తూ ఉండగానే మళ్ళీ శాంతినికేతనే గుర్తుకు వచ్చింది. కలకత్తా ప్రయాణం సార్ధకమైనట్లే తోచింది. 'ఇక వెళ్ళిపోవచ్చు. ఈవేళ నాన్నగారికి వుత్తరం వ్రాస్తాను' అనుకుంటూ వసారాలోకి వచ్చిన శాంతి, ఎదురుగా నాన్నగారు అమ్మగారితోసహా వేంచేసి ఉండడం చూచి క్షణకాలం ఆశ్చర్యపోయింది. చకితురాలైంది.
