Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 8


    "మీ యిష్టం. అయినా ఆవిడ స్వభావ మేమిటో నా కంతుపట్టడం లేదు. ఇప్పట్నుంచీ ఆవిడ పెంకెతనం రేగగొట్టేకంటే మీ అమ్మగారు, నాన్నగారు వచ్చాకనే తెలిస్తే బాగుంటుందేమో! వారైతే కూతురికి చనువుగ ఎన్ని బుద్దులైనా బోధించుకోగలరు."
    "నిజమే." భార్య సలహాను ఆమోదించాడు, శ్రీహరి.
    శనివారం సాయంత్రం ఆఫీసునుంచి తిన్నగా శ్రీహరి ఇంటికే వచ్చేశాడు రాజా, "రేపు శాంతి నికేతన్ వెళ్ళే ప్రయాణంలోనే వున్నారా?" అంటూ.
    "ఆఁ ఆఁ. ఈ శాంతమ్మగారు మరిచిపోనిస్తుందా?" అంది పద్మ నవ్వుతూ.
    "కూర్చోవోయ్. నిల్చునే మాట్లాడుతున్నానేమిటి?" అన్నాడు శ్రీహరి, తన గదిలోంచి వస్తూ, రాజా కూర్చున్నాడు.
    "ఏం, నాలుగు రోజుల్నుంచీ రావడం లేదు? సిగ్గుపడుతున్నారా?" అన్నది పద్మ, చనువుగా రాజా నవ్వి ఊరుకున్నాడు. కాని, అతడి కళ్ళు శాంతికోసం గాలిస్తున్నాయి.
    "ఆ సరస్వతీ విగ్రహం పూర్తి చేస్తోంది మీ శాంతి" అంది తిరిగి పద్మ.
    తన చూపుల భావం పద్మ కనిపెట్టేసి నందుకు రాజా ముఖం లజ్జాభారంతో వాలిపోయింది.
    "ఏమిటి, పద్మా, అతడిని మరీ ఆడించేస్తున్నావు? నీకు తమ్ముడైతే అయ్యాడు కాని, నా స్నేహితుడని మరిచిపోకు" అన్నాడు, శ్రీహరి. అంతలో శాంతి అక్కడికి రావడంతో సంభాషణ ఆగిపోయింది.
    "గుడీవెనింగ్" అంది శాంతి, అలవాటైన ధోరణిలో.
    రాజా చిరునవ్వుతో తల పంకించి ఊరు కున్నాడు. తనను చూసిందే తడవుగా అనేకం మాట్లాడే రాజా ఎందుకలా మౌనంగా ఉన్నాడో శాంతికి అర్ధం కాలేదు.
    "రేపు మన 'విశ్వభారతి' ప్రయాణం ఖాయమే కదూ?" అనడిగింది శాంతి తిరిగి.
    "ఓ" అన్నాడు రాజా.
    "ఏమండీ, అంత మందకొడిగా వున్నారు? ఏ సీనియర్ ఆఫీసరైనా కొంచెం కారం తినిపించారేమిటి?" అంది శాంతి, మళ్ళీ నవ్వుతూ.
    "ఎంత కారం తిన్నా మైసూర్ పాక్ వాటి ఏ మాటలు వినగానే పోతుందిలే" అని నవ్వాడు, రాజా.
    శాంతి ఒక్కక్షణం ఆశ్చర్యపోయింది. అతడి అతి చనువు చూచి నిర్ఘాంతపోయింది.
    ఆమె యింకా ఆలోచనలనుంచి తేరుకోనిదే, "వెళ్తాను, శ్రీహరీ, నేను వేకువనే వస్తాను. సిద్దంగా వుండాలి" అని లేచాడు, రాజా.
    "పోనీ వెళ్ళకపోతే నేం? ఇవాళ్టికి వుండిపోకూడదూ?" శ్రీహరీ, పద్మా ఒకేసారి అన్నారు.
    తల అడ్డంగా ఊపి నవ్వేశాడు, రాజా. "కతికితే అతకదట. అదీగాక ప్రయాణం ఏర్పాట్లు చూడాలిగా" అని వెళ్ళిపోయాడు.
    ఆ మాట లేమిటో శాంతికి ఎంత ఆలోచించినా బోధపడలేదు. అన్నయ్యనూ, వదిననూ మార్చిమార్చి చూచింది. వాళ్ళేదో ఆ సంగతే మరిచిపోయినట్టు ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటున్నారు. కాస్సేపు కూర్చుని, నిశ్శబ్దంగా అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది, శాంతి. అప్రయత్నంగానే రాజా బహూకరించిన చిత్రాలను పైకితీసి కాస్సేపు పరీక్షగా చూచింది. ఎన్నో ఊహలూ, ఆలోచనలూ మెదిలాయి. ఒక్కదానికీ నిర్దిష్టరూపం లేదు. ఆ చిత్రాలు దాచేసి కాస్సేపు రాధామాధవ చిత్రం దగ్గర నిలబడింది. ఏమిటో ఆ చిత్రాలన్నీ కూడా ఆమెకు అనేక రకాలాలోచనలు కలిగిస్తాయి. తన మనస్సులో రేగే ఒక్క భావానికీ అర్ధం తనకే తెలియదు. ఎందుకో రాజాను చూడగానే మనస్సులో ఏమిటో భావాలు చెలరేగుతాయి. గుండెలు కొట్టుకుంటాయి. ఎంత ప్రయత్నించినా అతడితో స్వచ్చంగా, నిర్భయంగా మాట్లాడలేకపోయింది. అతడు ఎదుట లేకపోయినా సరే, ఎందుకో పదేపదే నేత్రాలలో మెదులుతహడు. అతడి చిరునగవు అడుగడుగునా వెంటాడుతుంది. తనలో ఎన్నడూ లేని వింత పరివర్తన ఎలా కలిగిందో, దని ఆంతర్యమేమిటో తనకే తెలియకుండా ఉంది. ఆ ఆలోచనలతోనే బొమ్మలుకూడా ఎక్కువగా గీయలేకపోతూంది. ఆలోచించుకుంటూ మెల్లగా గదిదాటి వరండాలోకి వెళ్ళి పూలకుండీల దగ్గర నిల్చుంది, శాంతి. పావురాలు గూళ్ళు చేరుకుంటున్నాయి. చల్లటి గాలివీస్తూంది. ఆకాశంలో మేఘాలు అందంగా సభ తీర్చాయి. 'అబ్బ! శాంతినికేతన్ వెళ్ళి వచ్చే వరకూ వర్షం కురియకుంటే బాగుండును. ఈ ఆలోచన రాగానే ఆ ప్రయాణానికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకోవాలని గుర్తువచ్చి తిరిగి గదిలోకి వెళ్ళింది.
    శాంతికి ముందు కలిగిన సందేహం, 'రేపు ఏం దుస్తులు ధరించాలా?' అని బీర్వాముందు బట్టలన్నీ పరీక్షిస్తూ అలా నిల్చుంది. ఎంత ఆలోచించినా ఏ దుస్తులూ నచ్చలేదు. స్వతహాగా తనకు గులాబీరంగు దుస్తులంటే ఎక్కువ యిష్టం. కాని, రాజా ఆ దుస్తులలో ఉన్న తన రూపాన్ని చిత్రించి కాన్కగా యిచ్చాక ఎందుకో అవి తిరిగి దరించడానికి సిగ్గుగా ఉంటూంది. సరే, ఆ సమయానికి ఏవి నచ్చితే అవి కట్టుకో వచ్చు, మిగిలినవి చూద్దాం అనుకుంటూ హాండ్ బాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో సరిచూచుకుంది, కెమేరాలో క్రొత్త ఫిల్మువేసి సిద్ధంగా టేబుల్ మీద ఉంచింది. దీపాలవేశే వేళైందనుకుంటూ గదిలోనూ, వరండాలోనూ లైట్లు వేసింది. తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. రవీంద్రుని 'నివేదన' తీసి చదువుతూ వరండాలో నిలబడింది.
    'నేత్రములయందు నీవున్నావు. అయిననూ నేత్రములు నిన్ను దర్శింపలేకున్నవి. హృదయ మున నీ వుంటివి. కాని ఆ హృదయమే నిన్ను గుర్తింపలేకుండె.' రవీంద్రుని భక్తిగీతం ఇది వరకు చదివినదే అయినా ఈ రోజు క్రొంగ్రొత్త అర్ధాలు తోచాయి. ఏదో తెలియని ఒంటరితనానికీ, చికాకులూ గురి అయి అశాంతిగా ఉన్న శాంతి హృదయం ఆ గ్రంథపఠనంలో ఆహ్లాదపడసాగింది. అలా ఎంతసేపు చదువుతూ నిల్చుందో తనకే తెలియదు. వదిన భోజనానికి పిలిస్తే వాచీ చూచుకుంది. ఏడు గంటలు!
    వెలుగు ఉండీ ఉండని సంధ్యవేళనుంచి అప్పటి వరకూ సుమారు రెండు గంటలకాలం పైగా అలా నిల్చుని చదువుతూందన్నమాట, మైమరచి! తన పరధ్యానానికి తానే నవ్వుకుంటూ భోజనానికి వెళ్ళింది.
    "రేపు శాంతినికేతన్ చూసేస్తే ఎల్లుండి నన్ను పంపించేసెయ్యి, అన్నయ్యా" అంది, ఎదురుగా కూర్చుని భోజనం చేస్తున్న శ్రీహరితో.
    "వెళ్దువుగాని లేవే. ఏదో పరాయి చోటులాగ వెళ్తాను, వెళ్తానని ఒకటే గొడవ!"
    శాంతి వెంటనే ఏమీ మాట్లాడలేదు. తిరిగి శ్రీహరే, "నీకేమో ఇక్కడుండాలని లేదు. నాకు మాత్రం నిన్నెప్పుడూ ఇక్కడే ఉంచుకోవాలని ఉంది" అని నవ్వి, చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు.
    రాత్రి పడుకోబోయేముందు అలారం పెట్టుకోవడానికి టైంపీసుకు కీ యిస్తూంది, శాంతి. "పెందరాళే లేవాలిగా? త్వరగా పడుకో శాంతీ. ఎక్కువసేపు మేలుకోకు" అంది పద్మ, శాంతి గదిలోకి వచ్చి కూర్చుంటూ.
    "వదినా, ఇందాక రాజా మాటలు నాకర్ధం కాలేదు" అంది శాంతి, వదినదగ్గర కూర్చుంటూ.     "ఏమన్నాడు? ఏమో నాకు జ్ఞాపకం లేదు" అంది పద్మ, ఏమీ ఎరగనట్టు.
    "ఇవ్వాళ అతడి ధోరణేమిటో నాకు క్రొత్తని పించింది వదినా! ఎంతో మర్యాదగా మాటలాడే వాడల్లా 'నువ్వు' అని ఏకవచనంతో మాట్లాడుతున్నాడివ్వాళ. విష్ చేస్తే తల పంకించి ఊరు కున్నాడు, మహాగర్వంగా." శాంతి అహం దెబ్బ తిన్నట్లు ఆమె నేత్రాలు, కంఠస్వరం స్పష్టంగా చెప్పుతున్నాయి.
    పద్మ లోలోన కొంచెం కలవరపడింది. శాంతికి విషయం తెలియదు. తెలిసిన రాజా సిగ్గునూ, చనువునూ మరోవిధంగా అపార్ధం చేసుకుని ఆగ్రహం పెంచుకోవడం పద్మకు బాధ అనిపించింది. ఇంకా కూర్చుంటే సంభాషణ ఎంతవరకు వస్తుందో అన్న భయంతో పద్మ కూర్చున్న చోటనుంచి లేచింది.
    "ఎందుకో అతడు అన్యమనస్కంగా వున్నాడు, శాంతీ. అంతమాత్రానికే అపార్ధాలు దేనికి? అతడు చాల మంచివాడు. దానికేంగాని త్వరగా పడుకో" అంటూ వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS