Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 10


    "ఎప్పుడొచ్చారమ్మా? ఏమిటీ హఠాత్ర్పయాణం! వుత్తరం వ్రాయకుండా వచ్చారేం?" ప్రశ్నల వర్షం కురిపించింది.
    "తెల్లవారు ఝాము నాల్గు గంటలకు వచ్చామమ్మా. అయితే......" తండ్రి ఇంకా ఏదో చెప్పుతూండగా నవ్వుతూ శ్రీహరి అన్నాడు: "నువ్వు కలకత్తానుంచి వెళ్ళిపోతానన్నావు కదూ? అందుచేత అమ్మనీ, నాన్నగారినీ కూడ యిక్కడికే రప్పించేశాను. ఇంకెక్కడి కెళ్తావు?"
    ఆశ్చర్యపోతూ చూడడం మినహా శాంతి ఏమే మాట్లాడలేకపోయింది.
    తిరిగి శ్రీహరే చెప్పాడు: "నువ్వు కలకత్తా లోనే ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నానే, శాంతీ." తలఎగరేశాడు.
    అప్పటిమట్టుకు కుశలప్రశ్నలు వేసి శాంతి అక్కడినుంచి వెళ్ళిపోయింది. వంటగదిలో ఉన్న వదినదగ్గరికి వెళ్ళితే ఆవిడ నవ్వేసి ఊరుకుంది. ఎవరినుండీ తిన్ననైన సమాధానం రావడం లేదు. భోజనాలైన తరువాత శ్రీహరి ఆఫీసుకు వెళ్ళి పోయాడు. బలరామయ్యగారు హాల్లో మేను వాల్చాడు. లక్ష్మీదేవి కూతురు గదిలో పడుకుంది. శాంతి మెల్లగా తల్లి పక్కలో జేరి యింటి విషయాలు మాట్లాడటం మొదలెట్టింది.
    "నా గులాబీ పూస్తోందా, అమ్మా? నీళ్ళు పోయిస్తున్నావా?"
    "రోజుకు ఏడు, ఎనిమిదికూడా పూస్తోందా. ఇక్కడ ఏం పువ్వులు దొరుకుతాయి?" తిరిగి అడిగింది, లక్ష్మీదేవి.
    "అన్నీ దొరుకుతాయి కాని...... నా గదిలో అన్నీ జాగ్రత్తగా వున్నాయా? తలుపులు బాగా వేయించావా, వచ్చేముందు?" అసలు సంగతి ఎలా అడగాలో తెలయక ఏదో ఒకటి అడుగుతూంది.
    "అన్నీ వేశానమ్మా. అన్నీ బాగున్నాయి. అయితే నీకు కలకత్తా వచ్చిందా?"
    "నాలుగు రోజులుండి పోదామని వచ్చిన ప్రదేశం. నచ్చితే ఏమిటి, నచ్చకపోతే ఏమిటి?" విసుగ్గా ఉంది శాంతి జవాబు.
    "పోనీ కానీ, ఇక్కడెవరైనా మనవాళ్ళు న్నారా? స్నేహితులు దొరికారా?"
    ఈ ప్రశ్నకు మరీ చికాకు కలిగింది శాంతికి. అయినా అన్నిటికీ విసుక్కొంటే అమ్మ ఏమనుకొంటుందో అని, "నాకు స్నేహితులేమిటి? అన్నయ్యకు తెలిసినవాళ్ళెవరో వున్నారు. వదిన ఇరుగూ, పొరుగూ ఎవరెవరితోనో స్నేహం కలుపుతోంది" అన్నది.
    "నీకేగొడవా అక్కర్లేదు. అవునా?" నవ్వింది లక్ష్మీదేవి.
    "అది సరేగాని, యింత హఠాత్తుగా వచ్చారేమిటమ్మా?" కడకు ధైర్యంగా అడిగేసింది, శాంతి.
    మందహాసం చేసింది లక్ష్మీదేవి. "అన్నయ్య  ఇక్కడుండగానే వస్తే ఇక్క్లడినుంచి యాత్రలన్నీ చెయ్యచ్చని వచ్చామే. దార్లో భువనేశ్వరం, పూరీ జగన్నాధం, సాక్షి గోపాలం చూచి వచ్చాం. అలా అడుగుతావేమిటి, ఎందుకొచ్చా రెందుకొచ్చారని?"
    శాంతి హృదయం తేలికపడింది. "ఊరికే అడిగావమ్మ. సరే పడుకో" అంటూ వెళ్ళిపోయింది.
    తిరిగి వారం రోజులపాటు కుటుంబమందరూ కలకత్తా అంతా తిరిగి చూశారు. ప్రతి ప్రదేశం లోనూ శాంతికి విధిగా రాజా గుర్తుకు వచ్చేవాడు. 'ఇవన్నీ కలిసేకదా తిరిగాం! ఎందుచేతో రావడంలేదు' అనిపించేది. అన్నయ్యనూ, వదిననూ ఒకటిరెండు సార్లు అడుగబోయి మానేసింది, "నాకెందు'కని. అదీగాక శాంతినికేతన్ కు ప్రయాణమయ్యే రోజు ఉదయం అతడు విసిరిన మాటలు గుర్తుకువచ్చి ఏదో వెగటుగా ఉండేది. కాని, అందులోనే మళ్ళీ ఏమిటో 'నేనింత సౌందర్యవతినా!' అనే గర్వంకూడ అస్పప్ష్టంగా క్షణకాలం కలిగి మాయమయ్యేది. తిరిగి దక్షిణేశ్వరం చూచినవాడు మాత్రం శాంతి హృదయంలో చెలరేగే భావతరంగాలకు అడ్డుకట్ట నిర్మించలేకపోయింది. అక్కడ తొలిసారిగా రాజాతో పరిచయం, అతడి హాస్యాలు, కొంటెతనం, బహూకరించిన చిత్రాలు ఒక్కటొక్కటే గుర్తుకు రాసాగాయి.
    "అచ్చంగా ఇలాగే వేశావే, అమ్మాయీ, రాధాకృష్ణుల్ని!"
    దక్షిణేశ్వరం రాధాకృష్ణ విగ్రహాల్ని చూచి శాంతి వేసిన రాధామాధవ చిత్రంతో మనస్సులో పోల్చుకుంటూ ఆశ్చర్యంగా అన్న లక్ష్మీదేవి మాటల్లో శాంతికి చివరి సగం మాత్రమే వినిపించాయి.
    "ఊఁ. ఏమిటీ? అవునవును."
    శాంతి పరధ్యాన్నపు సమాధానానికి పద్మ, శ్రీహరి కూడా నవ్వారు.
    "ఏమిటే మరీ అంత పరధ్యానం? అసలే అంతంతమాత్రం! అందులోనూ శాంతినికేతన్ చూచిననాటి నుంచీ మరీ ఎక్కువైనట్లుంది!" అన్నాడు, శ్రీహరి.
    తిరిగి వచ్చే దారిలో ఏదో మాటలలో అడిగిన ట్టడిగింది శాంతి వదినను, "రాజశేఖరం రావడం లేదేం, వదినా?" అని.
    పద్మ కొంటెగా తిరిగి ప్రశ్నించింది: "ఏం. రమ్మని కబురు చెయ్యమంటావా?"
    "పోదూ. తెలిసినవాడు కదా అనడిగాను."

                               *    *    *

    నాలుగు రోజల అనంతరం బలరామయ్యా, లక్ష్మీదేవీ, శాంతీ కాశీయాత్రకు వెళ్ళారు. మొదట్లో శాంతికూడ చాలా ఉత్సాహంగా ప్రయాణమైంది,  తల్లిదండ్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు చూడటానికి. కాని తీరా సరిగా ప్రయాణపు రోజు ఉదయం శాంతి తన నిర్ణయం మార్చుకుంది.
    "లేదమ్మా. నాకు రావాలని లేదు. నాన్నగారూ, నువ్వూ వెళ్ళండి" అంది, మెల్లగా తల్లి దగ్గర చేరి. కొద్దిసేపు తర్కించాక తల్లీ, తండ్రీ ఊరుకున్నారు.
    శాంతి కోరికకు భిన్నంగా బలరామయ్య ఎప్పుడూ ప్రవర్తించడు. తక్కిన సంతానమైన ఇద్దరు కుమారులకంటే శాంతిపై ఆయనకు గల ప్రత్యేక వాత్సల్య కారణం తెలియాలంటే ఇరవయ్యేళ్ళనాటి బలరామయ్య గతి కొంత తెలుసుకోవాలి. ఉన్న ఆస్తిపై దాయాదుల లావాదేవీలతో, నడుస్తూన్న వ్యాపారంలో హఠాత్తుగా వచ్చిన నష్టాలతో కలిగిన ఆర్ధిక బాధలవల్ల మనశ్శాంతికి దూరమై అప్పటికి ఏడేళ్ళుగా బాధపడుతున్నాడు బలరామయ్య. ఒక్కసారిగా లక్షాధికారి కట్టుగుడ్డ లతో నిలబడిపోయి నీటినుండి ఒడ్డుకు విసిరి వేయబడిన చేపపిల్లలా గిలగిలలాడాడు. ఆరోగ్యం మరీ దెబ్బతినడం చూచిన డాక్టర్ అతడిని కొంత కాలం పల్లెపట్టున విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆరోగ్యం కోసం కాకపోయినా స్థలం మార్పుకై ఆలోచిస్తున్న బలరామయ్య వెంటనే కుటుంబంతో సహా ఒక పల్లెటూరులో మకాం చేశాడు.
    గోదావరి ప్రక్కన ఒక ఎకరం కొబ్బరితోటలో మధ్యగా చిన్న బంగళా. పట్టణంలో బలరామయ్యకు స్నేహితుడైన వెంకటాద్రిగారి తాలూకు పొలంలో ఒక చెక్క అది. సాధారణంగా పల్లెటూళ్ళలో అద్దె ఇళ్ళ అవసరం ఉండదు. అందుచేత తమకు ముందుతరంవారినుండి సంక్రమించిన స్థిరాస్తులలో ఒక భాగమైన ఆ పల్లెటూరి ఇల్లు గలీ వెలుతురూ కరవై నిత్యం మూసి ఉండడంకంటే ఎవరో ఒకరు దీపం వెలిగించే వాళ్ళయినా ఉండాలని కోరుకుంటారు.
    అందువల్లనే బలరామయ్యగారి మనోభీష్టం ప్రకారం పల్లెపట్టున అతి ప్రశాంతమైన ఆ వాతాహవరణంలో ఉండడానికి తేలికగానే అవకాశం లభించింది. నిత్యారోగ్యకరమైన ఆ పైరు గాలులు, సంతత గంభీర వాహిని అయిన ఆ నదీ సైకతాలలో ఏకాంత విహారాలు, నిర్మల నిశ్శబదాలకు ఆలవాలమైన ఆ పరిసరాలు బలరామయ్య మనస్సుకు కొంత శాంతినిచ్చాయి. ఆ ప్రదేశంశంలో అడుగెట్టిన వారం రోజులకే శాంతి పుట్టింది. అదివరకు శ్రీహరీ, నారాయణా యిద్దరూ పుత్రులే గనుక ఈసారి పుత్రిక కావాలనిపించేది బలరామయ్యకు లోలోన.
    అతడి కోరిక నెరవేరింది. కోరికలు నెరవేరడం మొదలైంది. ఆ సమయంలోనే ఆస్తి దావాలో గెలిచినట్టు హైకోర్టు వకీలునుండి టెలిగ్రాం వచ్చింది. ఇరవై ఎకరాలు! తనవి కావనుకున్న ఇరవై ఎకరాలూ తఃనవయ్యాయి. తిరిగి వ్యాపారం నడపవచ్చు. 'హాయిగా బ్రతుక వచ్చు నేను. నేను-నేనే! నేను దరిద్రున్ని కాలేదు. నేను బెంగతో కుమిలిపోనక్కర్లేదు! శాంతిలేని నా హృదయానికి నువ్వవతరించి ఎంత శాంతిని ప్రసాదించావు, చిట్టితల్లీ! ఇక నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ప్రశాంత ప్రత్యూష సమయాన నాయింట శాంతివే అవతరించావు. శాంతి దేవతవు!'  అనుకుంటూ భగవంతుని స్మరించి తోటలోకి వెళ్ళాడు. క్రొత్తగా నాట్లు వేసిన మడిలో ఒక సన్నంగి కొబ్బరిమొలక అప్పుడే భూమినుండి తొంగి చూస్తూంది. ఇంకా లేవయస్సులోనే ఉన్న శిరీషం క్రొత్తగా మొగ్గతొడిగింది. దేవునికి శిరీషపుష్పాలు ఎంతో ప్రీతిపాత్రమైనవి. టెంకాయ సరేసరి. దేవతానివేదనకు ప్రప్రథమ స్థానాన్నందినది. అందులోనూ సన్నంగి కొబ్బరి మూడవ సంవత్సరానికే కాపు పడుతుంది. ఎంత శుభసూచకం!   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS