"ఒరేయ్, సీతా, నన్ను రేపు పొద్దున్న పంపించి వెయ్యరా, గోపాలం దగ్గిరకు వెడతాను" అంది తల్లి.
"ఎందుకమ్మా అలా, అంత తొందరేమొచ్చింది?" అన్నాడు సీతాపతి. పరిస్థితి ఇంతదాకా వచ్చిందని అతడికి తెలియలేదు.
"మీ మధ్యన కలత లెందుకు పెట్టటం, బాబూ. ఇప్పటికే నలుగురూ నానా విధాల అనుకుంటున్నారు. నేను నోరు తెరిస్తేనే మీ ఇంటి రహస్యాలు బయట పెట్టేస్తాను. నా మానాన నన్ను పోనీ ఏదో ఇంత దూరం వచ్చాను. ఆపరేషన్ చేయించావు. దగ్గరుంచుకున్నావు. తిండి పెట్టావు. నీకూ నీ పెళ్ళానికీ ఇదిగో చెయ్యెత్తి దండం పెడుతున్నాను. ఇంక నా పేరెత్తకండి. నన్ననకండి. ఒకరి చేత మాట పడ్డదాన్ని కాను. ఇంక నీ యింటి గౌరవం చాలు, బాబూ పంపించెయ్. ఏ రోజు ఏం మునుగుతుందో" అంది.
* * *
"తులసీ, ఏం జరిగింది?" అన్నాడు సీతాపతి.
"నేనేం చేసినా, ఏం చెప్పినా చెడ్డగానే ఉంటుంది మీకు. మీ అమ్మ చెప్పినట్టూ, మీకు తోచినట్టూ చెయ్యండి. నన్నేమీ అడగద్దు. ఓపికుంటే చేస్తాను. లేకపోతే మానతాను. కాని ఒకరితో మాత్రం చేయించుకోను" అంది తులసి.
"తులసీ, ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నాను. అసలేమైందో తెలుసుకోవలసిన అవసరం నాకూ ఉన్నది గదా. అమ్మంటే పాతకాలపు మనిషి. నువ్వు చదువుకున్న దానివి. ఎవరితో ఎలా మసలుకోవాలో తెలిసినదానివి. నేను నీ మాటకు గౌరవమిస్తాను. అన్నీ తెలిసీ ఇలా మాటలు బిగపట్టితే నాకు బాధా, కోపం కలుగుతాయి. నాకు చెప్పటం నీ కిష్టం లేదనుకోవలసివస్తుంది. నా నించి దాచాలనుకుంటున్నావా?" అన్నాడు సీతాపతి.
తులసికి భయమేసింది. భర్త కంఠంలో అంత సీరియస్ నెస్ అరుదుగా ఉంటుంది. క్షణం ఊరుకుంది. నెమ్మదిగా ప్రారంభించింది.
"ఏం చెయ్యనండీ, మీ అమ్మను గురించి చెబితే మీకు కోపం రావచ్చుకాని చెప్పాలి మరి. నేను ఇలా పడి ఏడుస్తుంటే, నేనేదో కావాలని పడుకున్నాననీ, ఆవిడ చేత ఇష్ట పూర్వకంగా పని చేయిస్తున్నాననీ అనుకుంటుం దావిడ. పక్కింటివాళ్ళతో కూడా అదే చెబుతుంది. కళ్ళు కనిపించకా, కీళ్ళ నొప్పులతోనూ తను బాధ పడుతుంటే, నేను తన మెడలు వంచి పనిచేయిస్తున్నానట. ఇలా నలుగురి ముందూ ప్రచారం చెయ్యటం ఏం బావుంటుంది. ఇంట్లో సూటీపోటీ మాటలు ఎట్లాగూ ఉండనే ఉన్నవాయె. ఇంకా ఇరుగుపొరుగులతోకూడా చెప్పుకోవటమెందుకు."
"ఇంతకూ నీతో ఏమంది, నువ్వేమన్నావు?" అన్నాడు సీతాపతి.
"మధ్యాహ్నం కమల వచ్చి కూర్చుంది. ఆవిడ ముందరకూడా మళ్ళీ ఇదే ప్రారంభించబోయింది. నాకు ఆపుకోలేని కోపం వచ్చింది. ఇలా అందరితోనూ చెప్పుకోవటమెందుకన్నాను. ఆ మాటతోనే ఆవిడ రెచ్చిపోయింది. తనిష్టమొచ్చినట్టుగా చెబుతానంది. అలా అడగటానికి నా కేమీ అధికారం లేదంది. తనిక్కడికి వచ్చింది ఆపరేషన్ కోసంగాని, ఇలా దుక్కలా పడుకుంటే చేసి పెట్టటానికి కాదంది. నేనూ, పాపా కలిసి తనమీద పెత్తనం చేస్తున్నామంది. ఈ వ్యవహారం తను సహించలేనంది. ఇంకా ఏవేవో నోటికొచ్చినట్టల్లా అని తన నోటిదురద తీర్చుకుంది" అంది తులసి.
"ఐతే ఆవిణ్ణి వెళ్ళిపొమ్మంటావా?" అన్నాడు సీతాపతి.
"నే నెందుకంటాను. నే నేమీ అనను. మీ యిష్టం. నాకు చాతనయినన్నాళ్ళూ ఇలాగే చేస్తాను. ఆవిడకూ పెడతాను. ఆవిడకు ప్రత్యేకంగా సేవలు నేనేమీ చేయలేను. ఐనా మనుషులమీద అలా గొంతుదాకా నింపుకుంటే ఎన్నాళ్లని కలిసి ఉండగలరు. ఎప్పుడో అప్పుడు అదంతా ఈవలకు కక్కెయ్యక తప్పుతుందా" అంది తులసి.
సీతాపతి మాట్లాళ్ళేదు.
తులసి మళ్ళీ, "అవునండీ, నా కేమీ సేవలు చెయ్యద్దు. నాకు సత్తువుంటే చెయ్యకుండా ఉండను. ఆవిణ్ణి నేను వెళ్ళమనను. ఐనా ఇది మీ యిల్లు. మీ యిష్టం" అంది.
"అలా అంటే సమస్యలు పరిష్కారమవవు, తులసీ. జాగ్రత్తగా ఆలోచించాలి" అన్నాడు సీతాపతి.
"పోనీ, అదేదో మీరే చెయ్యండి. మీ యిష్టం వచ్చినట్టే కానివ్వండి. ఆవిడలా యింటింటికీ వెళ్ళి ప్రచారం చెయ్యటం మాత్రం నాకు నచ్చదు. మీరేమన్నా సరే" అంది తులసి.
"మనం పెద్దవాళ్ళను కొన్ని విషయాల్లో సహించాలి, తులసీ" అన్నాడు సీతాపతి.
"నేనేం కాదనటం లేదు. అంతగా అడగదలుచుకుంటే నా మొహం మీదే అడిగెయ్యమనండి. తప్పుంటే సరిదిద్దమనండి. కాని అలా నా గురించి మీకూ, మీ గురించి నాకూ చెప్పటం, మనస్పర్ధలు తేవటం నా కిష్టం ఉండదు" అంది.
తులసి బాగా అలిసిపోయింది. దమ్మొచ్చింది. కంఠం రుద్ధపడింది. తులసి వీపు నిమురుతూ, "పడుకో, పడుకో. జరిగేదేదో జరుగుతుందిలే" అన్నాడు సీతాపతి.
8
ఉదయం ఆరు గంట లయింది. తులసి లేచి వంటింట్లో పనిచేస్తున్నది. అక్క లేవటం చూసి, పాపకూడా లేచి సాయంపోయింది. అత్తగారు అంతకు ముందే లేచి తన గుడ్డలు సర్దుకుని కూర్చుంది. ఆ చలిలో వణుకుతూ స్నానం చేసి చీర ఆరేసుకుంది. మామూలుగానైతే తులసి వేన్నీళ్ళు తొలిచేది. ఆ రోజుఆమె అడగలేదు, కోడలు ఇవ్వలేదు. తల్లి సుప్రభాతమూ, వంటింట్లో చప్పుడూ సీతాపతిని మేల్కొల్పాయి. పక్కమీద ఉండే కాసేపు గమనించాడు. తులసి గొంతులో అధికారం ఉంది. చెల్లెల్ని కేక లేస్తూంది. ఓసారి కొళాయి తిప్పేసి అలాగే ఉంచింది. బిందె నిండిపోయింది. కాని తియ్యలేదు.
"మందేసుకో, అక్కా" అంది పాప. పాపను తిట్టింది.
"ఓ పూట మందేసుకోకపోతే చస్తానా. చస్తే మాత్రం ఎవరికేం పోయింది. మందు అక్కడ పడేసి ఈ వంట సంగతి చూడు. అందరికీ అవసరమైంది వంట. నా మందు కాదు; నేను కాదు. వేళకు సౌకర్యాలు అమరితే ఎవ రెల్లాపోయినా ఎవరికీ చీమ కుట్టదు."
సీతాపతికి మాచెడ్డ చిరాకు వచ్చింది. పొద్దున్నే ఈ సొద. తనను తాను తిట్టుకొంటూ లేచాడు. తల దువ్వుకునే నెపంతో వంటింటి గడప దగ్గర నిలుచున్నాడు. తులసి మాట్లాడలేదు. తల్లి కొడుకును చూడగానే, "నన్ను మొదటి బస్సుకు పంపించెయ్యరా, సీతాపతీ" అంది.
సీతాపతి పలకలేదు.
"ఏం వినొస్తూందా, బస్సు ఛార్జీల్లేవనక. ఏదోలా సర్ది నన్ను పంపేసి నా పీడ వదిలించుకోరా, నీకు పుణ్యం ఉంటుంది" అంది.
సీతాపతి గిరుక్కున తిరిగి బాత్ రూం వైపు నడిచాడు.
కాలకృత్యాలు తీర్చుకుని, మొహం కడుక్కుని, షేప్ చేసుకుని, స్నానం చేశాడు. కావాలని ఈ పనులన్నీ నెమ్మదిగా, ఆలస్యంగా చేశాడు. ఈమధ్య తులసి రెండుసార్లు కాఫీ వెచ్చబెట్టి దించింది. మొదటిసారి ఇవ్వాలనుకునేసరికి అతను దొడ్డివైపు వెళ్ళాడు. మరోసారి స్నానానికి మెట్లుదిగాడు. అక్కడికీ, "ఇదిగో కాఫీ" అంది. కాని అతడు వినిపించుకోలేదు.
భర్త మౌనం చూస్తే, తులసికి అనుమానం కలక్కపోలేదు. కాని నిశ్చయించుకుని కూర్చుంది. ఎలాగోలా ఈ గొడవ వదిలించుకోవాలి. భర్త కోపగించవచ్చు. కాని ఈ నిత్యపారాయణకన్నా భర్త కోపం చాలా సులభం. ఈ పెద్దరికాలు, చెప్పుడు మాటలు, కృతజ్ఞతలేని సేవలు, సాధింపులు లేని రోజున, తనూ తన చెల్లెలూ స్వేచ్చగా గడపగలిగినప్పుడు భర్త కోపం భరించటం కూడా మధురంగానే ఉంటుంది. కూర ఇంత ఎందుకు వండావనీ, చల్ధన్నం పారెయ్యట మెందుకనీ, రొట్టెలు ఇన్ని ఎందుకనీ తనమీద సూపర్వైజ్ చేసే మనిషి పోతే తను నిజంగా సుఖపడుతుంది. దేనికైనా హద్దుంటుంది. అంత అధికారం తనకుందని ఆవిడెల్లా అనుకుందో తన ఊహకందదు.
సీతాపతి స్నానం ముగించి సరాసరి వంటింట్లోకి వచ్చాడు. అతడి రాక గమనించి పాప అక్కడినించి చల్లగా జారుకుంది. తులసి కాఫీగ్లాసు ముందరెట్టింది.
"చూశావా!" అన్నాడు సీతాపతి.
ఏమిటన్నట్టు చూసింది తులసి. తులసి బలహీనంగా ఉంది. ఆమె మొహంలో బాధకూడా ఉంది. సీతాపతి అది గమనించకపోలేదు.
"అమ్మ వెళ్ళిపోతానంటున్నది, తులసీ" అన్నాడు.
అతని కంఠంలో ప్రాధేయత ఉంది. కాని తులసి కది అనవసరం.
"నన్నేం చేయమంటారు మరి?" అంది.
"నువ్వామెను వెళ్ళమంటావా? ఈ పరిస్థితిలో - ఇలా. ఇంకో రెండు వారాలన్నా ఉండి, ఆ కళ్ళ వ్యవహార మేదో తేల్చుకునిపోతే బావుంటుంది" అన్నాడు.
"ఉండమనండి మరి" అంది తులసి.
"నువ్వు చెబితే ఉంటుంది" అన్నాడు సీతాపతి.
"నేను చెబితే అసలు ఉండదు" అంది.
"చెప్పేరకంగా చెబితే ఉంటుంది" అన్నాడు.
"ఆ రకమేదో నాకు తెలియదు మరి. మీ ప్లానంతా నాకు తెలుసులెండి. నేను ఆవిడ కాళ్ళమీద పడి నా తప్పు క్షమించి, ఈ ఇంట్లో మరిన్ని రోజులుండి, మాచేత సేవలు చేయించుకుని మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అని వేడుకోనా?" అంది తులసి.
"నీకు వెటకారంగా మాట్లాడటం బాగా అలవాటైంది" అన్నాడు సీతాపతి.
తులసి మౌనం దాల్చింది.
"తులసీ, నువ్వు చాలా తెలివైనదానివి. నన్ను అడకత్తెరలో పెట్టి తమాషా చూస్తూ సంతోషిస్తావు. అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఆవిడ సరిగా నయం కాకుండానే వెళ్ళిపోతానంటున్నది. నేను ఉండమంటే ఉండదు. ఉన్నా, నీ సహకారం లేకుండా అదెలా సాధ్యం? ఎదటివాళ్ళు అంత ఆత్మాభిమానం లేనివాళ్ళని ఎందుకనుకుంటావు. అందులోనూ ఓ పెద్దమనిషిని. ఎంత చెడ్డా ఆవిడ నీ అత్తగద. అంతమాత్రం గౌరవం లేదూ? నీకన్నా పెద్దది. నీకన్నా సనాతన సంప్రదాయంలో పెరిగింది. నిజమే. కొంచెం పెద్దరికం చూపాలనుకోవచ్చు, కాదనను. నీకున్న విద్యతో, సంస్కారంతో ఆవిడతో ఆ కొంచెం సర్దుకుపోలేవూ? ఆవిడ వయసు చూడు. పరిస్థితి చూడు. ఆమె ఎంత అనారోగ్యంగా ఉందో గమనించావా? నిష్టురాలు పలికి ఆవిణ్ణి వెళ్ళి పొమ్మంటే ఎలా?" అన్నాడు సీతాపతి ఆవేశంగా.
కాఫీగ్లాసు తీసుకుని లేవబోయేదల్లా కూర్చుని, "మీకు ఆవిడ పరిస్థితి మీదా, ఆవిడమీదా ఉన్న సానుభూతిలో సగం నామీద ఉంటే ఇలా మాట్లాడక పోదురు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఆవిడ రోగంతో ఉందిగనకా, ముసల్ది గనకా ఆవిడేమన్నా ఊరుకొమ్మంటారు. రోగం నాకు లేదూ? ఈ గర్భ స్రావం ఏ ఏడో నెలలోనే జరిగితే అప్పుడు నా పరిస్థితి హాస్పిటల్ నించి డైరెక్టర్ గా శ్మశానాని కయ్యేది. ప్రస్తుతం నేనూ మూలుగుతూ పడుకుంటే మీకు కనిపించేది. నా ఒంట్లో సత్తు ఉందో లేదో నాకు తెలుసు. మాట పట్టింపుకు చేస్తున్నాను. ఇట్లాగే చేసి, చేసి పడితే అప్పుడు కూడా మీకు నామీద ఏమీ సానుభూతి రాదండీ. ఎలా వస్తుంది - కని, పెంచి పెద్దచేసిన తల్లి ఆవిడాయె. ఎక్కడినించో వచ్చి మిమ్మల్ని పట్టుకు వేళ్ళాడుతున్నదాన్ని నేనాయె. ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకుగాని, మీరడిగితే ఉండండి, నే నడిగితే ఉంటుందా ఆవిడ!" అంటూ గ్లాసు తీసుకుని కడుక్కురావటాని కెళ్ళింది.
సీతాపతి అలానే కూర్చున్నాడు. తులసి రాగానే మళ్ళీ, "తులసీ, నీతో ఎలా చెప్పాలో అర్ధంకావటం లేదు. రాత్రే ఇవన్నీ మాట్లాడాలనుకుంటే నీకు అలసట వచ్చింది. పడుకున్నావు. ఇప్పుడేమో అమ్మ తొందర చేస్తున్నది. టైం లేదు. తులసీ, నేను నిజంగా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. ఎందు కర్ధంచేసుకోవు? మన మెన్ని అనుకున్నా నువ్వంటే నాకెంత గౌరవముందో నీకు తెలుసు. అందువల్లే నాకై నేను ఓ నిర్ణయమంటూ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆవిడ ఇక్కడే ఉంటుందనుకో. నేను ఎలాగోలా బ్రతిలామి ఒప్పిస్తాను. కాని ఏం లాభం? నువ్వు ఆవిడతో మామూలుగా ఉండవు. ఎప్పుడూ సూటీపోటీగా సాగుతుంటుంది. ఆవిడ ఉన్నంతకాలమూ నువ్విలాగే ఉంటావు. మారవు. ఆవిడను పంపితే, నాన్నా, అన్నయ్యా ఏమనుకుంటారో గాని నా మట్టుకు నాకే అవమానంగా ఉంది. తులసీ, ఇది నీకూ, ఆవిడకూ సంబంధించిన సమస్యగాకాక మన ఇద్దరి సమస్యగా ఆలోచించు. ఏం చెయ్యమంటావో చెప్పు. అలాగే చేస్తాను. ఎందుకంటే చివరికి మిగిలేది మనమే గదా" అన్నాడు సీతాపతి.
"మీకు చెప్పటానికి నే నేపాటి దాన్ని?" అంది తులసి.
"తులసీ, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. నువ్వలా మౌనంగా ఉంటే ఇంక సహించలేను. నన్ను నేను ఇలా బయట పెట్టుకున్న తర్వాతకూడా నువ్వింకా, ఇంత వికటంగా మాట్లాడుతున్నావంటే నువ్వు మనిషివి కావు. రాక్షసివి. నన్ను చిత్రవధ చేసి నవ్వుతూ చూడగలవు. నువ్వింత చలాకీదాని వనుకోలేదు" అన్నాడు సీతాపతి.
ఆ క్షణాన సీతాపతి బాధ తులసికి పట్టలేదు. తనను ఎవరైనా గుండెకు హత్తుకుని 'అన్నీ మరిచిపో, నే నున్నాను' అనేవాళ్ళు కావాలనిపించింది. తనను గెలిచిన వాళ్ళు, తనకు విచక్షణాజ్ఞానం లేకుండా చెయ్యగలిగిన వాళ్ళు కావాలి.
తులసి మౌనం సీతాపతిని మరింత రెచ్చగొట్టింది.
