ఆ రోజు చాలా రాత్రైం తరవాత ఇంటికి వచ్చాడు సీతాపతి. సైకిలు మెట్ల దగ్గర పెట్టి, తాళం వేసి గదిలోకి వచ్చేటప్పటికి తల్లి తల వంచుకుని కింద కూర్చుంది. తులసి కాబోలు-పడుకున్నది. పాప తులసి పక్కనే కూర్చుంది. ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నది.
"ఏమిటి?" అన్నాడు సీతాపతి ఏం జరిగిందో తెలియక.
తల్లి మాట్లాడక ఇంట్లోకి వెళ్ళింది.
"పాపా, ఏం జరిగింది?" అన్నాడు మంచం దగ్గరికి వెడుతూ.
ఏడుపు కంఠంతో "నువ్వివాళ ఆఫీసుకు వెళ్ళలేదా?" అంది పాప.
"లేదు. వెళ్ళలేదు" అన్నాడు.
"అక్క ఆఫీసువాళ్ళు నీకు ఫోను చేశారు. అక్కను హాస్పిటల్ కు తీసికెళ్ళేముందు నీకోసం వెయిట్ చేశారట కూడా."
"ఏం జరిగింది, పాపా? అసలు సంగతి చెప్పవేం?" అన్నాడు సీతాపతి అసహనంగా.
ముసుగులోంచి వెక్కిళ్ళు, శరీరం ఊపు.
సీతాపతి మంచంమీద కూర్చుని తులసి మీద చేతులేసి, "ఏం జరిగింది, తులసీ, ఏమైంది, నాన్నా, నాకు చెప్పకూడనిదేం జరిగింది?" అన్నాడు లాలిస్తూ.
తులసి ఏడుపు పెరిగింది.
"బావా, అక్క ఏడవకూడదు. ఊరుకొమ్మను" అంది పాప.
"ఎందుకు నన్నిలా పిచ్చివాణ్ణి చేస్తున్నారు?" అన్నాడు సీతాపతి గాద్గదికంగా.
పాప మాట్లాడకపోవటం చూసి, ఇంట్లోకి పరుగెత్తి, "ఏమిటమ్మా, ఇది?" అన్నాడు బిగ్గరగా.
దుఃఖం అతన్ని మాట్లానివ్వలేదు.
"ఈ ఉదయం దానికి గర్భస్రావమయింది" అంది తల్లి.
సీతాపతికి సన్నటి బ్లేడుముక్కతో తన నరాల మీద ఎవరో గాటు పెడుతున్నట్టుగా అనిపించింది. నోట మాట రాలేదు. తనను తను తమాయించుకుని, తులసి దగ్గిరికి వెళ్ళి కూర్చుని, "ఊరుకో. ఏడవకు, తులసీ" అన్నాడు వీపు నిమురుతూ.
తులసి ఏడుపు ఆపలేదు.
"తులసీ, అలా ఏడవకమ్మా. తొందరగా జరిగింది నయంగదూ. ఊరుకో, ఏం చేస్తాం" అన్నాడు.
తులసి కంఠం బలహీనంగా మూలుగుగా వినిపించింది. భర్తచేతిని బ్లాంకెట్ కింది తన చేతిలోకి తీసుకుని, "మీ రివ్వాళ ఆఫీసుకు వెళ్ళలేదుటగదా" అంది.
"ఊఁ!" అన్నాడు సీతాపతి.
* * *
ఆ నెలంతా తులసి ఆఫీసుకు వెళ్ళలేదు. చాలావరకు మంచం మీద అలా పడుకోవటమే. ఇంటిపని అత్తా, పాపా కలిసి చేసుకున్నారు. సీతాపతికి పరీక్షలు సమీపించాయి. తులసికీ పరీక్షలు వచ్చాయి. కాని ఇప్పుడు పరీక్షలకు వెళ్ళే ప్రశ్నే లేకపోయింది. లీవు అవటంవల్ల ఆ నెలలో జీతంకూడా తక్కువ వచ్చింది. గర్భ స్రావం వల్ల ఆమె సంతోషం, బలంకూడా అడుగంటి పోయాయి. సీతాపతికి భార్య పరిస్థితి మీద ఎంత సానుభూతి ఉన్నా, లోలోపల ఆమెపట్ల ప్రేమకూడా తగ్గినట్టుగా కనిపించింది. పనితో అత్తగారి విసుగూ పెరిగింది.
ఓ మధ్యాహ్నం...
కమల వచ్చి చాలాసేపు కూర్చుంది. కబుర్లన్నీ ఐన తరవాత వెళ్ళేముందు, "తులసిగారూ, ఈ ఫస్టుకు మేం ఖాళీ చేస్తున్నామండీ" అంది.
"ఎందుకు, కమలా, మా వల్ల ఏమైనా ఇబ్బందా? ఇన్నాళ్ళు కలిసి మెలిసి ఉన్న తరవాత వెళ్ళిపోతారంటే బెంగగా ఉంది" అంది తులసి.
"ఔనండీ, మాకూ అలానే ఉంది. కాని విజయనగర్ కాలనీలో మా బంధువులు ఇల్లు కొన్నారు. అక్కడే ఓ పోర్షన్ లో మమ్మల్నీ ఉండమంటున్నారు. బంధువుల ఇళ్ళలో ఉండటం ఏమంత బావుండదు. కాని వెళ్ళకపోతే మొహమాటం. కొద్ది రోజుల్లో ఆయనకే తెలిసి వస్తుంది లెండి" అంటూ అత్తగారి వైపు తిరిగి, "ఏమండీ, పిన్నిగారూ, అలా పడుకున్నారేం?" అంది కమల.
మూలుగుతూ, "ఏమిటోనమ్మా, కమలా, ఈ చాకిరితో ఒళ్ళు హూనమై పోతున్నది. ఈ కళ్ళరోగంతో నేను ఎప్పుడో చస్తాను. అమ్మాయి చేసిన రోజుల్లో నేనూ చేశాను. కాని ఒంట్లో సత్తువ చచ్చిపోయిందమ్మా. ఐనా ఏం చెయ్యను? చెయ్యక తప్పుతుందా. ఊరికే మెక్కి కూర్చుంటే ఎలా? ఇంట్లో అందరూ ఆర్జనా పరులేనాయె. నే నొక్కదాన్ని తప్ప" అంది అత్తగారు.
కమల మొహం చూడకపోతే తులసికి తప్పకుండా ఆమెమీద కోపం వచ్చేదే. "క్షమించండి, తులసిగారూ" అంటున్నాయి ఆమె కళ్ళు. పాప రేడియోవాల్యూం పెద్దది చేసి అక్క నాదుకుంది.
కమల తులసితో, "మిమ్మల్ని చూస్తే నాకూ భయంగా ఉందండీ" అంది.
"ఛీ, అదేమిటి, కమలా, నా ఖర్మ ఇలా ఉన్నందుకు నువ్వెందుకు భయపడటం. అలా ఎప్పుడూ అనుకోకు" అంది తులసి. కమలకు ఐదో నెల.
"అలాంటప్పుడు మీరు ఇల్లు ఖాళీ చెయ్యటమే మంచిది, కమలా నా వంటి రోగులు రోజూ కనిపిస్తుంటే ఆ భయాలు పెరుగుతాయి కూడాను" అంది.
"అలా అనకండీ. మేం ఖాళీ చెయ్యటం అందుకోసం కాదు" అంది కమల.
"పోనీ, ఊరికే అన్నాను. సీరియస్ గా తీసుకోకు" అంది తులసి కమల చెయ్యి నొక్కుతూ.
తన మాటల కెవరూ ఏమీ జవాబివ్వకపోవటంతో అత్తగారు ఊరుకోలేకపోయింది.
"అత్తమామల బెడద లేని ఆడది అదృష్టవంతురాలమ్మా. నాకూ నా బెడద మా కోడలికి లేకుండా చెయ్యాలనే ఉందిగాని ఏం చేసేది. ఇప్పుడు వెళ్ళితే నన్నాడిపోసుకుంటారు" అంది.
"ఆమె గొంతునిండా విషం" అంది తులసి కమలతో మెల్లిగా.
"ఇప్పుడు మిమ్మల్నైన రేమన్నారని అలా చదువుతున్నారు? ఇంటి కెవరొస్తే వాళ్ళ ముందర ఈ కథంతా చెప్పాలా ఏమిటి" అంది తులసి.
"లేనిదేం చెబుతున్నాను? పోనీ, నువ్వూ చెప్పు. చెప్పకపోతే నలుగురికీ ఎలా తెలుస్తాయి ఈ విషయాలు. కోడలు నాలుగుపూటలా చేసి పెడుతుంటే తిని బలుస్తున్నా వనుకుంటున్నారు నలుగురూ అసలు సంగతి వాళ్ళకేం తెలుసు" అంది అత్తగారు.
"పోనీ, చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి. అలా కాకి మీదా, పిల్లి మీదా పెట్టి చెప్పటమెందుకు. మొహం మీదే అనెయ్యచ్చు. వాళ్ళింటికీ వీళ్ళింటికీ వెళ్ళిచెప్పటమెందుకు" అంది తులసి.
"ష్, ఊరుకోండి" అంది కమల తులసితో, ఇదంతా తను అత్తగారిని పలకరించటంవల్లనే జరిగిందని.
తులసి ఊరుకోలేదు.
"నే నెక్కడి కెడతానే, ఇంటికెవ్వరూ రాకుండా నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఏం చెప్పినా కమలకే చెబుతాను. ఇప్పుడామె నీ ముందరే ఉంది, అడుగు. కమలమ్మా, నేను నీకేమేం చెప్పానో చెప్పు. ఏమైనా చెడు చెప్పితే చెప్పుచ్చుకు కొట్టు. ఎందుకే నన్నిలా సాధిస్తావు. ఇంకా నువ్వన్నా ఆఫీసుకు పోతావు. ఎక్కడెక్కడో నీ యిష్టం వచ్చినట్టల్లా తిరిగొస్తావు. కాళ్ళూ చేతులూ విరిగిందాన్ని. ఇప్పుడు దేవుడిక్కూడా నా మీద కోపం వచ్చింది. కళ్ళు లేకుండా చేస్తాడు కాబోలు. ఇంతా భరిస్తూ నా ఖర్మ అనుకుని నే నుంటే నన్నంటావెందుకే. నీకేం బుద్ది..." అంది అత్తగారు ఆగకుండా.
"ఏం బుద్ది, పొయ్యేబుద్ది. అనండి ఆ మాట కూడా" అంది తులసి.
"ఊరుకో, అక్కా. ఆవిడంతే" అని పాప ఊరడించబోయింది.
"నా కలాంటి మాటలు రావే. నాకూ ఇద్దరు కొడుకులున్నారు. ఓ కూతురుంది. నీ నంగనాచితనంతో నన్నేదో చెయ్యాలనుకుంటున్నావు కాని అదంతా నీకే" అంది అత్తగారు.
కమల ఇరకాటంలో పడింది.
"అవును, నా దురదృష్టంతో ఇలా పడున్నాను. ఇంకేమంటారో అనండి. ఇంక మీరు వండింది తింటే ఒట్టు" అంది తులసి.
"ఔను, ఇంకెందుకూ మరి. అవసరం ఉన్నన్నాళ్ళూ కావాలన్నావు. ఇప్పుడిలా మాట్లాడుతున్నావు. అన్నీ నీకే తగుల్తాయే. ఇలా అనేవాళ్ళకు ఇంకేమవుతుంది మరి" అంది అత్తగారు.
"ఊరుకోండి, తులసిగారూ అసలే మీ ఆరోగ్యం బావులేదు. అలా ఏడ్చి, కంఠశోషపడి మరింత పాడుచేసుకోకండి" అని కమల వెళ్ళిపోయింది.
తులసి పెద్దగా ఏడ్చింది.
"ఈ వెధవ బ్రతుక్కు అందరికీ నా మీద విసుగే. నాకు చావొచ్చినా బాగుండిపోను" అని శోకాలు ప్రారంభించింది.
పాపకుకూడా ఏడుపుగొంతు వచ్చింది.
"ఊరుకో, అక్కా ఊరుకో ఊఁ" అంది.
అత్తగారు లేచి వెళ్ళి, వంటింట్లో కూర్చుని కాసేపు ఏడ్చి, అక్కడే కొంగు పరుచుకుని పడుకుంది.
తులసి అలసి మగతగా కాసేపు నిద్రపోయింది కాని వెంటనే మెలకువ వచ్చింది. ఒళ్ళు బలహీనంగా ఉంది. కాని తనే వంట చేసెయ్యాలి. ఆమెకు ఇంక అలాంటి అవకాశం ఇవ్వకూడదు! ఛీ! పాడుబుద్దులు.
"పాపా!" అని పిలిచింది. పాప కమల వాళ్ళింట్లో ఉన్నట్టుంది. తనే లేచి వంటింట్లోకి వెళ్ళి, నీళ్ళు తాగి వచ్చింది. టైం అప్పుడే ఐదవుతూంది. సీతాపతి వచ్చేశాడు. తులసి వంటింట్లో, స్టౌ ముందర కూర్చోవటం చూసి, "అదేమిటి, తులసీ, నువ్వు చేస్తున్నావేం వంట" అన్నాడు.
తులసి మాట్లాళ్ళేదు. సీతాపతి రావటం చూసి, పాప ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చింది.
సీతాపతికి పరిస్థితి అర్ధం కాలేదు. తల్లి మంచంలో పడుకుని ఉంది.
సీతాపతి పీట వేసుకుని కూర్చున్నాడు.
"పాపా, మీ అక్కతో ఎందుకు పని చేయిస్తున్నావు?" అన్నాడు.
"వద్దంటే వినటం లేదు" అంది పాప.
"తులసీ, మరికొన్ని రోజులు రెస్టు తీసుకో. ఏం మునిగిపోయిందని అప్పుడే వంటగదిలో కొచ్చావు" అన్నాడు.
"ఏమీ మునిగిపోలేదు. పడుకుని తినటానికి అలవాటుపడితే ఎలా? మొండిప్రాణం, దుక్కలాగా బాగానే ఉన్నాను గద, పని చేసుకోకేం" అంది తులసి.
"పోనిద్దూ. పాపా, నేనూ కలిసి చేస్తాంలే. నువ్వు పడుకో చెబితే వినవూ" అన్నాడు.
"ఇప్పుడు నాకేమయిందనీ. ప్రస్తుతం బాగానే ఉంది లెండి" అంది తులసి.
