Previous Page Next Page 
రంగులవల పేజి 10


    "ఐతే నువ్వు వినవన్నమాట. సరే అమ్మను ఇలానే పంపించేస్తాను. ఆవిడ గుడ్డిదైపోతే, మరేదైనా ఐతే అంతా నాకే వస్తుంది. అందరూ నన్నే తిడతారు. నిందిస్తారు. అప్పుడు సంతోషిద్ధువుగాని. నన్ను నేను అసహ్యించుకుంటుంటే చూసి నవ్వుకో. నీవంటి పతివ్రత లభించినందుకు నేను గర్విస్తున్నాను, తులసీ. నా ఖర్మానికి ఇలా నరకంలో ఉండక తప్పదు. అమ్మను ఇప్పుడే పంపిస్తాను..." అంటూ సీతాపతి లేచాడు. అతడు ఉద్రేకంతో వణికిపోతున్నాడు. దుఃఖంతో అతని కళ్ళలో నీళ్ళు నిండాయి. తులసికి అతణ్ణి చూస్తే జాలేసింది. కాని ఎంత? ఇంకో గంట. ఆమె నలా పంపించి రాగానే తను చూసుకుంటుంది.
    "అమ్మా, పద. నువ్విక్కడ ఉండకూడదు. ఇది నీకు తగిన ఇల్లు కాదు. ఇది ఆమె ఇల్లు. ఆమె, ఆమె చెల్లెలూ దీనికి అధికారులు. నేనేమీ కానమ్మా, పద" అన్నాడు సీతాపతి.
    తల్లి వచ్చింది. చీరకూడా సర్దుకుంది. తులసి అడగవద్దనుకుంటూనే అడిగింది, భోజనం చేసి వెడతారేమో నని.
    "ఇంక భోజనం కూడా ఎందు కీ పాపిష్టి కొంపలో. పద" అంటూ సీతాపతి తల్లిని బయటికి నడిపించాడు.
    తల్లి మళ్ళీ ఏదో మాట్లాడబోయింది. కాని సీతాపతి పడనివ్వలేదు.
    "పదమ్మా, ఇంక దాంతో మాట్లాడే దేమున్నది, పద."    
    రిక్షా తీసుకొని, తల్లిని రిక్షాలో కూర్చోబెట్టి, తను సైకిలు మీద బయల్దేరాడు. ఆమె కమలకు మాత్రం చెప్పగలిగింది, "నేను వెడుతున్నానమ్మా" అంటూ.
    మరో అరగంటలో తులసి కూడా తయారై పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి వచ్చింది. తాళంచెవి కమల కిచ్చి వెళ్ళినా, ఈలోగా సీతాపతి రానేలేదు.
    వచ్చి పాపకు అన్నం పెట్టింది. తను తినలేదు. పాప బలవంతం చేసినా ససేమిరా కాదంది.
    సాయంత్రం ఐంది. సీతాపతి రాలేదు. తులసి అలాగే పడుకొంది. వంట పాపే చేసింది. రెండుమూడు సార్లు లేపి చూసిందికాని తులసి లేవలేదు. మూలిగి అలాగే పడుకుంది. పాప ఆదుర్దా పడింది.
    "ఊరికే గొడవ చెయ్యక. పడుకో మీ బావగారు వస్తే అన్నం పెట్టు" అని చెప్పి పడుకుంది.
    కాసేపు చూసి పాప తినేసింది. పడుకుంది. ఎప్పుడో అర్ధరాత్రి వేళకు సీతాపతి తలుపు తట్టాడు తులసి మేల్కొంది. కాని లేవలేదు. పాప తలుపు తీసింది.
    "బావా, అన్నం తిందువు, పద" అంది.
    "వద్దు, నువ్వూ, మీ అక్కా తినండి" అన్నాడు సీతాపతి.
    "నేను తినేశానుగాని అక్క మధ్యాహ్నంనించీ అలానే పడుకుంది."
    "ఏం, ఎందుకు?" అన్నాడు. అతడు మాట్లాడదలుచుకోలేదు. కాని ఎలా?
    "హాస్పిటల్ కు వెళ్ళి వచ్చాం. అప్పుడే నీరసం వచ్చిందన్నది. రిక్షా దిగి రాగానే మంచంమీద పడుకుంది. అన్నం తినలేదు. కాఫీకూడా వద్దంది" అంది పాప.
    "మరి నన్నేం చెయ్యమంటావు? అన్నింటికీ నే నెక్కడ చచ్చేది" అన్నాడు సీతాపతి చిరాగ్గా.
    విధిలేక మంచంమీద కూర్చుంటూ, "ఎలా ఉంది ఒంట్లో" అన్నాడు.
    తులసి మాట్లాళ్ళేదు.
    "కాఫీకూడా తాగలేదట, ఏం?" అన్నాడు.
    తులసి మూలిగింది.
    "ఏమిటి, మళ్ళీ జ్వరమా?" అన్నాడు ఆత్రంగా తులసి శరీరం తడుముతూ.
    "బాగానే తగలడ్డానులెండి. వెళ్ళి భోజనం చేసి పడుకోండి" అంది నీరసంగా.
    సీతాపతి కదల్లేకపోయాడు. అనారోగ్యంగా ఉన్న మనుషులతో కోపంగా ఉండటం అతనికి తెలియదు.
    "తులసీ, నీ ఆరోగ్యం కూడా బాగుండలేదు. లే. లేచి పాలన్నా తాగి పడుకో. మరింత నీరసం వచ్చేస్తుంది, చూడు" అన్నాడు.
    తులసి పలకలేదు.
    "పాపా, పాలు వెచ్చబెట్టు" అన్నాడు సీతాపతి.
    "వద్దే, పాపా, ఇప్పుడేం వద్దు. నేను చావనులే, ఈ ఒక్కరాత్రికి పడుకో" అంది తులసి ముసుగులోంచే.
    సీతాపతి కేం చెయ్యాలో తోచలేదు.
    "తులసీ, చెబితే వినవేం? నేను చాలా తల్లకిందులై ఉన్నాను. అమ్మ లేదు. నువ్విలా ఉన్నావు. కోపంలో ఏదో అన్నాను. పట్టించుకోకు. నా కోపం నీకు మామూలేగా, లే" అన్నాడు.
    తులసి దుప్పటి విదిలించుకుని కూర్చుంది.
    ఆమె కళ్ళంట కన్నీళ్లు ధార కట్టాయి.
    "ఛీ, ఊరుకో" అన్నాడు సీతాపతి.
    రెండు చేతుల్తోనూ మొహం కప్పుకుని ఏడుస్తూ, "నన్ను చచ్చిపోనివ్వండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను" అంది.
    సీతాపతి ఆందోళనతో తులసిని కౌగిలించుకుని, "అలా మాట్లాడకు, తులసీ. నేను భరించలేను" అన్నాడు, ఆమె శరీరం చుట్టూ చేతులు బిగిస్తూ.

                                     9

    కమలవాళ్ళు ఆ క్రితంరోజే ఖాళీ చేసేశారు. వాళ్ళు వెళ్ళిపోయిం తర్వాత ఇంట్లో పెద్ద సంబరం పోయినట్టుగా తోచింది. తను మంచాన పడ్డ రెండు నెలల్లోనూ కమల తన కెంతో సాయం చేసింది. సీతాపతికి పరీక్షలు మరో పదిహేను రోజులు ఉన్నాయి. అతడు సెలవు తీసుకుని, గైడ్స్ కొనుక్కుని చదువులో నిమగ్నమైనాడు. తులసికికూడా ఒంట్లో మళ్ళీ సత్తువ వచ్చింది. డాక్టరు ప్రిస్క్రైబ్ చేసిన మాత్రలూ, టానిక్కులూ సీతాపతి తు.చ. తప్పకుండా కొనుక్కొచ్చాడు. ఈమధ్యన తమ ఖర్చు చాలా పెరిగి పోయింది. పాప టైప్ చురుగ్గా నేర్చుకుంటూంది. సీతాపతి మొదట తిట్టినా, విసుక్కొన్నా ఇప్పుడు మామూలు మనిషైనాడు. తనను ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. ఇంక మంచి రోజు చూసుకుని ఆఫీసులో జాయినవటానికి నిశ్చయించుకుంది.
    ఆ సాయంత్రం భర్త రాగానే, "ఏమండీ, ఈ సోమవారం నేను జాయినవుతున్నాను" అంది తులసి.
    "అప్పుడే ఏం తొందర మరి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో ఎందుకైనా మంచిది" అన్నాడు సీతాపతి.
    "బావుంది. రెన్నిల్లవవస్తున్నది. సెలవంతా ఐపోయి కూడా పదిహేను రోజులైంది. ఇంకెన్నాళ్ళు గడప మంటారు? వడ్డీ లేకుండా అప్పులెవరూ ఇవ్వటం లేదు గదా" అంది తులసి.
    "అవన్నీ ఇప్పుడెందుకుగాని, నువ్వు డాక్టరు సలహా తీసుకోకుండా ఏ పనీ చెయ్యకు, ఏం?" అన్నాడు సీతాపతి.
    "డాక్టరుకేం, మరో నాలుగు నెలలు పడుకొమ్మంటుంది. ఆవిడకేం పోతుందని అదిసరేగాని మీరు మరీ అంతగా రాత్రుళ్ళు నిద్రలు కాచి చదవకండి బాబూ, ఆరోగ్యం పాడవుతుంది" అంది తులసి.
    "సర్లే సంవత్సరమంతా పుస్తకాల మొహం చూళ్ళేదు. ఈ పది రోజులైనా కాస్త గట్టిగా కూర్చుంటే తప్ప, ఎలా పాసౌతాం" అన్నాడు సీతాపతి అన్నానికి కూర్చుంటూ.
    "అందికే నేను పోరేది, రోజూ చదువుకోవాలని" అంది తులసి చిరునవ్వు నవ్వుతూ.
    "చాల్లే.మీ చెల్లెలు మళ్ళీ సాయంత్రం పోతోందేం టైపుకు?" అన్నాడు సీతాపతి.
    "అది పొద్దున్నే లేవటం లేదు. ఆలస్యం ఔతోంది. పైగా, ఇప్పుడు దానికి బుద్దొచ్చింది లెండి. ఎలా మసలుకోవాలో ఇప్పుడిప్పుడే దానికి తెలిసొస్తున్నది" అంది తులసి.
    "ఓ కన్నేసి ఉంచు. ఎందుకైనా మంచిది" అన్నాడు సీతాపతి.
    "పొండీ, దాన్ని మనం అంతగా గమనిస్తున్నామని తెలిస్తే అది నిజంగా ఏదో చేస్తుంది" అంది తులసి. అదే విషయం ఇంకా ఎక్కడ సాగదీస్తాడోనని మాట మారుస్తూ, "ఏమండీ, కమల వాళ్ళ వాటాలోకి ఇంకా ఎవరూ రాలేదు. అద్దె పోతోంది" అంది.
    "రాలేదంటే, అది నీ తప్పు వచ్చినవాళ్ళకు ఇవ్వనంటావు. నీకు నచ్చినవాళ్ళు రారు" అన్నాడు సీతాపతి.
    "అవునండీ, బ్రహ్మచారులుంటే ఇల్లంతా పాడు చేస్తారు. ఒకసారి ఇచ్చిం తర్వాత బాధపడి ప్రయోజన మేమిటి?" అంది.
    "పోనీ, మా కాలేజీలో స్నేహితుడొకడున్నాడు. ప్రస్తుతం అతని భార్యను పుట్టింటికి పంపించాడు. అతడి కిల్లు కావాలిట, చెప్పేదా?" అన్నాడు.
    "చెప్పండి. కాని తెలిసినవాళ్ళతో మొహమాటా లొస్తాయండీ" అంది తులసి.
    "అన్నింటికీ అడ్డంకులు చెబుతావు. నీ ఉద్దేశ మేమిటి?" అన్నాడు సీతాపతి.
    "పోనీ, తీసుకురండి" అంది తులసి.
    పాప వచ్చింది.
    "అక్కా, దీపక్ లో సినిమా వెళ్ళిపోతోంది" అంది.
    "పోనీలే. మరోటి వచ్చినప్పుడు చూద్దాం" అంది తులసి.
    "అదేమిటి అలాగంటావు. అందరూ సినిమా వచ్చిన కొత్తలోనే చూస్తారు. నువ్వేమో పొదుపు అంటూ సినిమా బాగా పాతపడిందాకా పోనంటావు. ఇప్పుడదికూడా మానేస్తే పాప హృదయం ఎంత క్షోభిల్లిపోతోందో, పాపం!" అన్నాడు సీతాపతి.
    "అయ్యో, పాపం! మీరున్నారుగా ఒక్కగానొక్క బావగారు, మరదల్ని వెనకేసుకురావటానికి" అంది తులసి.
    "మరేమిటనుకున్నావు. నువ్వేమీ విచారించకు, పాపా, మనం రేపు వెడదాం" అన్నాడు సీతాపతి అన్నం ముగించి.
    తులసి మరింత తెచ్చింది వడ్డించటానికి.
    "ఊఁహూఁ. ఇంకేం వద్దు ఇప్పటికే ఎక్కువైంది" అన్నాడు సీతాపతి.
    "ఫరవాలేదు. ఇంతమాత్రం తినెయ్యగలరు" అంది పళ్ళెంలో వడ్డిస్తూ.
    "లాభంలేదు" అన్నాడు సీతాపతి.
    "బెట్టు చాలించి తినండి" అంది తులసి.
    "తులసీ, మీ ఆడవాళ్ళంతా ఇంతే. మొదట వద్దంటూ సిగ్గుపడే మొగుడికి 'కొంచెం, కొంచెం' అంటూ వడ్డిస్తారు. తినబెడతారు. ఏవో టిఫిన్లూ, స్వీట్లూ చేస్తారు. అలా తినబెట్టి, వాణ్ణి లావెక్కించి, తర్వాత అసహ్యంగా తయారైనానే అని వాడేడుస్తుంటే మీరు వాడిమీద సవారీ చేస్తారు. వాడి పిలక పట్టుకుని ఆడిస్తారు. అంతేనా?" అన్నాడు సీతాపతి.
    "మీ సరసం బాగుందే. నే నెప్పుడూ అలా చెయ్యలేదు, మీరు లావెక్కనూ లేదు. వద్దంటే మానేస్తాను. రేపటినించి టిఫిన్లూ చెయ్యను, మారడగను" అంది తులసి.
    "ఊరికే అన్నానోయ్, అలా మొహం మాడ్చుకుంటా వేం" అన్నాడు సీతాపతి.
    "ఏమిటో బాబూ, అన్నీ మీకే చెల్లును. అంతకే కోపాలు, అంతలోనే సరసాలు" అంది తులసి.
    "సరే. ఇంక మీ అక్కాచెల్లెళ్ళు తినండి. నేను చూస్తూ కూర్చుంటాను" అన్నాడు సీతాపతి.
    "ఫో, బావా, నువ్విక్కడ కూర్చుంటే నేను తిననే తినను" అంది పాప.
    "సరే, అదీ చూస్తానుగా" అన్నాడు సీతాపతి అక్కడే కుర్చీమీద కూర్చుంటూ.
    పాప తినటం మానెయ్యలేదు. పళ్ళెంలో తులసి అన్నం వడ్డించినా, కూర్చోకుండా కాసేపు నిలబడింది. కాని తులసి "ఊఁ, కూర్చో" అనటంతోనే కూర్చుంది, సీతాపతివైపు కోపంగా చూస్తూ.
    సీతాపతి నవ్వేడు.
    రెండు నిముషాలు ఊరుకుని, "పరీక్షలు ఉన్నాయని రాత్రుళ్ళు మేలుకుంటారు. మరి ఇప్పుడు టైం వృథా చెయ్యటమెందుకు, వెళ్ళి చదువుకోండి" అంది తులసి.
    "అబ్బబ్బ! నీ పొరు పడలేకుండా ఉన్నాను" అన్నాడు సీతాపతి లేస్తూ.
    పాప నవ్వింది.
    "నీ పరీక్షలు మళ్ళీ ఎప్పుడుంటాయక్కా?" అంది.
    తులసి మాట్లాడకుండా అన్నం కలిపింది.
    "డిసెంబరులో కదూ, అంతే" అంది పాప.
    "తిను, తిను" అంది తులసి.
    
                              *    *    *

    సీతాపతి తన క్లాస్ మేట్ గోవిందరావును తెచ్చాడు వాటాలోకి.
    ఆ సోమవారమే సీతాపతికి ఇష్టం లేకపోయినా ఆఫీసులో జాయినయింది తులసి. ఇప్పుడు తనొక్కత్తే అయింది ఆఫీసులో. పెళ్ళి చేసుకుని ఉద్యోగం మానేసింది నందిని.
    సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి వీళ్ళింట్లోనే భర్తా, గోవిందరావూ కూర్చునిఉన్నారు. తన రాక చూసి గోవిందరావు వెళ్ళిపోయాడు.
    "తులసీ, అన్నయ్య దగ్గిర్నించి ఉత్తరం వచ్చింది" అన్నాడు సీతాపతి.
    "ఏమంటున్నారు?" అంది తులసి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS