"పోనీలే రామచంద్రం జ్ఞాపకాలతో ఆ మచ్చ మిగిలి ఉంటుంది అవునా?'మృదువుగా మచ్చని తాకుతూ అన్నాడు బలరాం.
"మచ్చ లేకపోయినా నేను మామ్మయ్య ని మరిచిపోలేను బలరాం గారూ, నిరుత్సాహం నన్ను ముంచెత్తినప్పుడు -- మమయ్యేస్తే బాగుండును, అనుకుంటాను. ఇప్పటికి ,' కళ్ళలో నీటి పొర తేలింది లలితకి. ఎదురుగా ఉన్న బలరాం మసగగా కన్పించాడు. అతని కళ్ళు నక్షత్రాల్లాగా వెల్గుతున్నాయి.
'అప్పుడు నిజంగా రామచంద్రం అదృష్ట వంతుడు లలితా, నాకతనంటే జెలసీ రాకుండా చూసుకోవాలిప్పుడు."
"మీకేం మీ అన్నీ ఉన్నాయి . అదృష్టవంతులు.' అంది లలిత నవ్వేస్తూ.
"అవును ఒక్క హృదయం యిచ్చి నన్ను నాకై కోరేవాళ్ళు తప్ప' అన్నాడు.
"సారీ బలరాం గారూ, నేనలా అని అనలేదు.' తడబడింది లలిత.
"నోనో, నువ్వన్నా నన్నానా.'
ఆ క్షణం లో కవచం తొలగిన వీరుడి లాగా తోచాడు బలరాం. చేయి చాపి మృదువుగా అతని చేయి తాకింది ఓదార్పుగా.
'రా, మొక్కలు చూసి లోపలికి వెడదాం.'
'సరే పదండి.' అంది లలిత.
'అదిగో అండీలు వద్దు. నన్ను నీకు కావలసినవాడిని అనుకోకపోతే అలా అంటావని భావిస్తాను. బలరాం అను చాలు.' అన్నాడు.
'పదండి బలరాం' అంది నవ్వుతూ.
'అదిగో...' దుడుకుగా వెనక్కి తిరిగాడు బలరాం కాలు సన్నని గట్టు, మీదనుంచి జారి వెనక్కి పడబోయాడు. ఆత్రంగా చేయి అందించింది లలిత. నిలదొక్కుకున్నాడు.
'పద బలరాం . చీకట్లు కమ్ముకు వస్తున్నాయి. చెట్లున్న చోట చీకటి త్వరగా వచ్చినట్టు ఉంటుంది కదూ?' అంది లలిత. అతనికి చేయి అందించి నందుకు - హటాత్తుగా సిగ్గేసింది లలితకి ...కాని అదేమంత గుర్తిన్చినట్టే లేడు అతను.
'ఈ రోజెస్ పెంచడం చాలా కష్టం చూశావా? ఈ ఎల్లోవి , పూస్తే చాలా అందంగా ఉంటుంది -- బంగారపు పువ్వుకి సువాసన ఉన్నట్టుంది.
"మీకు పసుపురంగు ఇష్టమా?'
"ఎరుపు రంగు కూడా!' అన్నాడు బలరాం -- అప్పుడే సగం విచ్చిన యెర్రని గులాబి మొగ్గని చూపిస్తూ.
'ఆంధ్రులకి ఎరుపూ తెలుపూ కూడా ఇష్టం అంటారు... నేను తెల్లని చీరలు కడితే నా ఆరవ ఫ్రెండ్స్ వేళాకోళం చేసేవారు-- ఆంధ్రా అని' అంది.
'తెలుగు వనిత ఎర్రని నేత చీరలో ఎంత హుందాగా ఉంటుందో వాళ్ళకేం తెలుసు?' అంటూ చేతిలి అంటిన మట్టి దులుపుకుని.... నిటారుగా నిలాబడ్డాడు.
"సరళ కి స్నేహితులకి కొదువ లేదు. ఆమె అడ్డమైన వాళ్ళని చేర తీస్తుంది. పార్టీ లిస్తుంది. పార్తీలంటూ వెడుతుంది. మీ ఇద్దరూ ఒక వయసు వాళ్ళు కనుక స్నేహంగా ఉండొచ్చు. కాని ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకుంటావని చెప్తున్నాను. సరళ స్నేహితులంతా నా యిష్టులని నువ్వు అనుకోకు. అదే నాక్కావలసింది....' అన్నాడు.
"అలాంటి వాళ్ళంతా ఇటు ఎలా వస్తారు?' భయంగా అడిగింది లలిత "నీకు ప్రపంచం తెలియదు. అందుకే సంరక్షకుడుండలన్నారు.' నవ్వేసి ఇంటి వెనక వైపు తోటలోకి దారితీశాడు బలరాం.
అతని మాటలు అర్ధం కాక అతని వెనకనే నడవడం ప్రారంభించింది.
'మీ మంతనాలయ్యాయనుకుంటాను!' అన్నమాట విని ఉలిక్కిపడి తలెత్తింది లలిత.
పిట్ట గోడ మీద వయ్యారంగా కూర్చుంది సరళ. పుస్తకం ఒళ్లో ఉంది.
'అయాయి. ఏం పనుందా?' అడిగాడు బలరాం.
"లేదనుకో. అయినా ఇంత ఇల్లుండగా తోటలోనూ, నీ రోజెస్ దగ్గిరా ఏం మంతనాలు బలరాం -- నే ఊహించవచ్చా?' కొంటెగా అడిగింది.
"షటప్' అంటూ గబగబా వెనక మెట్లెక్కి ముందికి సాగాడు బలరాం.
'మొక్కలు చూద్దాం అని నేనూ దిగాను. ఆయనా వస్తున్నారు. సరే కదా అని ఇద్దరం కలిసి చూశాం.' వివరించింది లలిత.
'అంతేనా? నీ కంట్లో నలుసేదైనా పడిందేమో తీవ్రంగా చూస్తున్నాడనుకున్నాను.'
గడచిపోయిన ఆ దృశ్యం తలచుకుని లలిత ఒళ్లు పులకరించింది ...సరళ చూసిందన్న మాట. తన చేయి బలరాం అందుకోడం, బలరాం జారి పొతే తను చేయి అందించడం అన్నీ చూసి ఉంటుందన్న మాట. మూగగా నిలిచిపోయిన లలితని చూసి , 'ఏం కంట్లో ఏం పడలేదా?' రెట్టించింది సరళ.
'లేదు, నా చెంప మీది మచ్చ చూస్తున్నారంతే' ధైర్యంగా ముఖం పెట్టి అంది లలిత 'అదా, పాపం బలరాం, చంద్రునికి మచ్చ ఉండగా లేంది ఈ లలిత కుంటే ఏం బలరాం .' అంది అక్కడ లేని బలరాం ని ఉద్దేశించి.
లలిత ఒళ్ళు మండింది.
"మీరెప్పుడూ ఇలా వ్యంగ్యంగానే మాట్లాడుతారా?'
"వ్యంగ్యమా? పచ్చి నిజం అయితేనూ.... నువ్వే పది పన్నెండేళ్ళ దాని వో వెంటపడి ప్రాణాలు తీస్తారు కాబోలు అనుకున్నాడు బలరాం. ఫరవాలేదు -- లే-- నే చూస్తె. అమ్మ చూస్తేనే బాగుండదు.' అంది అక్కడికి లలిత ఏదో కూడని పని చేసినట్టు.
సమాధానం చెప్పకుండా లలిత మేడ మెట్ల వైపు పరుగెత్తింది. ఇదేం మనుషులు? పట్నం లో మనుషులు లేక ఒంటరి తనం, ఇక్కడ ఉండీ ఒంటరితనం తనకి తప్పదా? అని బాధపడుతూ లైటేనా వేసుకోకుండా మంచం మీద పడుకుంది.
"అదేమీటమ్మాయిగారూ దీపం పెట్టుకోలేదు." అంటూ రత్తి వచ్చింది.
"రత్తీ నేను నిడురపోతాను. నన్ను భోజనానికి కూడా లేపోద్దను." అంది.
"అయితే ఓ క్షణం ఉండండి. ఓ గ్లాసు పాలు తెస్తాను. తాగి పడుకోండి.' అంటూ కిందికి పరుగెత్తింది. కొంచెం సేపటికి వంటావిడ వచ్చారు పాల గ్లాసుతో.
'అదే మంచిదమ్మాయి , అడపా దడపా ఇలా ఉంటేనే నయం. సుష్టుగా భోజనాలు చేసి కూర్చుంటే -- ఇదిగో నాలాగే తయారవుతావు' అంటూ నవ్వి పాల గ్లాసు ఖాళీ ది పట్టుకుని వెళ్ళిపోయారు.
లలిత అలాగే నిద్రపోయింది. నిద్రలో ఆమె మనసు బలరాం కీ, మోహన్ కి మామయ్యా కి మధ్య ఊయేలలూగింది......
5
గేటులోంచి దూసుకుని కారుని పోర్టికో లో ఆపింది లలిత. ఉత్సాహంతో ఆమె మనస్సు ఉరకలు వేస్తుంది. జుట్టు ఎగరకుండా కట్టిన స్కార్ఫ్ ఒక్క లాగుతో విప్పేసింది-- కందిన చెంపలు ఎర్రగా ఉన్నాయి. నుదుటి మీద చిరు చెమటలు మెరుస్తున్నాయి. నుడుము చుట్టూ దోపిన పైట కొంగు విప్పి నుదురు అద్దుకుంది-- చేతిలో రేగిన ముంగురులు వత్తుకుంది. రెండేసి మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వచ్చి పడింది. మూడు నాలుగు వారాలుగా నేర్చుకుంటుంది కారు తోలడం. ఈ రోజే తొలిసారిగా పక్కన సుబ్బారావు గారు లేకుండా జుంయ్ మని నాలుగు ఫర్లాంగులు తోలి గేటు లోంచి ఇంట్లోకి తెచ్చింది కారుని! కాళ్ళూ చేతులు సణక్కుండా కారుని ముందూ వెనుకలు దేనికీ గుద్దించకుండా రాగలిగింది. అదే లలిత ఉత్సాహానికి కారణం.
'బలరాం మెట్ల పైన నిలబడి ఉండి ఉంటె ఎంత బాగుండును.' అనుకుంది తనంత హుందాగా కారు తీసుకొచ్చి నిలబెట్టడం అతను చూసి ఉండవలసింది. సరస్వతమ్మ గారూ, సరళా కూడా చూసి ఉంటె ఎంత బాగుండును. వాళ్ళెవరూ తను రావడం చూడక పోవడంతో లలితలో ఉత్సాహం కొంత తగ్గిపోయింది. అద్దంలో తన ముఖం చూసి సన్నగా నవ్వుకుంది. కాని మరు క్షణం లోనే ఆనవ్వు నిట్టుర్పుగా మారిపోయింది.
తనిక్కడికి వచ్చి అప్పుడే ఆరు వారాలు దాటిపోయిందంటే ఆశ్చర్యం ఉంది లలితకి. ఒక్కొక్కప్పుడు -- ఇంకా చాలా ఎక్కువ రోజులే అయిపోయినట్టు అనిపించేది లలితకి -- అత్తయ్య దగ్గిర ఉన్న రోజలు, ఆ కట్టడాలూ, ఒత్తిడిలూ లేకపోవడమే -- ఆ కాలం అంత దూరం లోకి వెళ్ళిపోడానికి కారణం.... ఆ ఆరేడు వారాల లోనే -- తనకి భవిష్యత్తు కేసే గాని భూతం లోకి చూడాలనే అనిపించలేదు ....ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నా కూడా అదంతా అందమైన పొరల మాటు నుంచి చూస్తున్నట్టుగా ఉంది లలితకి. పాత జీవితంలో ఒకే ఒక సంగతి బాగా మనసులో నిలచి పోయింది లలితకి. ఇదివరకంత బాధ పెట్టకపోయినా మోహన్ జ్ఞాపకం వచ్చినప్పుడు -- మనస్సు నెప్పి పెడుతోంది. అయినా మోహన్ తో తన స్నేహం బలీయంగా పాతుకు పోనందుకు మనస్సులో ఓ మూల సంతోషంగా ఉంది.... అదే జరిగి ఉండి తను మొండిగా పెళ్లి చేసుకుని ఉంటె ? అన్న ఊహ వచ్చినా భయం వేసింది లలితకి. పెళ్ళిమాట ఎత్తక ముందే తన కింత ఆస్తి పాస్తులు వస్తాయని తెలిస్తే మోహన్ అసలు గుణం ఎప్పటికి తను గ్రహించి ఉండేది కాదు. తీరా పెళ్ళయాక , తనని తన కోసం కాక డబ్బు కోసం పెళ్ళాడాడని తెలిస్తే? అమ్మయ్యో ఇంకేమేనా ఉందా -- తన గుండె పగిలి ఉండేది -- అతగాణ్ణి అంత నిండుగా తోలి ప్రేమ నుండీ ఆదర్శాలన్నితితోటీ , ఆవేశం తోటీ వలచింది. అందుకే ఇప్పుడు అలా జరగడమే మంచిదయింది అనిపించింది లలితకు. అది ప్రేమో, మోహావేశమో తెలిసేది కాదు---- అప్పుడు........ఇప్పుడు హటాత్తుగా మోహన్ ఎదురైతే ? తన ఊహలు ఎలా ఉంటాయా అని ఊహించి చూసింది. అప్పటి లలిత లాగా ఈ లలిత గుడ్డిగా గ్రీకు దైవం లాగా అందమైన విగ్రహం చూసి మూగవోదు...ఈనాటి లలితకి లోకజ్ఞానం ఉదయిస్తుంది. మనుష్యులలో తిరగడం , వారి ప్రవర్తనలని పరిశీలించడం , వారు ఎలాంటి వారో గ్రహించడం లాంటివి తెలుస్తున్నాయి. పూర్వం ఈ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు అత్తయ్య. అప్పుడు తనకి తెలిసిన ముఖాలన్నీ అత్తయ్య స్నేహితులే. చుట్టాలే. ముసలివాళ్ళు. ఈ ప్రపంచపు పోకడలకి అట్టే విలువ నియ్యని వాళ్ళు. అందుకే పోల్చి చూసే అవకాశాలు ఎప్పుడూ కలగలేదు లలితకి. అందుకే మోహన్ తనని మోసగించ కల్గాడు -- తీయని మాటలతోనూ, అతి హృద్యమం అయిన ప్రవర్తనతోనూ -- అనుకుంది. మోహన్ గురించి ఆలోచిస్తుంటే లలిత ఊహలు , బలరాం మీదికి మళ్ళాయి. గత మాసంన్నరగా ఇతని వంచన కాలం గడుపుతూ కూడా స్వేచ్చ లేదని అనుకోలేదు. వస్తూనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించిన మాట వాస్తవమే. కాని అలా చేయడానికి కారణాలు కనిపించలేదు. అటువంటి కారణాలకి బలరాం ప్రవర్తన గాని అధికారం గాని ఎప్పుడూ అవకాశం కల్పించ లేదు బాలరాం చాలా విశాల స్వభావం కలవాడని కొద్ది రోజులలోనే గ్రహించింది లలిత. 'నీ యిష్టం వచ్చినట్టు ఉండు. కాని మీ మామయ్య కి నాకూ ఉన్న స్నేహం మరిచి, మీ అత్తయ్య నాపై ఉంచిన నమ్మిక మరచి మాత్రం ఎప్పుడూ ప్రవర్తించకు' అన్నాడొకసారి. అంతే మళ్ళీ ఎప్పుడూ ఏ ప్రస్తావనా తేలేదు. లలిత కూడా అతని చుట్టూ తిరక్క స్వంతంగా బ్రతకడం ప్రారంభించింది --- అతను బాక్ గ్రౌండ్ లో ఉన్నాడని కొండంత ధైర్యం వచ్చింది లలితకు.
