రెండు రోజులై బలరాం ఊళ్ళో లేడు -- ఇల్లు చిన్నబోయినట్టు అనిపించింది అతను లేకుంటే, యజమాని ఇంట్లో లేకుంటే సరస్వతమ్మ గొంతు పెరుగుతుంది. అధారిటీ వెలిగిస్తుందని యిట్టే గ్రహించింది. ఇదొక తరహ కాబోలు -- అని సర్దుకుంది.
సుబ్బారావు గారు బలరాం కి చాలా కావలసిన వారు కాబోలు. మిలటరీ లోంచి రిటైరైన ఆఫీసరు. ఆ అధారిటీ హుందాతనం మొక్క పోక నిలిచాయి ఆయనలో. లలితకి డ్రైవింగ్ నేర్పమని ఆయన్ని అడిగాడు బలరాం. సరస్వతమ్మ వద్దని ఎంతో చెప్పింది. పరాయి పిల్లకి ఏ కలో చెయ్యో విరిగితే పరువు పోతుంది అంది.
"లలిత పరాయిదేమిటి? ఎవరేనా వింటే నవ్వుతారు. సరళ కారు తోలుకోవడం లేదూ-- అవసరం వస్తే . అలాగే లలితా.' అన్నాడు బలరాం.

ఆవిడగారికి లలితనీ, సరళనీ సమాన ష్టాయిలో చూడ్డం ఎలా ఇష్టం ఉంటుంది?
'సరళ సంగతి వేరు. అది యీ యింటిదని మనవాళ్ళ కెవరికి తెలియనిది బలరాం!' అంది నవ్వుతూ.
'లలిత అంతకంటే నత్తయ్యా' అంటూ అక్కడితో ఆ సంభాషణ అంతం చేశాడు బలరాం.
ఆ మాటలీనాడు లలిత చెవుల్లో స్పష్టంగా వినబడుతున్నాయి. అందుకే సరస్వతమ్మ చూస్తె బాగుండును! సరళ చూస్తె బాగుండును అనుకుంది. బలరాం చూస్తె బాగుండును -- అనుకుంది లలిత. ఆరోజు అతని పట్టుదల చూసి చాకితురాలైంది లలిత. 'పట్టితే మొండి పట్టే . ఈ వ్యక్తితో వాదించలెం' అనుకుంది. అదేమిటో మొండివాడు, తన యిష్టమే చెల్లాలనుకునేవాడూ అయినా అతని పట్ల లలిత మనస్సు విముఖత చూపడం లేదు.
ఆ రోజు నుంచీ కూడా సరస్వతమ్మ గారు లలితతో కొంచెం ముభావంగానే ఉంటున్నారు. బలరాం ఊళ్ళో లేకపోతె ఆ తల్లీ కూతుళ్ళ కీ ఓ క్షణం ఇంట్లో కాలు నిలువదని గ్రహించింది లలిత. చుట్టూ పక్కల చాలామంది తెలిసిన కుటుంబాలున్నాయి. అప్పుడూ అప్పుడూ సరళ తో పాటు వాళ్ళ పిల్లలూ వస్తుంటారు. కాని ఎవరితోటీ అతిగా మాట్లాడే అలవాటు కాలేదు లలితకి. వాళ్ళ వేష భాషలామేని అదర కొట్టేయి. సరళ స్నేహితులలో చాలా మటుకు తెలుగు రాని వాళ్ళే ఎక్కువేమో అనిపించింది లలితకి. ఒకటే 'ఓ, 'అ' లతో వారి ఇంగ్లీష్ , 'హాయ్ ' అంటూ వారి పలకరింపులు గమ్మత్తుగా తోచాయి లలితకి. ఒంటరిగా గడపటం అలవాటైన లలితకి కారు తోలడం నేర్చుకోవడం, పుస్తకాలు తిరగేయడం, చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతి లో లీనమై పోయి హాయిగా కాలం గడపడం ఎంతో బాగుంది. ఇంకా ఓపిక ఉంటె రత్తి ని వెంట పెట్టుకుని కొంచెం దూరాలలో కన్పించే చేల వెంట, ఇంకా దూరం దూరంగా పోయే కొండల దగ్గిరికీ నడవాలని ప్రయత్నించేది. అత్తయ్య ఉన్నప్పుడుండే స్తబ్ధత గాని, మోహన్ తెలిసాక కల్గిన ఉద్వేగం హడావిడి గాని లలిత కిప్పుడు కన్పించడం లేదు. కొత్తగా రెక్కలు వచ్చినట్టు ప్రమాదాలు రాకుండా కాపాడే వారోకరున్నట్టు ధైర్యంగా ఉంది. ఆ ధైర్యమే లలిత చెంపల్లో కేంపులని పూయించింది, రెండు నెలలు యీ ప్రకృతి పరిశీలన లలితలో కొత్త వెల్గు నింపింది.
సరస్వతమ్మ గారి కంటే కూడా లలితంటే అసలు పడనిది సరళ. యీ సంగతి సులభంగానే గ్రహించింది లలిత. లలిత ఉనికిని గుర్తించినా గుర్తించనట్టు మసలేది . చూసీ చూడనట్టు ఊరుకునేది. తన స్నేహితులకి లలితని పరిచయం చేయాలని ప్రయత్నం కూడా చేయలేదు సరళ. తన వయసు స్నేహితురాలుంటే చాలా ఉల్లాసంగా ఉంటుందనే అనుకునేది లలిత. కాని సరళ అందుకే మాత్రం సుముఖం కాదని గ్రహించేక స్నేహంగా ఉండాలన్నా ప్రయోజనం ఉండదని నిర్ణయించుకుంది.
వాలుజడ విప్పు దువ్వుకోవడం ప్రారంభించిన లలిత కి కిందకి వెళ్ళాలంటే అంత యిష్టంగానే లేదు. బలరాం లేడు. ఇల్లంతా బోసిగా నిశ్శబ్దంగా ఉన్నట్టుంది , నన్నెందుకీ వంటరితనం పీడిస్తుంది? అని ఆశ్చర్య పడింది లలిత. జుట్టు వదులుగా అల్లుకుని ముఖం నీళ్ళతో కడుక్కుంది. కళ్ళు చల్లగా అయ్యాయి నుదుట కుంకుమ పెట్టుకుని -- తన ఊహ లోకానికి ఒక్కొక్క మెట్టే దిగడం ప్రారంభించిన లలిత బూటు చప్పుడు విని తలెత్తింది-- ఎదుట కింది మెట్టు మీద కాలేసి నిలబడి ఉన్నాడు బలరాం.
"ఓ బలరాం , వచ్చేశావా?' అంటూ గబగబా క్రిందికి దిగింది -- చేయి ముందుకు చాపుతూ.
ఆ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె ముఖం లోకి చూసి నవ్వాడు బలరాం.
'హల్లో -- వచ్చేశాను మళ్ళీ' అన్నాడు.
తన తొందర పాటుకీ ఆత్రానికి సిగ్గుపడింది లలిత చేయి తీసేసుకుని తల వంచింది. అయినా కూడా ఆమెలో చెలరేగిన ఉత్సాహం అణగిపోలేదు. గుండె గబగబా కొట్టుకుంది. 'ఈరోజే వస్తావని తెలియలేదు నాకు' అంది నెమ్మదిగా ... అంతే ఉత్సాహం ఉరకలు వేస్తుంటే చెప్పేసింది.
'ఇదో రెడ్ లెటర్ డే బలరాం, నేను దేనికి కొట్టించకుండా కారు ఓ అరమైలు తోలాను. ఇంట్లోకి తీసుకొచ్చి పోర్టికో లో ఆపాను. నువ్వుంటేనా? ' అంది 'సుబ్బారావు గారు ఎంతో ఆనందపడి పోయారు. నేనింక ధైర్యంగా కారు తోలోచ్చునని సర్టిఫికేట్ ఇచ్చేశారు' అంది.
'అయితే కారు కొనాలి, అవునా!'
ఉత్సాహాన్ని అణచుకోలేని తన పసితనానికి సిగ్గు పడింది లలిత.
ఎందుకంత ఉత్సాహ పడిందో అతని రాకని చూసి వివరించి చెప్పినా, బలరాం ఆమె కనబరిచిన ఆనందాన్ని మరిచిపోలేక పోయాడు.... హల్లో ముందు కుర్చీలో కూర్చున్నా కూడా అతని ఊహలు యీ వయసు కత్తే మనసుని అర్ధ చేసుకోవడం ఎలాగన్న ధోరణి లోనే ఉన్నాయి. ఆమె చేతి స్పర్శ యింకా అతని అరచేయిని వదిలినట్టు అనిపించలేదు. ఈ అమ్మాయి రాకముందీ ఇల్లు ఇలా ఉత్సాహంగా ఉండేదా? జ్ఞాపకం రాలేదు బలరాం కి. సుబ్బమ్మ గారి పెంపకమే మంచిదనిపించింది -- చుట్టూ ప్రపంచంతో తిరిగి తిరిగి మొరటు తేలిన సరళ ధోరణి కి ఈ లలిత ధోరణి కి ఎంతో తేడా కన్పించింది....
'మీరు వెళ్ళినపని జరిగిందా?' ఏదో అనాలి కనుక అడిగింది లలిత.
'మీరా?' అంటూ నవ్వాడు బలరాం. 'నేను ముసలి వాణ్ణి అయిపోతున్నాను. ఇల్లు వదిలి ఎటైనా వెళ్ళాలన్నా , అందరినీ కలుసుకోవాలన్న విసుగ్గా ఉంటుంది. కానీ భూమి పుట్రా చూడకపోతే పెరగవు. అలాగే వ్యాపారాలూను. ఏం చెయ్యను చెప్పు?.... ఇల్లు కన్పించాక అమ్మయ్య! అనిపించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటె ఎవరూ లేరనే అనుకున్నాను. కాని రత్తి చెప్పింది -- నువ్వున్నావని.' అన్నాడు బలరాం. వంటావిడ కాలు బెణికింది. రత్తే కాఫీ కప్పులు పట్టుకు వచ్చింది వణుకుతున్న చేతులతో.
'పోనీ చాలా నమ్మకస్తులైన ఎవరికైనా కొంత పని అప్పగిస్తే సరి...' అంటు ఏదో సూచించబోతూ కారాగిన చప్పుడు విని ఆగింది లలిత.
'నువ్వు వచ్చేశావా బలరాం. ఈరోజు వస్తావనుకోలేదు.' అంటూ సరస్వతమ్మ గారు లోపలికి వచ్చారు.
'హాయ్ బలరాం హౌ నైస్?' అంటూ అమాంతం వచ్చి బలరాం కూర్చున్న కుర్చీ చేతి మీద వచ్చి కూర్చుంది సరళ.
'వెళ్ళిన పనులన్నీ సవ్యంగా జరిగిపోయాయా?" అంటూ గర్వంగా కూతురి కేసి చూసింది సరస్వతమ్మ.
'నేను ముసలాడ్నయి పోతున్నాననే యిప్పుడే లలితకీ చెప్తున్నాను. రిటైరైపోవాలింక!' నవ్వుతూ అన్నాడు బలరాం.
"ఎవరేనా వింటే నవ్వుతారు' అంది లలిత సరదాగా.
'ఇదిగో తల్లో పండు వెంట్రుకలు కన్పిస్తుంటేనే' అంటూ అతని క్రాపు సరిచేసింది సరళ.
'నే వెళ్ళాక సరళ తో స్నేహం ఎక్కువైందా లలితా? సరళ లా తయారయ్యావంటే ఈ జన్మకి పెళ్లి కాదు నీకు' అన్నాడు కాఫీ తాగుతూ బలరాం.
'నేనేం చేయలేదు. సుబ్బారావు గారితో గడపాను. కాలం అంతా----డ్రైవింగ్ నేర్చుకుంటూ ' అంది. ఎంత వద్దనుకున్నా అతనలా అంటే చచ్చేసిగ్గు ముంచు కొస్తుంది లలితకి. కాని అతని ముఖంలోకి చూడకుండా ఉండలేదు.
