Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 8


    'ఇటు మెట్లు లేవని తెలియదు- గోడ ఎట్టులేదు కదా?' అంటూ తేలికగా నవ్వేసింది లలిత.
    "తోట చూస్తారా? రండి. దీనిలో నా భాగం ఒటుంది ప్రత్యేకంగా' అంటూ దారి తీశాడు బలరాం.
    'అన్నీ గులాబి చెట్లే. వరసలుగా నాటి ఉన్నాయి. కొన్ని మరీ చిన్నవి. కొన్నిటికి ఆకులే లేవు. కొన్ని మటుకు మొగ్గ తొడిగాయి. కొన్నిటికి ఒకటీ అరా పూత ఉంది.
    నాకిది హాబీ , సరదాగా రకరకాలుగా పెంచుతాను. రోజ్ పెంచడం కష్టం. మీకు తెలుసా?'
    "పట్నాల్లో మేడమీద వాటాలో ఉండే మాలాంటి వాళ్ళం కర్ర తోట్టేల్లోనూ పూల కుండీల లోనూ తప్పించి మొక్కలని చూడండి శాస్త్రిగారూ.' అంది లలిత.
    'అదిగో మళ్ళీ . బలరాం అని పిలవమన్నానుగా?'
    'నాకింకా అలవాటు కాలేదు....' అతని ముఖం లోకి చూస్తూ ఊరుకుంది లలిత. అతనూ తననే పరీక్షగా చూడడం గమనించింది. 'ఈ సన్నగా నాజూకుగా పొడుగ్గా ఉన్న అమ్మాయికీ ఆ రెండు జడల పిల్లకీ పోలికలే లేవు. ఉంగరాలు తిరిగి ముఖం మీద పడుతున్న ఆ జుట్టే నా -- యీ సుదీర్ఘమైన వాలుజడ ?' ఆ బొమ్మే ఉండిపోయిందేం నా మనస్సులో? -- పాపం తనకీ ఇబ్బందిగానే ఉన్నట్టుంది -- ఎలాగా? చిన్న పిల్ల! అందుకే మాటలకి, సహితం తడువుకుంటుంది , అనుకున్నాడు. ఎందుకొచ్చిన బెడద ! ....' రామచంద్రరావు ఏం పని చేశాడు భగవంతుడా , సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్ట పెట్టుకోడానికి కాకుంటే యీ బాధ్యత తానెలా స్వీకరించాడు?' తన ఆలోచనలలో పది కన్నార్పకుండా లలిత కేసే చూస్తున్న సంగతి గమనించనే లేదు బలరాం.
    "బలరం గారూ' ఒణుకుతూన్న కంఠంతో అంది లలిత. 'మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఈ సదవకాశం జారితే మళ్ళీ ఏకాంతంగా మీరు దొరక్కపోవచ్చు. నేను వాళ్ళందరి ముందూ ధైర్యంగా మాట్లాడలేకనూ పోవచ్చు.' బలరాం బదులుగా తలూపాడు.
    'నా బెడద అనవసరంగా వచ్చి పడింది మీకు. నిజానికిలా జరగనే అక్కరలేదు. అంతా అత్తయ్య చాదస్తం. లాయరు గారి మంకు పట్టూనూ....నేనిక్కడే ఉండాలని రూలు లేదుగా.'
    ఆత్రుతలో మాటలు వడివడిగా వచ్చేస్తున్నాయి.
    బలరాం కళ్ళు వింతగా మెరిశాయి.
    'అలాగా> పోనీ దీనికింకో దారేమైనా ఉందేమో ఆలోచించారా?'
    బదులు తోచక ఓ క్షణం తటపటాయించింది -- ఆ సూటి ప్రశ్నకి. మాటలకి కరువైనట్టు గొంతుక పోడారి పోయింది. కష్టం మీద కూడదీసుకుని అంది----
    'నేనింకా అదేం ఆలోచించలేదు గాని .....' ఆగింది.
    'పోనీ ఈ ఇల్లంటే ఎందుకంత అయిష్టం కల్గిందో-- అదేనా చెప్తారా?'
    'అదేం లేదండీ, ఇంత అందమైన ఇల్లు నేనెక్కడా చూడలేదు. ఇది చూడగానే నాలో కొత్త ప్రపంచం లోకి అడుగెట్టా ననిపించింది ..కాని....' మాటలు రాలేదు సరికదా కళ్ళు నీళ్ళతో నిండాయి లలితకి. పెదవులు బిగపట్టి దుఃఖాన్ని అపుకోంది. కాని నిండిన కన్నీరు చెంపల మీద నుంచి కారసాగింది. చిన్న పిల్లలాగా చేతితో చెంపలు తుడిచేసుకుంటున్న లలితని ఆదరంగా చూశాడు బలరాం.
    "మరెందు కలా వెళ్ళిపోవాలని కోరుకున్నారో నా కర్ధం కావడం లేదు."
    "మామయ్య నేనిక్కడే ఉండాలని ఎందుకన్నాడో అర్ధం కావడం లేదు. ఎప్పటికీ ఇక్కడే ఉండాలా? అయినా ఎందుకు నేను అందరికీ భారంగా బ్రతకాలి?
    మా వూళ్ళో నేను హాయిగా బ్రతగ్గలను. లాయరు గారు కూడా ఒక ట్రస్టీ యే కదా? అయన అక్కడే ఉన్నారు.  నాకు సాయం కావలిస్తే అత్తయ్యకి తెలిసినావిడ అవ్వగారున్నారు. ఆవిడకీ ఎవరూ లేరు. నా దగ్గరే పెట్టుకుంటాను.... ఒకలా స్థిరపడేదాకా ఉద్యోగం చేసుకోగలను....' అతనేమనుకుంటున్నాడో? అన్నట్టు బలరాం ముఖం లోకి చూసింది. అతని కళ్ళు చిలిపిగా మెరుస్తున్నాయి. దయా? జాలా? ఏమిటి అతని చూపులో ఉన్నది? అర్ధం కాలేదు లలితకి. చిన్న పిల్ల నేరాలు చెప్తుంటే వింటున్నట్టుందేమో అతనికి-- కోపం వచ్చింది లలితకీ.
    'నువ్వు చెప్పేది బాగానే ఉందనుకో. అయినా, ఒక్కమాట. నేను నీ బాధ్యత కోరి బుజాని కెత్తుకున్నానంటే నమ్ముతావా లలితా?'
    ఆతని కంఠం లో ధ్వనించిన అప్యాయతకి ఎక్కడ లేను దుఖం పొంగి వచ్చింది లలితకి. ఈ మనిషి తన గురించే గాని ఇతరుల గురించి అర్ధం చేసుకోడెం. తన కిష్టమైతే సరళ కి సరస్వతమ్మ కి ఇష్టం లేదని ఎలా చెప్తుంది తను?'
    'కాని.....' ఏదో చెప్పబోయింది.
    "ఇది విను. నువ్వు నాదగ్గర చాలా చిన్న పిల్లవి. నిన్ను మీరనడం నాకే బాగులేదు' ఏం అనుకోకు.
    మీ మామయ్యని రెండేళ్ళ క్రితం ఆఖరుసారి చూశాను. 'బాగా డీలా పడి పోయాడూ నువ్వంటే ఎక్కడ లేని అభిమానం . నీకోసం వచ్చాడటగా? చూడనివ్వలేదని బాధపడ్డాడు. తన డబ్బు నీకే రాయాలని తన కోరికగా చెప్పాడు కూడా. అంతేకాదు. మీ మేనత్త నీకని ఎమిస్తుందో ఊహించలేక పోయాడు. అతనికి తోలి దగ్గిర నుంచి ఆవిడ ధోరణి కిట్టదు. నిన్ను గొప్పగా పెంచాలని, తనకూడా తిప్పుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అవెం కుదరనివ్వలేదు- సుబ్బమ్మ గారు. నిన్ను పెంచుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అదీ సాగనివ్వలేదావిడ. మీ మామయ్యని గురించి నీకేం తెలుసు లలితా? నన్నడుగు చెప్తాను." అన్నాడు బలరాం.
    'నాకు తెలిసిందంతా ఒకటే. మామయ్య వస్తే చాల సరదాగా ఉండేది. అస్తమానమూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. నేనింకా అప్పుడు ఫస్టియర్ కాబోలు చదువు తున్నాను. మళ్ళీ చూడనే లేదు. అప్పుడు కూడా అత్తయ్య నన్ను మామయ్యా తో బజారు కి కూడా వెళ్ళనివ్వ లేదు. అదే బాగా జ్ఞాపకం నాకు....మామయ్య వెళ్లి పోతూ , చాల బెంగ పడ్డట్టు కన్పించాడు నిజమే. అంత ఉత్సాహం కల మనిషికి అత్తయ్య చుక్కెదురే...'
    'మీ మామయ్య రామచంద్రం నేను కలిసి చదువు కున్నాం లలితా, వయస్సు లో నా కంటే రెండేళ్ళు పెద్ద అంతే అన్నాడు బలరాం .....
    'అవునా? మీరింకా......' '
    'చాలా చిన్నవాణ్ణి అనుకున్నావా?' నవ్వేశాడు బలరాం.
    'మా మామయ్య మటుకేం పెద్దవాడేమిటి?' అంది లలిత.
    'ఇరవై కి ముప్పయి అయిదు కీ బోలెడు తేడా కన్పించడం లో అసంబద్ధం ఏముంది? నీకంటికి నేనో ముసలివాడ్నే. సరళ చూడు ఏమంటుందో!'
    'నా ఉద్దేశ్యం అది కాదండీ..... ' ఏమనాలో తెలియక ఊరుకుంది లలిత.    
    'రామచంద్రం కాలేజీ లో కూడా చాలా చేలాకీ గా ఉద్నేవాడు. తరవాత కొన్నాళ్ళ పాటు కనపడలేదు. నేను పై చదువులకి విదేశాలు వెళ్ళిపోయాను.... నే తిరిగి వచ్చిన రెండు మూడేళ్ళ కి తారసపడ్డాడు. ఓ రోజంతా నాతొ ఇక్కడే గడిపాడు. ప్రేమించి పెళ్ళాడానని చెప్పాడు. ఇల్లు వదలి వచ్చానని చెప్పాడు. ఏదో వ్యాపారం చేస్తున్నాను బాగానే సాగుతోందని చెప్పాడు.
    కాలం జరిగిపోతుంది. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేవాడు-- విశేషాలతో. ఆ విశేషాలలో నువ్వు ప్రత్యేక్షంగా కన్పిస్తుండే దానివి. అప్పుడే గ్రహించాను నువ్వంటే అతనికి ఆరో ప్రాణం అని....
    నిశ్శబ్దంగా కూర్చుని కంటనీరు కారుస్తుంది లలిత. అతనిలా ఆరో ప్రాణంగా ఎంచిన మామయ్యని తన దృష్టి లో ఓ మృగం లాగా చిత్రించి పెంచింది అత్తయ్య అని.
    'ఐదారేళ్ళ కిందటే ననుకుంటాను ఇక్కడికి వచ్చాడు. అప్పుడే ఇచ్చాడా ఫోటో -- నీది."
    'నన్నలా తిప్పి తీసుకొస్తానని తీసుకెళ్ళి తీయించాడా ఫోటో-- అత్తయ్యతో చెప్పవద్దన్నాడు ' అంది లలిత.
    'అది నాకు చూపించి -- నా వారసురాలు. నాకేదైనా హటాత్తుగా ప్రమాదం జరిగితే నువ్వు పూచీ వహిస్తావు కదూ' అంటూ అడిగాడు. రామచంద్రం ఏం అడిగినా నేను కాదనను-- మా ఇద్దరి మధ్యా ఆత్మీయత అలాంటిది. నేను ప్రామిస్ చేశాను-- అతని కేదో దూరదృష్టి ఉన్నట్టే ఉంది -- ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ రాలేదు-- లాయరే నన్ను కలిపి, అతను గుండె పోటుతో మరణించాడనీ, ఆస్తికి సంబంధించిన కాగితాలు మీ కిమ్మన్నారని అందించాడు ... అందుకనే అప్పటి నుంచీ మీ అత్తయ్యతో కూడా లావాదేవీలు జరిపాను. నీకు తెలిసే ఉంటుంది నాకావిడ బాగా తెలుసునని....' ఆగాడు బలరాం.
    'తెలుసు. అవకాశం చిక్కినప్పుడల్లా యీ ఊరు విశేషాలు చెప్తూనే ఉండేది.... మీలాంటి ఉత్తముడైన యువకుడు ఈ కాలానికి చాలా అరుదని ఆవిడ అభిప్రాయం ' ...నవ్వింది.
    'నేనీ కాలం వాడిని కానే కాదుగా...' తనూ నవ్వేశాడు బలరాం . 'ఇదంతా ఎందుకు చెప్పానో తెలుస్తోందాని.... నిన్నో భారంగా నేను ఎప్పుడూ భావించలేదు. రామచంద్రం నాకెంత కావలసినవాడో చెప్తే , నీకు అర్ధం అవుతుందని చెప్పాను....ఇక వేరేదారి ఉందేమో నన్న ఆలోచన మరిచిపో. నీకు పెళ్ళి చేసి ఓ యింటి దాన్ని చేసి పంపించే దాకా నాదే బాధ్యత అని గ్రహించు. సరేనా? ఏది ఆ చెయ్యి ఇలా తే.' అంటూ ఆదరణ గా చేయి ముందుకి చాచాడు. తనూ నెమ్మదిగా తన చేతిని అతని చేతిలో ఉంచింది.
    'మనం స్నేహంగా ఉండాలి. శత్రువులం కాదు లలితా. ఆ సంగతి ఇక మరిచిపో -- సరేనా' అన్నాడు తన చేతిలో ఉన్న చేతిని మృదువుగా నొక్కుతూ.
    'థాంక్యూ , కాని సరస్వతమ్మ గారికి అనవసరంగా శ్రమ -- అని ...నా బ్రతుకు నేను బ్రతక కల్గినప్పుడు అనవసరంగా యింకోళ్ళని యిబ్బంది పెట్టడం ఎందుకని....'
    'సరళ ని చూస్తె అత్తయ్య శ్రమ ఎంతటిదో తెలుస్తుంది కదా!' గట్టిగా నవ్వేశాడు. చేయి వదులుతూ రా. యిప్పుడు నా రోజా మొక్కలు చూడు -- ' అంటూ మడిలోకి దారి తీశాడు.
    మడిలో మధ్యమధ్యన నున్న సన్నని గట్టు మీద అతని వెనక నడుస్తున్న లలిత గుండెలు తేలిక పడ్డట్టయ్యాయి. 'కనీసం , యీయన నన్ను భారం అనుకోడు' అన్న ఊహ గమ్మత్తుగా ఉత్సాహాన్నిచ్చింది.
    'ఒసరేమైందో తెలుసా?' అంటూ కుతూహలంగా అంది....నడుస్తున్న వాడల్లా సన్నని గట్టు మీదే నిలబడి వెనక్కు తిరిగాడు బలరాం.
    'ఏమైంది?' కుతుహాలంగా అడిగాడు.
    'నన్ను ఎప్పుడు ఓసారి పంపించమని అడిగినా-- ఆడదిక్కు లేని కొంప లోకి ఎలా పంపిస్తాననుకున్నావు? అనేది అత్తయ్య. నాకే తోచింది ' పోనీ నన్ను పెళ్ళాడు మామయ్య నేనే నీకు అడ దిక్కవుతాను ' అన్నాను.... నా చెంప చెళ్ళు మనిపించింది అత్తయ్య. అప్పుడే గోరు గుచ్చుకుని- ఇదిగో రక్తం వచ్చింది. చిన్న మచ్చ పడింది-- 'పోనే లేదు?' అంటూ తన చెంప మీద కంటికి కొంచెం కిందుగా ఉన్న సన్నని రేఖ లాంటి మచ్చని చూపింది బలరం కి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS