జట్కా దిగి లోపలికి వచ్చి అన్నాడు శ్రీనివాస్ : 'నన్ను క్షమించాలి పిన్నీ. మిమ్మల్ని మరిచి పోయానని సరస్వతి యేమేమో అంటోంది. నిజం చెప్పాలంటే అయన నన్ను కదల నిచ్చేరు కాదు.' శ్రీనివాస్ కళ్ళల్లో అవధాని గారు మెదిలారు.
శ్రీనివాస్ యింత హటాత్తుగా రావడం సుభద్ర కు అసలు నచ్చలేదు. జగదీశ్ తను ఆ తెల్లవారు ఝామున వచ్చిన సంగతి చెప్పేస్తే?
'మీరు యీలా అనుభవించాడో యిన్నాళ్ళూ , ఈ గడ్డు రోజుల్ని నేను కొంతలో కొంత పంపించ గలిగాను. నన్ను మన్నించండి. ఏం చేయను.'
'నువ్వు యేవీ చేతక్కర్లేదు. గోదావరి వోడ్డ్డున ఏం సుఖాలు అనుభావించావో మేము చూడలేదు కదా. దారిద్ర్యం అయితే నవ్వుతూ అనుభవించ వచ్చును. ఈ శరీరంలో వోపిక తగ్గిపోయి నేను యిలా మంచానికి అతుక్కుపోయి...దిక్కులేక పడివుంటే '
'సరస్వతీ' శ్రీనివాస్ కంఠం లో నీళ్ళు గరగర లాడాయి. 'నన్ను క్షమించమ్మా. నీకు తెలీదు నేను అనుభవించిన సుఖం. రామదాసు మావయ్య దారి చూపించాడు. తాడి చెట్టు యెక్కే వాడిని మనం యెంత దూరం యెక్కించగలం?'
'యింక యెంతో కాలం లేదు. రెండు నెలలు. క్షణం లో గడిచేస్తాయి. మామయ్యే వుద్యోగం యిప్పిస్తానన్నాడు. ఆ రెండు నెలలూ వోపిక పడితే.....
'మనం స్వర్గ సుఖాల్లో వోలలాడి పోతాం అంటావు. నాకు చావాలనుందన్నయ్యా ' సరస్వతి భోరున యేడుస్తోంది.
సుభద్ర కి దుఃఖం ఆగింది కాదు. 'వోక్కుమ్మడిగా యెన్ని జరిగాయని? సరస్వతి రోగిష్టిదై పోయింది. మందుకి డబ్బు లేదు. నేను తెగల్గే స్థితిలో లేను. అక్కడికి జగదీశ్ ని అడిగాను.'
శ్రీనివాస్ నెత్తి మీద పిడుగు పడింది. ఆ దెబ్బకి అతను స్థాణువై పోయాడు : 'మీరు ....ఆ వెధవ దగ్గరికి అప్పుకి వెళ్ళారా పిన్నీ.'
సుభద్ర చాలా జాగ్రత్తగా విసిరింది అస్త్రాన్ని సమయం చూసి. సవితి కొడుకు అంటే ఆవిడకు గౌరవంతో బాటు భయం కూడా వున్నదనే మాట అక్షరాలా నిజం. అందుకే వీలు చూసి నిజం చెప్పేసి మనసుని కడిగేసు కుంది.
'యెవరైనా ఆ స్థితిలో అదే పని చేస్తారు. అభిమానం, అత్మగౌరవం అడ్డు పడాలంటే డబ్బు పుష్కలంగా వుండాలి శ్రీనివాస్. నాకూ తెలుసును. నేను ఆ రోజు అలా వెళ్లి వుండకూడదనే సంగతి.'
'మరి యిచ్చేడా?'
లేదు?'
'యెందుకని?'
'ఎవరికి తెలుస్తయి అంతరంగాలు.'
' ఆసంగతి తెలిసి మీరు వెళ్ళడం బాగులేదు. యింక అటువంటి పని చేయకండి.'
'నువ్వు ఆ అవసరం రానివ్వకు,' సుభద్ర ఆశ్చర్యపోయింది. తనేనా యిన్ని మాటలు అనగల్గింది?
శ్రీనివాస్ నిశ్చలంగా విన్నాడు. తప్పు తనదే అయినపుడు 'కాదన గలిగే ధైర్యం అతనిలో లేకపోయింది. అంతే.....సరస్వతి మంచం మీద కూర్చొని చాలాసేపు మాట్లాడి బయటికి నడిచాడు. అప్పుడే అంది సుభద్ర . సరస్వతి మానసికంగా దిగజారి పోవడానికి కారబం శ్రీహరి నీరు పోసి పెంచి పెద్ద చేసిన ఆశాలతని పీకి పారేయడం అని. శ్రీనివాస్ వెళ్లి అడిగేందుకు తగిన ఆర్ధిక స్తోమత లేకపోయింది.
* * * *
సెలవులకి వచ్చిన శ్రీనివాస్ పదిహేను రోజుల వరకూ అడుగు బయటకు వేయలేదు. సుభద్ర ప్రొద్దున్నే లేచింది మొదలు సరస్వతి కి వుపచర్యలు చేయడం యింటి పని వీటితో ప్రోద్దుని పడమటి కి మళ్ళించేస్తోంది.
భోజనానికి కూర్చున్న శ్రీనివాస్ ని చూస్తుంటే సుభద్ర కళ్ళు యీ మధ్య రెప్ప వేయడం మానుకున్నాయి. అతని విశాల వక్ష స్థలం మరో స్త్రీకి అంకితం చేయబడుతుందనే వూహ యే మాత్రం మెదిలినా సుభద్ర లో దాగిన స్త్రీ ఈర్ష్యతో కుంచించుకు పోతోంది.
'అన్నం', అప్పుడు వులిక్కి పడుతుంది. పెరట్లో చెంబెలీ మొగ్గలతో , పువ్వులతో భూమిలో కంటా క్రుంగుకు పోతోంది. సరస్వతి మంచానికి అతుక్కుపోయింది బల్లిలా . 'ఐశ్వర్య పంతులకి కేటాయిస్తే బాగుండి పోయేది ఈ రోగాలు. ఈ దారిద్ర్యంలో నాకు టి.బి యేవిటి పిన్నీ.' అని ఏడుస్తూంటే సుభద్ర వోదారుస్తుంది జాలిపడుతూ.
పూలన్నిటి నీ కోసి మాలగా చేర్చి పదేపదే చూస్తున్న సుభద్ర ని చూస్తుంటే సరస్వతి బదాపడింది. చేత్తో సైగ చేసి దగ్గరికి పిలిచి చాలా రహస్యంగా అంది. ఈ యింట్లో మూడో మనిషి లేరు పిన్ని. నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది యెవరూ చూడరు పెట్టుకో.'
సుభద్ర చిత్రంగా చూసింది.
'నేను తమాషా చేయడం లేదు. నీకు నాన్న తిలకం దిద్దలేదు. ఆయనేవీ నీకు పూలు తురుమ లేదు. అది మనం పుట్టుకతో తెచ్చుకున్న సౌభాగ్యం. నాకు నలుగురూ అనే ఈ భేషజం మాటలు వట్టి గాలి కబుర్లే అనిపిస్తాయి. దెవుడి మీద వొట్టు వేసుకుని చెబుతున్నాను. నువ్వు పెట్టుకున్నావని నేనేవీ ఆక్షేపించను.'
సరస్వతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 'స్త్రీ'ని సంఘం యింత కఠోరంగా శాశించ కూడదు. సుభద్ర కోరిక కోరికగా మిగలకూడదు.
సుభద్ర కట్టుబడి పోయింది . తెల్లని చెంబెలీ లు తల నిండా ఆక్రమించు కున్నాయి. రాత్రి క్షణం లో పడిపోయింది. పౌర్ణమి పుచ్చ పువ్వు లాంటి వెన్నెలని ప్రకృతి లో వొలక బోస్తోంది.
శ్రీనివాస్ మల్లు పంచె కట్టుకుని బనీను వేసుకుని వెల్లకిలా పడుకున్నాడు. అచాతీ మీద రంగు రంగుల నీడలు పడి అక్కడ అతనికి రకరకాల వూహలు పేర్చి పెడుతున్నాయి. సుభద్ర దాదాపు రెండు గంటల నుంచీ అక్కడే కిటికీ దగ్గర నిల్చుని బయట వెన్నేలనీ, శ్రీనివాస్ నీ చూస్తోంది. పాతికేళ్ళ నా లేని సుభద్ర కి యిప్పుడు విచక్షణా జ్ఞానం పూర్తిగా పోయింది.
'కొడుకు ' యెవరో అంటున్నారు.
'నేనేవీ కనలేదు ,' కటువుగా అంది.
'అయినా అతని రక్తం నీలో వురకలు వేస్తోంది.'
'అందువల్ల అన్నా చెల్లెళ్ళ కాలేము.
;అందుకే అంటున్నాను భార్య భర్తల యెందుకు అవకాశం లేదని'
టక్కున అడిమేసింది మనసాక్షి, వోడిపోయింది శారీరక చాపల్యానికి.
సుభద్ర అటమి చాతీ మీద చేయి వేసి ఆ పెదవుల వైపు ఆత్రంగా చూసింది. శ్రీనివాస్ నిశ్చలంగా నిద్రపోతున్నాడు. ఆవిడ పెదాలు దగ్గరగా చాలా దగ్గరకి వచ్చేశాయి. వేడి నిట్టుర్పు రైలు యింజను సెగలా వచ్చేసి అతని ముఖాన్ని మాడ్చేస్తుంటే వులిక్కిపడి లేచాడు శ్రీనివాస్. 'పిన్నీ మీరు ఎంతపని చేశారు.'
'శ్రీనివాస్ ' సుభద్ర గొంతు వొణికింది.
'ఇది చాలా అసంభవం పిన్నీ . మీరు.... మీరు ఎందుకిలా అయిపోయారు? మీరు -- మీరేనా ?' నమ్మలేక పోతున్నాడు.
'నన్ను ...నన్నేం చేయమన్నావు?'
అతని కంఠం రోళ్ళని బ్రద్దలు చేస్తోంది. 'అట్టే వేషాలు వెయ్యొద్దు యింట్లోకి వెళ్ళండి. మీకు చిన్నతనం తెలియక పోవచ్చు ను. నేను నాన్నా అమ్మా అనే పదాలకి విలువ యిస్తాను. మీరు నాకు అమ్మ లాంటి వారు.'
సుభద్ర అహం దెబ్బ తింది. 'శ్రీనివాస్ ఈబుద్ది నీకే వున్నట్లై తే తండ్రి ముస్తాబై వూరేగుతుంటే చూస్తూ కూర్చోవు ఆరోజు ఏమై పోయింది నీ మగతనం? నేను తల్లి లాంటి దాన్నే,' హేళనగా నవ్వింది.
'మీ నాన్న యింకో పదేళ్ళు బ్రతికి నా కంటే కూడా అయిదారేళ్ళు చిన్నపిల్లను చేసుకుని వుంటే ఆ పిల్ల నీకు తల్లే అయేది, నా యీడు వారు అమ్మమ్మలూ అయేవారు'
'పిన్నీ.'
'మీకు కావలసింది యింటి చాకిరీ చేసేందుకు పనిమనిషి. మీ నాన్నలాంటి వాళ్లకి గౌరవంగా కలిసి వచ్చే మనుషులం మేము. మా గురించి మీకు అవసరం లేదు. యిన్నేళ్ళూ నా బాధ మీరు వోక్కరు -- మీలో వోక్కరైనా గ్రహించారా. మీ నాన్న నన్ను పేరుకు పెళ్లి చేసుకున్నారు. తరువాత యేమనుకున్నారో........'
'క్షమించండి పిన్నీ ఈ రాత్రి వేళ మనం యిద్దరం యిలా తర్కించు కుంటూ వుంటే నలుగురూ నాలుగు మాటలు అంటారు. నన్ను పడుకో నివ్వండి!' శ్రీనివాస్ కి వాదనకి దిగడం యిష్టం లేక పోయింది.
'నీ యిష్టం అదే అయితే సరే!' సుభద్ర లో ఆరని అగ్ని జ్వాలలు బయలుదేరు తున్నాయి. వాటి సెగలూ, పొగలూ తనను తానె కాకుండా చుట్టూ పక్కల ప్రాకిం చేసి దగ్ధం చేస్తున్నాయి. వాటిని తప్పించుకుని శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోయాడు మైళ్ళు దాటేసి.
'ఆరోజు యిస్తానన్న డబ్బు యివాళ యివ్వు జగదీశ్. నేను వెళ్లిపోవాలి!' సుభద్ర అంతకంతకు పాతాళం లోకి జారి పోతోంది. రాని ఆకు పండిపోయి, పండిపోయి, గాలికి దొర్లిపోయి నట్టేట కలిసి పోయినట్లు.
'యింద,' జగదీశ్ అందిస్తూనే సుభద్ర ని దగ్గరికి తీసుకున్నాడు. సుభద్ర కన్న కలలు రూపం దాల్చాయి. అతని విశాల వక్ష స్థలం మీద తల వుంచి అతను అన్న రకరకాల మాటలని మననం చేసుకుంటోంది. ఆవిడ పెదవుల్లో అమృతం అతను జార విడుచుకోవడం లేదు. ఆకలి గొన్న పులిలా వున్నాడు.
సుభద్ర కిక నిశ్చింత. రోగిష్టి సరస్వతి మంచం దిగలేదు. పాపిష్టి శ్రీనివాస్ తన దారికి అడ్డంగా లేడు.
సుభద్ర మైమరిచి యేమేమో అడుగుతోంది. అతను అందుకు తగిన విధంగా సమాధానాలు యిస్తున్నాడు. సుభద్ర తను పొందలేని సుఖాన్ని పురుషుడి నుంచి కోరుకుంటూ కోరుకుంటూనే ఆపాత్రుడికి దానం చేసింది. తెలివి వొచ్చాక దిక్కులు బ్రద్దలయ్యేలా యేడుస్తోంది. జగదీశ్ విసిరిన పది రూపాయలు గాలికి రెపరెప లాడుతుంటే కడుపులో ఆకలి బాధకు తట్టుకోలేక సుభద్ర కొంగులో ముడేసుకుని పైట చెంగు అడ్డంగా మొల పక్కకి దోపుకుంది.
'డబ్బు కావాలంటే నీకు నేను వున్నాను. నువ్వు అనవసరంగా యేడవకు. అన్నిటికీ నేను వున్నాను.' అతని మాటలకి పన్నెత్తి జవాబు యివ్వలేదు. నలుగురూ చూడకుండానే నట్టింట్లో కాలు పెట్టింది.'
'మందు తీసుకో సరస్వతీ.' సుభద్ర అందిస్తుంటే సరస్వతి అటు తిరిగి అంది. వొద్దు పిన్నీ. నన్ను చావనివ్వు. చాలు. నింక యెంతో కాలం బ్రతకను. మందుల కోసం చేసే ఖర్చు యింక దేనికైనా పెడితే లక్షణంగా బ్రతికేయ వచ్చును.'
'ఇవాళే పంపాడు శ్రీనివాస్. ఈ యాభై చాలు. నీ ఆరోగ్యం తరువాతే మిగతా అన్నీ.'
'అన్నయ్య' సరస్వతి కనుబొమ్మలు ముడేసింది. మనకి యాభై పంపాడు. నమ్మలేకుండా వున్నాను. పోనీ రసీదు చూపించు పిన్నీ. మనియార్డర్ ది' దేనికోసం పంపాడో ఏవిటో?'
'నీకు ఆరోగ్యం బాగులేదని తెలిసిన మనిషి దేనికి పంపుతాడు ? నీ పిచ్చి గాని.'
'నేను నమ్మాలేను పిన్నీ. అన్నయ్య వుద్యోగం చేస్తుంటే అదివేరే మాట. వాడు హటాత్తుగా వచ్చేసి అడుగుతే మనం ఎక్కడ్నించి తేగలం. నాకు యేవీ వొద్దు. నన్ను విసిగించకు.' సరస్వతి మంచం మీద వుంది గానీ నిజానికి అన్ని సంగతులు చెవిన పడుతూనే వున్నాయి. తూరుపు రేఖలు తెల్ల బడక ముందే వెళ్లి అంతలోకే వచ్చేసే సుభద్ర దేనికి బానిస అయిపోతోంది? నలుగుడు చేరి సరస్వతి కి విపులంగా చెప్పేస్తే అర్ధం చేసుకో లేనంత అవివేకి కాదు. సుభద్ర ని వారించేందుకు గాని, అడిగేందుకు గానీ సిగ్గు పడింది. ఆ సుభద్ర లో యే పిశాచం ఆవహించిందో అర్ధం గాక వెర్రి దానిలా మంచానికి అతుక్కు పోయింది. ఆ పాపిష్టి డబ్బును తను మాత్రం ఉపయోగించుకోకూడదనే ఉద్దేశ్యంతో తన గుండెల్లో నే దాచుకుంది ఆ రహస్యాన్ని.
