4
రెండు నెలలు తిరిగేసరికి శ్రీనివాస్ కి రాజమండ్రి కొట్టిన పిండే అయిపొయింది. గోదావరి ఉత్తుంగ తరంగాలని చూస్తూ ఆ వొడ్డు మీదే కూర్చుని రోజులు క్షణాల్లా నెలలు నిమిషాల్లా గడిపేస్తున్నాడు. చీకటి ముసురు కుందుకు యింకా చాలా వ్యవధి వుంది. ప్రతి బుధవారం అవధాని గారి యింటికి వెళ్ళాలి. అరవై నిండి పండి పోయిన ఆయన్ని చూస్తుంటే శ్రీనివాస్ హృదయం వల్లమాలిన అనురాగంతో మునిగిపోయి చిందులు త్రొక్కు తుంది. ప్రాక్పశ్చిమాల నాగరికత ని ఆకళించుకున్న ఆయనకి శ్రీనివాస్ పక్కనే భోజనానికి కూర్చుంటే గాని తోచదు. మెల్లగా యిసుక లోంచి లేచి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఫర్లాంగు దూరం చేరుకున్నాడు.
"చూడు అన్నపూర్ణా! మన శ్రీనివాస్ వచ్చేస్తున్నాడు. త్వరగా వడ్డించేయాలి. నీదే ఆలస్యం ప్రోద్దున్నుంచీ కరకరలాడు తోంది సుమా' భోజనం చేశాక కాల్చు కుందుకి పొగాకు దట్టంగా బిగిస్తున్నారు అవధాని గారు.
పండు ముత్తయిదువులా పార్వతీ దేవి లా వున్న ఆవిడ వైపు కన్నార్పకుండా చూస్తుండి పోయాడు శ్రీనివాస్.
'నేను అప్పటి నుంచీ మొత్తుకుంటూనే వున్నాను. మీరు వుండలేరు . వాడు ఏం పని మీద వున్నాడో యేమో అని, ఈ ఒక్క రోజు తినేయండి అని చెబితే విన్నారా? పోనీండి యిప్పటి కైనా వచ్చేశాడు.' అన్నపూర్ణకి గర్భ శుద్ధి అయిందే తప్ప పిల్లడు మాత్రం దక్కలేదు. శ్రీనివాస్ ఆ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే అనుకుంది 'బహుశా పాతికేళ్ళ నాడు చచ్చిపోయిన తన కొడుకు యిలా వచ్చాడేమో' అని.
ఆ మాటే భర్తతో అంటే అయన నవ్వి 'పిచ్చి అన్నూ , మన కంత అదృష్టం కూడానా. అయినా ఆభావం కూడా మంచిదే . లేమితో మన యింట్లో కంచం వేసుకునే ఆ పిల్లాడికి కడుపు నిండిపోతుంది. వాడికి కూడా వుండాలి కద యిటువంటి అభిప్రాయం ' అన్నారు. మనసులోనే భార్యని ఆకాశాని కేత్తుకున్నారు. మమత నిండిపోయిన ఆ మాతృహృదయాన్ని ఆ పిల్లడు గ్రహించక పోడు అని.
"నేను నిమిషం అటో యిటో అవుతాను. మీరు భోజనం చేసేయక పోయారా? నల్ల మందు అలవాటున్న వారు కదా బాబాయ్' శ్రీనివాస్ కాళ్ళు కడుక్కుని పీట మీద కూర్చున్నాడు.
మారు వడ్డిస్తూ అంది అన్నపూర్ణ: 'మీ నోటి తోనే చెప్పేయండి. వాడు మీ మాట కాదనడు.'
భార్య వైపు వోసారి చూసి గొంతు సవరించుకుని 'శ్రీనివాస్ నీకో సంగతి చెప్పాలోయ్ ' అన్నారు.
'చెప్పండి బాబాయ్.'
'ఏవీ లేదు. నీకు యిష్టం అవుతే యిప్పుడే వెళ్లి మాట్లాడి వస్తాను.
శ్రీనివాస్ తలెత్తాడు.
'రాధని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. మీ పిన్నీ మరీ మరీ అంటోంది.'
'బాబాయ్!"
'ఎందుకురా ఆశ్చర్యం?'
తల విదిలించి నెమ్మదిగా అన్నాడు శ్రీనివాస్. అతని కనుకోలుకుల్లో నీటి బిందువులు అంతకంత కు లోపలికే యింకి పోతున్నాయి : 'మీకు వున్న సహృదయత ప్రపంచంలో యెంత మందికి వుంటుందంటారు? రాధ తల్లి తండ్రులు యాయ వారం చేసుకున్నా అది వాళ్ళకి ఎబ్బెట్టు గా అనిపించదు కాని....
'చెప్పు నీ ఉద్దేశ్యం.'
'మీరు శ్రమపడి చెప్పినా లాభం వుండదు . అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నామేమో మనం.
'అయినా ప్రయత్నించి చూద్దాం యివాళ మంచి రోజు నేను వెళ్లి అడిగి వస్తాను.'
'నేను యింకా చదువుకోవాలి. పిన్నీ, చెల్లీ నామీద యెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళని నేను పోషించాలి. నాకు శక్తి లేదు కుటుంబాన్ని యింకా పెద్దది చేసుకుంటే ,
'నీకు వుద్యోగం దొరికేవరకూ మన యింట్లో వుంటుంది శ్రీనివాస్ : నువ్వు మళ్లీ మాలో వోకడివి కావాలి అంతే,' అన్నపూర్ణ భర్త ని తొందర చేస్తూ నిలవనీయడం లేదు. శ్రీనివాస్ తల్లి బ్రాహ్మణ పిల్ల అని ఆ దంపతులకి తెలుసు. అవధాని గారు హరికేన్ లాంతరు చేత్తో వుంచుకుని మెట్లు దిగారు రాధ యింటి ముఖంగా అడుగు వేస్తూ.
* * * *

'పిన్నీ! అన్నయ్య మనమాటే మరిచి పోయాడు యింకా ఎన్నాళ్ళు యిలాగ'? సరస్వతి కళ్ళల్లో యించుమించు కన్నీళ్లు కదులుతూ 'వూ' అంటే రాలిపడేట్లున్నాయి.
సుభద్ర వంట యింటి గుమ్మం ముందు చతికిల బడిపోయింది.
'నాకు ఆకలి చెప్పలేనంత బాధగా వుంది. యేదైనా తెచ్చి పెట్టు పిన్నీ.' మంచానికి అతుక్కుపోయిన సరస్వతిని వోదార్చేందుకు సుభద్ర కి వోపికా సహనం పూర్టిగా నశించి పోయాయి. గోపాలం వున్న రోజుల్లో నాలుగు యిళ్ళల్లో ట్యూషన్లు చెప్పో. లేకపోతె నలుగురి దగ్గిర సర్దుబాటు చేశో కుటుంబాన్ని యెలాగో లాగ యీడ్చుకు వచ్చాడు. మగదిక్కు లేని ఆబల లిద్దరూ వోకళ్ళనొకళ్ళు వోదార్చు కుంటూ శ్రీనివాస్ వెళ్ళిన అరునేల్లూ గడిపారు. కానీ రోజు గడవడమే కష్టం అయిపోతుంటే తనదే తప్పేమో అనుకునేది సుభద్ర వొక్కోసారి. శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చే డబ్బు నానాటికీ తగ్గి పోతోంది. సుభద్ర యెదురు చూడడం మానేసింది.
'అతనికేం సుభద్రా నువ్వు పొరబాటు చేశావు" అంతరాత్మని మరి నోరేట్టించేది కాదు. పైకి కఠినంగానే అనేది. 'అతను మనల్ని మరిచి పోయేడు. తోడ బుట్టిన అప్ప చెల్లెలూ మరో అడామనిషి దిక్కులేక అగచాట్లు పడుతున్నారని అనిపించి వుంటే తప్పకుండా వచ్చేవాడు. మనఖర్మ మనమే అనుభవించాలి.' నీళ్ళ బిందె భుజాన వేసుకుని బయటికి నడిచింది.
తిండికే మొహం వాచిన సుభద్రకి అభిమానం పూర్తిగా సడలి పోయింది. తూరుపు రేఖలు తెల్లబడక ముందే పక్కింటి జగదీశ్ చదువు చెవుల్లోకి వినిపిస్తుంటే గోపాలం ప్రతిమ కళ్ళల్లో కదిలింది. 'తప్పేం వాడు నా స్టూడెంట్ . ఫరవాలేదు. అడుగు సుభద్రా. నేను నీకు కానీ మిగల్చ లేదనే బాధ నాకు లేదంటావా? వెళ్ళు, వెళ్లి అడుగు. చెప్పాను కదా. నువ్వు చేసిన ఏ పని అయినా నాకు యిష్టం అయి తీరుతుందని.'
కాళ్ళు రెండు సార్లు మెట్లు ఎక్కి దిగి యిక దిగలేక ముందుకు కదిలి పోయాయి.
నేను....నేను లోపలికి రానుటయ్యా జగదీశ్!'
కొంచెం తడిసి ముద్ద అయిపోయిన జాకెట్టు లోంచి సుభద్ర బ్రహ్మదేవుడు సృష్టించిన అపురూపమైన స్త్రీని గుర్తుకు తెస్తోంది.
జగదీశ్ తల పుస్తకం లోనే వుంది :
'చెప్పవయ్యా. నేను లోపలికి రానా'
'రండి, రండి' కంగారుగా అనేసి లేచి నిలుచున్నాడు. సుభద్ర స్వరాన్ని తగ్గించేసి అంది. నేను నీతో చాలా అవసరం వుండి వచ్చాను . మీ మాష్టారే వుండి వుంటే నేనిలా రాకపోయే డాన్ని.'
'చెప్పండి అసలు విషయం ఏవిటో.'
'శ్రీనివాస్ వెళ్ళాక వుత్తరాలు అడపా తడపా వస్తున్నాయే తప్ప అతని భోగట్టా తలీడం లేదు. తిండి గింజలు లేక నానా యిబ్బంది పడుతున్నాం. మా శ్రీనివాస్ వస్తే తప్పకుండా ఈ ఋణం తీర్చు కుంటాను. ఒకవేళ మాట తప్పి వుంటే అది మీ మాష్టారికి యిచ్చా ననుకో. ఈ బీదవాళ్ళ పట్ల మీలాంటి వాళ్ళు సహాయం చేయకపోతే.'
జగదీశ్ కళ్ళు ముడతలు పడ్డాయి.
అప్పటికే అతని స్మ్రుతి పేటిక పని చేయడం ప్రారంభించి చాలాసేపు దాటిపోయింది. ఆ పేటికలో రకరకాల చిత్రాలు రీళ్ళు తిరుగుతున్నాయి --
'అయన వచ్చే వేళ అయింది. కూర్చో యిప్పుడే శ్రీనివాస్ బయటికి వెళ్ళాడు. అంతవరకూ ఈ పుస్తకం చదువుతూ వుండు, ' సుభద్ర చాప పరచి మంచినీళ్ళ చెంబూ, గ్లాసూ వుంచింది.
'సరేనండి, జగదీశ్ బుర్ర వూపాడు.
ఇరవై నిండిన జగదీశ్ లో ప్రకృతి లక్ష ణాలు స్తంభించిపోలేదు. అతని కళ్ళు ఆ పిల్ల చుట్టూ పరికిస్తూనే వున్నాయి. తెల్లగా మిసమిసలాడి పోతూ వున్న ఈ పిల్ల వొళ్ళు ఆ ముసలాడి బాహు బంధాల్లో నలిగి పోతోందనే వూహ రాగానే చిత్రంగా కదిలింది అతని మనసు.
'అతని కంటే బుద్దీ, జ్ఞానం లేకపోవచ్చును. ఈ శ్రీనివాస్ యెంత ఫూల్?'
సుభద్ర స్నానం ముగించి యింట్లో కి వెడుతుంటే పచ్చగా దబ్బ పండు చ్చాయలో కదిలి పోతున్న ఆవిడ అణువణువూ అతన్ని రెచ్చగొడుతుంది. జగదీశ్ మనసునిద్ర లేచింది. వెళ్లి ఆవిణ్ణి కౌగిట్లో బంధించేయాలనే పైశాచిక తలంపు అతన్ని బానిసను చేసుకుంటోంది.
సుభద్ర అదృష్టం ఆరోజే మంట గలిసి పోయేది. ఏమూలో అడుగంటని సౌశీల్యానికి రక్షగా నిలిచేందుకు శ్రీనివాస్ వచ్చేశాడు గుమ్మం లోకి అడుగు పెడుతూ.
జగదీశ్ లో ఉప్పెనలా పొంగిన అంతర్నాలాలు ఒక్కసారిగా దిగంతాలకు జారిపోయాయి. అతను కూర్చున్న చోటే కూలబడి పోయాడు.
శ్రీనివాస్ కి బాగా తెలుసు. అందుకే ఆ కళ్ళు యిటు త్రిప్పి ఒక్క చూపు విసిరాడు. అంతే శ్రీనివాస్ ఆ చాయాల్లో, ఆ పోలి మేరల్లో వుండగా జగదీశ్ యేనాడూ ఇటువంటి సాహసం చేయలేదు. అందుకే అతను అజ్ఞాతంగా వుండిపోయాడు యిన్నాళ్ళూ.
రీళ్ళు తిరగడం క్రమేపీ ఆగిపోయాయి. అంతే అతను యదార్ధం లోకి జారాడు. సుభద్ర యింకా నిలబడే వుంది ఎదురుగా ....' 'ఒక్క పది రూపాయలు వున్నా చాలు అతను రాగానే యిచ్చేస్తాను.'
సుభద్ర జబ్బ పట్టుకున్న జగదీశ్ ని యేమి చేయలేని దానిలా వెర్రిగా చూస్తుండి పోయింది , 'పదా...పది రూపాయలా నువ్వు కోరేది సుభద్రా. వెర్రి దానివి. నాలాంటి లక్షాదికార్ల దగ్గిర వేలు కాకపోయినా వందలు వసూలు చేయాలి. నువ్వు వట్టి అమాయకురాలివి' అతను బహువచన ప్రయోగం మరిచే పోయాడు. కళ్ళు మత్తెక్కి యదార్ధాన్ని మింగేయిస్తున్నాయి.
'జగదీశ్' సుభద్ర కళ్ళు నిప్పుకణికల్లా మారిపోయాయి.
'చస్! నీ సంగతి అందరికీ తెలుసు. కొడుకునే వుంచుకున్న దానివి.'
అతని పళ్ళు రాలిపోలేదు. 'ఎంతమాట అంటున్నావు. నేను అలాంటి దాన్నా?'
'నువ్వూ నేనూ యిద్దరం కాదు. ఈ ఘడియ, ఈ క్షణం అలాంటివి.'
'జగదీశ్ నీకు పుణ్యం వుంటుంది. నన్ను నవ్వుల పాలు చేయకు. గతిలేక వచ్చానని నన్ను నాశనం చేయకు. నువ్వేదో ఆడుకుంటావనీ నాకేదో సహాయం చేస్తావనీ అనుకున్నాను. కానీ యిలా....'
'ఇప్పుడు చేయనని ఎవరన్నారు?'
'ఒద్దు జగదీశ్ నీకూ, నీ సహాయానికీ నమస్కారాలు. నన్ను వెళ్లనివ్వు.'
'సుభద్రా నమ్ముతావా? ఎన్నాళ్ళ నుంచో తపిస్తున్నాను ఈ ఘడియ కోసం , ఈ నిమిషం కోసం. నేను నిన్ను కోరుకుంటున్నాను నాతొ రా.'
'గోపాలం లో యేముందని చేసుకున్నావు . అతను బాహుశా మీ తాతగారి ఈడు వాడు అయి వుంటాడు. అతన్ని పెళ్లి చేసుకున్నావు. బాగానే వుంది. ఏం సుఖ పడ్డావు? అతన్ని పోగొట్టు కున్నావు. నీకు యిప్పుడు ఒరిగింది కూడా యేమీ లేదు. నా మాట విను. నిన్ను ఐశ్వర్యం లో ముంచెత్తు తాను.'
'హైదరాబాదు, కలకత్తా, డిల్లీ , మద్రాసు వీటిలోనే మన కాపురం. కాలు క్రింద పెట్టనివ్వను నేను.ఈ బట్టల్తో నీ అదృష్టాన్ని మలినం చేసుకోకు. నీ అందాన్ని నా ద్వారా రక్షించుకో. నీ నొసట బొట్టు పెడతాను. 'కాదంటే నిన్ను రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాను.'
'తప్పేం ఎంతమంది లేరు యిలా ప్రప్రంచం లో.'
'జగదీశ్ ', సుభద్ర శరీరం పట్టుజారి పోతోంది. ఆ పురుష స్పర్శ నరనరాల్లో నూ వ్యాపించి విచలితని చేస్తున్నాయి. పక్షవాతం వచ్చి ఆ పార్శం పడిపోయి నంత యమబాద పడుతోంది. 'నన్ను క్షమించు జగదీశ్. నన్ను వెళ్ళ నివ్వు.' సుభద్ర ప్రాధేయ పడుతోంది. అతనిలో యే మూలో మానవత్వం పూరి విప్పింది. సుభద్ర మెట్లు దిగి ముందుకు దూసుకు పోయింది.
* * * *
నిలుదున్నా , కూర్చున్నా ప్రతి సేకండూ రింగు మంటూనే వున్నాయి. ఆ మాటలు సుభద్ర చెవుల్లో సముద్ర ఘోష పెడుతూ . 'నీ అందం మంట కలిసి పోకూడదు. చెరిగిన నీ నుదుటి రేఖలు శాశ్వతం చేస్తాను. రా సుభద్రా. రావోయ్. నా బంధాల్లో యిమిడి పో. నా కౌగిట్లో కరిగిపో. నిన్ను కాలు క్రింద మోపనివ్వను. ఈ దారిద్ర్యం లో నువ్వు ఎన్నాళ్ళు బాధ పడతావు? నాతోరా. బొంబాయి , కలకత్తా ' తల విదిలించి చెవులు మూసుకుంది. కానీ ఆ మాటలు ఈటేల్లా హృదయ కుహరం లోకి దూసుకుపోయి అక్కడ పటిష్టంగా పాతుకు పోతున్నాయి. అని శాఖోప శాఖలుగా చీలి నలు వైపులా వ్యాపించి రక్త నాళాల గుండా శరీరం అంతా పాకి ముద్దలా పేరుకు పోతున్నాయి విడదీసెందుకు వీల్లేకుండా. సుభద్ర అసహాయంగా చూస్తోంది. ఆ పురుష స్పర్శ లో తీయదనాన్ని తను మరీ మరీ గుర్తుకు తెచ్చుకుంటుంటే వొంట్లో నిస్సత్తువ వ్యాపించి తను కూపం లోకి కుదించుకు పోతున్నట్టు నిస్సహాయురాలిగా వుండి పోయింది. ఆ ఘడియ మరుపుకు రావడం లేదు.
* * * *
